ధ్రువసంస్థితినిరూపణమ్
సూతుడిట్లనియె: –
భగవంతుడగు హరియొక్క తారా (నక్షత్ర)మయమైన రూపము శిశుమార నక్షత్ర మంతరిక్ష చక్రమునందు ప్రకాశించుచున్నది. దాని తోక యందు ధ్రువుడున్నాడు. అతడు దాను దిరుగుచు చంద్రాదిత్యాది గ్రహములను ద్రిప్పుచున్నాడు. తిరుగుచున్న యీ ధ్రువుననుసరించి నక్షత్రముల చక్రమువలె తిరుగుచుండును. సూర్యచంద్రులు తారానక్షత్రగ్రహ సమూహము వాయుమయములైన బంధములచే ధ్రువుని యందు అనుబద్ధములై యున్నవి. అంతరిక్షమందు జ్యోతిశ్చక్రము శిశుమారాకారమున (మొసలివలె) నున్నదని వర్ణితమైనది. ఆమ్మూర్తికాథారమై హృదయమందు నారాయణుడున్నాడు. ఉత్తానపాదుని కుమారుడు ప్రజాపతి నారాధించి తారారూపమయిన ఆ శిశుమారముయొక్క తోకయందున్నాడు. శిశుమారమునకాధారము సర్వాధ్యక్షుడైన జనార్దనుడు. ధ్రువునకు ఆధారము శిశుమారచక్రము. ధ్రువునియందు భానుడున్నాడు. సురాసురమానుషమయిన ఈ జగత్తంతయు ఆ సూర్యుని ఆధారమై నిలిచియున్నది. నూర్యుడీ జగత్తునంతకు ఏ విధానమున ఆధారముగా నుండెనో నావలన వినుడు!
సూర్యుడెనిమిది మాసములు రస స్వరూపములైన జలములను పీల్చి వర్షించును. ఆ వర్షము వలన అన్నము దానివలన సకల జగత్తు పొడమును. తీక్షకిరణములచే అర్కుడు జగమ్మునగల నీటినాకర్షించి సోముని పోషించును. ఆయన వాయునాడీమయమైన జలముచే ఆకాశము నందుండి పొగ అగ్ని వాయువు యనువానియొక్క సన్నిపాతస్వరూపమయిన మేఘములందు జలముల జిమ్మును. ఆ మేఘములనుండి నీరు భ్రంశముకానందున ఆ మబ్బులకు ”అభ్రములు” అను పేరు వచ్చినది. ఈ మేఘము నందున్న నీళ్ళు వాయుప్రేరణమున కాలజనితసంస్కారమును బొంది నిర్మలములై వానగా అవనిపైబడును. ప్రాణికోటి పుట్టుటకు కారణములై భౌమములయిన యీ అప్పులు (నీళ్ళు) నదులు, సముద్రములు. భూమి ప్రాణి జన్యము లని నాలుగు రూపములతోనున్న యీ జలమును భగవంతుడైన సవిత ఆదానము చేయును (గ్రహించును). సూర్యుడు అభ్రగతము కాకుండ ఆకాశగంగా గతమైన నీటినికూడ కిరణములచే గ్రహించి ఆప్పటికపుడవనిపై వర్షించును. అట్టి ఆకాశగంగోదకముల స్పర్శవలన పాపములు వాసిన మర్త్యుడు నరకమునకేగడు. అది దివ్యస్నాసమని ఋషులు చెప్పిరి. సూర్యదర్శనమాత్రమున దివంబునుండి రవికిరణములచే ఆ ఆకాశ గంగోదకము వెదజల్లబడును.
కృత్తికాదివిషమ(బేసి) నక్షత్రములందు సూర్యుని దర్శనముతో వర్షించు ఆ ఉదకము దిగ్గజములెత్తి వర్షించినట్టి గంగోదకమని తెలియనగును. సూర్యుని కిరణముల ద్వారమున సరిసంఖ్యకల నక్షత్రములందు కురియువాన అప్పటికప్పుడు సూర్యకిరణములచే స్వీకరింపబడి వర్షింపబడినది యీ ఉభయమును నరులకు పావహరము పుణ్యకరమును అగు దివ్యస్నానమని తెలియనగును. మేఘముల వెంట కురియు ఉదకము ఔషధులను పొషించును. ప్రాణులకు జీవనమగు ఆ జలము అమృతము. దానంబెంపొందిన సకలౌషదీగణము ఫలపాకాంతమై (పంటపండగానే నశించునదియై) ప్రజలకు సాధకమగును. అందుచే శాస్త్రచక్షువులగు మానవులు వేదములు చెప్పిన యజ్ఞము సహరహము నాచరించి దేవతల కాప్యాయనము కలిగింతురు. ఇట్లు యజ్ఞములు వేదములు బ్రాహ్మణాది వర్ణములు సర్వదేవనికాయము సకల పశుభూత నంఘాతము స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు వర్షాధారమున రాజిల్లుచున్నది. ఆవర్షము సూర్యుని వలన నేర్పడుచున్నది. అట్టి సూర్యునికి ఆధారమై ధ్రువుడున్నాడు. ఆతనికి శిశు మారము దానికి నారాయణుడును అశ్రయమై యున్నారు. శిశుమారచక్ర హృదయ స్థానమందు నారాయణుడుండి సర్వభూతములను ధరించుచు సనాతనుడు సర్వాదిభూతుడై అలరారు చున్నాడు. భూ సముద్రాది సహితమైన బ్రహ్మాండము యొక్క స్వరూపమిది. మీకు తెలిపితిని. మరియేమి వినదలతురో ఆనతిండు.
ఇది శ్రీ బ్రహ్మపురాణ మందు ధ్రువసంస్ధితి నిరూపణము అను ఇరువదినాలుగవ యధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹