ఉత్కల క్షేత్రవర్ణనము
విరజయను క్షేత్రమందు విరజయను తల్లి సరస్వతీదేవి సుప్రతిష్ఠింపబడినది. ఆమెను దర్శించి మనుజుడు ఏడు తరముల వారిని పవిత్రులను చేయగలడు. ఆ దేవిని ఒక్కమారేని దర్శించి పూజించి మ్రొక్కినవాడు తన వంశమును ఉద్ధరించి ఆ లోకమున కేగును. ఆ విరజ క్షేత్రమున లోకమాతలు ఇంకా ఎందఱోయున్నారు. వారు సర్వపాపహారిణులు భక్తవత్సలలు, వరప్రదాత్రులు. అక్కడ సర్వపాపహారిణి వైతరిణీనదిఉన్నది. అందు స్నానముచేసిన నరోత్తముడు సర్వపాపవిముక్తుడగును. అక్కడనే వరాహమూర్తియై హరి తను కూడా వెలసియున్నాడు. ఆయనను భక్తితో దర్శించి మ్రొక్కి విష్ణు పరమాత్మం బొందుదురు.
విరజక్షేత్రమందున్న కపిలతీర్థము గోగ్రహము సోమము ఆలాబుతీర్థము మృత్యుంజయము క్రోడము (వరాహము) వాసుకము సిద్ధకేశ్వరమునను పేరుగల యీ ఎనిమిది తీర్థములందు బుద్ధిమంతుడు ఇంద్రియముల నిగ్రహించి యధావిధిగ స్నానము చేసి దేవతలకు మ్రొక్కి సర్వపాపముక్తుడై దివ్యవిమానమొక్కి గంధర్వులు గానము సేయుచు గీర్తింప నేగి ఆ లోకమందు పూజ్యుడగును.
విరజక్షేత్రమున పితరులకు పిండ ప్రదానము చేసిన అది అక్షయ తృప్తికరమగును. ఈ క్షేత్రమందు శరీరము విడిచినవారు ముక్తులగుదురు. ఇచట సముద్రస్నానము చేసి కపిలుడను పేరనున్న విష్టువును వారాహియను దేవతను దర్శించి స్వర్గమందును. ఇచట పుణ్యతీర్థములు ఆలయములు పెక్కులున్నవి. అవి ఆ యాత్రా సమయమందు తెలుసుకొని సేవింపదగును. సముద్రము ఉత్తరపు ఒడ్డునగల ప్రదేశమందు గుహ్యమైన ముక్తిక్షేత్రమున్నది. అందంతట ఇసుకమేటలు నున్నవి. పదియోజనముల వైశాల్యముగలది. అశోకాది నానాఫల వృక్షములు మందారాదులు పూలచెట్లు ఖర్జూరాదులు సర్వర్తుఫల కుసుమ గంధభరితములు పక్షికూజిత మనోహరములెన్నో కలవు. దిగుడుబావులు పుష్కరిణులు తామరకొలనులు లెక్కేలేదు. స్థలజలచరములగు పక్షులు పెక్కులున్నవి. స్వవర్ణధర్మానుసారులు గృహస్థాద్యాశ్రమముల వారక్కడనున్నారు. స్త్రీలు పురుషులు హృష్ణులును పుష్టులును. అది సర్వ విద్యా సదనము. సర్వ ధర్మగుణాకరము. అట్టి క్షేత్రము మఱి దుర్లభము.
అక్కడ పురుషోత్తముడను పేర విష్ణువున్నాడు. ఉత్కశదేశము సరిహద్దువరకుగల దేశమా కృష్ణానుగ్రహముచే పుణ్యతమము. నేను రుద్రుడు ఇంద్రుడు అగ్నిముఖులగు దేవతలునచ్చటనే యెల్లవేళల వసింతుము. గంధర్వు లప్సరసలు పితరులు మనుష్యులు మునులు వాలఖిల్యాదులు కశ్యపాదులు గరుడలు కిన్నరులు నాగులు సాంగములైన వేదములు సర్వశాస్త్రములు ఇతిహాసపురాణాదులు యజ్ఞములు పుణ్యనదులు తీర్థములు గిరులు సాగరములు అక్కడనే యున్నవి. ఇట్లు దేవఋషి పితృసేవితమై సమస్త ఉపభోగములతో గూడిన పవిత్రతమమైన దేశమున నివాసమెవనికి రుచింపదు? దానికంటె అథికమైన శ్రేష్ఠత్వము ఏ దేశమున నుండును? బ్రాహ్మణులారా ముక్తిప్రదుడైన పురుషోత్తముడు స్వయముగ సన్నిహిడుతై ఉన్న యుత్కళదేశవాసులు ధన్యులు.
అక్కడ తీర్థస్నానముచేసి పురుషోత్తముని సేవించినవారు స్వర్గమున కేగుదురు. వారు యమాలయమునకు పోరు. ఉత్కలదేశమునందలి పురుషోత్తమ క్షేత్రనివాసుల జీవితము ధన్యము. ప్రసనములై విశాలనేత్రములు చక్కనికనుబొమలు కేశపాశము కిరీటము నింపైన చెవికమ్మలు చిఱునవ్వు చక్కని పలువరుసయు కలిగి కిరీటాలంకృతుడైన ఆ కృష్ణపరమాత్మయొక్క ముఖపద్మము త్రిలోకానంద జనకము.
ఇది బ్రహ్మపురాణమునందు ఉత్కళక్షేత్ర వర్ణనమను నలుబదిరెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹