పంచతీర్థవిధివర్ణనము
ఇక పంచతీర్థములదు స్నానము దానములు చేయుట అచటి దేవతలను దర్శించుటవలన కలుగు ఫలమును తెల్పెదను.
మార్కండేయము అను మడుగున ఉత్తరముగ తిరిగి శుచియై ముమ్మారు ఈ మంత్రమును చెప్పుచూ స్నానము చేయవలెను. సంసారసాగరమందు మునిగి పాపగ్రస్తుడనై తెలివిదప్పియున్న నన్ను ఓ త్రిపురహర! రక్షింపుము. మంగళ స్వరూపుడు శాంతుడు సర్వపాపహరుడు నగు నీకు నమస్కారము. ఈశ్వరా ! ఇదిగో స్నానము చేయుచున్నాను. నా పాతకము నశించుగాక!
బొడ్డులోతున స్నాన మొనరించి యథావిధిగా దేవతలకు ఋషులకు పితరులకు మొదలగువారికి తిలోదక తర్పణములు గావింపవలెను. అవ్వల దేవాలయమందు మూడుమార్లు ప్రదక్షిణము చేసి మూలమంత్రముతో అఘోర మంత్రముతోను మార్కండేయేశ్వరుని పూజించి సాష్టాంగనమస్కారము గావించి ఈ విధముగా స్తుతించి ప్రసన్నుని చేసికొనవలెను.
ఓ త్రినేత్ర చంద్రభూషణ ఓ విరూపాక్ష నన్ను రక్షింపుము. ఓ మహాదేవ నీకు నా నమస్కారము.
మార్కండేయ హృదయమందిట్లు స్నానమాడి శంకరుని దర్శించిన అతడు పది అశ్వమేధములు గావించిన ఫలమందును. సర్వపాప విముక్తుడై శివలోకమేగును. అచ్చట మహాభోగముల నా ప్రళయ మనుభవించి ఈ లోకమందు (కర్మభూమియందు) విప్రుడై జనించి వేదవేదాంగ విద్యా సంపన్నుడై శంకర సాలోక్య సారూప్య యోగమునంది అవ్వల మోక్షముల బడయును.
కల్పవృక్షము (మఱ్ఱిచెట్టు) దరికేగి ఈ మంత్రము జపించుచు పూజించి ముమ్మారులు ప్రదక్షిణము చేయవలెను. అవ్యక్తమయిన పరమాత్మయెక్క వ్యక్తరూపము నీవు. మహా ప్రళయకర్తవు. అనగా ముక్తినిచ్చు వాడవు. అమృతమయుడవు. కల్పాంతమున నశింపవు. హరికి నివాసమవు నాపాపము హరింపుము. నీకిదే నమస్కారము.
భక్తితో ప్రదక్షిణము చేసి కల్పవృక్షమునకు మ్రొక్కిన అతడు పాము కుబుసమును విడిచినట్లు పాపమునుండి విడివడును. ఆ కల్పము నీడ వసించి బ్రహ్మహత్యా పాపమునే విడుచునే మఱి యితర పాపముల మాట చెప్పనేల? కృష్ణ శరీరమునుండి జనించి బ్రహ్మతేజస్సుతో నిండిన వటవృక్ష స్వరూపముననున్న విష్ణువునకు మ్రొక్కి రాజసూయ అశ్వమేధ యాగఫలము నందును. అట్లు స్వవంశమునుధ్ధరించి విష్ణులోకముం బొందును.
కృష్ణునికి ఎదుటనున్న గరుడ మూర్తికి మ్రొక్కి సర్వపాపము వెడలి విష్ణులోకమును బడయును. వటవృక్షమును గరుడుని దర్శించి పురుషోత్తముని సంకర్షణుని సుభద్రను దర్శించినవాడు. పరమోత్తమగతి కేగును. విష్ణ్వాలయముంజొచ్చి ముమ్మారు ప్రదక్షిణ మాచరించి సంకర్షణ మంత్రముచే ఆ మూర్తిని పూజించి ఇట్లు ప్రసన్నుని చేసుకొనవలెను.
నాగలిని దాల్చిన నీకు నమస్కారము. రోకలిని చేకొనిన నీకు నమస్కారము. రేవతీప్రియ భక్తవత్సలా నీకు నమస్కారము. బలశాలురకెల్ల మిన్నయగు నీకు నమస్కారము. ధరణింధరించు నీకు నమస్కారము. ప్రలంబాసురుని సంహరించిన నీకు నమస్కారము. కృష్ణునికి అన్నగారైన నీకు నమస్కారము.
ఇట్లు హరిని ప్రసన్నుని చేసికొని నీలాంబరుడైన ఏకకుండలుని బలరాముని రోహిణీ కుమారుని అనుగ్రహింప చేసికొని, ఆతడు పాపము బాసి విష్ణులోకమున కేగును. ప్రళయముదాక నట సుఖములంది పుణ్యానుభవానంతరము భువికివచ్చి యోగికులమందు విప్రుడై జనించి సర్వశాస్త్ర పారంగుడై జ్ఞానమంది ముక్తినందును. ఆమీద హరిని ద్వాదశాక్షర మంత్రముచే పూజించి సద్గతి నందును. గంధ పుష్పాదులచే కృష్ణునర్చించి జయజయయని స్వామి నామములను కీర్తించి నిస్సార సంసార సాగరమందు మునిగితిని. ఇది దుఃఖమను నురుగు క్రోధమను మొసళ్లు విషయములను ఉదకము నానారోగములనెడి కెరటములు మోహమను సుళ్ళు గలది. ఈ మహా భయంకర స్థితినుండి నన్ను పురుషోత్తమా! కాపాడుమని స్వామిమూర్తిని పద్మ పత్రాయ తేక్షణాది కల్యాణ లక్షణములు గలదానిని ధ్యానించి మ్రొక్కిన అతడు అశ్వమేధములు వేయి చేసిన పుణ్యమునందును.
సర్వతీర్థ స్నానదాన ఫలమును కృష్ణదర్శనము చేసి పొందును. ఇటనుండి యాబై ఒకటవ శ్లోకము దాక ఫలశ్రుతి సులభముగా అర్థమగును. ఇట్లు కృష్ణదర్శనము చేయునతడు పాపరహితుడయి ఐశ్వర్యవంతుడు గుణవంతుడునై కల్పశతము అఖిల భోగములను అనుభవించి గంధర్వ అప్సరసలు అనుగమింప విష్ణులోకమంది ఇటకు తిరిగివచ్చి విప్రుడై జనించి సర్వవేది సర్వజ్ఞుడునై స్వధర్మనిష్ఠుడై శాంతుడై సర్వభూతహితముం గోరుచు వైష్ణవ జ్ఞానంబడసి ముక్తినందును.
ఆమీద మంత్రపురస్సరముగా భక్తవత్సలను సుభద్రను అర్చించి నమస్తే సర్వగే అన్న యీమంత్రముచే నమస్కరించి కామగ విమానమున విష్ణుపురమేగి ప్రళయముదాక నటక్రీడించి బ్రాహ్మణుడై వేదవేత్తయే విష్ణుయోగమంది ముక్తినందును.
ఇతి ఆదిబ్రహ్మపురాణమున పంచతీర్థవిధివర్ణనమను ఏబదియేడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹