సముద్ర స్నాన విధి వర్ణనము.
శ్వేత మాధవుని దర్శించి ప్రళయమందేకార్ణవమైన తరి మత్స్యావతారమెత్తిన మాధవుని దర్శింపవలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేదరక్షణము చేసిన మొదటి అవతారమెత్తిన విష్ణువును నమస్కరించి నరుడు దుఃఖ విముక్తుడగును. విష్ణులోకమును బడయును. మరల నీ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామినిచట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తము. యజ్ఞకర్తయు, విష్ణుభక్తుడును సత్యవ్రతుడునై హరి సన్నిధానమొంది మోక్షము పడయును. సర్వకామ ప్రదమయిన మత్స్య మాధవ మాహాత్మ్యమును వర్ణించితిని. అనవిని మునులు స్వామి! సముద్ర జలమార్జనము స్నానము దానము చేయుట యందువలన గల్గునశేషఫలము చెప్పుమని యడుగ బ్రహ్మ యిట్లనియె.
మునులారా ! వినుండు. భక్తి మనసునందుంచిన సముద్రజల మార్జనము మార్కండేయ హ్రదమందు ప్రాతః స్నానము ఉత్తమపుణ్యఫలమిచ్చును. చతుర్దశియందు పూర్ణిమకు స్నానముజేసిన యశ్వమేథ ఫలమందును.
మార్కండేయహ్రదము, కృష్ణవటము బలరాముడు మహోదధి ఇంద్రద్యుమ్న సరస్సునను వీనికి పంచతీర్థములని పేరు. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రము కలసి వచ్చిన పుణ్యకాలమున ఈ తీర్థసేవనము పరమశుభమని చెప్పబడినది. త్రికరణముల చేతను శుద్ధుడయి రాగద్వేషాదులను ద్వంద్వములను బాసి కల్పవృక్షమును బోలిన మర్రిచెట్టునకు స్నాన పూర్వకముగ ప్రదక్షిణము జేసి విష్ణువునకు కూడా ముమ్మార్లు వలగొనినవాడు సప్తజన్మ పాపములనుండి ముక్తుడయి కోరిన సద్గతి బడయును. ఆ వటవృక్షమునకు వటేశ్వరుడు కృష్ణుడు, పురాణపురుషుడు అను పేరులు మూడు కృతాది యుగములందు గీర్తింపబడినది. కృతయుగమునందు నీ వృక్షప్రమాణము ఒక యోజనము. త్రేతాయుగమునందు నాల్గవవంతు తగ్గినది. ద్వాపరమందు సగము యోజనము. కలిలో దానిలో సగము వైశాల్యమని చెప్పబడెను. ఎడమ పాదమున ప్రణవమును దక్షిణపాదమున నకారము వామ కటియందు మోకారము కుడివైపున నాకారము నాభియందు రాకారము యెడమ భుజమున ”య” కారమును కుడిభుజమున ణాకారము శిరస్సున ”య”కారమును న్యాసము చేయవలెను. క్రిందను మీదను హృదయమందును ఇరుప్రక్కలను పుష్ఠభాగమునను నారాయణుని ధ్యానించి నారాయణ కవచపారాయణము ప్రారంభించవలెను. గోవిందాది నామములతో తూర్పు మొదలుగా నలుదిక్కుల యందును విష్ణువు, మొదలుగాగల నామములతో ఆగ్నేయాది విదిక్కులయందు (మూలలందు)ను విష్ణువు రక్షించుగాకయని పలుకవలెను. వరాహమూర్తి భూతలమునందును త్రివిక్రముడు మీదను రక్షించుగాక అని పలికి నారాయణుడను నేనెయని యాత్మానుసంధానము చేయవలెను. (అద్వైతమును) అభేదమును సాధింవవలెను.
అటుపై ఈ క్రింది మంత్రమును జపింపవలెను. ఆమంతరభావమిది. మనుజులలో అగ్నివి నీవు. అనగా వైశ్వా నరాగ్నియను జఠరాగ్ని నీవె. కామోద్దీపనము చేయు వీర్యాధానము చేయువాడవు నీవె. సర్వభూతములకు ప్రధాన భూతము నీవు. సర్వజీవులకు ప్రభువు నీవు . అమృతములకు సరణివి. అనగా జన్మస్థానము. దేవతలకు మూలపురుషుడవు. నా పాపము హరింపుము. ఓ తీర్థరాజమా! నీకు నమస్కారము. ఆపైన స్నానము చేయవలెను. స్నానమవసరమూ లేదు. ఆతీర్థ జలములందు వైదిక మంత్రములతో నభిషేకము చేసి మార్జనము చేసుకొన్నను చాలు. మోకాళ్ళు నీళ్ళలో నిలిచి అఘమర్షణ ఋక్కులను మూడావృత్తులు జపించుచు స్నానము చేసిన అశ్వమేధయాగఫలము వచ్చును.
గట్టునకు వచ్చి మడి బట్టలను ధరించి ప్రాణాయామాచరణములను జేసి సంధ్యనుపాసించి సూర్యోపస్థనము జెప్పి పూలతో జలాంజలి యిచ్చి బాహువులు మీదికెత్తి సూర్యు నుద్దేశించి నూటయెనిమిది మార్లు జపించవలెను. నిలువబడి ఇంకను గల సౌరమంత్రములను జపించవలెను. సూర్యునుద్దేశించి ప్రదక్షిణము జేసి నమస్కరించి తూర్పుముఖమై బ్రహ్మయజ్ఞము దేవర్షి పితృతర్పణములను గోత్రములతో పితృదేవతలకును తర్పణము చేయవలెను. దేవతా తర్పణమయిన తరువాతనే పితృతర్పణమున కధికారి యగును. శ్రాద్ధకాలమందు హోమకాలమందు నొంటిచేతితో జేయవచ్చును. తర్పణము రెండుచేతులతో జేయవలెను.
తర్పణము చేయువాడు నీటిలో నిలబడి యొడ్డున తర్పణము చేసిన యెడలను, వొడ్డున కూర్చుండి నీటిలో తర్పణము చేసినను అది ఆయా దేవతలకు జెందదు. వృథాయగును. పితృతర్పణము నీటిలో జేయరాదు. కుపితుడై చేయరాదు. ఒంటిచేతితో చేయరాదు. గట్టుమీదికి వచ్చి శుచియైన చోట పితృతర్పణము చేయవలెను. ఉదకమందు పాత్రలయందు జేయరాదు. అట్లు చేసిన అది పితృదేవతలకు అందదు. భూమియందు జేసిన పితృతర్పణము అక్షయము అందుకొరకె నేను భూమినిచ్చితిని. జలము భూమిలో పుట్టినది. భూమియందు పారుచున్నది. భూమియందే లయమగుచున్నది. కావున పితృతర్పణమునకు భూమి ప్రధాన స్థానము. అగ్రములతో నున్న దర్భలను తూర్పు అగ్రములుగ పఱచి దేవతలకును, దక్షిణాగ్రములుగ పఱచి పితృదేవతలకును తర్పణము జేయవలెను.
ఇది బ్రహ్మపురాణమున సముద్రస్నానవిధి నిరూపణమను అరువదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹