ప్రాసాదకరణము
ఇట్లా రాజు విష్ణుప్రాసాద నిర్మాణమును గురించి ఆలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను పిలిపించి భూశోధనము చేయించెను. అంతియే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్ర తారాబల సంపత్తి గ్రహానుకూల్యము గల శుభ సమయమున వాస్తు విద్వాంసులతో నీ ఆరంభము జరిపించెను. మంగళవాద్యములు, వేదాధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, అక్షతలు, పేలాలతో దీపములతో పూర్ణకుంభములతో నా మహీపతి భక్తితో భగవంతునకు అర్ఘ్యమిచ్చెను. కళింగోత్కళ, కోశలాధీశ్వరులను ఆహ్వానించెను.
మఱియు ఆ నరేంద్రులను స్వామి విగ్రహము కొఱకు అనువయిన శిలకై వెళ్ళుడని ఆనతిచ్చెను. శిల్పులను వెంటగొని వింధ్యాద్రికి జని బండ్లపై పడవలపై నేగి పాషాణములను గొనిరండని పంపెను. ఇట్లాజ్ఞయిచ్చి అమాత్యులతో పురోహితులకు ఇట్లానతిచ్చెను.
నా ఆనతిగొని దూతలు ఈ పుడమిని కల రాజులందరికి శుభవార్త తెలిపిరండనెను. దూతలు రాజువచనమును రాజులకు తెలుపనేగిరి.
దూతలేగి రాజులకు వార్త నెఱింగింప వారు ససైన్య పరివారముగా అరుదెంచిరి. నలుదెసల రాజ్యములవారు పర్వత ద్వీపాది పర్వత ప్రాంతములవారు ఆ ఉత్సవమునకు వచ్చిరి.
అట్లరుదెంచిన రాజులనుగని ఈ పుణ్యక్షేత్రము భుక్తి ముక్తిప్రదము. ఇందశ్వమేధమునుజేసి విష్ణుప్రాసాద నిర్మాణమును గూడా జేయ కుతూహలపడుచున్నాను. కావున మీరందరూ నాకు ఇందు సహకరింపవలెను.
బుద్ధిశాలియగు రాజిట్లు పలుకుటకు నృపతులెల్లరు ఆనందించిరి. అతని శాసనమును అనుసరించి ధన, కనక, రత్న, ముక్తామణి రాసులను అనర్ఘ,వజ్ర, వైడుర్యాదులను, శాలువలను నూతనాంబరములను, ఏనుగులపై గుర్రములపై అసంఖ్యాకముగా తరలించుకొని వచ్చిరి. నానావిధ ఆహార పదార్థములను నవధాన్యములను, మాష,ముద్గ, తండుల,తిలాదులను, గొనితెచ్చి గాదులను నింపిరి, ఆ యజ్ఞ సంభారములను జూచి నృపతి పరమానందభరితుడై మహర్షులను, దేవర్షులను, బ్రహ్మచారి ప్రముఖ చతురాశ్రమస్థులను ఆచార్యోపాధ్యాయ ఋత్విజ వర్గమును సర్వశాస్త్ర కుశలురయిన సదస్యులను ఆ శ్రీమంతుడు దర్శింప ఆనందభరితుడై పురోహితునితో నిట్లనియె.
అశ్వమేధాశ్వమునకు వేదపారగులైన బ్రాహ్మణులు ఆయా దేశములకేగి పరీక్షింతురుగాక యనెను.
రాజపురోహితుడు ఆనంద భరితుడై రాజులతో బ్రాహ్మణ పురస్సరముగా ఒక గ్రామప్రాంతమున యజ్ఞవాటమును శాస్త్రీయముగా నిర్మింపజేసెను. అది అనేక రాజప్రాసాదములతో మణిమయములయిన వేదికలతో, బంగరు స్తంభములతో తోరణములతో సుమనోహరముగా శోభిల్లుచుండెను. నానా దేశరాజులకు అంతఃపురములను ఏర్పరచెను. ఆ దేవుని సంతోష పరుప అమూల్యమయిన వస్తువులను స్వర్ణరత్నాదులను కాన్కలంగొని వారి వారి శిబిరములందు విడిసిరి. అ సందడి సముద్రధ్వనినిమించి ఆకాశమంటెను.
నానాదేశాగతులైన బ్రాహ్మణ వైశ్యులకును విడుదులను యథావిధిగ నేర్పాటు చేయించెను.
మఱియు నందాగతులైన వారికి శయ్యాసనాదులు మృష్టాన్న సంతర్పణములను అతడేర్పరచెను. ఆయజ్ఞమునకు మహానుభావులు బ్రహ్మవేత్తలు శిష్యులతో ఏతెంచిరి. రాజువారికి నెట్టి డాంబికములేక హృదయ పూర్వకముగా స్వయముగా స్వగతమెసంగెను. ఆ మీదట శిల్పులు నందు తమ శిల్పనైపుణ్యముం ప్రదర్శించిరి. రాజుమంత్రులతో ఏమాత్రము ఏమరుపాటు లేకుండా ఆ యజ్ఞసన్నాహమును తిలకించి పులకితాంగుడయ్యె.
ఆయజ్ఞము ఆరంభమునంత సదస్యులు ఒండొరులను గెలువ నిత్యాద్బుత శాస్త్రార్థములు గావించిరి. దేవేంద్ర వైభవమును మించిన ఆ యజ్ఞవాటిక నిర్మాణ శోభను తిలకించి, మంగళార్థములయిన పూర్ణ కలశల వీక్షించి శ్రౌతము చెప్పినట్లు నిలువబడిన దారుమయయూప స్తంభములంగని, జటస్థలములందు పుట్టిన యజ్ఞపశువుల ఆవులు గేదెల ఆలోకించి యజ్ఞమునకు ఏతెంచిన ప్రజలానందభరితులైరి. జరాయుజాదులు నాల్గురకముల జీవులు పర్వతములందు పండెడి ధాన్యములు మొదలయిన యజ్ఞసంభారము లనేకములం జూచి రాజులు ఆశ్చర్యానంద వివశులైరి. బ్రాహ్మణాదులకు మృష్టాన్న సంతర్పణములు జరిగెను. ఇట్లు విప్ర సహస్ర సంకులమైన య్యజ్ఞవాటిక యందు మంగళార్థములైన దుందుభి ధ్వనులు వినసొంపైనవి. పాలు పెరుగులందు ఏరులై ప్రవహించెను. జంబూద్వీపమంతయు అటకు ఏతెంచినట్లు కనిపించెను. విప్రులు సువర్ణ మణికుండలాదులను వేలకొలది బహుమానములు అందుకొని ఏగిరి. అందు బ్రాహ్మణులు రాజ భోజ్యములయిన విందులారగించిరి. ఋత్విజులకు భూరిదక్షిణ లొసంగెను. మరియు నారేడు రాజులకు గూడా మిక్కిలి సత్కరించెను. ఆ రాజు అంతఃపురము యజమాన నత్నీగణము కులశీల సంపన్నము పరమశోభన స్వర్ణ రత్నాభరణములందాల్చి ముక్తారత్నహారములు మెఱయ నాయజ్ఞమున అద్బుతశోభను సంపాదించెను. మహాగజములు సింధు జాతములైన అశ్వములు పలురంగులు గలవి నానావిధాయుధధారులయిన భటులు నా యజ్ఞమునకు రక్ష యిచ్చు చుండ జూచి యా యజమాని మానవేశ్వరుడు ఉప్పొంగుచు నిట్లనియె.
సర్వశుభ లక్షణ లక్షితమైన అశ్వమేధాశ్వమును గొనిరండు, సుసన్నద్ధులయి రాజకుమారు లాగుఱ్ఱము వెంట రక్షణ యిచ్చును ననుగమింతురుగాక ధర్మశాస్త్రవిదులయిన విప్రులు ఋత్విజు లిక్కడ హోమాదులను నిర్వర్తింపుడు నల్లమేక, నల్లలేడి, జాతిగల యెద్దు దున్నపోతు గోవులు గోపాలురును నిందు గొనిరండు. ఇష్టి విశేషములను జరిపింపుడు. ఆమీద విష్ణుదేవాలయ నిర్మాణము నిర్వర్తింపబడును. విప్రులేది కోరిన నదియెల్ల నిండు, మఱి యిందు వచ్చు యాచకు లెల్లరకు లేదనకుండ సర్వద్రవ్యములు నీయబడుగాక. నాకు భగవంతుడు విష్ణువు సాక్షాద్దర్శనమిచ్చు దాక యీ యజ్ఞము జరుగవలసినదే యని యారాజు బంగారురాసులను గజతురగ గోవృషభాదులను కోట్లు నర్బుదములుగా దానములు గావించెను. గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు పాలుపితుకుటకు కంచుబిందెలు జతసేసి అనేక గోవులను వేదవిదుల కొసంగెను.
ఆ రాజ్యమున అకాలమరణము గ్రహావేశము భూతప్రేత పిశాచావేశము విషస్పర్శము అన్నది లేనేలేదు. హృష్ట పుష్ట జనసంకులము ఎరుగని దేశము. మునులు తమతమ తపస్సులందు పరమసిద్ధిని బడసిరి. చిరంజీవులైరి. ఎన్నడు నీవరకిట్లు ధనధాన్య సమృద్ధముగ యజ్ఞము జరిగినది లేదు. ఇట్లా రాజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు యధావిధిగ ఆ అశ్వమేధమును విష్ణు ప్రాసాదమును నిర్వర్తించి జగన్మంగళము సేకూర్చెను.
ఇది బ్రహ్మపురాణమునందు ప్రాసాదకరణము నలుబది ఏడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹