నృసింహ మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మ యిట్లనియె!
ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రను జూచి మ్రొక్కిన అతడు ధర్మాది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి ఇసుకలో దాగియున్న ఇంద్రనీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమున కేగును.
హిరణ్యకశిపుని సంహరించిన నరసింహమూర్తి సర్వదేవతామయము ఇచట దర్శించిన అతడు సర్వపాప విముక్తుడగును. నరసింహ భక్తులకు అసాధ్యము లేదు. సర్వాభీష్టములు లభించును. ఆయన సర్వపురుషార్థ ప్రదాత.
నరసింహమూర్తి ప్రభావమును విపులముగా వినదలతును. ఆయన యెట్లు ప్రసన్నుడగును. ఆయన వలన కలుగ సిద్దులేవి. దయచేసి తెల్పుము ఆన బ్రహ్మ యిట్లనియె.
మునులారా! ఆయన యజయ్యుడు ”ఊహకందడు. భుక్తి ముక్తి ప్రదుడు. ఆయన గుణసంపద తెలుప వశము గాదు. ఆయన అనుగ్రహముచే సర్వసిద్ధలు లభించును. ఆయన దయచే స్వర్గ మర్త్య పాతాళాదులందు నప్రతిహాతమైన గమనమేర్పడును. చరాచరముల యందు నరసింహ భక్తునకు అసాధ్యము లేదు. నరసింహా స్వామి ప్రసన్నుడగుటకు సురాసురులకు గూడ తెలియని ఆయన తత్వమును- ఉపాసనా కల్పమును చెప్పెదను. వినుండు.
నృసింహోపాసకుడు ఆకులు-దుంపలు-యవల- పండ్లు-పేలపిండి-ఒలము మాత్రముతో వర్తించుచు పట్టుగోచి పెట్టుకొని అరణ్యమునందు నదీ సంగమమునందు-ఊషర క్షేత్రమునందు సిధ్ద క్షేత్రమునందు స్వామిని ప్రతిష్ఠించి జితేంద్రియుడై సమాధి నిష్ఠుడై కల్పవిధానముచే పూజింపవలెను. శుక్ల వక్ష ద్వాదశినాడు ఉపవసించి నృసింహమంత్రము ఇరువది లక్షలు జపించపవలెను. దానిచే మహాపాతకముల నుండి ముక్తుడగును.
స్వామికి ప్రదక్షిణము ఆచరించి షోడశోపచార పూజలనొనరించి నమస్కారము చేయవలెను. పచ్చ కర్పూరము నలదు నద్దిన పూవులను శిరసునందుంచిన సిద్దిని బడయగలరు. అన్ని పనులు అప్రతిహముగ సఫలమగును. బ్రహ్మ రుద్రాదులేని ఆయన తేజస్సును నోర్వజాలరు. దానవ-సిద్ద-గంధర్వ-మానుషాదుల విషయము చెప్పనేల. ఆసురములైన మంత్రములు నాభిచారికములును నృసింహ మంత్రజపముచే ప్రళయము చెందును. నృసింహకవచము నొక్కసారి జపించిన సర్వోవద్రవములనుండి రక్షించును. రెండుసార్లు జపించిన దేవదానవ యక్ష భూత ప్రేత పిశాచాదుల బాధలు నశించును. మూడుసార్లు జపించిన పండ్రెండు యోజనముల మేరలో నురాసురలకు నభేద్యడగును.
ఇట్లా భగవంతుని పూజించి ఆ సాధకుడు నృసింహ బిల ద్వారమునకేగి మూడు రాత్రులు మోదుగ సమిధలచే అగ్నిని జ్వలింప జేసి త్రిమధు రసపూతములైన మోదుగ సమిధలను హోమము చేయవలెను. రెండువందల హోమములను వషట్కార పూర్వకముగా జేయవలెను. అంతట నరసింహ బిలద్వారము తెరుచుకొనును. నిశ్శంకముగా నృసింహకవచన్యాసము చేసికొని లోనికి ప్రవేశించిన సాధకునకు తమో మోహము కల్గును. వెంటనే సువిశాలమైన రాజమార్గము కనిపించును. ఆట తేనెతీటగల బాధ కనిపించదు. నృసింహుని స్మరించుచు నటనుండి సాధకుడు పాతాళము ప్రవేశించును.
ఆలోనికేగి నృసింహమంత్రజపము జేయగా వీణామేళనము జేయు వేలకొలది స్త్రీలెదురై స్వాగతమిచ్చి చేయి పట్టుకొని లోనికి ప్రవేశింప చేయుదురు. తరువాత నొక దివ్య రసాయన పానముచే దివ్యశరీరరియు బలశాలియు నగును. భూతప్రళయముదాక ఆ కన్యలతో క్రీడించి శరీరము బాసి వాసుదేవునియందు లీనమగును.
ఆ గుహయందు వసింప గోరనివాడటనుండి వెలికివచ్చి పట్టము శూలము ఖడ్గము రోచనము మణి రసము రసాయనము పాదుకాంజనము కృష్ణాజినము మనోహరమైన కమండలువు. అక్షమాల సంజీవని విద్యయును. శస్త్రములను జేకొని బ్వలించెడి విస్ఫులింగములచే నావరింపబడిన త్రిశిఖము నొక్కసారి హృదయమందు నానించినంతనే అనేక కోటిజన్మపాపములు దహింపబడును. ఆ త్రిశూలమును విషమునందుంచిన విషము విరిగిపోవును. శరీరమునకు తాకించిన కుష్ఠువ్యాధి పోవును. తన దేహమందు మోపిన బ్రూణహత్య మొదలైన పాపములు పోవును. తీవ్రమయిన బాధలు జ్వలించు నా త్రిశూలమును ధ్యనించినంతనే నశించును. బాలురకు కంఠమందుగట్టిన రక్ష యిచ్చును . అది గళరోగములను. గండపిండకలూతాదిరోగములను నశింపజేయును. ఆవునేతితో ఆవుపాలతో సమిధలతో ఒకనెల మూడుసంధ్యలయందును ఆ మంత్రజపముచే హోమము చేసిన యెడల అసాధ్య రోగములు కూడా నశించును. త్రిలోకములందేది కోరినను సిద్దించును. నృసింహుని పూజించిన యెడల కోరిక కెల్ల సిద్దించును.
నరసింహుని అష్ణోత్తర శతనామములతో పూజించి పుట్టమన్ను స్మశానమందలి మట్టి రాజవీధిని నాలుగు దారులుకలియు చోటనుండియు ఏడేసి మట్టి ఉండలు గ్రహించి రక్తచందనము కలిపి ఆవుపాలతో మెదిపి అరంగుళము నరసింహ ప్రతిమ తయారుజేసి భూర్జపత్రము నందు గోరోచనముతో మంత్రమును వ్రాసి నరసింహ స్వామి కంఠమునందు గట్టి మంత్రమును లెక్కలేకుండగ మడుగులో నిలిచి ఏడురోజులు పూజించి జపింవవలెను. అందువలన ముహూర్తమాత్రములో ఎల్లభూమియు జలసమృద్ధమగును. ఎండిన చెట్టు చివర నరసింహమూర్తిని పూజించి నూటయెనిమిది మార్లు ఆ మంత్రము జపించినయెడల వర్షమాగిపోవును. అట్లే నరసింహస్వామిని పిండిముద్దలో నుంచి గిరగిర త్రిప్పినయెడల వెంటనే పెనుగాలి వీచును. తరువాత ఏడుసార్లు జపించి మంత్రించిన జలముచే నాప్రతిమను అభిషేకించి దానిని తాను ధరింపవలెను.
దానిని యెవ్వని గృహద్వారమందు పాతిపెట్టునో వానివంశము నశించును. ఆ ప్రతిమను వెలికిదీయగా నా యుపద్రము శాంతించును. కావున సర్వాభీష్టముల నొసంగు నరసింహమూర్తిన భక్తితో బూజింపవలెను. దానిచే పాపముక్తుడై విష్ణులోకమందును. బ్రాహ్మణాది వర్ణములవారు ఆంత్యజులుకూడా నా స్వామిని పూజించి అమంగళములను తరింపగలరు. అంతియే కాదు దేవత్వ దేవేంద్రత్వములు యక్షవిద్యాధరగంధర్వాది దేవవిశేష భావములను రాజ్య స్వర్గసుఖములను దుర్లభమైన మోక్షమును గూడ బొందగలరు. నృసింహదర్శన మొకసారి చేసినను పాప విముక్తినంది యభీష్టమునొదగలరు. యుద్దమందు. సంకటములందు దొంగలు కిరాతులు మొదలైనవారి పీడచే దుర్గమమమైన అడవియందు ప్రాణసందేహము కల్గినపుడు విషాగ్ని జలోపద్రవములనుండియు రాజులవలన సముద్రము వలన గ్రహముల వలన కలుగు పీడనుండి తరించును. నృసింహస్వామిని స్మరించినంతనే రాజోపద్రవముల నుండి ముక్తుడగను. ఉదయమందు చీకటి విడిపోయినట్లు స్వామి దర్శనముచే సమస్త కష్టములు నశించును. ఘటిక కాటుక – పాదుక యను వానియందు రసాయన సిద్దిని పొందవచ్చును. ఎల్లకోరికలు ఫలించును.
స్వామిని పూజించి నమస్కరించి దర్శించి అశ్వమేధయాగముల ఫలమందును సద్గుణ సంపన్నడగునున. జరామరణములు లేనివాడయి, చిరుగంటలతో మెరయు మొరయు కామదమైన స్వర్గవిమానమెక్కి ఉదయసూర్యుని వలె దివ్యవర్చస్సుతో ముత్యాలహారములు మెరయు దివ్య స్త్రీ శతముతో గంధర్వగాన రమ్యమైన విమానమెక్కి ఇరువదియెక్క తరములవారి నుద్దరించుచు సాక్షాద్దేవతాస్వరూపముతో నమ్మోదముతో సుఖముతో అప్సరసలు స్తుతింప విష్ణులోకమునకేగును. అండు అనుపమ భోగముల అనుభవించి చతుర్భజముల దాల్చి మనోహరమైన రూపముతో భూతప్రళయము దాక నానంటించి యా పుణ్యము భుక్తమయిన తరువాత సుత్తమమయిన యోగుల కులమందు బుట్టి చతుర్వేద వేదాంగ పారగుడయి విష్ణుదేవతా భక్తియోగమునంది మోక్షమును బొందును.
ఇది బ్రహ్మపురాణమందు నృసింహనూహాత్మ్యవర్ణనమను ఏబది ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹