Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నలబై తొమ్మిదవ భాగము

కారుణ్య స్తవ వర్ణనము ఇంద్రద్యుమ్నుడు

పురుషోత్తమదేవుని స్తుతించుట

వాసుదేవా!మోక్షకారణ! జన్మ సంసార సాగరమునుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశమువంటివాడవు నిర్లేపుడవు.(గణసంగములేనివాడవన్నమాట) ఈ స్తుతి పారాయణ నారాయణ నామావళి. 1 శ్లో నుండి 9 బలరామాది వివిధ మూర్తులన్నియు నీవే వేఱువేఱుగా ననిపించుచున్నవి. గరుడుడు శంఖచక్రాదులు దిక్పాలురు కేశవాది రూపములన్నియు నీయవయవములే.

జగన్నాథ ! నీ ఆ స్వరూపములన్నిటి నర్చించితిని. నీ సంకర్షణ అనిరుద్ద ప్రద్యుమ్నాది మూర్తులను నేను కీర్తించితిని. నిన్నేకరూవుని భిన్నరూవుల బేర్కొందురు. ఔపచారికము. అద్వైతుడవైన (ఏకైక వస్తువైన) నిన్ను ద్వైతునిగా బేర్కొనుట యెట్లు పొసగును ?

హరీ ! నీవు చిత్స్వరూపమున (కేవలము జ్ఞానమై) వొక్కడిపై సర్వము వ్యాపించియున్నావు. నీ పరమ రూపము భావాభావ వర్జితము. ఉనికి మనుకులు లేనిది. కూటస్థము సర్వసాక్షి అచలము ధ్రువము. నామరూపములు గలదానికి ఉపాధియని పేరు. నీ రూపముపాధి విడిచినది. కేవలము సత్తా మాత్రము. దానిని దేవతలే ఎఱుగరు. నేను ఎట్లు ఎఱుంగుదును? పీతాంబరధారి చతుర్బుజము. శంఖచక్రగదాపాణీ కిరీటము భుజకీర్తులు. ధరించిన శ్రీవత్సవక్షము వనమాలాభూషితమునైన నీ మఱొక మూర్తిని (అర్చామూర్తిని) దేవతలు నీ భక్తులు నర్చింతురు. ప్రభూ రక్షింపుము నేను శరణొంద నీకంటె మఱియెక్కని గానను. కర్మపాశబద్దుడనై సంసార సాగరమునం బడి కొట్టుకొను మాయా మోహమున బడినవానిని నుద్ధరింపుము.

నానాయోనులం బుట్టి నానాకష్టముల ననుభవించితిని. సాంగములైన వేదములను శాస్త్రములను జదివితిని. కళలను శిల్పములను నేర్చితిని. సుఖాలు దుఃఖాలెన్నో యనుభవించితిని.

సంతోషా సంతోషములు సంచయాప్రచయములు (కూడబెట్టుట పోబెట్టుట) పుత్రమిత్రకళత్రాదులు తలిదండ్రులన్నదమ్ముల కలయికలు ఎడబాటులెన్నో నాకైనవి.

విణ్మూత్రముల రొంపిలో (ఆడుదాని గర్భములో) నే నిరికికొన్నాను. మహాదుఃఖము లందినాను. బాల్యకౌమర¸యవ్వన వార్ధక్యాదిదశలం అంతులేని వంతలొందినాను. మరణమంది యమమార్గమున నరకమందు పలుయాతనలు పడినాను.

క్రిమికీటకాదులు పలుమృగములు పక్షులు పలు పశువుల బ్రాహ్మణాదిశూద్రాంత యోనులందు ధనికులు దరిద్రులు రాజులు రాజర్షులు రాజసేవకులు మఱి పెక్కుదేహులగేహముల యందు మఱలమఱల పుట్టితిని గిట్టితిని.

పెక్కుమంది దాసులకు దాసుడనైతిని. దరిద్రుడనైతిని. రాజులకు రాజునైతిని. భిక్షకులకు భిక్షకుడైతిని. ఒరులకు నేనిచ్చితిని. ఒరులకడ దీనుడనై నేను చేయి చాచితిని. ఒరులచే నేబడితిని. నాచే నొరులెందఱో పడిరి. తండ్రులు తాతలు మిత్రులు భ్రాతలు పుత్రులు కళత్రముల కొఱకు సిగ్గువిడిచి దైన్యము వెళ్ళబోసికొన్నాను.

పశుపక్ష్యాదులలో చరాచర ప్రపంచమునందు దిగులు గడిచి నేను పోయి యీడిగిలబడిని చోటన్నది లేనేలేదు. నరకమెప్పుడో స్వర్గమెప్పుడో వసుధయైప్పుడో పశుపక్ష్యాదులందెప్పుడో నా ఉనికి ఎప్పుడెక్కడో యెఱుగను. నీరు తోడు యంత్రచక్రమున త్రాటితో గట్టిన కుండ ఒకమారు క్రిందికి ఒకసరి మీదికి నొకపరి నడిమికి వచ్చిన విధమున భైరవమైన యీ సంసార చక్రమున చిరకాలము పరిభ్రమించుచున్నాను. ఈ తిఱుగుడున కంతుగానకున్నాను.

ఇంద్రియుములు వ్యాకులములై యిప్పుడు నేనేమి సేయవలెనో దెలియకున్నాను. శోకము తృష్ణకు (ఆశకు)జిక్కినేను మతివోయి కాందిశీకుడనై(భ్రాంతుడనై = భయముచే నట్టిట్టు పరుగులెత్తువాడనై) దేవా! ఇప్పుడు నేను విహ్వలుడనై (తపనచే అవయవములు పట్టుతప్పి) బెగ్గలించుచు విలవిల దన్నికొనుచు మ్రగ్గుచు విరవిర వోవుచు) నిన్ను శరణందుచున్నాను. కృష్ణా సంసారమందు మునిగిపోయిన నన్ను కాపాడుము. జగన్నాథ నన్ను భక్తుడని యనుకొందువేని నా యెడ దయసూపుము.

నన్ను గురించి యాలోచించు బంధువు నీకంటె నాకు లేడు. నిన్ను నా నాథునిగ (దిక్కుగ) బొందితిని. మఱి నాకెక్కడను బ్రతుకునా చావునా క్షేమమున ఏ భయముండదు. జగద్దాతయైన కేశవునందు భక్తికలుగని వారికి నిన్ను యధావిధిగా సేవింపని వారికి నరాధములకు సంసార బంధమునుండి సుగతి(విముక్తి) యెట్లగును?

కులముతో శీలముతో విద్యతో బ్రతుకుతో పనేమి? ఎవరుమోహవశులై నిను నిందింతురో వారాసుర ప్రకృతిలో నుండి మఱల మఱల పుట్టుచు ఘోరనరకమందు బడుచుందురు. నీ దూషణము సేయువాండ్రకు ఆ నరకము కంటె మఱి ప్రాయశ్చిత్తము లేదు. నా ప్రారబ్దమును బట్టి యెందెందు నాకు జన్మము గల్గునో అందందు నీయందు నాకు దృఢభక్తి యెల్లపుడు గల్గుగాక ! నిన్నారాధించి సురాసురులు నరులను మనసు నిమిడించుకొని పరమసిద్దినందిరి. నిన్నెవ్వడు పూజింపడు? బ్రహ్మదులేని వొగడలేని ప్రకృతికంటే పరుడైన నిన్ను మానుషబుద్దిని నేనెక్కడ పొగడగలను. అయినను తెలియని తనముచే నాచేత వినుతుడనైతివి.

నాయెడ దయగలదేని దీనికి నన్ను క్షమింపుము. సాధువులు మహానుభావులు అపరాధులయెడం గూడ క్షమ సేయుదురు. భక్తవాత్సల్యము అనుసరించి దేవేశ్వర ! నాయెడ ప్రసన్నుడవగుము. భక్తిభరితచిత్తమున నుతించితింగాన నా చేసిన పూజయెల్ల సాంగమగును గాక! వాసుదేవ ! నమస్కారము.

ఇట్లాతనిచే బొగడబడి గరుడధ్వజుండు ప్రసన్నుడై ఆతడు మనసారనేది కోరెనది ఎల్ల ఇచ్చెను. దినదిన మెవ్వడు పూజించి హరి నీ స్తోత్రముచే వినుతించునతడు నిక్కముగ మోక్షమందును. ఈస్తోత్ర వరమునెవ్వడు తెలిసి (అర్థమెఱిగి)త్రిసంధ్యము శుచియై జపించునో ఆనరుడు ధర్మ అర్థ కామ మోక్షములను బోందును. దీని జదివిన విన్న వినిపించిన ఆతడు పాపములెడని శాశ్వతమైన విష్ణులోకమందును. ధన్యము పాపహరము భుక్తి ముక్తిదము శివము(మంగళము) గుహ్యము (రహస్యము) సుదుర్లభము పుణ్యమునైన యీ స్తుతి ఎవ్వనికి పడితే వారికి ఈయరాదు. నాస్తికుడు మూర్ఖుడు కృతఘ్నుడు మాని (నే నే ఘనుడు ననుకొనువాడు) దురాలోచనుడు (దుష్టజ్ఞానము గలవాడు) ఆభక్తునికి ఎప్పుడును దీని నీయరాదు. భక్తుడు గుణవంతుడు శీలవంతుడు విష్ణుభక్తుడు శాంతుడు శ్రద్దతో అనుష్ఠానము సేయువాడునైన వారికిది సర్వాదా విఘాతుకము సుఖమోక్షదము అశేష వాంచాఫలదము వరిష్ఠమునైన ”కారుణ్య”మను పేరుగల ఈ పురుషోత్తమ స్తోత్రమును నేను జెప్పితిని. విశుద్దు లెవ్వరుసు నూక్ష్మ వస్తువైన మురారిని పురాణ పురుషుని ఇచ్చలు ధ్యానింతురో వారు ముక్తులై మంత్రములచే యజ్ఞాగ్నియందు హోమముసేయబడిన ఆజ్యమువలె హరిం ప్రవేశింతురు. అతడొక్కడే దైవము సంసార దుఃఖహరుడు పరుడు పరాత్పరుడు, అంతకంటె మఱి యెండులేడు.

ఆ కృష్ణుడు ద్రష్ట (సర్వసాక్షి) పాత (రక్షకుడు) నాశకర్తయు సమస్తసారభూతుడు జగద్గురువు మోక్షసుఖప్రదాతయు నగును. కృష్ణునందెవరికి ఇహమందు భక్తికలుగదోవారికి విద్యచేనేమి? గుణముల నేమి యజ్ఞములను దానముల నుగ్రతపముల నేమి ప్రయోజనము? ఎవనికి బురుషోత్తము నందు భక్తి యుండు నాతడు లోకమందు ధన్యుడు. అతడు శుచి అతడు విద్వాంసుడు. నుఖములతో తపస్సులతో గుణములతో నతడు శ్రేష్ఠుడు. జ్ఞాని దాత యతడే సత్యవక్త.

ఇది శ్రీ బ్రహ్మపురాణము నందు కారుణ్యస్తవము అను నలుబది తొమ్మిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment