Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ఇరువదిమూడవ అథ్యాయము

భూర్ఛువ స్సువరాదిలోకవర్ణనమ్‌

ఓ లోమహర్షణ ! నీవు సర్వమును మాకు దెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను , గ్రహసంస్థానమును వాని ప్రమాణమును తెలుపుము. అని మునులడుగ లోమహర్షణు డిట్లనియె.

సూతుడిట్లనియె : –

సూర్యచంద్రుల కిరణ ప్రసారము కలదాక సముద్ర శైలపరివృతమైయున్న ప్రదేశము పృథివీమండలము, భూమియెక్క విస్తారమెంతో దానికి మీద నున్న అంతరిక్ష విస్తారము నంతే. భూమికి లక్షయోజనములలో సౌరమండల మున్నది. దానికి లక్ష యోజనములలో చంద్రమండల మున్నది. దానికి లక్ష యోజనములమీద నక్షత్రమండల మున్నది. ఆ నక్షత్ర మందలమునకు రెండు లక్షల యోజనములలో ఉత్తరమున బుదుడు కలడు. అతనికంతే దూరములో శుక్రుడు, అంతే దూరములో అంగారకుడు (కుజుడు)గలరు. అక్కడకు రెండు లక్షల యోజనముల దూరములో బృహస్పతియు ఆటకు- రెండు లక్షల యోజనములలో శని ఆమీద లక్ష యోజనములలో సప్తర్షిమండలము దానికి లక్షయోజనములలో జ్యోతిశ్చక్రమునకెల్ల కేంద్రదస్థానమై ధ్రువ మండలము నున్నవి. ఈ యంతరిక్షలోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞఫలమునకు స్థానము. ఇజ్య(యజ్ఞము) ఇందు బ్రతిష్ఠితమై యున్నది.

”క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి వర్మజా”

మనుష్యలోకమున కర్మఫలసిద్ధి వేగముగ గల్గును.

ధ్రువలోకమునకు మీద నొకకోటియోజనములలో కల్పాంతజీవులు నివసించు మహర్లోక మున్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనోలోక మున్నది. అది బ్రహ్మ మానస పుత్రులు నిర్మల చిత్తుల చిత్తులునైన సనకసనందనాదు లుండెడి స్థానము జనోలోకమునకు పై నెనిమిది కోట్ల యోజనములలో తపోలోక మున్నది. అచట వైరాజులను దేహరహితులైన [విదేహులు] దేవతలు నివసింతురు. తపోలోకమునకు పై ఆరు యోజనములలో సత్యలోకము విరాజిల్లుచున్నది. అచట సిద్ధాది మునులుందురు. అది అపునర్మారకము తిరిగి మరణ ధర్మము లేని పుణ్యలోకము బ్రహ్మ లోకము.

పాదగమ్యమైన భూభాగమంతయు భూలోకము. దీని విస్తారము చెప్పబడెను. భూమికిని, సిద్ధాదిమునిసేవితమైన సూర్యలోకమునకు నడిమిభాగము భువర్లోకము[అంతరిక్షము]అని చెప్పబడును, ఇది రెండవలోకము. సూర్యునకు థ్రువుసకును నడుమగల చతుర్దశ నియుత(లక్ష)పరిమాణమైన లోకము స్వర్లోకము. ఈ మూడులోకములకు కృతకము (కర్మసంపాద్యము)లను పేరు గలదు. ఆ మీదు జనసపస్సత్య లోకములు మూడును ఆకృతకములనబడును. కృతకాకృతముల నడిమిభాగము మహర్లోకము. దీనికి కృతకాకృతకమని పేరు. ఇది కల్పాంతమందు శూన్యమగును. కాని నశింపదు.

బ్రాహ్మణులారా! సప్తమహాలోకములు, సప్తపాతాళములు నాచే చెప్పబడినవి. ఇది బ్రహ్మాండముయొక్క విస్తృతి. అండకటాహముతో క్రింద మీద నడుమ వ్యాపించి వెలగపండు విత్తనమువలె నుండునది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివిగల యుదకము వహ్నిచే నావరింపబడి యున్నది. అయ్యగ్ని వాయువుచే, నది యాకాశముచే నాకాశము మహత్తత్వముచే పదేసిరెట్లు పరిమాణముగల దానితో నావరింపబడి యున్నది. మహత్తత్వము నావరించి ప్రధానమున్నది. అది అనంతము.

దానికి లెక్కలేదు. అది సమస్తసృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటికోటి ప్రకృతులందు దారువునందగ్నివతె నువ్వులందు తైలమువలె చేతనాత్మకమై పురుషతత్వము-అనగా పరబ్రహ్మవస్తువు ప్రధానమందువ్యాపించియున్నది.ఈప్రధానము పురుషతత్వము సర్వభూతముల అనుభూతిలో నున్న విష్ణుశక్తిచే ధరింపబడి పరస్పరాశ్రయధర్మము కలవియైయున్నవి. ఆరెంటి పృథగ్భావమునకు, సంశ్రయమునకు ఆ విష్ణుశ క్తియే కారణము.

సృష్టికాలమందు విష్ణుశక్తియైన మాయ(ప్రకృతి)యే కారణరూపమైన తత్త్వమునందు క్షోభకు కారణమగును. అదేప్రథమ స్పందనము. ఈశక్తి, వాయువు నీటి బిందువులందలి చలువను భరించినట్లు, ప్రధాన పురుషాత్మకమై యీజగత్తును భరించును. చెట్టు, మొదలు స్కంధము (బోదె) కొమ్మలు రెమ్మలు ఆకులతో మొదటి విత్తనమునుండి పుట్టును. ఆచెట్టునుండి మఱల విత్తనము పుట్టును. ఈక్రమమునందు పుట్టినచెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యముల కారణములననుసరించి యున్నట్లే యీ జగత్పరంపర (బీజపరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువు ననుసరించి యుండును. ఆ విష్ణువే యవ్యాకృతతత్త్వము. ఆబీజమునుండియేమహత్తు అహంకారము సమష్టి మనస్సు మొదలగునవి వ్యాకృతము అగుచున్నవి. (అవ్యాకృతమునే యవ్యక్తమని వ్యాకృతమును వ్యక్తమని శాస్త్రము వ్యవహరించినది). అహంకార తత్త్వము నుండి దేవవర్గము తత్పుత్రులు పౌత్రులు జనించిరి. బీజమునుండి మొలక మొలక నుండి వృక్షము తద్భాగములు పుట్టినపుడు బీజాదులకు నాశము లేనట్లు భూతల పరిణామము వలన మూలభూతముల కపచయములేదు. వృక్షమునకు నాకాశము కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధాన మాత్రమున కారణమైనట్లు సర్వసాక్షియయిన భగవంతుని సన్నిధాన మాత్రమున బొడమెడి నామరూపాత్మక వివిధసృష్టి వలన సఠ్వాధిష్ఠానమైన భగవత్తత్త్వమునకు నుపచయాపచయములు లేవు. హరి పరిణామము లేకుండగనే కారణమగుచున్నాడు. ధాన్యపుగింజలో మూలము కాడ మొలక ఆకు కోశము పువ్వు క్షీరము, ధాన్యము బియ్యము ఊక తవుడు మొదలైన పదార్థములు (అవ్యక్తముగ) ఇమిడియుండి తరువాత వ్యక్తమైనట్లు పరమాత్మయందు సృష్టికారణసామగ్రియయిన అనేక కర్మబీజములు దేవాద్యుపాధులు జీపశరీరమును నిండియుండి విష్ణుశక్తిలన ఆ పరమాత్మనుండి యావిర్భావమును బొందుచున్నవి. కావున నీజగమెల్ల పుట్టిపెరిగి. లయించుటకు హేతువైన విష్ణువే పరబ్రహ్మ మనబడును. అదియే పరంధామము, పరమపదము, సదసద్రూపము ననబడు పరతత్త్వము. చరాచరమైన యీ జగత్తు అభేదదృష్టిచేత నతడే యగును. మూలప్రకృతియు, వ్యక్తరూపమగు జగత్తును నతడే. ఆతనియందే సర్వము నిలుచు చున్నధి, లయించుచున్నది. యజ్ఞకర్త యజ్ఞము యజ్ఞమునయజింపబడువారు యజ్ఞభోక్త యజ్ఞఫలము నాతడే. సర్వ స్వరూపుడయిన నతనినుండియే యుగాది కాలగణనమేర్పడినది. ఆ హరికి వ్యతిరి క్తమయిసదే కొంచెములేదు.

ఇది బ్రహ్మపురాణమున భూర్భువస్స్వరాదికీర్తనమను ఇరువదిమూడవ అథ్యాయము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment