Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – 44 వ అధ్యాయం

పురుషోత్తమ క్షేత్ర దర్శనము

బ్రహ్మయిట్లనియె.

అరాజవంతీ నగరమందు (ఉజ్జయిని యందు) ప్రజలును స్వనంతానమట్లు పాలించెను. సత్యవచనుడు శూరుడు సర్వసుగుణ సంపన్నుడు ధార్మికుడు జ్ఞాని బుద్దిశాలి సర్వశాస్త్రజ్ఞుడు. వరరాజుల గెల్చినవాడునై యతడు ప్రతాపమున రవిని రూపముచే అశ్వినీ కుమారులను పరాక్రమమున ఇంద్రుని వ్రజారంజమున చంద్రుని బోలియుండెను. అశ్వమేధాది యజ్ఞములను దానములను తపస్సులను ఆ చరించి అష్టైశ్వర్య సంపన్నుడై ఉండెను. విప్రులకు ప్రతీ యజ్ఞమందును సువర్ణ మణిముక్తాదులను ఏనుగును గుఱ్ఱములను నొసంగెను. కంబళులు అజినములు వస్త్రములను ధన ధాన్యములను సర్వ సమృద్ధముగ నొసంగెను. భక్తిని ముక్తిని యిచ్చు సర్వయోగేశ్వరుని హరిని సేవింప ఇచ్చ జనించి సర్వ నిగమాగములను నితిహాస పురాణములను వేదవేదాంగములను పరిశోధించి ఋషులు తెలిపిన నియమములను బాటించి, వేదపారగులయిన విప్రుల సేవించి గురుసేవలొనర్చి పరమావిధి ధర్మమునందుకని కృతార్థుడయ్యె.

వాసుదేవతత్త్వము నంది భ్రాంతి జ్ఞానము వాసి మోక్షేచ్చగొని యింద్రియము లెల్ల నిగ్రహించి భగవంతునెట్లా ఆరాధింతునని అమ్మూర్తిని ధ్యానించుచు ఉజ్జయిని నుండి మంత్రి పురోహిత భృత్య పరివారముగ చతురంగ సైన్యముతో అంతఃపురాంగనలతో వందిమాగధులు మంగళగానములు సేయ బ్రహ్మణాది చాతుర్వర్ణముల వారు వివిధ కులములవారు వివిధ వ్యాపారులు కవులు గాయకులు పౌరులు గ్రామంతరమేగు తండ్రిని తనయులట్లు తనను వెంబడింప దక్షిణ సముద్ర తీరమునకు ప్రస్థాన మొనరించెను. అక్కడ నానారత్న పూర్ణము తిమి తిమింగలాది నానా జంతు నమాకలము, పరమ గంభీరమును, పవిత్రము మంగళము తీర్థములకెల్ల ఉత్తమ తీర్థము. సర్వ పుణ్య నదనదీనాయకమునైన ఆ సాగరముల దర్శించి ఆశ్చర్యమంది తత్తీరమందు విడిసెను. అవ్వార్థి తీరము సర్వవృక్షమనోహరము. సర్వర్తు కుసుమఫలభరితము చిలుకలు గోరువంకలు నెమళ్ళ చకోర చక్రవాకములు కలకలా రావములు శ్రుతిమనోహరముగ నందు వినిపించుచుండెను. మల్లికా కుంద మందారాది మేమ వివిధ తరులకు సుమవాసన లిట నింపుగొల్పుచుండెను. విద్యాధర గంధర్వ కిన్నర అప్సరోగణమలందు ఆడుచు పాడుచు నిత్యము విహరించుచుండును. నంద నోపమములగు ఉద్యానములు హంసకారండకాది జలపక్షుల విహార స్థానములు పద్మాకరము లందాశ్చర్యకరములయి యుండెను. ముల్లోకములకు పూజనీయమగు పదియోజనములు పొడవు నైదు యోజనములు వెడల్పు గల నా దివ్యక్షేత్రము నారదుడు దర్శించి ఆనంద వివశుడయ్యెను.

ఇది పురుషోత్తమ క్షేత్రదర్శనమను నలబదినాల్గవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment