Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – అరవై మూడవ భాగము

పంచతీర్థ మాహాత్మ్యం బ్రహ్మ ఇట్లనియె.

సముద్ర స్నానానంతరము యజ్ఞ పురుషుని శరీరమందావిర్భవించిన తీర్థము ఇంద్రద్యుమ్న సరస్సును సేవింపవలెను. ఆ తీర్థసేవనమందు ”అశ్వమేధాంగ సంభూత”అను మంత్రము నుచ్చరించవలెను. ఇట దేవర్షి పితృతర్పణము జేసి దశాశ్వమేధ యాగఫలమొందవచ్చును. వెనుక ఏడు తరముల రాగల ఏడు తరముల వారిని నీ పుణ్యమాచరించునాతడు ఉద్ధరింపగలడు. కామగ విమానమున విష్ణులోకమునకు ఏగగలడు. ఏకాదశి ఉపవాసముండి పంచతీర్థములను సేవించి జ్యేష్ఠశుద్ధ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించునాతడు పునరావృత్తిరహిత పుణ్యస్థానమందును.

మునులిట్లనిరి.

మాఘాది మాసములను వదలి జ్యేష్ఠమాసమునే ప్రశంసించితివేలయని మునులడుగ బ్రహ్మయిట్లనియె. జ్యేష్ఠ శుక్ల దశమిమొదలు ఏడురోజులు సర్వతీర్థములు పురుషోత్తమ క్షేత్రమందుండును . కావున ఏ కొంచెము పుణ్యమేని ఇచట అక్షయమగును.

జ్యేష్ఠ శుక్లపక్ష దశమి పది రకముల పాపములను హరించును. కనుక దశహర యనబడును. ఆనాడు బలరామకృష్ణ సుభద్రల దర్శనము విష్ణులోకప్రదము. పాల్గుణ పూర్ణిమనాడు ఇక్కడ ఉన్న గోవిందుని ఆ డోలోత్సవమును జూచునతడు గోవిందపురమేగును. విషువత్తులందు పంచతీర్థసేవనమొనరించి ఆ మూడుమూర్తులను సేవించునతడు సర్వయజ్ఞఫలభాజనుడు అగును. విష్ణులోక గమనము చేయును. వైశాఖ కృష్ణతృతీయతిధియందు కృష్ణునకు చందనోత్సవము జరుగును. అదిచూచునతడు. విష్ణులోకమందును. జ్యేష్ఠా నక్షత్రముతో ఉన్న జ్యేష్ఠపూర్ణిమ నాడు పురుషోత్తమ దర్శనము చేసిన అతడు ఇరువది యొక్క తరముల నుద్ధరించి విష్ణుపదమందును.

ఇది బ్రహ్మపురాణమున పంచతీర్థ మాహాత్మ్యమను అరువది మూడవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment