ఉపాసనాఖండము మొదటి భాగము
రాజోపదేశ కథనం
ఆ తరువాత కధను సూతమహర్షి యిలా చెబుతున్నారు :
‘ఓ ఋషివర్యులారా! అప్పుడు భృగుమహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంత మహరాజుయొక్క పూర్వజన్మ కర్మయొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆరాజుతో ఇలా అన్నాడు:”ఓ రాజా! నీ పాపంయొక్క బరువు ఎంతటిదంటే అది నేనే పరిహారోపాయం చెప్పబూనినా దాన్ని మించిపోయేలా వుంది!
ఐనా అనుగ్రహంవల్ల నీయొక్క సమస్త పాపములనూ నశింపచేసేటటువంటి ఒక ఉపాయం చెబుతాను. నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన‘’గణేశపురాణము”ను విన్నట్లైతే తక్షణమే నీవీ దుఃఖసముద్రము నుంచి విముక్తుడివవుతావు! దీనికే మాత్రం సందేహంలేదు” అంటూ శ్రీగణేశుని అష్టోత్తర శతనామాలతో తన కమండలువులోని జలాన్ని అభి మంత్రించి సోమకాంత మహారాజుపై చల్లాడు! అలా ఆపుణ్యజలాలు అతనిమీద పడీ పడగానే ఆరాజు ముక్కురంధ్రాలనుంచి ఒక నల్లటి కాలమేఘంవంటి శరీరంగల పాపపురుషుడు భూమ్మిదపడి వెంటనే పెరుగసాగాడు!
పాప పురుష చరిత్ర :-
ఓ ఋషులారా! ఆ పాప పురుషుడు ఏడుతాడిచెట్లంత ఎత్తు గలిగి నల్లటి దేహకాంతితో, భయంకరమైన కోరలుగల తన నోటిని వికృతంగా తెరచి ఎఱ్ఱని ముఖంతో పెద్ద చేతులతో, జడలు ధరించి భయంకర రూపుడై నోటిలోనుంచి అగ్నిజ్వాలలను వెడలకక్కుతూ, ఒక్కో క్షణంలో చీము, రక్తములను గ్రక్కుచూ, చూసేవాళ్ళకు కళ్ళు మిరు మిట్లుగొలిపేలాగాఢాంధకారము ఆవహించిందా అన్నంత నల్లగావున్న ఆ పాపపురుషుని రూపం చూసిన ఆశ్రమం పరిసరవాసులంతా భయభ్రాంతులై పారిపోయారు!
దిక్కులు మారుమ్రోగేటట్లుగా గర్జిస్తున్న ఆ వికృతుడైన రాక్షసుడిని చూసి భృగుమహర్షి ఆ సోమకాంతుని సమక్షంలోనే ‘ఓరీ నీవెవడవు? నీపేరేమి?’ అంటూప్రశ్నించాడు. అప్పుడు ఆ పాపపురుషుడిలా బదులు పలికాడు
‘భృగు పాప పురుష సంవాదం’
”ఓ ఋషివర్యా! ఈ రాజు యొక్కసూక్ష్మశరీరంలో నివసిస్తూన్న పాప పురుషుణ్ణి నేను! నీవు మంత్రోదకం చల్లటంవల్ల ఈ రాజుయొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను! బాగా ఆకలిగొని వున్నాను! నాకు తగిన ఆహారం వెంటనే చూపించు! లేకపోతే లోకాలనన్నింటినీ మ్రింగివేస్తాను. వీని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు!’అప్పుడు ఆ భృగుమహర్షి తన ఆశ్రమంనుండి వెలుపలికి వచ్చి,ఎదుటగా జీర్ణమై శుష్కించివున్న ఒక మామిడిచెట్టును చూపించి ‘ఓరీ!నీ చెట్టుతొఱ్ఱలో ఉండు! రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో! అలాచేయని పక్షంలో నిన్నీక్షణాన్నే భస్మంచేస్తాను! ఇదినిజం!’ అనిఆజ్ఞాపించాడు.
సూతులవారు ఇలా చెప్పసాగారు :-
‘ఓ ఋషులారా! అప్పుడు ఋషి ఆజ్ఞమేరకు ఆ పాపపురుషుడుఆ శుష్కించిన మామిడిచెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రంచేతనే అది కాలి బూడిదైంది. ఋషియొక్క ఆగ్రహానికి వెఱచి అతడా భస్మంలోనే లీనమై దాగి ఉన్నాడు. అప్పుడా భృగుమహర్షి ఆ సోమకాంత మహారాజుతో యిలా అన్నాడు.”ఓ రాజా! పురాణ శ్రవణం వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి ఈ మాడి మసైన మామిడివృక్షం తిరిగి ఎంతలో చిగురుస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు. ఈ భస్మంలోనే నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది. తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడవు అవుతావు!’ అని ఋషి చెప్పగా విని ఆ రాజిలా ప్రశ్నించాడు!
‘ఓ మహాత్మా! భృగుమహర్షీ! ఈ గణేశపురాణమనే గ్రంధాన్ని గురించి ఎన్నడూ కనీవినీ కూడా ఉండలేదు! అటువంటి మహా మహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది? దాన్ని నాకెవరు వ్యాఖ్యానించి చెబుతారు? దయతో సెలవివ్వండి!’ అంటూ శ్రద్ధాళువై ప్రార్ధించాడు. అప్పుడు ఆ భృగుమహర్షి యిలా బదులిచ్చాడు!
‘ఓరాజా! ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పూర్వం చతురాననుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి చెప్పాడు!వ్యాసులవారు నాకు చెప్పారు. దాన్ని నీకు నేను చెబుతాను. గనుక నీవీ పుణ్యతీర్దములో స్నానంచేసి ఈరోజునుంచి పరిసమాప్తివరకూ ఆ గణేశ పురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పం చేసుకో!’ అని నియమించాడు.
అప్పుడు తరువాతి కధను సూతులవారిలాచెప్పసాగారు :-
‘ఓ మహర్షులారా! అలా భృగుమహర్షిచేత ప్రేరేపించ బడిన సోమకాంతమహారాజు పరమ పవిత్రమైన ఆ భృగుతీర్ధంలో స్నానంచేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో ”గణేశపురాణం శ్రోష్యే” (ఈరోజు మొదలు గణేశపురాణమును వినగలను) అంటూ సంకల్పమాచరించాడు.
అలా సంకల్పం చేసీచేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీరకాంతితో ప్రకాశించాడు. అలా భృగుమహర్షి యొక్క అనుగ్రహ విశేషం చేత రోగభూయిష్టమైన తన శరీరంనుండి రక్తస్రావము, క్రిములతో కూడిన గాయాలు, పుండ్లు అన్నీ పోయి దివ్యదేహం గలవాడైనాడు. అప్పుడుఆ మహర్షి సంతోషంతో మందహాసంచేస్తూన్న సోమకాంతుడిని తన చెంతనే ఒక ఆసనంపై కూర్చుండపెట్టుకున్నాడు.
అప్పుడు ఆరాజు స్వస్థచిత్తుడై యిలా అన్నాడు. “ఓ ఋషిసత్తమా!తమయొక్క దివ్యమైన అనుగ్రహ ప్రభావంచేత నా శరీరంలోని బాధలన్నీ కూడా “శ్రోష్యే” అని సంకల్పంచేసిన వెంటనే నశించినాయి. కనుక తాము దయతో ఇక ఆ గణేశ పురాణమును నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి!”ఆ మాటలకు భృగుమహర్షి యిలా బదులు చెప్పాడు : “ఓరాజా! అత్యంత పావనమైన, పవిత్రమైన, అట్టి గణేశ పురాణమును నీకు వినిపిస్తాను. శ్రద్ధాళువుపై ఏకాగ్రచిత్తంతో విని తరించు! దీనిని వినటం అన్నది అంతతేలికగా సంభవించే విషయంకాదు! అనేక జన్మలలోసముపార్జించుకున్న పుణ్యరాశి వల్లనే జరుగుతుంది!
ఈ మహాత్తరమైన పురాణాన్ని వినటంచేత మానవుడికి తాను గత ఏడుజన్మలుగా ఆర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజాననుని అనుగ్రహ విశేషం చేత సమూలంగా నశిస్తాయి.
సూర్యోదయమవగానే రాత్రి తాలూకు చీకటి తెరలు తొలగిపోయినట్లుగా ఆ గజాననుని అనుగ్రహకిరణాలు ప్రసరించగానే జీవుల పాపాలచీకట్లు ఇట్టే తొలగుతాయి.
ఇక ఈ గజాననుడు ఎట్టివాడంటే నాశనం లేనటువంటివాడూ, విభజించబడనివాడూ (అపరిచ్ఛిన్నుడు), గుణములకు అతీతుడు, నిరాకారుడూ, వాక్కులచేత మనస్సుచేత అందుకోలేనటువంటివాడూ, ఇటు వంటివాడని నిర్దేశించటానికి శక్యంకానివాడూ, ఆనందమే స్వరూపమైనటువంటివాడూ అయినటువంటి ఈతని స్వరూపాన్ని బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతలు సైతం తెలుసుకొనలేరు! అంతెందుకు?వేయినాల్కలుగల ఆదిశేషునికే ఈ మహామహిమోపేతుని మహిమలు వర్ణించటం అసాధ్యమంటే ఇక మామూలువారి సంగతి వేరే చెప్పేదేముంది? అటువంటి ఈ గణేశుని పుణ్యచరిత్రను పూర్వం వ్యాసభగవానుని ముఖకమలం నుంచి మధువుగా నేను గ్రోలాను!
తన యజ్ఞం రుద్రుని అనుచరుడైన వీరభద్రునిచేత విధ్వంసమైనప్పుడు వికల మనస్కుడైన దక్షప్రజాపతి ముద్గలమహర్షివద్ద విన్నాడు! అటువంటి మహామహిమాన్వితమైన గణేశపురాణమునంతటినీ నీకు వినిపిస్తాను! అయితే ఇది వినటానికి శ్రోతలకు ఒక అర్హత వుండాలి! అదేమిటంటే సర్వసిద్ధులనూ ప్రసాదించి విఘ్నాంధకారాన్ని పారద్రోలే ఆగజాననుడియందు దృఢమైన భక్తిభావం ఉండాలి!
ఈ పురాణాన్ని తన అష్టాదశ ఉపపురాణాలలో ప్రధానమైనదిగా,చెప్పవచ్చు! కలియుగంలోని ఆచారరహితులు, అధ్యయన శూన్యులు అయిన, వర్ణాశ్రమ ధర్మాలను సరిగ్గా అనుష్టించని వారికై ధర్మ రక్షణకై అష్టాదశ పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించారు. ఈ యొక్క ఉపపురాణము గణేశుని యొక్క స్వరూపాన్నీ, ఆయన అనుగ్రహ విశేషాన్నీ, లీలలనూ తెలిపేది.కనుక నీవు దీన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభీష్టాన్నీ, ఆయురారోగ్యాలను ఆ గజాననుని కరుణావిశేషంతో పొందు!” అన్నాడు భృగుమహర్షి!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”రాజోపదేశ కథనం” అనే తొమ్మిదవ అధ్యాయం. సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹