Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై రెండవ అధ్యాయము

ఉపాసనా ఖండము

మొదటి భాగము

భల్లాల వినాయక కథనం

తన పూర్వీకుడైన దక్షుని చరితనంతటినీ విశ్వామిత్రమహర్షి చెప్పగా విన్న భీమమహారాజు యిలా అన్నాడు.

“ఓ మహర్షిసత్తమా! మీయొక్క అపారమైన కృపా విశేషంచేత మా పూర్వీకుడైన దక్షుని చరితాన్ని వినగలిగాను! ఐనా, నన్నొక సందేహం పట్టి పీడిస్తున్నది. పుట్టుకతోనే మూక, బధిర, అంధత్వాలను సంతరించుకొని శరీరమంతా రోగాలతో దోషభూయిష్టుడై జన్మించిన ఆ దక్షుడు ఏ పూర్వపుణ్యం వలన ఆరోగ్యవంతుడైనాడు?

ఆ మహర్షి శరీరం పైనుండి వీచిన వాయుస్పర్శ ఏవిధంగా అతడిని ఆరోగ్యవంతుడినిగా చేసింది? ఎన్నో సంవత్సరాలు గాఢతపస్సు చేసినా ముద్గలునికి ఎందుకని సాక్షాత్క రించలేదు? ఎట్టి శ్రమాలేక సులభంగా వల్లభ పుత్రునికి ఎలా ఆ దివ్య సాక్షాత్కారం లభించింది? ఇంతకీ పూర్వజన్మములో ఆతని పుట్టుపూర్వోత్త రాలేమిటి?

ఈ నా సంశయ సమూహాన్నంతనీ తాము విచ్ఛేదన సలుపవలసింది. తాము సర్వజ్ఞులు, మూర్తీభవించిన అనుగ్రహంలా ఉన్న తమరే నాకీ గణేశ కధామృతాన్ని పానం చేయించవలసింది. ఈ కధను ఎంత వింటున్నా నాకు తనివితీరటంలేదు!” వినయంగా ఆ రాజు వేసిన ప్రశ్నకు విశ్వామిత్రుడు అమిత ప్రసన్నుడై యిలా బదులిచ్చాడు.

”ఓ రాజా! సంశయాల నివృత్తికై నీవడిగిన ప్రశ్న ఎంతైనా తగి యున్నది. ఆ వృత్తాంతాన్నంతా నీకు చెబుతాను సావధాన మనస్కుడవై ఆలకించు!”

విశ్వామిత్రుడు రాజుకు ఇతిహాసమును వివరించుట

ఓ భీమరాజా! పూర్వం సింధుదేశంలో ప్రసిద్ధిచెందిన ‘వల్లీ’ అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో ”కళ్యాణసంజ్ఞకుడు” అనే పేరుగల ధనికుడైన వైశ్యుడుండేవాడు. వితరణతో అడిగినవారందరికీ లేదనకుండా దానధర్మాలు చేసేవాడు. దేవబ్రాహ్మణభక్తిలో సాటిలేనివాడు. ఆతనికి ఇందుమతి అన్న పేరుగల సౌందర్యవతియు, మహాపతివ్రతయూయైన భార్య ఉండేది.

ఆ దంపతులకు గుణవంతుడూ, రూపవంతుడూ ఐన కుమారుడు జన్మించాడు. యధోచిత సంస్కారములు నిర్వర్తించి, పుత్రుని జనన కాలంలో బ్రాహ్మణుల సంప్రీతికై గోవులను,రత్నమాణిక్యాలనూ, అనేక దివ్యవస్త్రాలను దానమిచ్చాడు.జ్యోతిష్కులను సంప్రదించి ఆ పిల్లవానికి భల్లాలుడన్న నామకరణం చేసాడు.ఆ పిల్లవాడు కూడా శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై ఎదగసాగాడు. బాల్యంనుంచే భగవద్భక్తి అతనికి సహజంగా అలవడింది. పూర్వపుణ్య విశేషంచేత గజాననునిపట్ల అతనికి గాఢ అనురక్తి ఉండేది.

ఇలా ఉండగా ఆ భల్లాలుడు తన తోటి బాలకులతో కలసి ఒకనాడు అడవికెళ్ళాడు. అనేకరకాలైన ఆటలాడి, స్నానంచేసి ఒక నునుపైన రాతిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్టచేసి శ్రద్ధగా దూర్వాంకురాలతోనూ, పువ్వులతోనూ ఆ గణేశుని మూర్తిని భక్తితో పూజించారు. ఆతని మిత్రులలో కొందరు ధ్యానమగ్నులై గణేశ నామాన్ని జపిస్తూంటే, మరికొందరు ఆనందంతో నాట్యంచేశారు. మరికొందరు మృదుమధురంగా గానం చేశారు. కొందరు కఱ్ఱలతోనూ, మామిడిచిగుళ్ళ తోరణాలతోనూ ఆ మూర్తికి ఒక చక్కని మంటపాన్ని ఏర్పాటుచేశారు. ఇలా ఆ బాలకులంతా చక్కని ప్రాకారాన్నీ, దేవునికి మంటపాన్నీ, ఆలయాన్నీ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్మించారు. ఫలపుష్పాదులను నైవేద్యంగా సమర్పించి ధూపదీపాలతో ఆమూర్తిని ఆరాధించారు! కొందరు పండితుల వేషంలో వేదపురాణాలను ఉపదేశించి తన్మయులయ్యారు!

ఇలా భగవంతునిపై గల భక్తిలో ఆ పిల్లలు అన్నపానాలను సైతం మరిచారు. ఇలా కొన్నిరోజులు గడిచినాయి. ఇలా ఉండగా, ఆ పిల్లల తలిదండ్రులు ఒకనాడు ఆ కళ్యాణ వైశ్యునివద్దకు వచ్చి ఎంతో రోష పూరిత వచనాలతో”మీ భల్లాలుని నివారించు! తనతోపాటు మా పిల్లల్నీ ‘భక్తి-రక్తి’ అంటూ పాడుచేస్తున్నాడు.

అడవుల్లో తిరుగుతూ, వేళకు అన్నపానాదులు కూడా తీసుకోక మా పిల్లలు కృశించిపోయారు. సరిగ్గా వేళకు భోజనానికి కూడా యిళ్ళకు రావటంలేదు! కనుక నీవే నీకుమారునికి బుద్ధి గరపి అలా తీసుకెళ్ళకుండా నివారించుము! అలాకాకుంటే మేమే వాణ్ణి కట్టివేసి చావమోదుతాం! లేదా రాజుగారికి ఫిర్యాదుచేసి మిమ్మల్ని ఈ గ్రామానుంచే వెళ్ళ గొట్టిస్తాము!” అంటూ నిష్ఠూరమాడారు! ఇలా ఆ గ్రామస్థులాడిన తీవ్రమైన పరుషమైన వచనాలకు బాధతో, రోషావేశ పూరితుడైన కళ్యాణ సంజ్ఞకుడు వడివడిగా తన కుమారుడు అతని స్నేహితులు గణేశుని పూజిస్తున్న అడవిలోకి వెళ్ళాడు.

ఒక పెద్ద కఱ్ఱను పెరికి ఆ కఱ్ఱతో బాలురు నిర్మించిన మందిరాన్ని ప్రాకారాన్ని భగ్నంచేశాడు. భయంతో ఆ బాలకులు నలుదిక్కులకీ పరుగుతీశారు. ఆ సమయంలో భల్లాలుడు మాత్రం చెక్కుచెదరక స్థిరంగా కూర్చున్నాడు. తోటి గ్రామస్థుల నిందాలాపనచే అప్పటికే క్రోధోన్మత్తుడైన ఆతని తండ్రియైన కళ్యాణవైశ్యుడు మాత్రం క్రోధంతో వివశుడై అతని చేతిని గట్టిగా పట్టుకుని నెత్తురు కారేలా కఱ్ఱతో చావమోదాడు. అతని క్రోధాగ్ని అంతటితో చల్లారక ఆ బాలునిచే పూజింపబడుతోన్న సింధూరవర్ణంలో ఉన్న గజాననుని విగ్రహాన్నికూడా పెకలించి పారవైచాడు.

పాలుగారే ఆతని లేతశరీరం ఆ రక్తపురంగులో మోదుగపువ్వు వర్ణంతో ఎఱ్ఱగా మారిపోగా తన కుమారుణ్ణి చెట్టుకి లతలతోనూ, తాళ్ళతోనూ నిర్దాక్షిణ్యంగా కట్టేసి “ఓరీ! నిన్నిప్పుడు నీ దేముడే రక్షించాలి! అతడే నీకన్నం పెట్టి నీ ఆకలి తీర్చాల్సింది! చూద్దాం ఏంచేస్తాడో? ఒకవేళ పొరబాటున ఇంటికి వచ్చావా… చచ్చావే అనుకో!” అంటూ రోషావేశంతో ఆలయాన్ని, విగ్రహాన్ని భగ్నంచేసి ఇంటికి పెద్దపెద్ద అంగలతో వెళ్ళి పోయాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment