మార్తాండజన్మ శరీరలిఖనవర్ణనమ్
దివాకరుడు, శాశ్వతుడు నిర్గుణుడు అని తెల్పితివి. తరువాత పండ్రెండు మూర్తులతో జన్మించినట్లు తెల్పితివి. తేజోరాశియైన ఆ వెలుగు స్త్రీ గర్భమందెట్లున్నది. ఎట్లు పుట్టెను. ఇది మాకు పెద్ద సంశయము. తీర్పుమని మునులడుగ బ్రహ్మయిట్లనియె.
దక్షునకు సౌందర్యవతులు ప్రసిద్ధలు అయిన అరువది మంది కుమారైలుండిరి. వారు అదితి-దితి-దనువు వినత మొదలైనవారు. అందు పదముగ్గురను కశ్యపునకిచ్చెను. వారి పుత్ర పౌత్ర దౌహిత్ర సంతతి అనంతము. అదితి సంతతి దేవతలు దితి సంతానము దైత్యులు. వారన్యోన్యము గలహించిరి. దాన ముల్లోకములు నాకుల మగుటకు వగచి అదితి సూర్యునారాధించెను. ఆమె సూర్యునిట్లు స్తుతించెను.
సూక్ష్మము పుణ్యము స్వచ్ఛమునైన పరమతేజస్సును ధరించు నీకు నమస్కారము. తేజోవంతులకు నీశ్వరుడును దేజస్సులకు నాధారభూతుడు శాశ్వతుడునై జగదుపకారమునకై తీవ్రరూపము దాల్చిన నిన్ను స్తుతించెదను. ఓ గ్రహావతి! ఎనిమిదిమాసములు (ఆదాన మాసములు) జలరూపమయిన రసమును గ్రహించుటకు దీవ్రరూపముం దాల్చు నీకు వినత నయ్యెదను. అగ్నీషోములతో గూడి త్రిగుణాత్మకమై ఋగ్వజుసామ రూపవేదత్రయీ రూపమైన నీ స్వరూప మీ విశ్వమును తపించుచున్నది. అట్టి నీకు నమస్కారములు. ఓ సనాతన మూర్తి! నీ త్రయీరూపము కంటె పరమై ఓం కారము చేత అభినంహితమైన (వర్ణింపబడిన) స్థూలము సూక్ష్మమునైన యా నీ రూపమునకు నమస్కారము.
ఇట్లు నిరాహారమై అహర్నిశము ఆ భగవానుని స్తుతించెను. చిరకాలమున కా సూర్యభగవానుడు ఆమెకు ప్రత్యక్ష మయ్యెను. ఆమె ఆకసమంతట ఆవరించి పుడమి కవతరించిన ఆ జ్వాలామయ మూర్తిని జూచి మిక్కిలి స్తుతించెను.
ఓ దివాకర! జగత్తునకెల్ల మొదటివాడా! నీ స్వరూపము చూడలేకున్నాను. నేను చూడగల్గునట్లు ప్రసన్నుడ వగుము. నీ భక్తులగు నాబిడ్డలను రక్షింపుము.
అంతట సూర్యభగవానుడు ఆ తోజోమండలము నుండి వెలువడి అగ్నితప్తమైన రాగివలె నెఱ్ఱగా సాకారముగ దర్శనమిచ్చి నమస్కరించు ఆమెతో నభీష్టవరము కోరుమనియె. ఆమె శిరసు వంచి మోకాళ్ళమీదవ్రాలి నమస్కరించి వరదుడయిన స్వామినిట్లు కోరెను.
గ్రహరాజా! నా యెడను నా పుత్రులయెడను ప్రసన్నుడవుగమ్ము. ప్రబలురైన దైత్యదానవులు త్రిభువనములను హరించి యజ్ఞభాగములను తామే అనుభవించుచున్నారు. అందుచే మాయెడల ప్రసన్నుడవై నీ యంశమున వారికి భ్రాతవై జన్మించి ఆ శత్రువులను నశింపజేయుము. నా కుమారులు మరల యజ్ఞభాగములను అనుభవించి ముల్లోకములకు ప్రభువులగు నట్లు అనుగ్రహింపుము. శరణన్నవారి దుఃఖమును హరించువాడవు. వారి కార్యము చక్కబెట్టువాడవునని పేరొందితివి. ఉదకములను హరించు సూర్యభగవానుడు ప్రపన్నుడై ఆమెతో నిట్లనియె.
నేను నీ తపస్సునకు సంతోషించితిని. నీకు వేయవవంతు తేజస్సుతో కుమారుడనై జనించి నీ బిడ్డలకు శత్రువు లయినవారిని అందరిని నశింపజేసెదను. అని సూర్యభగవానుడు అంతర్ధానమందెను. ఆమె కోరిక సఫలమై తపస్సును చాలించెను.
ఆ తరువాత ఒక సంవత్సరమునకు సుషుమ్నయను కిరణరూపమున అదితి గర్భమందు నామె కోర్కె సఫలమొనర్ప సూర్యుడు ప్రవేశించెను. అమె కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతముల నాచరించెను. అంతట కశ్యపుడు కుపితుడై ”నిత్యోప వాసములం జేసి నీగర్భమారణము చేసికొందువా” అన నామె యిట్లనియె.
అంత నామెయు కుపితయై ఈ గర్భాండముం జూడుము. ఇది మారితము కాలేదు. గాక శత్రుమారకము గాగలదు. అనిపలికి గర్భమును పనివడి విసర్జించెను. అట్లు జారిన యామెగర్భము తేజస్సులచే జాజ్వల్యమాన మయ్యెను. కశ్యపుడు భాస్కరవర్చస్వి అగు నామూర్తిని గని ప్రణతుడై ఆదరముతో తొలిపల్కుల స్తుతించెను. అంతట ఆ గర్భాండము వెలువడి పద్మపత్రమట్టి అరుణ ప్రభల దీపించుచు నలుదెసలు ఉద్దీపింప చేయుచున్న ఒకమూర్తి ప్రత్యక్షమయ్యెను. అవ్వల అంతరిక్షమునుండి ఆముని సత్తముం గూర్చి అశరీరవాణి సజల జలదగంభీరమ్ముగా ఇట్లు పలికెను.
ఈ అండము మారితమని నీవంటివి. ఓ కశ్యపు మునీంద్రా! అందువలన నీ మూర్తి మార్తండుడను బేరం బరగును. ఇతడు యజ్ఞభాగముల హరించుచున్న అసురులను సంహరించును. ఆ ఆకాశవాణి వాణినాలించి గీర్వాణులు హర్షించిరి. దానవులు దిగులొందిరి. శతక్రతువంతట అసురుల యుద్ధమునకు పిలిచెను. మార్తాండునిచే జూడబడిన దానవుల్లెల నిస్తేజస్కులై దహింపబడి భస్మమైపోయిరి. దేవతలు మార్తాండుని పెక్కుభంగుల వినుతించిరి. నురలు మార్తండుడు స్వాధికారముం బడసి యజ్ఞభాగములందిరి. ఇనుండు క్రిందుమీదును తన కిరణములచే కడిమిపూవువలె భాసించుచు అగ్నిగోళమట్లు పెలుంగుచు అస్ఫుటమైన ఆకారము దాల్చెను.
అంత మునులు కదంబముకుళమట్లెఱ్ఱగ కన్నెఱ్ఱయైన అమ్మూర్తి యెట్లు దర్శనీయమయ్యె నానతిమ్మన బ్రహ్మయిట్లనియె.
సర్వలోకములకు నాభిస్థానమైన సూర్యుడు తరణి పట్టునప్పుడు పరిభ్రమించుట వలన సముద్రములు పర్వతములు పనములతో గూడిన భూమి ఆకాశమంటెను. చంద్రాదిగ్రహాది నక్షత్రసహితమైన ఆకాశమెల్ల చిమ్మబడి వ్యాకులమై భూమికి దిగిపోయెను. సముద్ర జలము సంక్షోభించెను. చరియలు పగిలి మహాపర్వతములు బ్రద్దలై పోయెను. ధ్రువుని ఆధారముగా గొన్న అఖిల జ్యోతిర్నివాసములు (లోకములు) రశ్మి (కిరణము శ్లేష రజ్జువు) బంధములు తెగి క్రిందబడినవి. చక్రభ్రమణవేగమున బుట్టిన వాయువులచే చెదరి మహామేఘములు గర్జిల్లుచు విడిపోయెను. సూర్యభ్రమణము వలన విక్షిప్తములైన భూమ్యాకాశ పాతాళ ప్రపంచము మిక్కిలి వ్యాకుల మయ్యెను. ఇట్లు ముల్లోక మాకులమగుటగని బ్రహ్మతోగూడ దేవతలు భాస్కరు నిట్లు స్తుతించిరి.
సూర్యభగవన్ స్తుతి
దేవతలకు ఆదిదేవుడవై ఆవిర్బవించితివి. భూమియొక్క విభూతికెల్ల నీవాధారము. నీవే సృష్టిస్థితి లయకార్యములందు ముమ్మూర్తు లగుదువు. జగత్పతీ నీకు మంగళమగుగాక! నీవు తాపమువర్షింతువు. జగత్‌పతీ! జయము జయమని ఇంద్రాదులు సప్తర్షులు వివిధ స్తోత్రములచే వాలఖిల్యాదులు వేదసూక్తములచే స్తుతించిరి. దేవతలకెల్ల మొదటివాడు (దేవతలకు ముఖస్థానీయుడు) అగు అగ్ని భగవానుడు సంతోషముతో తరణిబట్టు బడుచున్న తరణిని నాథ! మోక్షమందిన వారికి నీవు మోక్షస్వరూపుడవు. ధ్యాననిష్ఠులకు పరమ ధ్యేయమైన వస్తువవు. సర్వభూతములకు నీవు పరమగతివి. కర్మకాండ ప్రవర్తనులకు నీవే గతివి. పూజ్యుడవు. దేవేశ! మాకు శం = సుఖము అస్తు = కలుగుగాక! ద్విపదే = రెండు పాదాలుగల జీవకోటికి మాకు సుఖమగుత. చతుష్పదే. నాలుగు పాదములు గల పశుజాతికి సుఖమగుగాక అని వేదసూక్తార్ధములతో విద్యాధర గణములు యక్షరాక్షస నాగకులములు తలలు వంచి చేతులు జోడించి మనసునకును వీనులకును నింపుగ స్తుతులం బలికిరి. సర్వభూతాధార నీ తేజస్సు భూతజాలము సహింపగలదగుగాక! అవ్వల హాహా హూహూ నామక గంధర్వులు నారద తుంబురులు షడ్జమధ్యకుమగాంధారరూప గానత్రయ విశారదులు గావున సూర్య పరమాత్మను గాంధర్వ విధితో సంకీర్తనము సేయ నారంభించిరి.
తానమూర్ఛనాది వివిధ సంగీత ప్రయోగములచే బహుసుఖముగ వారు పాడిరి. విశ్వాచి ఘృతాచి ఊర్వశి తిలోత్తమ మేనక సహజన్య రంభ మొదలైన యప్సర స్త్రీమణులు నర్తనము సేసిరి. హావభావవిలాసములచే సభినయించిరి. వీణావేణు మృదంగ ఝర్ఝరపణవపుష్కరపటహ ఆనక దేవదుందుభి శంఖాదివివిధ వాద్యములు శతముసహస్రముల మ్రోయించిరి.
పాటలు పాడు గంధర్వులచే నాటలాడు అప్సరోగణములచే తూర్యవాదిత్రఘోషములచే సర్వ కోలాహల మయ్యెను. ఆసమయమున వేల్ఫులెల్లరు జేతులు మొగిచి భక్తితో వంగి సహస్రాంశునకు ప్రణామములు సేసిరి.
అంతట సర్వస్వర్గ సమావేశమునందు కోలాహలమందు విశ్వకర్మ (దేవశిల్పి) మెలమెల్లన రవిబింబమును యంత్ర మెక్కించి చెక్కనారంభించెను. ఆయనచే భానుడాజానువుగ (మోకాళ్ళ దనుక) నిపుణముగ లేఖనము సేయబడి తసయభినందనము లేనందున యంత్రమునుండి దింపబడెను.
తేజోహాని వలనగలిగిన రూపమును నిషేధింపలేదు. అందువలన ఆయన రూపము చక్కనివానికెల్ల చక్కనిదై మిక్కిలి శోభించెను. హేనుంత, వర్ష, గ్రీష్మ ఋతువులకు హేతువైన వాడును త్రిమూర్తులచే స్తుతింపబడువాడునగు భానుమూర్తియొక్క ఈ స్వరూపతక్షణములు (చెక్కుటను) విన్న యాతడు ఆయుస్సమాప్తిలో సూర్యసాలోక్యము నందును. ఓ మునిసత్తములార ! సూర్యునిజన్మవృత్తాంతము ఆయనపరమోత్తమ రూపమును నేను సంకీర్తించితిని.
ఇది శ్రీ బ్రహ్మపురాణము నందు ”మార్తాండ శరీరలిఖనము” అను ముప్పదిరెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹