Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – అరవై ఎనిమిదవ భాగము

విష్ణులోకవర్ణనము

మునులు ఇట్లనిరి.

విష్ణులోక ప్రమాణము అచటి భోగములు కాంతి బలము తెల్పుము. ఏ ధర్మాచరణము వలన విష్ణులోకము లభించునో తెల్పుమన బ్రహ్మయిట్లనియె.

విష్ణులోకము సంసార నాశకము. సర్వాశ్చర్య స్థానము. అశోకాది సర్వవృక్ష సంకులము. కల్పవృక్షస్థానము. సర్వర్తు పుష్ప ఫలసుందరము. పద్మములు కలువలు నానావిధ జలపక్షులు గల దిగుడు బావులు, సరస్సులు నందు గలవు. కామగములైన బంగారు విమానములపై వేల్పులు విహరింతురు. అవి వాయువుకంటె మనస్సు కంటె మించిన వేగము గలవి. పరమ సుందరులైన దేవతాస్త్రీలు అటకేగిన పుణ్యాత్ములను చుట్టుకొని వారు ఛత్ర చామరములు పట్టి సంగీత నృత్యాదులచే నానందింప చేయుదురు.

దక్షిణ సముద్ర తీరమున పెద్దమఱ్ఱిచెట్టు దగ్గరగల కృష్ణభగవానుడు అప్సరసలతో దర్శన మిచ్చును. కృష్ణ సారూప్యము నందిన కృష్ణ భక్త బృందము విష్ణుపురమునందు దర్శన మిత్తురు.

మేలిమి బంగారము రంగుగల్గి అనేక రత్నభూషితమై బహుపతాక సమలంకృతమై బంగారు ప్రాకారమున చుట్టుకొని యోజన విస్తారమైన హరిమందిరమా విష్ణుపుర మధ్యమందు భాసిల్లుచుండును. చుక్కల నడుమనున్న శరశ్చంద్రునివలె అది ప్రకాశించు చుండును. కంచు కధారులైన ద్వారపాలకులు ఆ పురమునకు గల నాలుగు ద్వారములకు రక్ష యిచ్చుచుందురు. ఆలోపల స్వర్ణమయము. మరకత మణిమయము ఇంద్రనీలము మహానీలము పద్మరాగ మణిమయము వజ్రమయము వైఢూర్యమయమునైన ఏడు పురములు వైకుంఠలోకములోనున్నవి. అందలి స్తంభములు రత్నమయములు. పవడపు కర్రతో తయారు చేసినవి. అచట మహాసిద్ధులు తమతేజస్సుచేత దశదిశలను వెల్గింతురు. వారి నడుమ నక్షత్రములు నడుమనున్న పున్నమి చంద్రుని వలె మేఘశ్యాముడు పీతాంబరధారి శ్రీవత్సాంకితుడు నైన శ్రీహరి శ్రీదేవితో ప్రకాశించుచుండును. ఆయన కుడిచేతిలో సుదర్శన చక్రము ఎడమచేత యచ్చము తెల్లనైన శంఖము విలసిల్లు చుండును. ఆ శంఖము వేయిసుడులు గలది. పాంచజన్యమను పేరుగలది. ఆశంఖనాథమున సకల జనము సంక్షోభించును. ఆయన యొక్క కుడిచేతిలోని దైత్య దానవ నాశకము జ్వలదగ్ని ప్రకాశము. సర్వపాప వినాశకమునైన కౌమోదకియను గద రాణించుచుండును. ఎడమ చేత సూర్యునట్లు వెల్గు శారంగధనువు అగ్నిజ్వాలలను చిమ్ము బాణములును దీపించుచుండును. ఆస్వామి సర్వలోక సృష్టిస్థితి సంహారకుడు సర్వశాస్త్ర నిపుణుడు. సర్వజగద్గురువు. సహస్రశీర్షుడు. సహస్రపాదుడు. ఆప్రభువు సింహాసన మందు ఆసీనుడై యుండును. ఆయన కనులు తామరరేకులు. ఆయన మేని తళుకు మెఱపుతీగ సొంపుగులుకుచుండును. సురసిద్ధ గంధర్వాదులతో మునులతో సుపర్ణులతో మరిగల సురాసుర ప్రభువు లందరితో పేరోలగముండి వారుచేయు స్తుతుల నవధరించు చుండును. అచట కీర్తి మొదలుకొని మాయ వఱకు గల ఆయాశక్త్యధిష్ఠాన దేవతలు ఆయన భవనమున కొలువు చేయుచుందురు. ఘృతాచి మొదలు నవగర్భ వరకు గల అప్సరసలు రూపవన శాలినులు స్వామి పేరోలగమునందు నాడుచు పాడుచు హరిని సేవించుచుందురు. అటగలవారికి రోగము నీరసము మృత్యువు యెండ చలి ఆకలి దప్పిక దుఃఖము విరూపము కలుగవు. విష్ణుభువనము పరమానంద జనకము. సర్వాభీష్ట ప్రదము. పుణ్యులు పొందు ఉత్తమలోకములన్నియు విష్ణులోకముయొక్క పదునారవ కళకు కూడ సరితూగవు. ఇట్టి పుణ్యలోకమునకు నాస్తికులు విషయలంపటులు కృతఘ్నులు పిసినారులు దొంగలు ఆజితేంద్రియులు చేరలే. విష్ణుభక్తులై దక్షిణసముద్ర తీరమందలి క్షేత్రమును సేవించి సుభద్రా రామకృష్ణుల నర్చించిన ధన్యులే పొందగలరు. పురుషోత్తమ క్షేత్రమందు కల్ప వటవృక్ష సముద్ర మధ్యమందు మరణించినవారు ఈ పరమోత్తమ స్థానమున కేగుదురు. సనాతనము సర్వానందకరము. భుక్తిముక్తి ప్రదమునైన హరిలోకమును గురించి మీకు తెలిపితిని.

ఇది బ్రహ్మ పురాణమునందు విష్ణులోకవర్ణనమను నఱువదెనిమిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment