Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ఇరవై ఒకటవ భాగము

పాతాళప్రమాణకథనమ్‌

లోమహర్షుణుడిట్లనియె –

మునిశ్రేష్ఠులరా ! భూమియొక్క వైశాల్యము డెబ్బదివేల యోజనములు, దానియెత్తునంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము, యనునవి సప్తపాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమసౌధములతో నొప్పుచుండును. ఆ ప్రదేశములందు దైత్యదానవ జాతులు వందలకొలది గలరు. బ్రాహ్మణొత్తములారా! అచట పెద్ద సర్పజాతులు కూడ గలవు.

స్వర్గముకంటెను పాతాళములు రమ్యములని పాతాళములనుండి స్వర్గమునకేగి సభామధ్యమున నారదమహర్షి చెప్పిరి. వీరియందు ఆహ్లాదజనములైన పరిశుభ్ర కాంతిభరితములైన రత్నములున్నవి. నాగాభరణ భూషణములు పెక్కులున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటియగును. దైత్యదానవ కన్యారత్నము లిందందందు క్రీడింతురు. ఇట్టిపాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతిజనకమై యుండును. పగటిసూర్యుని కిరణము లిచ్చట కాంతి నొసంగునుగాని యెండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్రకాంతులును చలిని గాక చక్కని వెలుగునుమాత్రమే యిచ్చును. భక్ష్యభోజ్యలేహ్యపానీయ రూపమైన యాహారములచే మదించిన భోగులగు దానవాదులు కాలగమనమునిచట గమనింపనే గమనింపరు. వనములు నదులు సరోవరములు కోకిలల కలకలారావములతో మనోహరములై యుండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గంధాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణావేణుమృదంగ నాదము శ్రవణమనోహరముగ వినిపించును. ఇచటి భాగ్యభోగ్యములు పరమమనోహరములు. పాతాళవాసులగు దానవులు ద్తెత్యులు నాగులును ఆభోగములను అనుభవించుచుందురు.

పాతాళమున కడుగున విష్ణువు యొక్క తమోమయ శరీరము శేషుడను పేర అనంత కళ్యాణగుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ-దేవర్షి-సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్యస్తిక ముద్రాంకితములైన వేయిశిరశ్సులచే సహస్రణామణికాంతిపుంజములచే దిసలను రంజింపజేయుచూ ఉండును. లోకహితమునకై ఆయన అచటి అసురులను తనతేజముచే నిర్వీర్యుల నొనరించుచుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీటధారియ్తె, పుష్పమాలాలంకృతుడై మదఘార్ణిత నేత్రుడై అగ్నిసహిత శ్వేతాచలమట్లు ప్రకాశించుచుండును. నీలవసనుడు మదోత్సీక్తుడు శ్వేతవరోపశోభితుడు ఆకాశగంగాప్రపాత సంయుత కైలాస వర్వత మన్నట్లు ఈ శేషుడు ఒకచేత నాగలియు మరొకచేతి రోకలియు ధరించి వారుణియను నాగాంగనతో గూడి ఉపాసింపబడును.

కల్పాంతమందు నహస్రముఖములనుండి విషానలజ్వాలలు గ్రమ్ముకొస సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగత్రయమును మ్రింగివేయును. గిరిమండలమట్లు అశేష క్షితిమండలమును ఫణాగ్రమున ధరించి అశేషు యాశేష సురసమర్చితుడై పాతాళమూలమందు అధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్యప్రభావ రూప వైభవము వర్ణింపజాలరు. తెలసికొనజాలరు ఆయన ఫణామణి శిఖలచే అరుణమయి కుసుమమాలిక వలె నిలాతల మఖిలము నిలిచియున్నది. అట్టి మహానుభావునిశక్తి నెవ్యడువర్ణింపగలడు.

మదముచే తిరుగడువడు కన్నులతో ఆ అనంతునెప్పుడు విజృంభించునో అపుడు భూమండలము పర్వత సముద్రముగా కంపించును. గంధర్వావ్పరస్పిద్ధ కిన్నరోరగవారణులు కూడ ఆశేషాహిగుణములయంతుతెలియలేదు. కావుననే ఆయన అనంతుడను పేరొందెను. నాగకన్యా తిలకములు తమ మృదుల కరకమలములచే నతనికి పూయు హరిచందనము శ్వాసానిలములచే విసరబడి దెసలకు సువాసన భరితపటవాసమై (పరిమళచూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజు నారాధించి పురాణమహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యములు నెణుంగనెను. సకలశకున ఫలితములను దెలుపగల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసావహింపబడివ యీ వసుంధర దేవాసుర మానుష విశేషనహీతములయిన సర్వలోకములను ధరింపగల్గుచున్నది.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు పాతాళ వర్ణనమునమను నిరువరియొకటవ అధ్యాయము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment