Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – యాబై తొమ్మిదవ అధ్యాయము

శ్వేతమాధవ మాహాత్మ్య వర్ణనము

బ్రహ్మయిట్లనియె.

అనంత వాసుదేవ మూర్తిని సేవించనవారు పాపముక్తులై పరమపదమందుదురు. ఈ స్వామిని నేనును నింద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు రాముడు సేవించిరి శ్వేత గంగ యందు స్నానముచేసి శ్వేతమాధవుని మత్య్సమూర్తియైన మాధవుని దర్శించినతడు శ్వేతద్వీపమునకేగును.

అటుపై మునులు శ్వేత మాధవుని మహాత్మ్యమును చెప్పుడు. శ్వేత మాథవుని విగ్రహమును ప్రతిష్టించిన వారెవరు?

కృతయుగమందు బుద్ధిమంతుడు ధర్మజ్ఞుడు శూరుడు సత్యనంధుడు వ్రతనిష్ఠుడునైన శ్వేతుడను రాజు యొక్క రాజ్యమందు మానవులు పదివేల సంవత్సరముల ఆయుర్దాయము గల్గియుండిరి. కొంతకాలమునకు కపాల గౌతముడను ఋషి పండ్లుకూడ రానిస్థితిలో మరణించిన తన కుమారు నెత్తుకొని రాజునొద్దకు గొని వచ్చెను. రాజు వానింజూచి ఆ శిశువును యమలోకమునుండి తిరిగి తీసికొని రానిచో ఏడు రోజులలో చితి ఎక్కెదనని ప్రతిజ్ఞచేసెను. అట్లుచేసి వేలకొలది. పద్మములతో మహాదేవుని పూజించి శివమంత్రములను జపించెను. అతని భక్తికిమెచ్చి మహేశ్వరుడు ఉమాదేవితో సాక్షాత్కరించెను. అంతియేకాదు. నీభక్తికి సంతుష్టుడనైతిని అని అనెను. శరత్కాల మందలి చంద్రబింబమట్లు మల్లె మొగ్గలవలె తెల్లగానున్న విభూతి దాల్చి శార్దూలచర్మము బూని, చంద్రశేఖరుడునై దర్శనమిచ్చిన ఫాలాక్షుని దర్శించి నమస్కార మొనరించి శ్వేతుండిట్లనియె. స్వామీ! నాయందు ప్రసన్నుడ వైతివేని, కాలవశుడైన ఈ బ్రాహ్మణ శిశువు బ్రతుకు గాక ! ఆకాల మృతుడైన ఈ బాలుని సంపూర్ణాయుష్మంతుని క్షేమవంతుని చేయుమని కోరెను.

శ్వేతుని ఆ పలుకులు విని శివుడానందము వడి కాలమును నియమించి సర్వభూత భయంకరమైన యముని శాసించి మృత్యుముఖ గ్రస్తుడైన నా బాలుని జీవింప జేసెను. మహాదేవుడు. గౌరితో మునికుమారుని నర్వ జగత్తును క్షేమ సంపన్నము ఒనర్చి అంతర్థానమయ్యెను. అన విని మునులు ఆ శ్వేత నృపతి వృత్తాంతమును సవిస్తరముగా తెల్పుమని ఆడుగ జగత్ర్పభువిట్లు పలికెను.

ఈ కథ సర్వజీవ హితకరము. మాధవుని మహాత్మ్యము సర్వపాప ప్రణాశనము. సర్వకామ ఫలప్రదము. నేను ఋషుల వలన వింటిని. భయదుఃఖములను హరించు నీ దివ్యకథను వినుడు. శ్వేతుడు వేలేండ్లు చక్కగ పాలించి లౌకిక వైదిక ధర్మవిచారణ చేసి దక్షిణ సముద్ర తీరమందలి క్షేత్రముల కేగి కృష్ణాష్టమినాడు సలక్షణమైన విష్ణు ప్రాసాదమును నిర్మించెను. ఆది నూరు ధనస్సుల పరిమాణము గలది. శ్వేతశైల మయమైన భగవన్మూర్తిని మాధవునిమూర్తి నందు స్వయముగా ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులకు తపస్వినులకు దీనులకు అనాధులకు ఆ మాధవుని సన్నిధిని దానములు ఒనరించి స్వామి ఎదుట పుడమిపై వ్రాలి ప్రణవపూర్వకమైన ద్వాదశాక్షర మంత్రమును జపించుచు ఒకమాసము మౌనవ్రతుడై నిరాహారుడై ఆ వ్విష్ణుపదమందు సమాధి నిస్ఠుడయ్యెను. జపాంతమందు దేవేశ్వరునిట్లు స్తుతించెను.

ప్రభో! నన్ను నరకమునుండి ఉద్ధరింపగల బంధువు నీకంటెలేడు. కాయిక మలము మానసిక మలము అను వానికంతము లేదు. వానిని క్షాళనము సేయ నీకంటె నెవ్వరులేరు. సర్వ సంగముల నెడలి నిన్ను జేరితిని. నీతో నెన్నడును నాకు సంగము గలుగుగాక. అది ఆత్మలాభము (స్వరూప దర్శనము) కొఱకు సమర్ధమగుగాక. ఈ సంసారము అపార కష్టభరితము . నేను తాపత్రయ పరితప్తుడను. నిన్ను శరణు జొచ్చితిని. దారేషణ పుత్రేషణలచే మాయా మోహితుడనై లొభాదిగుణములచే ఆకర్షితుడనై నిన్ను శరణందితిని. సాంసారిక సుఖమించుకైన లేదు. యజ్ఞేశ్వరా! మనసు నీవంక ప్రవర్తించి నిష్కామమైన ఆత్యంతికసుఖము (మోక్షము) బొందుదును గాక. వివేకశూన్యుడనై యున్నాను. జగత్తు వ్యక్తావ్యక్తము. ఓ గోవిందా! రక్షింపుము. సంసారమునుండి ఉద్ధరింపుము. మోహ రస మయము దుస్తరము ఐన భవాబ్ధిలో మునిగిన నన్ను ఉద్ధరింపగలవాడు ఓ పుండరీకాక్ష! నీ కంటె మఱి ఇంకొకరు కనబడడు.

ఇట్లు శ్వేతునిచే వినుతుడై ఆ పురుషోత్తమక్షేత్రమందు జగద్గురువు హరి సర్వ దేవతలతో సాక్షాత్కరించెను. ఆ మూర్తి నీలమేఘుడు. పద్మనేత్రుడు. తేజోమండలాంతర్గతుడు. ఆయన వామహస్తమున పాలవెల్లి చందమామవొలె పాంచజన్యమనుశంఖము వెలుగొందుచుండెను. గదా శారజ్గ ఖడ్గధరుడై గరుడధ్వజుడు వచ్చి రాజా! నీబుద్ధి స్వచ్ఛమైనది. భక్తిభరితమైనది. ఓ పుణ్యశాలి! ప్రసన్నుడనైతిని. అభీష్టవరమును గోరుమన శిరసువంచి తద్గతమనస్కుడై స్వామి పరమామృత వాక్యములను విని శ్వేతుడిట్లనియె. ప్రభో! నేనుభగవద్భక్తుడనేని బ్రహ్మ లోకము కంటెను మీదిది, విమలము, విరజము శుద్ధము సంసార సంగరహితము అవ్యయమునగు విష్ణుపదమును నీ అనుగ్రహమున నందగోరుచున్నాను అని విన్నవించెను.

భగవంతుడిట్లనియె. దేవ-ముని-సిద్ధ-యోగి గణముల కందని పరమ రమ్యమైన స్థానమునకు నీవు వెళ్ళగలవు. రాజ్యాసనము, రాజ్యామృతము, ఉపాసించి సర్వలోకములు దాటి నా లోకమునకు ఏగగలవు. నీకీర్తి త్రిలోక వ్యాప్త మగును. ఎల్లప్పుడు నా సాన్నిధ్యము కలుగును. ఇది శ్వేతగంగయని దేవదానవులు గానము చేయుదురు. ఈ శ్వేత గంగాజలమును కుశాగ్రము చేత స్పృశించినా భక్తులు సమాధి నిష్ఠులై స్వర్గమున కేగ గలరు. ఈ శ్వేతమాధవ విగ్రహము వెన్నెలకాంతి మించును. శంఖము గోక్షేరమువలె అచ్ఛమైనది. ఈ మూర్తి సదాఅఘ వినాశిని. తెల్ల తామర పూలవలె మెఱయు నేత్ర శోభగలది. ఈ ప్రతిమకు నమస్కరించి సర్వలోకములను దాటి నా లోకమందు అనేక మన్వంతరములు దేవ సుందరీ పరివృతుడై మధురముగా గానము చేయబడు కీర్తిగలవాడై సిద్ధ గంధర్వ సేవితుడై నా భక్తులతో నతడు విపుల భోగముల ననుభవించును. అటనుండి పుడమిపై బ్రాహ్మణుడై వేదవేదాంగవేత్తయై భోగియై, సమృద్ధుడై, శుచియై, అదృష్టవంతుడై, రూపవంతుడై పుత్రపౌత్రాదులతో సుఖించు పురుషోత్తమును మరలజేరి యా వటమూలమందు జేరి యీ సముద్రమందు హరిస్మరణ చేయుచు దేహమును వదిలి శాంతపదమందును.

ఇది బ్రహ్మపురాణమున శ్వేతమాధవమాహాత్మ్యము అను ఏబదితొమ్మిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment