స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః
ప్రవచన నిపుణా! పృథివి యందు ఉత్తమ మయినది ధర్మార్థకామమోక్షములను ఒసంగునదియగు భూమిని తీర్థములకెల్ల ఉత్తమ తీర్థమును తెల్పుమని మునులడుగ సూతుడిట్లు చెప్పదొడంగె, మున్ను మునులీప్రశ్నను మా గురువులనడిగిరి.
కురుక్షేత్రమున నానాతరులతా పుష్పఫలోపశోభితమైన తన ఆశ్రమమునందు ఆసీనుడైయున్న మహాభారతకర్తను సర్వశాస్త్ర విశారదుని ఆధ్యాత్మనిష్ఠుని సర్వజ్ఞుని స్వభూతహితాభిరతుని పురాణాగమనక్తను వేదవేదాంగపారగుని శాంతుని మతిమంతులకెల్ల అగ్రేసరుని పద్మపత్రాయతేక్షణుని శ్రీ daవేదవ్యాసుని దర్శించువేడుకతో నిశిత వ్రతపరాయణులైన మునులేతెంచిరి. ఆ వచ్చినవారు కశ్యపుని మొదలు కృష్ణానుభౌతుకునిదాక గల పేర్లవారు. నక్షత్రములలో చంద్రునివలె వారిలో పరాశరసూనుడు శ్రీమంతుడు వ్యాసుడు మిక్కిలిగా తేజరిల్లెను. వేదవేత్తయగు సమ్ముని యా మునివరులను బూజించెను. వారును నతనికి ప్రతిపూజసల్పి కుశల ప్రశ్నములయిన తరువాత సాత్యవతేయునిట్లడిగిరి.
ఓ మునివరా! వేదశాస్త్ర పురాణాగమాది సర్వసారస్వతమును భూత భవిష్యద్వర్తమానములను నెరుంగుదువు. మునిసత్తమా! రాగమును మొసళ్ళు విషయములను ఉప్పునీరు ఇంద్రియములను సుళ్ళు గలిగి దురాశయను కెరటముల నిండి లోభ గంభీరము దుస్తరము మోహమును రొంపియుగల్గి దుఃఖ బహుళము కష్టతరము నిస్సారమైన సంసారసాగర మందు మునిగి నిరాలంబమై అచేతనమై యున్న జగత్తును జూచి మహానుభావుడవగు నిన్నడుగు చున్నాము. ఈ భయంకర సంసారమందేది సాధింపవలె? ఏది శ్రేయస్సాధనము? ఉపదేశించి జగముల నుద్ధరింపుము. ఈ అవనియందు దుర్లభము మోక్షదమునైన పవిత్రక్షేత్రమును చెప్పడు. ఈ మేదినియందు గర్మభూమి యేదియో నీ వలన వినదలచితిని. కర్మభూమియందు నరుడు యధావిధిగా కర్మ మొనరించి పరమసిద్ధిని బొందును. వికర్మవలన నరకమును బొందును. మోక్షభూమియందు మోక్షమందును గావున మాకీ విషయములు వినిపింపుమన, త్రికాలజ్ఞుడగు వ్యాసమహర్షి వారి కిట్లానతిచ్చెను.
మున్ను మేరుపృష్టమందు నానారత్నద్రుమలతా కుసుమపల్లవ లలితమై నానామృగఖగకలకలమై నానావర్ణ శిలాధాతు రంజితమై నానా మునిజనాశ్రమ సమన్వితమై రమ్యమునైన ప్రదేశమునందు ఆసీనుడైయున్నవాడు.
జగన్నాథుడు, జగద్యోని, చతుర్ముఖుడు, జగన్నాథుడు, జగద్వంద్యుడు జగదాధారుడు ఈశ్వరుడు, జగత్పతి, దేవదానవాదులచే వివిధ రీతుల సేవింపబడుచున్న బ్రహ్మను భృగ్వాది మునులు దర్శించి మ్రొక్కి యిదే యంశము నడిగిరి.
భగవంతుడా భూతలమున కర్మభూమిని దుర్లభమైన మోక్షప్రద క్షేత్రమును తెలుపుడనగా సురేశ్వరుండిట్లు తెలుపబూనెను.
ఇది బ్రహ్మ పురాణమున స్వయంభు బ్రహ్మర్షి సంవాదమును ఇరువది ఆఱవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹