మదన దహనము
మహాదేవుడు నిజభవన మందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథుడాయనను వేధింప నేతించెను. అది యెరింగి ఆ ఆతతాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప – నమ్ముక్కంటి మంటకెఱయై యనంగుడు మూర్చవడెను. ఆయన సతి రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని ఆ ఉమా శంకరులు రతీదేవింగని యిట్లనిరి.
కల్మాణీ ! శరీరము లేకయు నీభర్త పూర్వమట్లు సర్వకార్య సమర్ధుండగును. విష్ణువు కృష్ణావతారమెత్తినపుడు ఆతనికి కుమారుడై నీ పతి జనింపగలడు అని వరమిచ్చిరి.
అచట అప్సరసలాడిరి గంధర్వులు పాడిరి. కొందరు దివ్యవాద్యములను వాయించిరి. కొందరు స్తుతించిరి. ఇంద్ర,యమ, ఆగ్నితుల్యులగు ప్రమథ గణములతో నిట్లు శివుడు కూడి విహరించుచు దేవికి ప్రియమ్ముగూర్ప ఆ గిరిని విడువడయ్యెను. ఆ మీద దేవేశుండేమి కావించెనని ఋషులడుగ బ్రహ్మ యిట్లనియె:- భగవంతుడు ఆ హిమగిరి శిఖరంబున దేవికి వినోదము గూర్ప ప్రమధ గణములు పలురూపులు దాల్చి ఆడునట్లొనర్చి దేవికి పరిహాసము గల్పించెను. అటుపై గిరికన్య ఒంటరిగా బంగారు పీఠముపై గూర్చున్న జనని సన్నిధి కేగెను. మేనా దేవియు దేవరూపిణియగు శర్వాణికి ఆసనమిడి ఆదరించి ఆమె కూర్చున్న తర్వాత ఇట్లు పలుకరించెను.
మేన ఇట్లనియె:- కుమారీ ! చిరకాలమునకు నీవు వచ్చితివి. ఆటవస్తువుల లేమికిగురియై భర్తతో ఆడుకొను చున్నావు. ఎవ్వరులేనివారు దిక్కులేనివారో వారీ విధముగ నీ మగనివలె వినోదింతురు.
అని తల్లి పలుక విని పార్వతి అంతరంగమందంతట సంతోషపడలేక పోయెను. మిక్కిలి ఓర్మితో గూడి ఆమె కించుకయు బదులీయదయ్యెను. మరియు తల్లిచే విడువబడి ఏగి మహాదేవుని కిట్లనియె.
స్వామి ! దేవదేవేశ్వర ! ఈపర్వతమందు వసింపను. ఓతేజోనిధీ ! ఈ భువనములంటెందేని నాకు వేఱొక నివాస మేర్పరుపుము. అన విని దేవి ! నివాసార్ధమై నే నెల్లపుడు చెప్పుచున్నను వేఱొక నివాసమునకెన్నడు నిష్టపడవైతివి. ఇప్పుడు నీయంతట నీవే ఓ కల్యాణి ! వేఱొక నివాసము నెందులకు వెదకెదవో ? నాకది నెలువుమన దేవి యిట్లనియె.
మహానుభావుడు మా తండ్రి యింటికిప్పుడే నేను వెళితిని. మాయమ్మ యచ్చట నన్నుగని యేకాంతమున నాకాసనాదులిడి యాదరించి యిట్లనియె. ఉమా! నీ మగడు దరిద్రుడు. నిరంతరము నాటవస్తువులతో (బొమ్మలతో) నాడుకొనును. దేవతలకటువంటి ఆట కూడదనెను. మహాదేవ! నీవు ప్రమథగణములతో పలురకములగు భూత ప్రేత పిశాచములతో వినోదింతువు. వృషభవాహన!అది మాయమ్మ కిష్టముగాదనియె.
బ్రహ్మ యిట్లనియె:- ఈశ్వరుడది విని ఆ దేవిని పరిహసింప జేయుటకిట్లనియె. ఇంతీ! మీయమ్మ యన్నది సత్యము. నీకేల కోపము? నేనిదిగో కృత్తివాసుడను. నిర్వాసుడను. శ్మశాన వాసిని. నిలువనీడ లేనివాడను. అడవులలో కొండలలో గుహలలో దిగంబరుల గుంపులతో దిరుగుదును. మీయమ్మయెడ గినియకుము. తల్లికి సాటియగు చుట్టము మఱిలేదు. అని హరుడన ఆ యిల్లాలు నాకు బంధువులతో పనిలేదు. నేను సుఖపడుమార్గ మేదైన చేయమనియె.
బ్రహ్మ యిట్లనియె:- పరమేశ్వరుడు ప్రియురాలి ప్రీతికొఱకామెతో కైలాసమునుండి ప్రమథ గణపరివారముతో సురసిద్ద సేవిమగు మేరువున కేగెను.
ఇది బ్రహ్మ పురాణమున ఉమామహేశ్వరుల హిమవత్పరిత్యాగ నిరూపణమును ముప్పది యెనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹