Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఇరవై తొమ్మిదవ భాగము

సూర్యపూజా ప్రకరణము

మీరు చెప్పిన భాస్కర క్షేత్ర మహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగలేదు. కావున పూజా విధానము,దానము నమస్కారము,ప్రదక్షిణము,ధూప దీపాది సమర్పణ ఉపవాసము, సూర్యాలయమార్జనము-మొదలగు వాని విశేషములను వినగోరెదము. సూర్యప్రీతికరములైన పూవులను, నమస్కారవిశేషములను, సూర్యార్ఘ్యవిధానము, సూర్యునుద్దేశించి చేయు నుపవాసము, నక్తము (పగలుపవాసముండి రాత్రి భోజనముచేయుట) మొదలగువాని ఫలము, దేశకాల విశేషములను వినవలెనని కుతూహలపడుచున్నాము. అని మునులడుగ బ్రహ్మయిట్లనియె.

మనస్సుచేత చేయు భావన భక్తి శ్రద్ధ ధ్యానము సమాధియను పేర్ల పిలువబడును. భక్తి సమాధి స్తుతి అనువానిచే పత్రపుష్పఫలముతోయములే కొంచెమొసంగిన నది భగవంతుడు స్వీకరించి ప్రీతిచెందును. రవికి భక్తితో చేసిన ప్రదక్షిణ అఖిల భూప్రదక్షిణమే. సర్వదేవతాప్రదక్షిణమే. షష్టితిధియందు ఏకభుక్తముచేసి గాని సప్తమి నాడు భానునర్చించిన అది అశ్వమేధ యాగము చేసిన ఫలమిచ్చును. కృష్ణపక్షసప్తమీతిధియందు. భాస్కరుని పూజించిన పద్మప్రభమైన విమానములో నెక్కి సూర్యలోక మేగును. శుక్లపక్షసప్తమినాడు ఉపవసించి తెల్లని పూజాద్రవ్యముల అబ్జ బాంధవుని పూజించిన సరియే ఫలము. అర్కసంపుటముతో (రాగిఅరివాణముతో) గూడిన తీర్థము నేకోత్తర వృద్ధిగా నిరువది నాలుగు రోజులు పానముచేసి క్రమముగా తగ్గించుకొనివచ్చుచు సేవించుచు నిట్లు రెండేడ్లకు వ్రతసమాప్తి చేసినచో ఆయ్యర్క సప్తమీ వ్రతము అశేష కామప్రదము. శుక్లపక్షసప్తమి భానువారము కలిసివచ్చెనేని యది విజయసప్తమి అనబడును. అందు స్నాన దానములనంతఫలదములగును.

ఆదివారము శ్రాద్ధము పెట్టినను మహాశ్వేతము (తెల్ల జిల్లేడు) తో హోమమొనర్చినను అఖీష్టసిద్ధి గల్గును. వారి వంశమున దరిద్రుడుగాని రోగిగాని పుట్టడు. తెల్లని ఎఱ్ఱని పసుపుపచ్చని మృత్తికతో పూజించిన వాని కోర్కెలు నెరవేరును. రంగురంగుల పూలతో చిత్రభానునర్చించి ఉపవాసముండిన అభీష్టము వడయును. ఆవునెయ్యితోగాని నువ్వులనూనెతోగాని దీపముపెట్టి ఆదిత్యుని పూజించినవానికి నేత్రవ్యాధులుండవు. దీపదాతకు జ్ఞానదీపము లభించును. తిలలు పవిత్రములు కావున తైలగోదానము పుణ్యప్రదము. నలుదారులు కలిసినచో (చతుష్పథములందు) రాజమార్గములందు నట్టి దీనదానముచేసిన నరు డందగాడు (సుభగుడు) భాగ్యవంతుడు నగును. దీపము హవిర్ద్రవ్యములు (ఆవునెయ్యి) మొదలైన వానిచే బెట్టుట ప్రథమ కల్పము. ఓషధీరసములచేతబెట్టుట రెండవ కల్పము. వసా మేదోస్థి సంబంధమైన (క్రొవ్వు పదార్థములు) దీపము నిషిద్ధము. దీపమెపుడు నూర్ధ్వముగా బ్రసరించును. కావున దీపదాత యెపుడు నూర్ధ్వగతినేగాని యథోగతి నందడు.

వెలుగుచున్న దీపమును తగ్గింపరాదు. ఆర్పివేయరాదు. అట్లుచేసినవాడు బంధము నాశనము కోపము తమోగుణమును బొందును. దీపదాత స్వర్గమందు దీపమాలవలె వెలుగును. కుంకుమాగరుచందనములచే రక్తచందన రక్తపుష్పములచే ఆదిత్యునర్పించిన అతడుదయ మందు అర్ఘ్యమిచ్చినతడు సంవత్సరములో నిష్టసిద్ధిగాంచును.

సూర్యుడు ఉదయించి అస్తమించుదాకా నిలబడి సూర్యాభిముఖుడై ఏదేని మంత్రము జపించినవాడు సూర్యస్తోత్రము ఏదేని చేసినవాడు సర్వపాపములణు బాయును. దీనిని ఆదిత్య వ్రతము అందురు. సువర్ణ గోవృషభ వస్త్రదానములతో సూర్యునకు అర్ఘ్యమునిచ్చిన పుణ్యుడా ఫలమేడు జన్మలదాకా అనుభవించును. అగ్ని నీరు అంతరిక్షము పవిత్రభూమి ప్రతిమపిండితో చేసిన సూర్యమూర్తి అనువానికి అందర్ఘ్య మీయనగును. సవ్యముగా గాని యపసవ్యముగ (కుడి ఎడమ ప్రక్కల) అర్ఘ్యమీయరాదు. అభిముఖముగా మాత్రమే సూర్యునకు అర్ఘ్యమీయ వలెను. రవికి గుగ్గులుక్రర మారేడు దేవదారువులతో చేసిన నలుపలకల ఆసనము కర్పూరాగరుధూపము లొసగినవారు స్వర్గమందుదురు. విషువములందు (రాత్రిపగలుసమముగానున్న పర్వములందు) ప్రభాకరుని అర్చించిన సర్వ దురితములు దొలంగును. కృసరము (పులగము) పాయసము – అపూపములు పండ్లు – దుంపలు- నెయ్యియను వానిచే సూర్యబలి యిచ్చిన సర్వ కామసమృద్ధినందును. ఆవునేతితో తర్పణముచేసిన సర్వసిద్ధినందును. ఆవుపాలతో తర్పణము మనస్తాప హరణము, ఆవుపెరుగుతో చేసిన కార్యసిద్ధి. పవిత్రతీర్థ జలములచే మార్తాండునకు స్నానము నిర్వర్తించినచో పరమగతి వడయును. ఛత్రము ధ్వజము వితానము చాందినీ)పతాక చామరములు భానునకు సమర్పించిన అభీష్టగతి లభించును. ఏద్రవ్యము అర్కునకు భక్తితో సమర్పించునో ఆ ద్రవ్యము అనంతముగా లభించును. త్రికరణకృత దురితజాలమెల్ల జలజబంధువు వారింపగలడు. యథోక్తదక్షిణముగా చేసిన క్రతుశతమును ఫలము ఒక్కనాడు సూర్యుని భక్తితో నారాధించినను లభింపగలదు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు సూర్యపూజాకల్పమను ఇరువదితొమ్మిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment