ఉపాసనాఖండము మొదటి భాగము
మంత్రకథనం
బ్రహ్మ వ్యాసునకు గణేశమంత్రమును చెప్పుట
అనంతరం భృగుమహర్షి సోమకాంతుడికి యిలా చెప్పసాగాడు.
“ఓరాజా! ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ‘ఓ వ్యాసమునీంద్రా గణేశమంత్రములే గణేశునియొక్క శబ్దస్వరూపం!ఆగమాలలో ఏడుకోట్ల గణేశమంత్రాలు చెప్పబడివున్నాయి! వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే! నాకు కొద్దిగా మాత్రమే తెలుసును! ఇక గణేశమంత్రాలన్నింటిలోనూ’షడక్షర గణపతి మంత్రమూ’,’ఏకాక్షర గణపతి మంత్రములు’ శ్రేష్ఠమైనవి! ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యములూ సిద్ధిస్తాయి
లోకములో గజానన మంత్ర ఉపాసకులు పూజనీయులు! వారు సర్వదా నమస్కరించ తగినవారు. వారు జీవన్ముక్తులు అవుతున్నారు.
ఆ గజాననుని భక్తితో ఉపాసించటంవల్ల సకలసిద్ధులూదాస్యం చేస్తాయి. ఈ గణేశమంత్రోపాసన చేసేవారు ఇచ్ఛావిహారులు!
వారికి సర్వజ్ఞత్వమూ, కోరిన రూపం ధరించగల కామరూపసిద్ధి కలుగుతాయి!
సకలాభీష్టములను ప్రసాదించే ఆ వరగణేశుని భక్తిగా కొలిచేవారు ధన్యులు. ఆ గజాననునియందు భక్తిలేనివారి జన్మ నిరర్ధకము!
అట్టివారి ముఖం చూడటంవల్ల అన్ని పనులూ చెడతాయి! పైగా అట్టివారికి పదేపదే సకల కార్యవిఘ్నములూ కలుగుతుంటాయి. అలాగే గణేశుని భక్తుల ముఖ సందర్శనమాత్రం చేతనే సకల విఘ్నములూ ఉపశమిస్తాయి! అట్టి గణేశ ఉపాసకులకు సకల చరాచర భూతములన్నీ స్వాధీనమై నమస్కరిస్తాయి! అందుకని ఓ వ్యాసమునీంద్రా! అటువంటి సకల కార్య సిద్ధిప్రదమూ మహామహి మోపేతమూ,సర్వమంగళకరమూ, పరమ శుభకరమూ అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను!” అంటూ బ్రహ్మదేవుడు శుచియై, ఆచమించి, వ్యాసునకు ఉపదేశించాడు!
మంత్రానుష్టాన క్రమము చెప్పుట :-
ఓ వ్యాసమునీంద్రా! ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలోకూడా చెబుతాను విను!
ఈ అనుష్టానక్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు. దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను! ప్రాతఃకాలాన్నే స్నానంచేసి తెల్లటి పట్టువస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని ఆపైన లేడిచర్మాన్ని, దాని పైన తెల్లటి వస్త్రాన్ని వైచి, మృదువైన ఆసనం తయారుచేసుకోవాలి!దానిమీద కూర్చుండి భూతశుద్ధిని, ప్రాణస్థాపన, అంతర్మాతృక, బహిర్మాతృకా వ్యాసములుచేసి, మూలమంత్రంతో ప్రాణాయామం చేయాలి!
ఆ తరువాత గాయత్రీ ఉపాసన చేయాలి! తదనంతరం నిశ్చల మనస్సుతో గజాననుణ్ణి ఆపాదమస్తకమూ ధ్యానించాలి. ఏకాగ్రచిత్తంతో మానసిక ఉపచారములతో యధావిధిగా గణపతిని పూజించి యధాశక్తి గణపతి మంత్రమును పురశ్చరణగా గణేశుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించే దాకా జపపరాయణుడై ఉండాలి!
ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా బ్రహ్మ భ్రాంతచిత్తుడైన వ్యాసమునీంద్రునికి గణేశుని ఉపాసనా నియమాలను, శుభముహూర్తంలో ఏకాక్షర గణపతీమంత్రాన్ని ఉపదేశించాడు! అంతేకాదు “ఆ గజాననుని ‘ఓ గజాననా! నా హృదంబుజమున నిత్యమూ స్థిరంగా వుండమని ఆవాహన చేసుకుని ప్రార్థించి, ఆతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకో!
అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న ఆ గజాననుడు తప్పక నీకుగల సకల కామ్యములనూ ప్రసాదించగలడు!
అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్యజ్ఞానమూ, త్రికాలజ్ఞానమునూ, నానా గ్రంధ రచనాశక్తీ నీకు కలుగుతాయి!” అంటూ వ్యాసమహర్షిని ఆశీర్వదించాడు వాణీపతియైన ఆ చతురాననుడు.
అప్పుడు వ్యాసమునికి యింకా ఆ మంత్రవిశేషాన్ని గురించి విరించి యిలా వివరించాడు “ఓ వ్యాసమునీంద్రా! నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్తవరదుడైన గజాననుణ్ణి నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ, ఈ మంత్రాన్ని అనుష్ఠించు!
పరమపవిత్రమూ, అనంతమహిమోపేతమూ అయిన ఈ మంత్రాన్నిమాత్రం నాస్తికులకు, వేదనిందచేసే వారికీ, అకృత్యాలుచేసే క్రూరులకూ,శరులకూ, దురాచారపరులకూ ఎన్నడూ చెప్పరాదు.’దైవం’యందు ధృఢమైన భక్తివిశ్వాసములు కలవానికీ వినయమూ, శ్రద్ధా ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి!
అలాకాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందూ, వెనుకా పదితరాల వారిని మహానరకాలను పొందించినవాడవౌతావు!
ఎవరైనా భక్తిశ్రద్ధలతో ఈ గణేశోపాసనను చేస్తే అట్టివారి సకల మనోభీష్టములూ తప్పక నెరవేరతాయి! ఆ ఏకదంతుడైన గణపతియొక్క దివ్యానుగ్రహంచేత పుత్రపౌత్రాభివృద్ధినీ కలిగి, పాడిపంటలతో, సమస్త సంపదలనూ అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలనూ అనుభవించటమే కాక, చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు!” అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని”మంత్ర కథనం” అనే పదకొండవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹