ఆదిత్య మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మయనియె:- ఓ మునులారా ! దేవాసుర మానుషమైన సర్వజగత్తు ఆదిత్య మూలము. ఈ తేజస్సు ఇంద్రోపేంద్రాది సర్వదేవతామయము. పరమదైవతమిదియే. అగ్నియందు యధావిధి వేల్వబడిన ఆహుతి ఆదిత్యు నందును, ఆదిత్యునివలన వృష్టి, వర్షమువలన అన్నము దానివలన ప్రజలు గల్గుదురు. ధ్యాననిష్ఠులకు ధ్యానము మోక్షులకు మోక్షము ఈతత్వమే. క్షణ ముహూర్త దివస నిశా పక్ష మాస సంవత్సర ఋతు యుగాది కాలగణన ఆదిత్యుని వలననే. కాలము లేక నియమములేదు. అగ్ని విహరణ క్రియలేదు. ఋతు విభాగములేదు. అపుడు పుష్ప ఫలము లెక్కడ? సస్య నిష్పత్తి యెక్కడిది. తృణౌషధిగణమెక్కడ ! ఇక్కడ దివంబునను జీవ వ్యవవహారము లేనేలేదు. వారి తస్కరుడైన భాస్కరుని వలననే జగద్వ్యవహారము సాగును. వృష్టిలేక సూర్యుడు తపింపడు నీటిని శోషింపజేయడు. గుడికట్టడు. ఉదకముననే వెలుంగును. వసంతమున కపిలవర్ణుడు. గ్రీష్మముస బంగారురంగువాడు. వర్షఋతువున తెల్లనివాడు. శరత్కాలమున పాండువర్ణమువాడు. హేమంతమున రాగిరంగుగలవాడు. శిశిరమున లోహితుడు (ఎఱ్ఱనివాడు). ఋతుస్వభావ సిద్ధము లయిన రంగులంబట్టి కూడ సూర్యుడు క్షేమము సుభిక్షము సేయువాడు.
సూర్యునకు అదిత్య- సవితృ- సూర్య – మిహిర-అర్క – ప్రభాకర-మార్తాండ- భాస్కర-భాను-చిత్రభాను-దివాకర-రవి-ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణు ధాత-భగ-పూష-మిత్ర-ఇంద్ర-వరుణ-అర్యమ-వివస్వత్ అంశుమత్-త్వష్ట-పర్జన్య-యను నీ పంద్రెండు నామములు విశేషనామములు. విష్ణువు చైత్రమందు పంట్రెండువందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖమందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠమందు పదునాల్గు వందల కరముల తోడను – అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల యంశువులతోను వర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును వరుణుడు భాద్రపదమందు అన్నియే కిరణముల చేతను, ఇంద్రుడు ఆశ్వయుజమున పన్నెండవందల కిరణములలోను ధాత కార్తీక మందు పదునొకండువందల కిరణముల చేతను మార్గశిరమున మిత్రుడు పైవిధముగాను, పౌషముస పూష తొమ్మిదివందల కిరణములతోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణములతోను వెలుంగుదురు, ఉత్తరాయణమునుండి సూర్యకిరణములు పెంపొందును. దక్షిణాయనమునుండి తగ్గును. ఇట్లు వేలకొలది కిరణములు గ్రహముల ననుసరించి సూర్యుని నుండి వెలుపడి వెలుంగును. సూర్య సామాన్య నామములు. వివేష నామములును గలిసి యిరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేరుగా నున్నవి.
అంతట మునులు – ఓ పరమేశ్వరా ! ప్రజాపతీ ! సహస్రనామములతో సూర్యుని స్తుతించిన మానవునకు నే పుణ్యం ప్రాప్తించును ? ఏ గతి సిద్ధించును ? తెలుపుమని యడిగిరి.
బ్రహ్మయిట్లనియె. మునులారా ! సూర్య సహస్రనామ పారాయణము వలన నే ఫలము గల్గునో పవిత్రము శుభావహము గుహ్యములునైన ఆ సూర్యనామములను మీకు దెల్పెదను వినుండు.
సూర్యుని ఇరువది యొక్క నామములు మూలమున స్పష్టము. ఈ పవిత్ర నామ స్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును.
ఇది శరీరారోగ్యము , ధనవృద్ధి యశస్సును గూర్చును. రెండు సంధ్యలందు నీ స్తుతి పఠించిన పాపములెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణకృతమైన దురితము నశించును. ఒక మారీనామములచే హోమము సంద్యోపాసనము చేసిన ఆర్ఘ్యమందు బలియందు అన్నదానమందు స్నానమున నమస్కారమందు ప్రదక్షిణమందు నీ మహామంత్రము పఠించిన సర్వపాపక్షయమగును. శుభమగును. కావున మీరీమంత్రము పఠించి వరదుడైన సూర్యదేవుని నుతింపుడు.
ఇతి ముప్పది యొకటవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹