Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నలబై ఐదవ భాగము

పురుషోత్తమ క్షేత్ర వర్ణనము

మునులిట్లనిరి.

పురుషోత్తమము అను నా పుణ్య వైష్ణవ క్షేత్రమున ఆ రాజు ససైన్య పరివారముగ సేవించి అందు బలరామ కృష్ణులను ప్రతిష్టించి పూజించెనని విందు మా కథ నవిస్తరముగ ఆనతిమ్మన బ్రహ్మ వారల కిట్లనియె

బ్రహ్మ ఇట్లనియె

శ్రీదేవి అడుగగా మున్ను శ్రీహరి తెలిపిన పుణ్యకథను వినుండు. సుమేరు పర్వతము యొక్క సువర్ణశిఖరమునందు సిద్ధ విద్యాధర కిన్నరులు, సంచరించు చోట, వాలఖిల్యాది మహర్షులు విహరించు చక్కని ప్రదేశమందు నానా తరులతా కుసుమ ఫలభరితమైన చోట- కోకిలలు, చిలుకలు, నెమళ్లు మనోహరముగ కూయు తావున దేవతలు కొలువ గొలువున్న వాసుదేవుని జగన్నాధుని సమీపించి శిరసు వంచి నమస్కరించి శ్రీదేవి సర్వలోక హితముగోరి ఇట్లని ప్రశ్నించెను.

సర్వేశ్వరా !

నా సంశయము వారింపుము. మర్త్యలోకమున మిక్కిలి యాశ్చర్యము గొలుపునది కర్మభూమి (భారత వర్షము).అచట జన్మ అంత నులభము గాదు. లోభమోహాదు లను మొసళ్లు సంచరించు కామక్రోధములను మహా సముద్రమునందు జనన మరణాదుల నుండి తరించుట కనువైన ఉపాయము దెలుపుము. నీకన్న ఈ సంశయమును నివారిపంగల వక్త లేడు. మాయెడల దయగొని తెలుపదలపుగలదేని అనుగ్రహింపుము.

బ్రహ్మ ఇట్లనియె.

శ్రీదేవి పలుకులు విని దేవదేవుడు పరమప్రీతితో అమృతోపమానము సర్వవేద శాస్త్రసారమునైన విషయము నిట్లుపనసించెను.

సుఖముగను, సుభముగను, ఉపాసించి సాధింపదగిన మహాఫలము నొసంగు దివ క్షేత్రమొకటి పురుషోత్తమము అను పేర ప్రపిద్ధమై యున్నది. అది కీర్తన, స్మరణ వందనాదులచే సర్వ పాపముక్తినీయగలది. సురాసురులు మరీచ్యాది మునివరులు గూడ దాని నెఱుగురు. అట్టి తీర్థరాజమునుగూర్చి నీకు దెలుపుచున్నాను. సుందరీ! ఏకాగ్రచిత్తవైవినుము. కల్పాంత ప్రళయమందు, స్థావర జంగమాత్మకమైన జగమెల్ల లయమందెను. అంధకార బంధురమయ్యెను. ఆ పెంజీకటి కవ్వల నున్నవాడు మేలుకొన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆయనయే సర్వభూత స్వరూవుడు. త్రిమూర్తులకు కర్త. వాసుదేవడనువాడు. యోగీశ్వరుడు. అయన యోగనిద్రనుండి మేల్కొని తన నాభికమలమునుండి కమల దళకాంతి నంపన్నమగు బ్రహ్మయనెడి యొక మూర్తిని సృజించెను. ఆ బ్రహ్మ పంచభూత పంచీకృతముయిన ప్రపంచమును సృజించెను. శబ్ద, స్పర్శరూప, రస, గంధములనెడి పంచతన్మాత్రలకు కారణములైన ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదము, భూమి యనెడి స్థూల సూక్ష్మములైన పంచభూతములను నృజించెను. ఆ మీద ఆ ప్రజాపతి మనసు ఆత్మవంకకు మరల్చి సంకల్పించి మరీచ్యాది మునులను సర్వదేవతలను పితృదేవతలను, యజ్ఞములను, విద్యాధరులను, గంగాది నదులను, నర వానర సింహ శార్దూలాది మృగములను, జరాయుజ – అండజ – శ్వేదజ – ఉద్భిజ్ఞములను నాలుగు విథములైన చరాచర భూతజాలమును నృజించెను. బ్రహ్మ క్షత్ర – వైశ్య – శూద్రులను నాలుగు వర్ణములను, అంత్యజులను, మ్లెచ్చులను వేర్వేరుగా సృజించెను. పిపీలికాది జీవకోటి ఆయన సృజించినదే. ఆ సృష్ఠికర్త తన కుడిభాగమందు తననే పురుష రూపముగా భావించి యెడమ భాగమున స్త్రీని భావించి స్త్రీ – పుంస రూపమున ద్విధాభావము నంచెను. మానసిక సృష్టి యిట్లు జరిగిన తరువాత స్త్రీ పుంసాత్మక మిథునమునుండి సృష్టి ఆవిర్భవించెను. అటనుండియే మైధున సంభవమైన సృష్టి ఆరంభమైనది. ఉత్తమ, మధ్యమాధమ భేదమున తయారయిన ఈ ఉపాధులన్నియు నా యొక్క క్షేత్రములు. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ఒనరించి ఇంచుక ఆలోచించి ధ్యాన నిష్ఠుడై వాసుదేవ తత్త్వమందు వాసుదేవత్మకమైన మూర్తిని ధరించెను. ధ్యానమాత్రముచే ఆ జనార్ధనుడు తానే ఆ క్షణమున సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్రశీర్షుడు ఐన పురుషుడై ఆవిర్భవించెను. తెల్లతామరపూల వంటి నేత్రముల సజల జలదచ్ఛాయమైన శరీరము, శ్రీవత్సచిహ్నము, మొదలైన లక్షణములతో ఒక ప్రాకృత మంగళ స్వరూపమున సాక్షాత్కరించెను. లోకపితామహుడగు బ్రహ్మ హఠాత్తుగా ఆ మూర్తిని దర్శించి అసన అర్ఘ్య పాద్య సమర్పణము చేసి అక్షతల పూజించి అభివాదనము జేసి పరమ మంగళ స్తుతులచే స్తుతించెను. విరించి మనస్సును ఒదిగించి చేసిన ఆ స్త్రోత్రమును విని తండ్రి ఇపుడు నను ధ్యానించుటకు కారణమేమని ప్రశ్నించితిని.

బ్రహ్మయిట్లనియె.

దేవేశా !స్వర్గద్వారమునకు దారులు, యజ్ఞదానవ్రతములు, యోగము, సత్యము, శ్రద్ధ వివిధ తీర్థములు తెలుపబడినవి. ఆ అనుష్ఠానము దుర్లభము. వానినన్నిటిని మించిన సులభ సాధనము లోకహితము కొఱకు తెల్పుము. ఓ వాసుదేవ! పరమోత్తమమయిన పుణ్యస్థానము ఆనతిమ్ము , అన విధాత పలుకులు విని అతనికిట్లు చెప్పితిని.

సంసారతారకము సర్వోత్తమ క్షేత్రము, చాతుర్వర్ణ సుఖసాధనము. భుక్తిముక్తిప్రదము, శీఘ్ర సిద్ధిదము, చతుర్యుగములందును సుస్థిరమై సేవింపదగినది. సర్వదేవ దానవ యోనులకును సునేవ్యమై ఉన్న తీర్థరాజము పురుషోత్తమునికి ఆవాసమైన ”పురుషోత్తమము” అను క్షేత్రము గలదు. ఆది దక్షిణసముద్ర తీరముందున్నది. పది యోజనములు వైశాల్యము గలది. అటవొక మఱ్ఱివృక్షము గలదు. కల్పాంతమందు కాలాగ్ని విజృంభించినపుడు కూడ అది నశింపదు. నేను స్వయముగా అచటనే ఉన్నాను. ఆ వటవృక్షమును దర్శించి ఆ క్రిందినీడలో విశ్రమించిన వాడు బ్రహ్మహత్యా పాపమునుండి విడివడును. తక్కిన మహాపాపముమాట చెప్పనేల! దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసినవారు విష్ణులో మున కేగుదురు. ఆ మఱ్ఱికించుక దక్షిణమున కేశవుని ఆలయమున్నది. అది ధర్మమయము. భగవంతుడు తానే నిర్మించుకొన్న ప్రతిమ (విగ్రహం) గలదు. దానిని దర్శించినవారు అనాయాసముగ వైకుంఠము కేగుదురు. అట్లేగుచున్న జీవులను చూచి యమధర్మరాజు నాకడ కేతెంచి శిరసువంచి మ్రొక్కి యిట్లనియె.

యమధర్మరాజిట్లు స్తుతించెను

జగన్నాధస్వామీ! నీకు నమస్కారము. శ్రీవత్స వక్షస్థల, పద్మమాలాభూషిత, పీతాంబరధారీ, శంఖచక్ర గదాధరా! హారకేయూర భూషితా! కిరీటాంగద ధారియునై సాక్షాత్కరించు జగద్గురువగు నీకు సగుణమూర్తికి వందనము. ప్రకృతికి నవ్వలనై సర్వేంద్రియ రహితుడై కేవలజ్ఞాన జ్యోతియై సర్వసాక్షియై నిర్విశేష సుఖానుభవము జ్ఞానము స్వరూపముగా గల్గియున్న కేపలాత్మను నిన్ను నమస్కరించుచున్నాను. అనవిని పరమాత్మ నన్ను నీవిపుడెందులకు స్తుతించితివో క్లుప్తముగా నానతిమ్ము అని పురుషోత్తముడనియె.

స్వామీ! పురుషోత్తమము” అను నీ పుణ్యాలయమున ఇంద్రనీలమణిమయమైన ఈ ప్రతిమ సర్వాభీష్టములను దీర్చునది. దానిని శ్రద్ధతో దర్శించి ఏకాగ్రచిత్తమున సేవించి మానవులు నిష్కాములై శ్వేతభవనమునకు వెళ్ళుదురు.

కావున పాపులన్నవారు లేరు. పాపులను దండించు అధికారము నాకున్నను దాని అవనరము లేనందున నా పదవికి గౌరవము పోయినది. కావున నీ ప్రతిమను ఉపహరింపుమనెను. అది విని ఇసుకలో దాచెదనంటిని. అన్నట్లు నేను దాచితిని. బంగారుతీగల పొదరింట దాచి యముని దక్షిణదిశకు పంపితిని.

బ్రహ్మయనియె.

ఇంద్రనీల ప్రతిమట్లు మరుగుపడిన మీదట జరిగిన కథను విష్ణువు లక్ష్మికి చెప్పెను.

ఆ చెప్పిన విషయ సంగ్రహము మూలము వలననే సులభముగా తెలియుచున్నది. కావున పునరుక్తిగా అనువాదము చేయబడలేదు.

ఇది బ్రహ్మపురాణమున నలుబది యైదవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment