సముద్ర స్నాన మాహాత్మ్యం
బ్రహ్మ ఇట్లనియె.
ఇట్లు నారాయణుని యథావిధి పూజించి సముద్రునకు నమస్కరించవలెను. అపుడు ‘ప్రాణస్త్వం’ అను మంత్రమును జపింపవలెను. స్నానము చేసివచ్చి ఒడ్డున నారాయణుని పూజించి బలరాముని కృష్ణుని సుభద్రను సముద్రుని గూర్చి నమస్కారము సేసి అశ్వమేధ ఫలమును మానవుడు పొందును. అంతియే కాక సూర్యప్రభమైన విమానమెక్కి గంధర్వాప్సరసలు సేవింప ఇరువదియొక్క తరముల వారి ఉద్ధరించి విష్ణులోకమున కేగును. నూరు మన్వంతరములు విష్ణులోక భోగములను అనుభవించి ఈ భరతభూమి యందు శ్రీమంతుడై సర్వైశ్వర్య సంపన్నుడై వేదశాస్త్ర వేత్తయై వర్తించి వైష్ణవ యోగమున మోక్షమును బొందును. ఈ సముద్రమున పుణ్యకాలమందు అనగా గ్రహణ సంక్రాంతి అయన విఘవ యుగాది షడశీతి వ్యతీపాతముదినక్షయ ఆషాఢీ కార్తికీ వైశాఖీ పూర్ణిమల యందు స్నాన దానాదులు చేసి పితృతర్పణ పిండప్రదానాదులు చేసి అనంత పుణ్యనిధి యగును. పిండ ప్రదానము వలన ఆయువు, కీర్తి భుక్తి ముక్తి సిద్ధించును. ఈ వార్త నాస్తికులకు చెప్పరాదు. పుష్కర తీర్థములు తమ తమ చెప్పబడిన ఫలముల నీయగలవు. ఈ తీర్థరాజము సర్వతీర్థ ఫలప్రదము. సాగరుడు సర్వతీర్థ రాజు. సూర్యోదయమందు చీకటి విరిసినట్లు ఈ తీర్థరాజ సేవనమున పాపమెల్ల విరియును. స్నాన దాన తపో హోమాదు లిచట అక్షయ ఫలప్రదములు.
ఇది బ్రహ్మ పురాణమున సముద్రస్నాన మాహాత్మ్య వర్ణనమను అఱువది రెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹