పురుషోత్తవర్ణనమ్
ఇంద్రద్యుమ్నునితో పరమేశ్వరుడిట్లనియె. రాజా! యక్ష గంధర్వాదులు మహేంద్ర బ్రహ్మా రుద్రాదులలో నే నెవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్నెఱుంగుము. సకల పాపములు హరించు అనంత బల పౌరుషములు గలవాడను. అనంతుడును అశేష భూతకోటికి ఆరాధనీయుడను. ఎవరిని జ్ఞానమ్యుడని వాసుదేవుడని యోగులు పేర్కొందురో. వేదాంతములు వెల్పునో అట్టి యోగగమ్యమగు వస్తువును నేను త్రిముర్తులు నేనై ఉన్నాను. దిక్పాలులందురు నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నాకంటె అన్యము లేదు. నీ ఎడల సంప్రీతింగంటిని. వరమర్ధింపుము.నా దర్శనము పుణ్యము చేయనివానికి కలనైన గాదు. నీవు ధృఢభక్తి సంపన్నుడగుటచే ప్రత్యక్షము నన్ను జూచితివి, అని స్వామి అన భూమిపతి మేను పులకింపనా దేవుని పలువిధంబుల స్తుతించెను.
ఓ లక్ష్మీనాథా ! పీతాంబరధారీ ! శ్రీనివాసా ! నమస్కారము. ఆదిపురుషుడు సర్వేశ్వరుడు సర్వతోముఖుడు సనాతనుడు నగు విష్ణుదేవుని నమస్కరించెద. శబ్దములకు అతీతుడు గుణాతీతుడు భావాతీతుడు నిర్లిప్తుడు నిర్గుణుడు సూక్ష్మమైనవాడు. సర్వజ్ఞుడు శంఖచక్ర గదా ముసలధారియు నీలోత్పలదళశ్యాముడు. వరప్రదాత శేషశాయియు క్షీరసాగరశయనుడు, సర్వపాపహారియు నగు హృషీకేశుని నమస్కరించెద. మోక్షకారణభూతుడవు వ్యాపకుడవు, నాశరహితుడవు దేవదేవుడవునగు నిన్ను నమస్కరించెద.
ప్రాంజిలియై ప్రణామ మాచరించి వినయమున రాజిట్లు పలికెను. ”జగన్నాధ! దేవానుర గంధర్వ యక్షరక్ష స్సిద్ద సాధ్య విద్యాధర నాగ గుహ్యక కిన్నరాదులు సర్వశాస్త్ర పారగులు సన్యాసులు యోగులు వేదార్థచింతనులు మోక్షమార్గ విదులు ఏ వరమపదుమును ధ్యానింతురో నిర్గుణము నిర్మలము శాంతమునైన దేనిని బొంద గోరుదురో యట్టి పదమును నీ ప్రసాదమున నందగోరుదును.
అంత భగవంతుడు ” ఓ రాజా! మంచిది నీకు శుభముగుగాక. నీ కోరిన స్థానము నందుము. నా అను గ్రహమున అది నీకు లభించును. సందేహము వలదు. పదివేల తొమ్మిది వందలేండ్లు నీవు రాజ్యమేలుదువు గాక. ఆ మీద నా దివ్యపదము గాంతువు. నీకీర్తి శాశ్వతమగును. ”ఇంద్రద్యుమ్న సరస్సు” అను పేరున ఈ తీర్థము యజ్ఞాంగ సంభవము. ఇందు స్నానము చేసిన జీవి ఇంద్రలోకము వడయును. ఇచ్చట పిండప్రదానము చేసిన ఇరువది తరములవారు స్వర్గముంగాంతురు. అచ్చట అప్సరసలచే గంధర్వ గాన మాలాపించు బూజింపబడి పదునల్గురింద్రులు పాలించునంత కాలము విమాన మధివసించి నీవు విహరింతువు. ఈ సరస్సునకు దక్షిణదిశ నైఋతి మూల నొక మఱ్ఱి చెట్టున్నది. దాని దరి నిక మండపము కలదు. దాని చుట్టు మొగలిపొదలున్నవి. వివిధ తరుసంకుల మట కొబ్బరి మొదలగు తోటలు సంపెంగ పూలతోటలు చాలా గలవు. ఆషాడశుక్ల పంచమి పితృదేవతాకమయిన మఘానక్షత్రమందు మండపమున వేంచేవు జేసి యేడురోజులు నిలిపి నృత్యగీత క్రీడావినోదములచే నర్చించి సువర్ణ దండములగు చామరములచే నీచోపులిచ్చుచు రత్నభూషిత వ్యజనములచే వీచుచు నొక స్తంభమునట ప్రతిష్ఠించి బ్రహ్మచారి యతిస్నాతకులు గృహస్థులు వానప్రస్థులు నానావిధ స్తోత్రపాఠములచే ఋగ్యజుస్సా మములచే మమ్ము(బలరామకృష్ణులను) స్తుతింతురు. ఇట్లు మమ్ము దర్శంచి భక్తితో మ్రొక్కినభక్తులు పదివేలేండ్లు వైకుంఠమున వసించును. సర్వభోగములందును నా పుణ్యము ననుభవించి తిఱిగి ఈ ఇలపై విప్రులై జనించి కోటీశ్వరులై చతుర్వేదులై విరాజిల్లుదురు.
అని యిట్లు హరి యాతనికి వరమిచ్చి విశ్వకర్మతో కనుమఱుగయ్యెను. ఆనందభరితుడై కృతార్థుడనైతి ననుకొని బలరామకృష్ణులను సుభద్రను దేవ విమానమట్టి రథమునెక్కించి ఊరేగించి పురోహిత మంత్రి సామంతాదులతో చక్కని పవిత్ర ప్రదేశమందు శుభలగ్నమున ప్రతిష్టించి యథావిధిగ నర్చించి ఆచార్య ఋత్విగ్జనంబులను భూరిదక్షిణలచే సత్కరించెను. ఆ మీద పెక్కు జన్నములు చేసెను. కృతకృత్యుడై ఐహికభోగములను విడిచి విష్ణుపదమంచెను. ఇది ఈ పురుషోత్తమ క్షేత్రమహిమ. మఱి ఏమి వినదలతురన మును లిట్లనిరి. పురుషోత్తమ క్షేత్రయాత్ర యేపుదెట్లు చేయవలెను! పంచతీర్థ విశేష మేమి! అందొక్కొక్క తీర్థస్నానంబు వలనను, దానములవలను దేవదా దర్శనంబు వలన నేయే ఫలము లభించును? దెలుపుమని వేడిరి.
అంత బ్రహ్మయిట్లనియె. కురుక్షేత్రమందు నిరాహారియై ఒంటికాలిపై నిల్చి డెబ్బదివేలేండ్లు చేసిన తపస్సు యొక్కఫలమీ క్షేత్రమునందు జ్యేష్ఠ శుద్ద దశమి నాడు ఉపవాసముండి జగన్నాథు దర్శించినంతమాత్రాన గల్గును జ్యేష్ఠమందే పంచతీర్థయాత్రసేసి శుద్దద్వాదశినాడు పురుషోత్తముని దర్శంచవలెను. దానిచే విష్ణులోకమును శాశ్వతముగ పొందును. దూరముననుండియేని పురుషోత్తముని దినదినము కీర్తించిన జాలును. విష్ణుపురము నందును హరి చేతిలోని చక్రము నల్లంత దూరమందుండి యేని ఆలయమన ఉపరి భాగమందున్న దానిని జూచి నమస్కరించిన ఆతడు పాప విముక్తుడగును.
ఇది బ్రహ్మపురాణమున పురుషోత్తమవర్ణనము అను ఏబది ఒకటవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹