Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 -యాబై మూడవ భాగము

మార్కండేయ ప్రళయ దర్శనము

అంతట ఏన్గులట్లు మెఱుపుదీవల మెఱయు మేఘములు వింతగా నింగి నలముకొనియె. అవి కొన్ని నల్ల కలువలవలె నల్లనివి కొన్ని తెల్ల కలువలవలె తెల్లనివి కొన్ని పద్మ కింజల్కములట్లు ఎర్రనివి. కొన్ని పసుపుపచ్చనివి కొన్ని ఆకుపచ్చనివి కొన్ని కాకిగ్రుడవంటివి. కొన్ని తామరరేకులట్టివి కొన్ని ఇంగువఛాయగలవి అయియుండెను. కొన్ని పెద్ద నగరములుగను కొన్ని పర్వతములట్లు కొన్ని కాటుక కొండలట్లు, మరకతవరములునై మెఱుపు దీవల నలుముకొని మహా మేఘములు క్రమ్ముకొనెను. అవి కుండపోతగా వర్షించు వర్షధారలచే నీ మేధిని నలుదెసల బెందడి యయ్యెను. ఆ వర్షపాతముచే నింతకు మున్నేర్పడి అగ్ని యుత్పాతము వశమించెను. పరమేశ్వర ప్రేరణచే మేఘములు అవిరామముగా పన్నెండు ఏండ్లు వర్షింప సముద్రములు పొంగి చెలియలకట్టులుదాటి జగమ్మును ముంచెత్తెను. వర్వతములు పిండిగుండయయ్యె. ఆభూమి నీటిలో మునిగిపోయినది. అట్లువ్వెత్తుగ గ్రమ్మిన కారుమబ్బులెల్ల నల్లంతలో వీచిన పెనుగాలులకు పింజపింజలై విడిపోగియెను. ఆ తొలితామరగద్దియపైనున్న విష్ణువు ప్రళయకాల మారుతమును త్రోసివైచి ఆ ప్రళయపయోధిపై హాయిగ నిద్రవోయెను. అపుడు సర్వజీవకోటి వినష్టమయ్యెను.

అంత మార్కండేయ మహర్షి విశ్రమించి పురుషోత్తముని ధ్యానించి కనులు తెఱచి ఈ వసుంధరయెల్ల నీటమునిగినట్లు గమనించెను. అంతమున్నుగల ఆ పెనుమర్రిలేదు. భూమిలేదు. దిక్కులు లేవు. భాస్కరుడు లేడు. చంద్రుడు లేడు. అగ్నిలేడు గాలిలేదు. సురాసురులు లేరు. ఏకార్ణవమై కేవలము కారుచీకటి క్రమ్మిన అత్తరి నిరాశ్రయమైన ఆ నీట మునిగి ఈద యత్నించెను. అట్టిటు ఈతకొట్టుచు ఆయాసపడజొచ్చెను. తుదకందు మునిగెను. కాని రక్షకుని కానలేడయ్యె. ఆయన ధ్యానమునకు తనివిచెంది పురుషోత్తముడు అపుడదరి చెదరిపోవుచున్న మునిని గని యిట్లనియె.

వత్సా ! ఆలసిపోయితివి. పిల్లవాడవు. నాకు భక్తుడవు. వ్రతనిష్ఠుడవు. ఇటు రారమ్ము.మార్కండేయా ! నాదరికి రమ్ము. భయపడకు. నాముందున్నావు.

అన్న నమ్ముని మిగుల కుపితుడై మరిమరి వెఱగు పడుచున్నిట్లనియె.

ఎవడు వీడు ? నా తపస్సును కించపరచి మాటలాడుచున్నాడు. పెక్కువేలేండ్లు ఈదగల నా శరీరమును బెదిరించుచున్నాడు. దేవతలలో కూడ నీలాగ నన్ను తేలికజేసి మాటలాడు నాచారములేదు. దేవేశుడు బ్రహ్మకూడ నన్ను దీర్ఘాయుష్మంతుడవనియనెనే ఎవడురా! జీవితము కడముట్టినవాడు. తపముచే గట్టివడిన తలకాయ గల నాకు నన్ను ఇట్లు మార్కండేయ! అని పేరెత్తి పిలిచి నావలన చావునొందగోరుచున్నాడు. అని పలికి చింతంగొని ”ఇది కలయా! మోహమా! ఈ వింతయేమనుకొన్న అతనికినంతలో నిశ్చలచిత్తంబున ధ్యానించుటయు నాతనికి సకల దుఃఖ విధ్వంసనియగు మనశ్శక్తి యార్భూతంబయ్యెను.

అపుడతడు పురుషోత్తముని భక్తితో శరణొందెదనని మనసు నిలిపి శరణంది ఆ వెంటనే ఆ నీటిమీద విశాలమైన వటవృక్షమును జూచెను. ఆచెట్టు పెనుగొమ్మపై పరుచుకొనియున్న విశ్వకర్మ నిర్మితమయిన చక్కని వింతయిన పర్యంకమును గాంచెను. అది వజ్రవైడూర్య నిర్మితము. మణివిద్రుమ శోభితము. పద్మరాగాది మఱి గణాలంకృతము. నానావిధాన్తరణము. నానారత్న శోభితము. వింతలన్నిటికినెలవు. విచిత్ర ప్రభామండల మండితము. అందు కోటి సూర్య పభాజిష్ణుని, తోజోమూర్తిని, చతుర్భుజుని, సుందరాంగుని, పద్మపత్రనేత్రుని, శ్రీవత్సవక్షుని, శంఖచక్రగదాధరుని, వనమాలాంకృతోరస్కుని, దివ్యకుండలమండితుని, హారభారావనమ్రగ్రీవుని బాలకృష్ణుని దర్శించెను.

మార్కండేయుడు అచ్చెరువడి విచ్చిన కన్నులు పులకించిన మేనుంగొని వ్రాలి ఆహా! ఈ ఏకార్ణవమందు చరాచర మడిగిన తఱి ఈ బాలుడెవ్వడొ భయము లేక మసలుచున్నాడు అనుకొనెను. భూతభవ్య భవిష్యము నెఱింగియు ఆ మహాముని మాయామోహితుడై ఆ దేవుని ఎఱుంగడయ్యెను. మఱియు నా తపశ్శక్తి వ్యర్థము – నాజ్ఞానము వృధా-సుదీర్ఘమయిననా బ్రతుకు వ్యర్ధము. నామానుషముత్తది. ఈ పర్యకమున నిదురించు బాలుదెవ్వడో నెఱగనైతి.

ఇట్లనుకొనుచు ఈదుచు మైమఱచి మార్కండేయుడు మిగుల వగచెంది రక్షణకొఱకు తడుములాడెను. కాని బాల సూర్యుడట్లు తన మహిమచే వెఱయుచునున్న తేజోమయుడైన ఆ బాలుని చూడనేరడయ్యె. ఆ పిల్లవాడట్లు వచ్చుచున్న మునిని గని మేఘ గంభీరముగ నిట్లు పలికెను. వత్సా! చాల అలసితివని యెఱుంగుదును. నన్ను శరణందిన నిన్ను గాపాడుటకే వచ్చితిని . నాశరీరమందిపుడు ప్రవేశింపుము. నీకు విశ్రాంతి కల్గును. అనవిని ఏ భయము నెఱుగక ఏమియు మాటలాడక ఆ బాలుడు మోమునందు వివశుడై ప్రవేశించెను.

ఇది బ్రహ్మపురాణ మార్కండేయ ప్రళయదర్శనమను యాబదిమూడవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment