Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ముప్పై నాల్గవ భాగము

రుద్రాఖ్యానము

సర్వాంతర్యామియైన రుద్రుడు ఉమాదేవికి ప్రియము చేయువాడై సర్వదేవతలను సిద్ధ విద్యాధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన అందరిని పారద్రోలి సర్వశ్రేష్ఠ పదార్థములతో నిండిన యజ్ఞమును సర్వ సంభారములతో నశింపజేసెను. స్వామి ప్రతాపమున కడలి ఇంద్రాదులు శాంతి కరవై కైలాసమున కేగి వరదుడైన ఆ శూలపాణిని దక్షయజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివుడు ఏకామ్రక (కాంచీ) క్షేత్రమందు సర్వకామప్రదుడై యుండెను.

మును లిట్లనిరి.

సర్వభూత హితాభిలాషి అయిన శివుడేల ఆ యజ్ఞమును సంహరించెను. సర్వదేవతలు అందు అలంకరించియున్నారు గదా స్వల్పకారణమున అట్లు జరిగినదని మేమనుకొనము. మీ వలన విన మిక్కిలి గుతూహల మగుచున్నది.

బ్రహ్మయనియె

దక్షునికి ఎనమండుగురు కూతుండ్రు. వారందరు వివాహితులు. వారిని తండ్రి రావించి తనయింట సత్కరించెను. వారును పుట్టింట ఆదరమంది వసించిరి. వారిలో పెద్దదియగు సతియను శివుని భార్యను దక్షుడు రుద్రుని ద్వేషించి పిలువడయ్యెను. అందులకు అల్లుడు పరమేశ్వరుడు నైజముగ తన ప్రభావమున తానున్నవాడు కావున ఆ మామగారియెడ ఏ కొంచెము వినయము చూపడయ్యెను. సతీదేవి తండ్రి గృహమునకు చెల్లెండ్రందరు వచ్చిరని ఎఱింగి తానును పిలువకున్నను అట కేగెను. తండ్రి అందరు కూతురుల కంటె ఆమెను హీనముగా జూచి వారికంటె తక్కువగా ఆదరించెను. అంతట సతీదేవి కినుక గొని తండ్రితో ఇట్లనియె.

నాకన్న నీ కన్యలు చిన్నలు. నేను పెద్ద ఆడపడుచును. నన్ను పూజింపవైతివి. అంతేకాదు అలుసుసేసితివి. నేనిందఱిలో పెద్దను యోగ్యతలోను పెద్దను. నన్ను సత్కరింప దగినవాడవు. అని సతీదేవి అన విని దక్షుడు కన్నెఱ్ఱ చేసియిట్లనియె.

ఆనాకన్నియలు నీకన్న అన్నివిధములు మిన్నలు. యోగ్యులు. వారి భర్తలుగూడ నాకెంతేని గూర్తురు. బ్రహ్మిష్ఠులు వ్రతనిష్ఠులు ధర్మిష్ఠులు. యోగ నిష్ఠులు గుణగరిష్ఠులు నిటలాక్షునికంటె పలువిధముల అందఱు మెచ్చదగినవారు. వారు వశిష్ఠుడు అత్రి పులస్త్యుడు అంగిరుడు పులహుడు క్రతువు భృగువు మరీచి అనువారు. పశుపతి వారితోగూడ స్పర్థ గొనును. వారును అతనిని ద్వేషింతురు. అందువలన నిన్ను నేను గౌరవింపను. నాకు శివుడు ప్రతికూలుడని మూఢ బుద్ధియైన దక్షు డామెతో ననెను. శాపమునకు తాను గురికావలసిన విధి ననుసరించి ఇట్లు ఋషులను అల్లుని తూలనాడెను. అంత ఆ దేవి కోపము దెచ్చికొని తండ్రితో నిట్లనియె.

సతి పలికెను

త్రికరణములచేత పరిశుద్ధురాలనైన నన్ను గర్హించితివి. కావున నీ వలన వచ్చిన ఈ దేహము ఇదిగో విడుచుచున్నాననెను.అని ఆ అవమానము సైపనేరక దుఃఖముతో ఆ దేవి దక్షునతో ఇట్లనియె

ఈ మేనువిడిచి మఱియొక్క ఉపాధితో వెలుగొందుచు నేను పొరపాటుపడని దాననై ధర్మనిష్ఠనై పరమేశ్వరునికి ధర్మపత్నిని అయ్యెదనుగాక.అని అక్కడనే కూర్చుండి, దుష్టుడగు దక్షుని సాధించుటకు తాను అగ్నిధారణ చేసెను.

ఆ అగ్ని వాయుప్రేరితుడై ఆమె అన్నియవయములందుండి వెలువడి ఆమెను భస్మ మొనరించెను. శూలపాణి ఆమె నిర్యాణ వార్తవిని తండ్రి కూతుండ్ర ఆ సంవాదము ఉన్నదున్నట్లు దెలిసికొని భగవంతుడా శంకరుడు దక్షవినాశమునకై కుపితుడయ్యెను.

అట్లు కోపించి శంకరుడిట్లనియె. ఓ దక్షా! పిలువని పేరంటముగ వచ్చి సతీదేవి నీచే అవమానితురాలైనది కావున నీ తక్కిన కూతుళ్లు మగలతో ఉత్తమరాండ్రు గావున వైవస్వత ద్వితీయ మన్వంతరమున నీ మహర్షులు అయోనిజులై నీ యజ్ఞమునకు వత్తురు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మ గావించు సత్రయాగమందు హోమము జరుగగా నిట్లు జరుగును. అని సప్తర్షులను శపించి రుద్రుడు దక్షునికిట్లు శాపమిచ్చెను. చాక్షుషమన్వంతరమున ప్రాచీన బర్హిపౌత్రుడు ప్రచేతసుని పుత్రుడు వైదక్షుడను నీ పేరుతోనే మారిషయందు నీవు జనింతువు ఆమారిష వృక్షములకు కన్యయై జనించును. నే నక్కడగూడ దుర్బుద్ధివగు నీకు ధర్మకామార్థయుక్తములయిన నీ కర్మాచరణములందు మఱి మఱి విఘ్నములు గావింతును ఇట్లు శప్తుడై యాదక్షుడును రుద్రునకెట్లు ప్రతిశాపమిచ్చెను.

ఓ క్రూరుడా! నా కొఱకు ఈమహర్షులనుగూడ తూలనాడితివి. కావున యజ్ఞములందు దేవతలతోబాటు నిన్నెవ్వరును యజింపరు. ఒకవేళ నీకాహుతి యిచ్చినను, (రుద్రుని కిచ్చిన యాహుతి యనంతరము) పవిత్రులగుట కుదక స్పర్శ గావింతురు. యుగాంతము వరకీ లోకముననే నీవుందువు. దేవతలతోబాటు పూజ నీ కుండదనెను.

దేవతలు తమలోగల చతుర్వర్ణములవారితో గలిసి భుజింతురు. వారితో గలిసి నేను భుజింపను. వేరే భుంజితును. అన్నిలోకములకు మొదటిది భూలోక మందురు. ఆ లోకమును నాయంతట నేనొక్కడనే ధరింతును. నీ యాజ్ఞతో గాదు. (నీ యాన అక్కరలేదు) ఈ కర్మభూమిని ధరించినంతట ఎల్లలోకములు శాశ్వతముగ సుస్థిరములై నిలువగలవు. అందుచే నే నీ భూలోకమందే యుందును. అదియు నీ యాజ్ఞచేత గాదు. అని రుద్రుడనెను.

అమిత తేజోమూర్తియగు రుద్రునిచే నిట్లు దక్షుడు నొవ్వనాడ బడి స్వాయంభువమూర్తిని విడిచి (ప్రజాపతత్వము గోల్పోయి) మనుజులం దిక్కడ మానవలోకమున జనించి దక్షుడను పేరుతోనే గృహస్థుడై యజ్ఞములందు యజమానుడై దేవతలతో గూడ నెల్ల యజ్ఞముల నాచరించెను.

ఆ మీదట సతీదేవి వైవస్వత మన్వంతరమురాగానే హిమవంతునికి మేనక యందు ”ఉమా|| నామ్నియై అవతరించెను. ముందు సతియను పేరంది యా మీద ”ఉమ” అను నామమందెను. శంభుని కీమె సహధర్మచారిణి. ఆయన యీమె నెన్నడును విడిచి యుండడు. మరీచి కుమారుడైన కశ్యపుని అదితి నారాయణుని శ్రీదేవి. ఇంద్రుని శచీదేవి విష్ణుని కీర్తి సూర్యుని ఉష వశిష్ఠు నరుంధతియు నట్లు శంకరు నీమె యెన్నడును విడువదు. పరమేశ్వరున కీమె నిత్యానపాయిని.

మున్నిట్లా దక్షుడును చాక్షుషమన్వంతరమందు బ్రహ్మ గావించిన యజ్ఞమునందు ప్రాచీనబర్హికి పౌత్రుడుగను బ్రచేతసులకు పుత్రుడుగనునై మారిషయందు జనించెను. ఇది మునుపు త్రేతాయుగమున వైవస్వత మనువు కాలమున బ్రహ్మ వరుణదేవతాకమైన మూర్తిధరించి గావించిన యజ్ఞమునందు దక్షుని జన్మము జరిగినది. అల్లుడు మామలకు కలిగిన యీ విరోధము జన్మాంతరమును పొందినది. కావున నుత్తము లొండొరులు విరోధము పెట్టుకొనగూడదు. శుభా శుభకర్మ ఫలములచే భావితుడై (అనగా ప్రారబ్ధమునకు అధీనుడై) యుండు జీవుడు ఆకారణముచే జాత్యంతరమందు పుట్టినపుడు వానికిని పూర్వజన్మ ఖ్యాతి (యోగ్యత) రాదు. ఆపుట్టువులో కార్యాకార్య విఛక్షణతయున్నను తొల్లిటి కర్మానుభవమెంత వారికిని దప్పదన్నమాట.

బ్రహ్మ పలుకులు విని మును లిట్లనిరి. దక్షకన్య సతీదేవి రోషముగొని మేరువిడిచి పర్వతరాజింట జనించెగదా ! అపుడు మఱల నా భవానికి భవునితో సమావేశ మెట్లయినది. వారికా ఘట్టమునందు జరిగిన సంవాదమేమి ? ఆ మహాపుణ్య జన్మ మందు స్వయంవర మెట్లయ్యె వారి కల్యాణ మహోత్సవమచ్చెరువు గొల్పునది గదా ! అదెల్ల సవిస్తరముగ నానతీయ దగుదువు. అపుణ్యకథ మనోహరము మేము విన గుతూహలపడుచున్నామన బ్రహ్మ యిట్లనియె.

ఓ ముని వర్యులార ! పాపహరమగు నా ఉమా శంకర కల్యాణము పవిత్రము. కామ ఫలదము. ఒకప్పుడు తన యింటి కరుదెంచిన కశ్యపమహర్షిని హిమవంతుడు పుణ్యయశఃకరమగు నొక వృత్తాంతము నిట్లడిగెను. మునీ! ఏమి చేసిన అక్షయపుణ్యలోకములు గల్గును? పరమోత్తమఖ్యాతిదేనివలన వచ్చును? సత్పురుషు లెవ్వరెట్లు పూజింప వలసి యుందురది యానతిమ్మన కశ్యపు డిట్లనియె.

నీ తెల్పిన భాగ్యమెల్ల సంతానము వలన గలుగును. నేను(చతుర్ముఖ బ్రహ్మ)పరమర్షు లెల్లరు సంతానలాభముచే ఖ్యాతి గన్నారము. గిరీంద్ర ! నీవు చూచుట లేదా ! మఱి యడిగెదవేమి ? మున్ను నేను గన్న వృత్తాంతమిదె చెప్పెద వినుము. వారణాసికేగుచు ఆకాశమందున్న ఒక నూతన దివ్యవిమానము గాంచితిని. దానికి క్రిందుగ నొక గుంట నుండి యొక ఏడుపుధ్వని విన్నాను. నా తపశ్శక్తిచే దానినెఱింగి యచటకేగి దాగి నిలిచితిని. అటనొక పవిత్రమూర్తి తపస్వి తీర్థముల సేవించి అభిషేకము గావించుకొని ఆదారినేగుచు నొక బెబ్బులికి బెదరి ఆ గుంట దరికి పరువిడి వచ్చెను. అక్కడ నొక అవురుగడ్డికాడనుబట్టుకొని వ్రేలాడు మునుల గాంచెను. అట్లుగని ఆర్తుడై దుఃఖించుచున్నవారల నెవ్వరు మీరు ఈగడ్డి దుబ్బు నూతగొని మొగములు క్రిందికి వాల్చి వ్రేలాడుచున్నారు. మీ దుఃఖమునకు విముక్తిగలుగగలదు చెప్పుడు. అన పితరులిట్లనిరి.

మేము పుణ్యకర్ముడవగు నీ తండ్రులము, తాతలము, ముత్తాతలమును. నీపాపకర్మముచే మేమిట్లు క్లేశపడు చున్నాము. ఈ గుంట గుంటగాదు నరకమే. నీవే ఈ అవురుగడ్డిదుబ్బు. నిన్నే యూతచేసికొని వ్రేలాడుచున్నాము. నీవు బ్రతికినన్నాళ్ళు మేమిచ్చట నిట్లుందుము. నీవు మరణించినంతట మేము నరకము పాలగుదుము. నీవు పెండ్లి చేసికొని గుణవంతుని పుత్రుని గంటివేని మే మీపాపమునుండి ముక్తులగుదుము. మఱి యే తపస్సుయొక్క తీర్థములయొక్క ఫలమునను మాకు విముక్తి రాదు. బుద్ధిమంతుడవు గావున నీపితరులను మమ్మీ నరక భయము నుండి తరింపజేయుము. అన కశ్యపు డనియె.

అట్లు చేసెదనని యాతడు వృషభవాహనుని ఆరాధించి ఆగర్తమునుండి పితరులనుద్ధరించి శివుని ప్రమథగణముల నాయకులం గావించెను. తాను సువేశుడనుపేర బలశాలియై రుద్రుని గణనాయకుండయ్యె. కావున ఓ శైలేంద్ర! తీవ్రతపస్సు సేసి గుణశాలియైన సంతానముం గనుము. పరమసుందరిని గూతురుం గాంచుము.

బ్రహ్మ యిట్లనియె. ఇట్లాఋషిచే దెలుపబడి కొండరేడు నియమమూని అనుపమమయిన తపస్సు గావించెను. దాన నాకు సంతుష్టి గల్గినది. వెంటనే నేనాతని కడ వ్రాలితిని. నీ తపమ్మునకు మెచ్చితిని. వరమిచ్చెద నడుగుమంటిని. సర్వ గుణాలంకారుం గుమారుం గోరెవ నాయెడ సంతుష్టుడైతివేని అనుగ్రహింపుమని శైలరాజనియె.

ఆతని మాటవిని యాతని మదికనువైన వరమిచ్చితిని. ఓ శైలరాజ! ఈ తపః ప్రభావమున నీకొక కన్య యుదయించును. దాన నీవు పరమశోభనమైన కీర్తి నొందెదవు. ఎల్లవేల్పులు నిన్నర్చింప కోటి తీర్థములకు నెలవై పావనుడవై దేవతలకెల్ల పూజనీయుడవయ్యెదవు. ఆ కన్నియ నీకు పెద్ద కూతురగును. మరి ఇద్దఱు కన్యలు కలుగుదురు.

బ్రహ్మయన్నట్లు హిమవంతుడు మేన యందు కన్యకం గాంచెను. మేనాదేవి యందు హిమవంతుడు మఱి కొంత కాలమునకు అపర్ణ ఏకపాటల ఏకపర్ణ అనుకన్యల వడసెను. ఆకుకూడ తినక అపర్ణయు మఱ్ఱియాకు నొక దానిని తిని యేకపర్ణయు పాటలమను చెట్టునాకొకటి తిని నీడను నిలువక ఏకపాటలయు తపస్సు చేసిరి. ఇట్లు వారు వే యేండ్లు తపస్సు గావించిరి. అప్పుడు తల్లి మేనమాతృప్రేమతో ఉ+మా తపస్సు వద్దు చాలింపు మనియె. అట్లు తనను నిషేధించుచున్నను దీవ్రతపంబు గావించినందున అదేపేరుతో అనగా ”ఉమా” అనుపేరుతో దేవతలకు బూజనీయయై ప్రఖ్యాతి నందెను.

చరాచరాత్మకమైన యీజగత్తు త్రికుమారీకము అనగా నీ ముగ్గురు కుమార్తెలతో (శక్తులతో) నిండినది. వీరి తపో వృత్తాంతమును భూమి యెంతవఱకు ధరించునో అనగా ఈ చరిత్ర భూలోకమునందు వాడబడినంతకాలము తపోమూర్తులైన యీముగ్గుర శక్తులు యోగభూమికయందుండి స్థిరవనులై లోకమాతృకలై బ్రహ్మచారిణులై తమ తపస్సుచే నెల్లప్పుడు లోకముల ననుగ్రహింతురు. వారిలో జ్యేష్ఠురాలు (పెద్దది) శ్రేష్ఠురాలు గూడ. మహా యోగబలముతో గూడి మహేశ్వరుని బొందినది.

భృగుకుమారునికి ఏకపర్ణ భార్యయయ్యె. ఆమె దేవలుడను పుత్రునిం గనియె. ఆ మువ్వురు కుమారికలలో మూడవ యామె ఏకపాటల అలర్కుని కుమారుడగు జైగీషవ్యునిం బెండ్లాడినది. ఆమెకు శంఖలిఖితులను నిద్దరు పుత్రులు అయోనిజులు గల్గిరి. ఉమాదేవి పరమసుందరి. ఆమె తపన్తీవ్రత చేత ముల్లోకములు పొగలుగ్రమ్ముట చూచి నేను (బ్రహ్మ) ఆమెతో దేవీ కళ్యాణివి నీవు తపస్సుచే లోకములనేల తపింపజేయుదువు. నీచేత నీ జగత్తు సృష్టింపబడినది. నీవేదానిం పుట్టించినదానవు. నీవు దీనిని నశింపజేయదగదు. నీ తేజముచే నీ లోకముల నన్నిటిని ధరించుచున్నావు. ఓ జగన్నాతా! నీవు కోరునదేమో మా కిపుడిక్కడ తెలు మన దేవి నేనెందుల కీ తపస్సు చేయుచున్నానో నీవే యెఱుంగుదువు. మఱి నన్నేల ప్రశ్నింతువనెను.

బ్రహ్మ యిట్లనియె

అంతట నేనామె కిట్లంటిని. ఎవని కొఱకు నీవీ తపస్సు చేయుచున్నావో యాతడు తానేవచ్చి యిచట నిన్ను వరింపగలడు. నీకు దగిన వాడు ఈ శర్వుడు. సర్వలోకేశ్వరులకీశ్వరుడు. మే మాయన వశములోని కింకరులము. ఆ దేవదేవుడు స్వయంభువు. ఆయన ఉదారరూపుడు. విలక్షణ రూపుడును. ఆయనకు సమానరూపుడు మఱిలేరు. కొండలమీద వసించు వాడతడు. చరాచర సృష్టి కీశ్వరుడాయన. మొట్టమొదటి వాడు. ఊహకందనివాడు. ఇంద్రుని కీడగు వర్చస్సుతో నిందు బింబము భరింపకుండ ఆదిశేషసమానమైన వర్చస్సుతో భీకరమగురూపముతో నీదరికి తాన రాగలడు.

ఇది బ్రహ్మపురాణమున రుద్రాఖ్యానమనము అను ముప్పదినాల్గవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment