దక్షయజ్ఞ విధ్వంసనము
ఋషులు పలికిరి:-
వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధయాగమెట్లు నాశమొందెను. దేవియొక్క క్రోధవ్యాపానమెఱింగి సర్వాత్మకుడగు ఈశ్వరుడెట్లు కోపించెను? అమిత తేజోవంతుడగు దక్షుని యాగము మహాదేవునిచే రోషముతో నశింపచేయబడిన వృత్తాంతమును సవిస్తరముగ మా కెఱింగింపుము
ఋషులతో బ్రహ్మ యిట్లనియె! మేరు శృంగమొకటి ”జ్యోతి స్థ్సలము” అను పేరనున్నది. అది సర్వరత్న భూషితము. లోకమనోహరము. అందుపై శైలకన్యతో నిందుధరుండు వసించును. ఆదిత్యులు, వసువులు అశ్వినులు, కుబేరుడు సనత్కుమారాదులు అప్సరసలు అందరు ఈశ్వరుని సేవింతురు. గంగానది మూర్తిని ధరించి శివునుపచరించుచుండెను.
దక్ష ప్రజాపతి ఈ చెప్పిన విధముగ యజ్ఞారంభము చేసెను. ఇంద్రాదిదేవతలు వచ్చిరి. అగ్నిసమమైన తేజస్సులతో విమానముల మీద గంగా(హరి) ద్వారమునకు వారరుదెంచిరి. గంధర్వులు అప్సరసలు ఆడిరిపాడిరి. అందరును చేతులొగ్గి ఆయనను సేవించిరి. మఱియు శ్రీమహావిష్ణువుతో వసు, రుద్ర, ఆదిత్య, సాధ్య మరుద్గణములు ఊష్మపులు, ఆజ్యవులు, సోమపాయలు అశ్వినీ దేవతలు యజ్ఞభాగార్థులై వచ్చిరి. జరాయుజ, అండజ, స్వేదజ,ఉద్భిజ్జములను నాలుగు రకముల జీవసంఘాతము కూడ వచ్చిరి. దేవతలు,ఋషులు సపత్నీకులై యేతెంచిరి. వారిని చూచి దధీచి కుపితుడై ఇట్లనియె.
పూజార్హులు కానివారిని పూజించినను అర్హులను పూజింపకున్నను మానవుడు మహాపాపియగును. అని దక్షుని చూచి పశుపతిని పూజార్హుని పరమేశ్వరుని నీవేల పూజింపవని అడిగెను. దానికి దక్షుడు – శూలహస్తులు జటాజూట ధారులునైన ఏకాదశరుద్రులు నాకు గలరు. మఱియొక మహేశ్వరుని మేమెరుగము అనెను. అదివిని దధీచిసర్వేశ్వరుల కేకైకమూర్తి యయిన మా మహేశ్వరుని నీవు పిలువలేదు శంకరుని కంటె మించిన దైవతమును నేనుగానను. ఈ యజ్ఞము సంపన్నముగాదు. అన దక్షుడు విష్ణువునకు హవిర్భాగము లిచ్చితిమి. రుద్రులకు నిచ్చితిమి. మఱియును గల దేవతలందరకు వారివారి భాగములనిచ్చుచున్నాను. శంకరునికి మాత్రమీయననెను.
బ్రహ్మ ఇట్లనియె:- గిరిరాజకుమారి, తండ్రి యజ్ఞయునకు వేల్పులెల్లరేగిరని తెలిసి పశుపతియగు పతితో నిట్లనియె.
స్వామి! ఇంద్రాది దేవతలు ఎచటికేగుచున్నారు. ఆ రహస్యమును సర్వరహస్యజ్ఞుడవగు నీవు నాకానతిమ్ము అన ఈశ్వరుడు, మహానుభావుడగు దక్షుడను పేరుగల ప్రజాపతి యశ్వమేధము చేయుచున్నాడు. దేవి! ఈ యజ్ఞమునకు మీరేల వెళ్ళరు. వెళ్ళక పోవుట కభ్యంతరమేమి?
ఈశ్వరుడు:-ఇదంతయు దేవతలు చేసిన కుట్ర. యజ్ఞములందన్నిటను నాకు భాగము కల్పింపబడుటలేదు. మునుపటినుండి యేర్పడిన దారినే పోవలెను. దేవతలు యజ్ఞభాగమును నాకు ధర్మము ననుసరించి యీయవలసినది ఇచ్చటలేదు అన పార్వతి యిట్లనియె. ఏలినవారు ప్రభావము చేతను గుణముల చేతను దేవతలందరిలో తేజస్సుచేత కీర్తిచేత అణిమాసంపద చేత గెలువరాని వారు లొంగని వారు. మీకీ హవిర్భాగము ఈయనందున నేనెంతో దుఃఖమునందు చున్నాను. నాకు వణకు పుట్టుచున్నది. సాక్షాత్ భగవంతుడు ధ్యానమునకందని మహానుభావులు అయిన నా భర్త యజ్ఞభాగమునందుటకు నేనేమి దానము, నియమము తపస్సు చేయుదును అని పలికి క్షోభ పడుచున్న పత్నిని జూచి భగవంతుడు ఆనందభరితుడై యిట్లనియె.
ఈశ్వరుండిట్లనియె:- ఓ కృశోదరి! లతాంగి! నన్ను నీవు ఎఱుంగవు. నీవిపుడన్న మాటలేమంత ఉచితములు? విశాలాక్షి! మహానుభావులు అందఱు ఏమనకుందురో నేనెఱుంగుదును. నీకు కలిగిన పొరబాటు వలన ఇంద్రునితో గూడ ఎల్ల దేవతలు ముల్లోకములు సర్వము నష్టపడినది. నన్ను యజ్ఞేశ్వరుండందురు. రథంత సామముచే వేదవిదులు నన్ను స్తుతింతురు. బ్రాహ్మణులు నన్ను వేదమంత్రములచే పూజింతురు. అధ్వర్యులు నాకు యజ్ఞములందుభాగము గల్పింతురు. అనవిని దేవి యిట్లనియె. సామాన్యునివలె నాడు వారిలో నిన్ను నీవు పొగడుకొనుచున్నావు. నీలో నీవు గర్వపడుచున్నావు. సందేహములేదన ఈశ్వరుండు సురేశ్వరి! నీవనుకొన్నట్లు నన్ను నేను పొగడుకొనుటలేదు. ఇక నా యజ్ఞభాగమును నేను అడుగ బోవుచున్నాను. అని ప్రాణములకంటె ప్రియురాలైన ఉమాదేవింగూర్చి భగవంతుడు పలికి ముఖమునుండి క్రోధాగ్నినుండి ఒక కుమారుని సృష్ఠించెను. వానింగని దక్షుని యజ్ఞమున కేగుము . నాయాజ్ఞచే నతడు సేయుచున్న క్రతువును నాశనము సేయుమనియె.
బ్రహ్మ పలికెను: – అవ్వల నిట్లు రుద్రుడు ప్రయోగించిన సింహవేషధారి చేతను దేవి క్రోధవశమైనదని యెఱింగి నాదక్షయజ్ఞమవలీలగ ధ్వంసము చేయబడెను. ఆగ్రహముచే మహోగ్రయై మహేశ్వరి భద్రకాళియై. తాను కర్మసాక్షి గావున ఆ కోపమూర్తి వెంటనేగెను.
రుద్రక్రోధ స్వరూపుడైన అతడు వీరభద్రుడను పేరందెను. ఆయన శ్మశాన నివాసిగూడ. దాక్షాయణి కోపనివారణము చేసినవాడు. ఆయన తన రోమకూపములనుండి తనకుదాన గణేశ్వరులను సృజించెను. వారు రుద్రునివెంట నుండువారు రుద్రుని బలపరాక్రమ స్వరూపులు రౌద్రాకారులు. రుద్రుని సేవకులు వందలు వేలకొలది అప్పుడు అటకు వచ్చి వ్రాలిరి. ఆ రుద్రగణములు చేసిన ఘోరమైన కిలకిలారావముల ఆకాశమెల్ల అలముకొన్నట్లయ్యెను. ఆ ధ్వనికి దేవతలందరు హడలిపోయిరి.పర్వతములు బ్రద్దలయ్యెను. భూకంపమయ్యెను,ఝంఝూమారుతములు విసరెను. సముద్రము క్షోభించెను. అగ్నులు వెలుగవయ్యె. సూర్యుడు వెలవెల పోయెను.నక్షత్రములు తారాగ్రహములు కాంతిహీనములయ్యెను. ఋషులు దేవదానవులు ప్రభాశూన్యులయిరి. లోకమిట్లంధకారబంధురమై ఆతఱి గణేశ్వరులు విజృంబించి యజ్ఞశాలనంటించిరి.బ్రద్దలు కొట్టిరి. ఊపస్తంభములను పెల్లగించి పారవేసిరి. మనో వాయు వేగముల పరుగులెత్తిరి. యజ్ఞపాత్రములను యజ్ఞాయతనములను పిండి పిండి చేసిరి. తారలు (నక్షత్రములు) తునుకతునుకలై నింగినుండి రాలుచున్నట్లు కనబడెను.
రుద్రగణము దివ్యాన్నపాన భక్ష్యరాసులను పర్వతములట్లున్న వానిని తినివేయ మొదలిడిరి. క్షీరనదులు, కరడుగట్టిననెయ్యి పాయసము తేనెలు ఇసుక మేటలిట్లు పడియున్న ఖండ శర్కరలు కాలువలై పారు బెల్లపు పాకములు హెచ్చురుచిగుల్కు మాంసములు వివిధములైన భక్ష్యములు (తినదగినవి) లేహ్య (నాకదగినవి) చోష్య (జుఱ్ఱదగినవి) పానీయములు (త్రావదగినవి) పెక్కునోళ్ళ దినుచున్నారు. ఒలుకబోయుచున్నారు,విరజిమ్ముచున్నారు, రుద్రుని కోపస్వరూపులు మహాకోవులు. కాలాగ్నులట్లున్నారు.
నడగొండలట్లు నలుదెసలగ్రమ్మి భక్షించిరి. బెదరించెను. పలురూపులనాడిరి. గంతులిడిరి. దేవతాంగనలను పట్టుకొని విసరజొచ్చిరి. ఇట్లు గణములం గూడి ప్రతాపశాలి వీరభధ్రుడు రుద్రకోపముచే ప్రయోగింపబడి సర్వదేవతల రక్షణలోనున్న ఆ మహా యజ్ఞమును, భద్రకాళిసన్నిధి నుండ దహించివేసెను. కొందరు గణాధివులు సర్వభూత భయంకరముగ నార్చులు వెట్టిరి. యజ్ఞపురుషుని తలబ్రద్దలుగొట్టి పెల్లున గర్జించిరి.
అప్పుడు వీరభద్రుదు ఇట్లనియె. నేనుదేవుడనుగాను దైత్యుడనుగాను ఇక్కడ విందుగడుచుటకు వచ్చినవాడనుగాను. మీవేడుకచూడ వేడుకపడువాడనుగాను. దక్షయజ్ఞ నాశనము సేయ వచ్చినాడను. రుద్రకోపమువలన బయలుదేరినానాడను. వీరభద్రుడను పేరందినవాడనను. దేవిక్రోధమునుండి వెలువడి భధ్రకాళియని పేరందినదీమె. దేవదేవుడు పంప నీయజ్ఞము దరికి వచ్చినది. రాజేంద్రా! నీవు దేవదేవు నుమాపతిని శరణందుము. దేవప్రభువు కోపించుట మంచిదిగాని నైకరులతో గోపము మంచిదిగాదు.
కలుగులనుండి పెల్లగింపబడి విఱువబడిన యూపములతో మాంసలుబ్ధములై వ్రాలుచు మిక్కిలి విసురగా రెక్కలు విసరుచు నెగురుచు వ్రాలుచున్న గ్రద్దలతో నక్క కూతలతో ప్రతిధ్వనించుచున్న రుద్రగణములచే ధ్వంసము సేయబడిన దక్షయజ్ఞమపుడు లేడి రూపుగొని ఆకాశమున కెగిరిపోయెను. ఆ రూపమున బోవుచున్న ఆ య్యజ్ఞపురుషుని చూసి వీరభద్రస్వామి విల్లునమ్ములుంగొని వానింజంప నేగెను. అమిత ప్రతాపశాలియైన ఆ గణేశుని క్రోథమువలన నాతని నుదుటినుండి ఘోరమైన యొక చెమటచుక్క రాలిపడెను. నేలపై బడగానె యా ప్వేద బిందువునుండి ప్రజ్వలించు కాలాగ్నివోలె నొక పురుషుడు ఆవిర్భవించెను. ఆ పురుషమూర్తి మరుగుజ్జు ఎఱుపు కన్నులవాడు. బవిరిగడ్డము వాడు. భయంకరుడు. నిక్కిన తలవెంట్రుకలు. ఒడలెల్లబొచ్చు. ఎఱుపారుచెవులు. జడుపుగొల్పు కాఱునలుపురంగు ఎఱ్ఱబట్టలు గలవాడై ఆ మహాబలుడా యజ్ఞము నగ్ని కక్షమును(ఎండుగడ్డిని)వలె గాల్చివైచెను.
దేవతలు హడలెత్తి పదిదెసలకు బారిపోయిరి. అందు విక్రమమున సంచారము సేయుచున్న ఆ వీరభద్రునిచే భూమి సప్తద్వీపములతో కంపించెను. దేవలోక భయంకరమైన యొక పెనుభూతమిట్లు విజృంబించినంతట నేను(బ్రహ్మ) మహాదేవుని బూజించుచు ఇట్లంటిని.
దేవతలెల్లరు నీకుగూడ యజ్ఞభాగము నీయగలరు. ప్రభూ! సర్వదేవాధినాథుడవు. నీవీ భయంకరరూపమును ఉపసంహరింపుము. ఈ దేవతలందఱు వేలకొలది ఋషులు నీ క్రోధముచే శాంతివడయలేకున్నారు. ఓ సురేశ్వరా! నీ చెమటనుండి పుట్టిన ఈ పురుషుడు జ్వరమను పేర లోకములందు చరింపగలడు. ఏకరూపమై ఉన్న ఇతని తేజస్సును ఈ ఎల్ల పృధివియు భరింపజాలదు. కావున దీనిని పెక్కురూపుల గావింపుము. అని నేనన్నంతట, ఆయనకుగూడ యజ్ఞ భాగము గల్పించినంతట నా భగవంతుడు పినాకపాణి తనకుతాను పరమప్రీతి నందెను. దక్షుడును మనసార ఆ భవుని దేవుని శరణందెను. నేత్రస్థానమున ప్రాణాపానములను ప్రయత్నముతో నిలిపి బహుదృష్టియగు పరమేశ్వరుడు బహిర్గతమైన చూపును మరలించి నిలిపి అల్లన నవ్వి నీకేమి చేయుదును తెలుపుమనియె. ఈకథను దేవతలు పితృదేవతలు ఆలించినంతట ప్రజాపతి దక్షుడు చేతులు మొగిచి బెదరిపోయి మదిలో శంకించుచు కన్నుల నీరు గార్చుచు నిట్లనియె.
భగవంతుడు నాయెడల ప్రసన్నుడగునేని నేను నీకు ప్రియుండనేని నేననుగ్రహింప అర్హుడనేని నాకొక్క వరమీయదగును. ఈ యజ్ఞము కొరకు బహుకాలము బహుప్రయత్నముచే సమకూర్చుకొన్న భక్ష్యమెల్ల భక్షింపబడినది. త్రావదగినిదెల్ల త్రావబడినది. బెదిరింపబడినది. నాశనము సేయబడినది. పొడిపొడి గావింపబడినది. ముక్కముక్కలు సేయబడినది. అయినను నీ అనుగ్రహమువలన ఓ మహేశ్వరా ! ఈయజ్ఞము అబద్దము గాకూడదు. సఫలము గావలయునని ప్రార్ధించెను.
తథాస్తు (అట్లేయగుగాక) యని భగుని కన్నులురాల్చిన ఆ హరుడు పలికెను. ధర్మమునకధ్యక్షుడు త్రినేత్రుడునగు మహాదేవుని దక్షుడు నేలపై మోకాళ్ళ నానించి నమస్కరించి శివయజ్ఞమును బడసి యెనిమిదివేల శివనామముల నా వృషభధ్వజుని స్తుతించెను.
ఇది శ్రీ బ్రహ్మపురాణములో ‘దక్షయజ్ఞ విధ్వంసనము’ అను ముప్పది తొమ్మిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹