ఏకామ్రక్షేత్ర మాహాత్మ్యము
లోమహార్షణుం డిట్లనియె:- మునివరులార! వ్యాసులు తెలుపుచుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్యకథను పార్వతి రోషము శంభుని క్రోధము వీరభద్రుని యెక్కయు, భద్రకాళి యొక్క అవతారము దక్షయజ్ఞ ధ్వంసము శంకరుని ఆద్భుత విక్రమము తిరిగి ఆయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నుడగుట రుద్రునకు యజ్ఞ భాగమిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులునై ఋషులు వ్యాసుని తక్కిన కథను దెలుపుమని యడిగిరి. వ్యాసభగవానుడు ఏకామ్రక్షేత్రమును గురించి వారడుగ నిట్లు తెలుపదొడంగెను.
వ్యాసుడు పలికెను
బ్రహ్మ తెలిపిన పుణ్యకథను ఆలించి మునిపుంగవులు యొడలుపులకరింప ఆనందభరితులై వ్యాసులను కథను గొనియాడిరి.
ఋషులు పలికిరి
ఆహా ! శంభుదేవుని మహిమ నీవు చక్కగా దెల్పితివి. ఇపుడేకామ్రక్షేత్రమునుగురించి తెలుపుము. వినవలెనని మిక్కిలి కుతూహలముతో నున్నామనిరి, వ్యాసుడు వారి వచనమువిని లోకేశ్వరుడు చతుర్ముఖుడు భూతలమున పాపహరమగు ఆ శివక్షేత్రమును గూర్చి మునులకిట్లు తెలిపెను.
సర్వపాపహరము పరమ దుర్లభము కోటిలింగ సహితము కాశీక్షేత్ర సమానము ఎనిమిది తీర్థములతో గూడి నదియు నేకామ్రమని ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రమును గురించి చెప్పుచున్నాను. వినుడు.
పూర్వకల్పమందక్కడ ఏకామ్రవృక్షము (ఒంటి మామిడి చెట్టు) ఉన్నందున ఆ క్షేత్రమునకు ఆ పేరు వచ్చినది. అందు సంతుష్టి, పుష్టియు గల స్త్రీ పురుషులుందురు. పండిత సమూహాముతోను ధన ధాన్యములతోను గూడినది. గృహ గోపురముల ఒత్తిడి గొన్నది. త్రికోణాకార ద్వారబంధ శోభితము. నర్తకబృంద సహితము సర్వరత్నోప శోభితము, కోట బురుజులతో నొప్పునది, రథికులచే శోభించునది, రాజహంసలట్లు తెల్లని ప్రాసాదములతో రాణించునది పురద్వారములతో నొప్పునదియు తెల్లని ప్రాకారములతో వ్యాప్తమైనదియు, ఆయుధ ధారులచే నభిరక్షితము, కందకములతో రాణించునదియు, వాయుకంపిత బహువర్ణ పతాకా పరిశోభితము, నిరంతరోత్సవ ప్రముదితము, నానా వాద్యధ్వని సంకులము, దేవాలయములు, ప్రాకారములు, ఉద్యానవనములతో పరమసుందరము. అందలి స్త్రీలు పరమసుందరులు, ఆనందభరితులు, సర్వాభరణ భూషితులు, పద్మనేత్రలు పూర్ణచంద్రాననలు కాంచీనూపుర శబ్దశోభితలు కొందరు బంగరు చాయవారు. కొందరు గజగమనలు. కొందరు పినోన్నత కుచభారావనమ్రలు దివ్యగందాను లిప్తలు, కొందరు కర్ణాభరణ భూషితలు, మరికొందఱు మదవతులు, సుశ్రోణులు, కొందరు నగుమోము గలవారు, ఆపుడించుక వెలువడు పలువరుస గలవారు కొందరు బింబాధరోష్టులు కొందురు మధురస్వర మనోహరులు. తాంబూల రంజితముఖులు, ప్రియదర్శనులు, మనోహారిణులు, క్రియవాదినులు, నిత్య వన గర్వితలు. అందరు దివ్యాంబరాభరణ థారిణులు, పరమ పతివ్రతలు ఆ క్షేత్రమున యువతులు అప్సర సమానులు, క్రీడావిలాసినలు, రేయింబవళ్ళు తమతమ గృహములందు ఆనందభరితులై యుండు ఉత్తమ గృహిణులు.
అచట పురుషులు రూపవన గర్వితులు, సర్వలక్షణ సంపన్నలు నిగనిగ మెరగయుమణిమండనములు ధరించు వారు. బ్రహ్మణాది వర్ణములవారు స్వధర్మ నిరతులు. అందు వారాంగనలు కూడ పరమసుందరులై యెప్పుదురు. ఊర్వశి , మేనకాది దేవ సుందరీమణుల అందమున నొప్పువారు. సంగీతాది సకలకళా నిపుణులు. ప్రియవాదినులు. సర్వలక్షణ లక్షితులు, నృత్య గీత విశారదులు. సర్వరమణీ రమణీయ గుణగర్వితలు. వాలు చూపులలో మాటలలో నిపుణులు , కురూపులు, కుబుద్దులు, పరద్రోహ పరాయణులు, నందు గానరారు. వారి కటాక్ష ప్రసరణమాత్రమున మానవులు మోహా వివశులగుదురు.
నిర్ధనులు, మూర్ఖులు పరద్వేషులు, రోగులు, లోభులు మాయకులు, జగత్ర్పసిద్ధమైన ఆ క్షేత్రమున నుండరు, సర్వసుఖ సంచారము. సర్వసత్త్వ సుఖకరము, సర్వసన్య సంభరితము. సర్వజన సంకులము. అందుకల ఫలవృక్షములు ఎందును లేవు. అందలి ఉద్యానములు నందనవనోపమములు, సర్వర్తు కుసుమఫల భారావనమ్ర వృక్ష శోభితములు.
అందు శుక పికచకోర చక్రవాక ప్రముఖ సకల పక్షికుల కిలకిలారావ సంకులములగు వనములు, సరస్సులు దిగుడుబావులు, చూడముచ్చట గొల్పుచుండును. అందు కమలములు కలువలు ఎర్ర తామరలతో నిండిన పుణ్యసరస్సు లెటుచూసినను కన్నులపండువు చేయుచుండును. అచట పరమశివుడు సన్నిహితుడు. ఆ పరమేశ్వరుడు భూమి యందున్న నదులు పుష్కరిణులు చెరువులు నూతులు సాగరములు అనువాని నుండి జల బిందువులను సేకరించి సురలతో నా పుణ్యక్షేత్రమును బిందుసరమను తీర్థమును నిర్మించెను. మార్గశీర్ష బహుళాష్టమినాడు జితేంద్రియుడై అచట యాత్రచేసి శ్రద్ధతో స్నానముచేసి వాజ్నియమమూని దేవర్షి పితృతర్పణ మాచరించి తిలాంజలులు చేసినవాడు అశ్వమేధఫలమందును. గ్రహణ పర్వకాలమున విషువమున (సమరాత్రిందివ కాలమున) సంక్రమణమందు అయన సమయమున యుగాదులందు షడశీలితిని (తుల మొదలుకొని ఎనభై ఆరవ రోజున వచ్చెడి పుణ్యకాలము. ఇది సంవత్సరమునకు నాలుగు పర్యాయములు వచ్చును. ద్విస్స్వభావ రాశియందే యిదివచ్చును.) మఱి యితర శుభసమయములందు ధనాది పుణ్యదానములు చేసినవారు ఇతర తీర్థములకంటె నూరురెట్ల ఫలము నందుదురు. ఆ బిందుసరతీర్థము నందు పితృదేవతలకు పిండప్రదానము చేసినవారు పితృదేవతలకు అక్షయతృప్తిని కలుగజేసినవారగుదురు సంశయము లేదు.
అటుపై నింద్రియముల నిమిడించుకొని వాక్కును నిగ్రహించుకొని, శివాలయమునకు (ఏకామ్రేశ్వరాలయము) ఏగి అందు శంకరుని పూజింపవలెను. ఆ మున్ను ఆలయమునకు ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. ఆవునేతితో గోక్షీరముతో శుచియై స్వామి కభిషేకించి చందనము, కుంకుమయు పూసి యవ్వల ఉమాపతియగు చంద్రమౌళీశ్వరుని పుష్పములచే పవిత్రములగు బిల్వార్క కమలాదులచే నాగమ విధానమున వైదిక మంత్రములతో నారాధించవలెను. దీక్షాపరుల పూజావిధానమిది. దీక్ష నొందనివారు మూలమంత్రముతోను నామములతోను అర్చించవలెను. ఈ విధముగ గంధపుష్పాదులతో షోడశోపచారములతోను నృత్యగీతాదులతోను నారాధించి పాపవిముక్తులగుదురు. రూపసి యువకుడు నగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరించి దివ్యాభరణముల దాల్చి, చిరుగంటలు మ్రోయుబంగరు విమానమున గంధర్వాప్సరసాదులు కీర్తింప స్వదిశల మిరుమిట్లు గొల్పుచు తుదకు శివలోకము చేరును. అచటిభక్తులతో భూత ప్రళయపర్యంత మచటనుండి భూలోకమునకు వచ్చి యోగిగృహమునందు చతుర్వేది యగును. అచట పాశుపతదీక్షగొని మోక్షము నొందును.
శయనైకాదశి, ఉత్థానైకాదశులందు సంక్రమణములందు, అయన పుణ్యకాలములందును, అశోకాష్టమి పవిత్రారోపణములందును శివదర్శనము చేయువారు సూర్యప్రభమగు విమానమున శివలోకమున కేగుదురు. మేధావంతులు ఎల్లకాలము శివదర్శనము చేసి శివలోక మందుదురు. ఈ శివక్షేత్రమునకు నలుదిక్కులందుగల రెండున్నర యోజనముల ప్రదేశము భుక్తి ముక్తుల నిచ్చు క్షేత్రము. ఆ క్షేత్రమునందుగల లింగము భాస్కరేశ్వరమనబడును. అచట నున్న కుండమున స్నానముచేసి ఆదిత్యునిచే నర్చింపబడిన ఆ భాస్కరేశ్వరుని దర్శించినవారు విమానమెక్కి గంధర్వ గానము లవధరించును శివలోకమున కేగుదురు. అచట నానందభరితులై ఒక కల్పకాలము మనోహర భోగముల ననుభవించి పుణ్యక్షయముకాగా భూలోకముచేరి యోగిగృహమునందుపుట్టి వేదవేదాంగపారగులై సర్వభూత హితము కోరు బ్రాహ్మణులై సర్వసములై మోక్షశాస్త్ర కుశలురై శివయోగమంది మోక్షమందుదురు. పూజ్యమైనను అపూజ్యమైనను ఒక శివలింగము అడవిలో రాచబాటలో నాల్గుదార్లు కలిసినచోట శ్మశానమునందు గాని యెక్కడో అక్కడ క్షేత్రమునందున్న యెడల దానింజూచి తొట్రుపడక శ్రద్ధతో మనసునిలిపి భక్తితో నభిషేకము చేసి సుగంధ పుష్పాదులచే ధూప దీప నైవేద్యాదులచే నమస్కారములచే స్తుతులచే నమస్కరించి సాష్టాంగ దండప్రణామము గావించి నృత్యగీతాదులచే యాధావిధిగా నర్చించిన అతడు శివలోక మేగును. స్త్రీయైనను శ్రద్ధతో శివుంబూజించిన నీ మన్ను జెప్పిన ఫలమందును. ఇందు విమర్శింప బనిలేదు.
ఆ యేకామ్ర క్షేత్రము యొక్క సమగ్రగుణ విశేషములను పరమేశ్వరునికంటే మఱియెవ్వడు వర్ణింపగలడు? ఏ స్థితిలోనున్నను వైశాఖాది మాసములందు బిందుసరోవర జలమందు స్నానముచేసి యటనున్న శివుని, వరదాత్రియగు పరమేశ్వరిని ప్రమథగణములను కుమారస్వామిని గణపతిని నందిని కల్పవృక్షమును సావిత్రీదేవిని దర్శింపవలెను. అందువలన శివుని సాలోక్యమందును. కపిలతీర్థమున యధావిధిగ స్నాన మాచరించి అభీష్టముల నంది శివలోకమందును. ఆ క్షేత్రములనే జితేంద్రియుడై యధావిధి స్తంభప్రతిష్ట చేయునతడు ఇరువది యొక్క తరముల కులము నుద్ధరించి శివలోకమున కేగును. కాశీక్షేత్ర సమయమున శివక్షేత్రమగు ఏకామ్రక్షేత్రము నందు స్నానము చేసిన అతడు తప్పక మోక్షమందును.
ఇది బ్రహ్మపురాణమునందు ఏకామ్రక్షేత్ర మహాత్మ్యము అను నలుబది యొకటవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹