ద్వాదశ యాత్రా మాహాత్మ్యము
మునులు అడుగ బ్రహ్మయిట్లనియె. ఉత్థాన ఏకాదశియందు,ఫాల్గుణ పూర్ణిమనాడు,విషువ పుణ్యకాలమందు,గుడివా యాత్ర దర్శనము చేసిన వాడు, పదునల్గురింద్రుల పరిపాలన కాలము వరకు విష్ణులోకము నందుండును. పురుషోత్తమ క్షేత్రమునకు జ్యేష్ఠమందు యాత్రచేసినవాడు కల్పాంతము వరకు విష్ణులోకమందు సుఖించును. విధానమున లోభత్వము డాంబికము లేకుండా భగవత్ప్రతిష్ఠ చేసిపూజించిన యతడు వైకుంఠభోగముల ననుభవించిమోక్షమునందును.
భగవత్ప్రతిష్ఠా విధానము, అర్చనము, దానము మొదలైన వాని ఫలము మునులడుగ బ్రహ్మయిట్లనియె.
జ్యేష్టశుక్ల ఏకాదశినాడు ఇంద్రద్యుమ్న సరస్సునందు యథావిధిగా స్నానమాచరించి దేవర్షి పితృతర్పణము లొనరించి మడివస్త్రములను ధరించి సూర్యాభిముఖుడై వేదమాత గాయత్రిని అష్టోత్తర శతము (108) జపించి సౌరమంత్ర పారాయణము జేసి ముమ్మార్లు ప్రదక్షిణము జేసి త్రివర్ణముల వారు వేదోక్త విధానమున సూర్య నమస్కారములను చేయవలెను. స్త్రీ శూద్రులు స్నానాదులందు జపములందు వేదోక్తముగాక పురాణొక్త విధానము ననుసరింపవలెను.
అటుమీద గృహమునకేగి మౌనమూని పురుషోత్తముని ధ్యాన ఆవాహనాది విధానమున పూజింపవలెను. అదేవుని ఆవునేతితో పాలతో అభిషేకింపవలెను. పంచామృత స్నానము కూడ చేయింపవలెను. చందనోదకముతో స్నానమాడింపవలెను. ఆ మీద వస్త్రయుగ్మ సమర్పణ చేయవలెను. చందనాగరు కర్పూర కుంకుమములు పూయవలెను. విష్ణు ప్రియములైన తామర మల్లియలతో జగన్నాథుని పూజింపవలెను. ధూపమీయవలెను. అవునేతితోగాని నువ్వుల నూనెతోగాని పండ్రెండు దీపములను పెట్టవలెను. పాయసము చక్కెలములు లడ్డూ వటకము బెల్లపుపాకము నివేదింపవలెను. మధుర ఫలములను గూడ నివేదింపవలెను, పంచోపచారములచే నిట్లు పూజించి ”నమఃపురుషోత్తమాయ” అను మంత్రము 108 మార్లు జపింపవలెను. అటుపై నాదేవుని నమస్తే సర్వలోకేశ (29శ్లో)అని ప్రారంభించి స్తుతించి యీ పండ్రెండు యాత్రలు నీయనుగ్రహమున సంపూర్ణ ఫలవంతములగుగాక యని ఆ దేవుని అనుగ్రహింప జేసుకొని దండవత్ప్రణామము గావింపవలెను. పుష్ప వస్త్ర గంధాదులచే సటుపై గురువుని పూజింపవలెను. గురువునకును దేవునకును భేదములేదు. ఆ మీదట పుష్పమండప నిర్మాణము జేసి వేదాది విద్యలను స్వామికి అవధరింపజేసి ఆ రాత్రి జాగరణ చేయవలెను. అందు వాసుదేవ కథా ప్రసంగము. సంకీర్తనము చేయవలెను. చేయింపవలెను. ధ్యానించుచు పఠించుచు శ్రీహరిని స్తుతించుచు నమస్కరించుచు ఆ రేయి గడుపవలెను. ద్వాదశియందు ప్రభాతమున పండ్రెండుగురు వ్రతస్నాతులు వేదపారగులు ఇతిహాస పురాణజ్ఞులు జితేంద్రియులు అయిన బ్రాహ్మణులను ఆహ్వానింపవలెను. తాను యథావిధి స్నానముజేసి పురుషోత్తముని పూజింపవలెను. బ్రాహ్మణులను బూజించి గొ, స్వర్ణ, ఛత్ర, పాదుకాదులను వస్త్రాభరణములను నొసంగి బూజింపవలెను. ఆచార్యునకు కూడా పైన చెప్పిన ద్రవ్యములనొసంగి అందరికిని మృష్టాన్న భోజనము పెట్టవలెను. ఆ బ్రాహ్మణులకు మోదకములతో గూడా పండ్రెండు ఉదక కుంభ దానములను సదక్షిణముగ చేయవలెను. జ్ఞాన ప్రదుడైన గురువును బ్రాహ్మణులను విష్ణుతుల్యులుగా భక్తితో భావించి యిట్లు పూజింప వలెను. అటుపై వారికి నమస్కరించుచు ఈ క్రింది శ్లోకరూపమయిన మంత్రమును పఠింపవలెను. ఆ శ్లోక భావమిది. ”అంతటను నిండియున్నవాడు. ఆదిమధ్యాంతములు లేనివాడు శంఖచక్ర గదాధరుడు జగన్నాధుడు నగు పురుషోత్తమదేవుడు సంప్రీతుడగుగాక. అని యిట్లుపలికి విప్రులకు నమస్కరించి ఆచార్యునితోబాటు వారికి శిరసు వంచి నమస్కరించి వారిని తనయింటి సరిహద్దుల వరకు సాగనంపి నమస్కరించి వచ్చి బంధుజనముతో వాజ్నియమము వహించి భగవత్ప్రసాదమును ఆరగింపవలెను. ఉపాసకులకు దీనులకు భిక్షుకులకు అన్నాతురులకు గూడ భోజనము పెట్టవలెను. ఇట్లుచేసిన పురుషుడేని స్త్రీ యేని అశ్వమేధ రాజసూయ శతసహస్ర పుణ్యము బొందును. నూరు తరములు వెనుకవారిని ముందువారిని తరింపజేసి దివ్యరూపధారియై సూర్యునట్లు వెలుగు కామగమగు విమానమున గంధర్వ అప్సరోబృందము స్తుతింప తన పుణ్య విశేషముచే దశదిశలను వెలిగించుచు ఆతడు హరిపురమేగును. నూరు కల్పములు వైకుంఠ భోగములను అనుభవించి సర్వస్తుతి పాత్రమై జగన్నాధ స్వామి సారూప్యమంది సర్వభోగములను అనుభవించి బ్రహ్మలోక మేగును. అచట తొంబది కల్పములు సుఖించి రుద్రలోకమున కేనును. అచట ఎనుబది కల్పములు సుఖమనుభవించి గోలోకమునకేగును. డెబ్బది కల్పములచట నుండును. అటనుండు ప్రజాపతి లోకమేగి అఱువది కల్పములు నానా భోగములననుభవించును. అటనుండి ఇంద్ర భవనమున కేతెంచి యేబది కల్పములు సుఖించి నలుబది కల్పములు సురలోకమున సుఖమనుభవించి నక్షత్రలోకమునకేగి ముప్పది కల్పములుండి చంద్రలోకమున ఇరువది కల్పములుండి ఆదిత్యలోకమున కేగి పది కల్పములు సుఖించి గంధర్వ భువనమున ఒక కల్పము భోగించి భూమికేతెంచి ధర్మపరుడైన చక్రవర్తి యగును. ఇచట రాజ్యమును ధర్మముగ పాలించి సంపూర్ణ దక్షిణములగు యజ్ఞములాచరించి యోగిగమ్యమగు మోక్షప్రదమయిన శివలోక మందును. అందు భూతప్రళయము దాకా సర్వభోగములను అనుభవించి మరల నిటకువచ్చి యోగుల కులమందు విష్ణుభక్తుడైన విప్రులవంశమందు ఙనించి చతుర్వేదాధ్యాయిమై సుదక్షిణములై యజ్ఞములను జేసి విష్ణుభక్తి యోగమునూని మోక్షమందును.
భుక్తిముక్తులనొసంగు గుడివాయాత్రాఫలము మీకు చక్కగ వినిపించితిని. ఓ విప్రులార! మరి యేమి వినదలతురు?
ఇది బ్రహ్మపురాణమునందు ద్వాదశయాత్రా ఫల మాహాత్మ్యము అను అఱువది ఏడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹