ఉపాసన ఖండము మొదటి భాగము
పూజా నిరూపణం
ఆ తరువాత జరిగిన కథా వృత్తాంతాన్ని భృగువు సోమకాంత మహారాజు కిలా చెప్పసాగాడు అలా ధ్యాన నిమగ్నుడై ఉన్న చతుర్ముఖుడికి ఒక మహత్తరమైన దివ్యానుభూతి స్వప్నం రూపంలో కలిగింది తాను ఆ జలాల పైనున్న ఆకాశంలో పరిభ్రమిస్తూ ఒక పెద్ద వటవృక్షాన్ని చూశానని ఆ వివరాలను వ్యాసునితో ఇలా వర్ణించి చెప్పసాగాడు…
బ్రహ్మ స్వప్న వృత్తాంతం
నాయనా అప్పుడు సమస్త సృష్టి ప్రళయ జలాలతో నశించిపోగా ఈ వట వృక్షం ఒక్కటి మాత్రం ఎలా మిగిలి ఉన్నదా అన్న ఆశ్చర్యంతో పరికించి చూడగా ఆ వటవృక్షపు పత్రం మీద ఒక చిన్ని బాలుడిని చూశాను!
నాలుగు చేతులు కలిగి చెవులకు చక్కని కుండలాలను ధరించి ఎర్రని వస్త్రాలను కటి సూత్రాలతోనూ ఉండి ఏనుగు ముఖము మానవ శరీరము గల ఆ బాలకుడి శిరస్సున అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్య కిరీటము నుదుట చంద్రకళను ధరించిన ఆ బాలకుని మెడలో దివ్యమైన మణిహారాలు విరాజిల్లుతున్నాయి…
ఈ బాలకుడు , ఇప్పుడు వటపత్రం పైన ఎలా వచ్చాడా అని ఆశ్చర్య చకితుడనైనా నా శిరస్సు పైన ఆ బాల గజాననుడు తన తొండంతో నీటిని సంప్రోక్షించాడు అప్పుడు నేను పకాలున నవ్వాను ఆ బాలుడా తామరాకు పైనుండి లేచి నా ఒడిలో కూర్చొని మృదు మధురమైన గొంతుతో ఇలా అన్నాడు….
ఓ నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ నీవు వయస్సులో ఎంత పెద్దవాడవై ఉండి కూడా చిన్న వారి కన్నా కూడా చిన్నవాడిలా ప్రవర్తించి అహంకార బుద్ధితో విర్రవీగినందుకే నీకు అనేక విఘ్నములు దాపరించాయి చింత వ్యాకులడవై ఉన్న నీ సకల చింతలు తొలగేందుకు చింత వినాశకరమైన నా ఏకాక్షరి గణపతి మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను దాన్ని పురశ్చర విధానంలో పది లక్షలు జపించు…
అప్పుడు నీకు దర్శనాన్ని అనుగ్రహించి అద్భుతమైన సృష్టి రచన సామర్థ్యాన్ని ప్రసాదిస్తాను అంటూ స్వప్నంలోనే ఉపదేశం ఇచ్చి అంతర్దానం చెందాడు ఆ తరువాత స్వప్నంలోంచి మేల్కొని గజాననుని అనుగ్రహానికి కృతజ్ఞతతో ఆనంద అనుభూతిలో ఓలలాడాను ఆ తరువాత ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం ఒక్క కాలిపైన పద్మంలో నిలచి నిశ్చల బుద్ధితో జపం చేశాను…
ఇంద్రియాలను నిగ్రహించి ఆహారమును వర్ణించి నిశ్చలంగా వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సును ఆచరించాను ఆ తపో తీవ్రతకు నా నాలుగు ముఖాల నుండి మహా జ్వాలలు ఉత్పన్నమై సకల లోకాలను తల్లడిల్ల చేశాయి నా దృఢనిష్టకు భక్తికి సంతుష్టుడైన ఆ గజాననుడు నా ఎదుట అనుగ్రహ మూర్తియై సాక్షాత్కరించాడు ఆ దివ్య సుందర ప్రకాశమైన రూపం వర్ణించడం మాటలలో అలవి కానిది….
గజాననుని సాక్షాత్కారం
కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో విరాజమానుడై అగ్నిహోత్రునిలా ప్రజ్వరిల్లే కాంతితో ఒక తేజ పుంజములో నుండి ఆ దేవదేవుడు ఆవిర్భవించాడు ఒక చేత పరశువును మరో చేత ఎర్రటి కమలాన్ని ధరించి దివ్యపుష్పమాలలను మెడలో దాల్చి సౌందర్యానికి ఆటపట్టువా అన్న రూపంలో గజవదనంతో భక్తుల మనోభీష్టాలు అన్నింటిని నెరవేర్చే వరద మూర్తియై సకల మానవులు దేవ యక్షగంధర్వ సిద్ద సాధ్యుల యొక్క విజ్ఞాలను నివారించే ఆ దివ్యమూర్తి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చాడు…
అంతటి కాంతిని తట్టుకోలేక భయభ్రాంతుని అయ్యాను మూర్చిల్లిన నన్ను ఉపశమింపజేసి నాకు అభయానిస్తూ గజ వదనుడు ఇలా అన్నాడు ఓ చతురానన భయాన్ని వీడు నీకు స్వప్నంలో మంత్రోపదేశం చేసినది నీవు నిరతము నీ హృదయ కమలంలో ధ్యానిస్తున్నది నన్నే ఇక ఇప్పుడు నీకు నా సౌమ్య రూపాన్ని అనుగ్రహంగా దర్శనం ఇస్తున్నాను నీ మనోభీష్టమును కోరుకో నీ సకల వాంచితాలను అనుగ్రహిస్తాను అప్పుడు జరిగిన వృత్తాంతం అంతటినీ సోమకాంతునితో వివరిస్తూ భృగువు ఇలా కొనసాగించాడు…
ఓ రాజా ఆ విధంగా కృపాళువైన గజాననుని పరమానుగ్రహాన్ని పొందిన చతురాస్యుడు తన నాలుగు శిరస్సులను ఆ దివ్య చరణాలకు తాకిస్తూ హృదయం నిర్మలమనగా గజాననుని అనుగ్రహ వాక్యాలకు పరమానంద భరితుడై ఇలా వరం కోరుకున్నాడు ఆది అంతము లేనటువంటి వాడివి నిర్గుణుడవు విభజించబడని వాడవు అయిన ఓ కరుణాసిందో నీకు నా యందు అనుగ్రహం కలిగితే ఎన్నడూ నీ పాదపద్మాలయెడ విస్మతి కలుగని ఆచంచలమైన భక్తిని ప్రసాదించు…
నానా సృష్టి రచన శక్తిని నిర్మాణ సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు నాకు దయతో సకల విఘ్న బాధల నుండి విముక్తి కలిగించు ఇది మొదలు ఎప్పుడైనా నీ స్మరణతో ఆరంభించే నా యొక్క సకల కార్యములు సానుకూలమయ్యేటట్లు నిర్మలమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందేలా కర్తవ్యం నిష్టను అంత్యములో మోక్షాన్ని అనుగ్రహించు ఈ వాక్యాలను విన్న గజాననుడు తధాస్తు అంటూ అంతర్దానం చెందాడు మంత్రానుష్టానం సంపూర్తి అయిన సందర్భంగా ఆ దేవదేవుడైన గజాననునికి సకల శుభ లక్షణములతో అలరారే వారు అనేక విధాలైన రత్నాభరణములతో ప్రకాశిస్తున్న వారు ఆయన ఇద్దరు దివ్య కన్యకలను దక్షిణగా సమర్పించుకున్నాడు..
ఆ తరువాత కర్పూర మంగళ నీరాజనాన్ని ఇచ్చి గణేశుని సహస్రనామాలతోనూ అర్ర్చించి ప్రదక్షిణాదికాలను నమస్కారమును సమర్పించి అపరాధ క్షమాపణకై వేడుకున్నాడు అలా బ్రహ్మచే సమర్పించబడిన దక్షిణగా సిద్ధి బుద్ధి అనే కన్యకలను స్వీకరించి గజాననుడు అంతర్హితుడైనాడు ఆ దేవదేవుని అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ తిరిగి యధావిధిగా సృష్టిని కొనసాగించాడు!
ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని ”పూజ నిరూపణం” అనే పదిహేనవ అధ్యాయం. సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹