Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – డెబ్బయవ భాగము

అనంత వాసుదేవ మాహాత్య్యము

ఋషులిట్లనిరి

భగవంతుని కథను ఎంత విన్నను మాకు తృప్తికలుగటలేదు. అనంతవాసుదేవుని మహిమను తాము వర్ణించినారు. కాని అందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మయిట్లనియె.

మునిశ్రేష్ఠులారా ! పరమ సారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోకవాసులకు అందనిది. ఆదికల్పమందు అవ్యక్తజన్యుండనగు నేను విశ్వకర్మను పిలిచి యిట్లంటిని. ఆతడు దేవశిల్పి శ్రేష్ఠుడు విశ్వకర్మలందరికి అగ్రేస్వరుడయిన పనివాడు. వాసుదేవుని ప్రతిమను శిలామయమైన దానిని చేయుము. దానిని దర్శించి ఇంద్రాది దేవతలు మనుష్యాది భూలోకవాసులు దానవుల వలన రాక్షసుల వలన కలుగు భయము తొలగి స్వర్గముంబొంది సుమేరు శిఖర మందెల్ల కాలము ఆ వాసుదేవునారాధించి ఏ అడ్డును లేక నివశింపగలరు.

ఇట్లని తెలుప విని విశ్వకర్మ ఆ క్షణము ఆ యొక్క ప్రతిమను తయారుచేసెను. శంఖచక్ర గదలంగొని శ్రీవత్సచిహ్నము వనమాలయును దాల్చి తెల్లతామర పూవులట్టి నేత్రములు గల్గి కిరీటము భుజకీర్తులు ధరించి పీతాంబరము కట్టుకొని మణికుండలము మెఱయ శోభించు అందమగు విగ్రహమది నిర్మింజేసి రహస్య మంత్రములచే నేనే ఒక పుణ్యలగ్నమందు ప్రతిష్ఠ చేసితిని. ఆ సుముహూర్తమునకు దేవరాజు వేల్పులం గూడి ఐరావతమెక్కి బ్రహ్మసదనమున కేగి స్నానదానాదులొనరించి ఆ విగ్రహమును మఱి మఱి పూజించి తననగరమునకు తిరిగి వచ్చెచు. అచట ఆ విగ్రహము నర్చించి త్రికరణములను నియమించు కొని వృత్రుడు సముచియ మొదలుగాగల అసురులంజంపి ముల్లోకముల నేలెను.

రెండవ త్రేతాయుగము రాగా మహావీరుడు రావణుడు పుట్టెను. పదివేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై అసాధ్యమైన ఉగ్రతపముల జేసెను. దాన నేను సంతుష్టుడనై దేవతలకు దైత్యులకు నాగులకు రాక్షసులకును నీవు అవధ్యుడగుదువని వరమిచ్చితిని. యమ కింకరులకుకూడ వాడవధ్యుడయ్యె. వానికొడుకు మేఘనాదుడనువాడు ఇంద్రుని గెలిచి ఇంద్రజిత్ అను పేరొంది ఇంద్రుని గెల్చి స్వర్గరాజ్యము వడసె. రావణుడు అమరావతిని స్వాధీనము చేసుకొని ఇంద్రగృహ మందు వాసుదేవ మూర్తిని ఇంతకు మున్ను వర్ణించిన విధంగా దర్శించెను. అంతట నట గెల్చుకొన్న రత్నములను (శ్రేష్ఠములగు సామగ్రిని) వదలివేసి ఆ వాసుదేవ విగ్రహ మును విమానముమీద లంకకు గొని తెచ్చెను.

అప్పుడు మంత్రియు నగరాధ్యక్షుడు అయియున్న విఖీషణుడు ధర్మమూర్తి గావునను నారాయణ భక్తిపరాయణుడయినందున ఇంద్రభవనమునుండి దిగివచ్చిన ఆ విష్ణుమూర్తి విగ్రహముంగని మేను పులకరించి అచ్చెరువంది తలవంచి నమస్కరించి సంతుష్టాంతరంగుడై ఇప్పుడు నా జన్మము ధన్యమయ్యె. ఇప్పుడు నాతపస్సు ఫలించినది. అని మఱిమఱి సాలి మ్రొక్కి పెద్దన్నయగు రావణుని కడకేగి దోసిలొగ్గి ప్రభూ! ఈ ప్రతిమను నాకు ప్రసాదింపుము. దీని నారాధించి సంసార సముద్రముం దాటెదను. అస దశాననుడు తీసికొనుమిదిగో విగ్రహము. దీనితో నేనేమి చేయుదును. సర్వభూత కారణుడగు బ్రహ్మనారాధించి ముల్లోక విజయము గావించితిననియె.

విభీషణు డచ్చెరువు గొలుపు ఆ మూర్తిని గ్రహించి నూట యెనిమిదేండ్లు పూజించి జరామరణములు లేనిస్థితిని (చిరజీవిత్వమను) అణిమాది విభూతులను బడసి లంకారాజ్యాధిపతియై అభీష్ట భోగములను అనుభవించు చున్నాడు. అనవిని మునులహో! చాలయాశ్చర్య కరమైన కధ వింటిమి. అయ్యనంత వాసుదేవ ప్రభావమింకను విస్తారముగా తెలుపుమన బ్రహ్మ యిట్లనియె.

అయ్యెడ ఆ రాక్షసుడు దశకంఠుడు దేవగంధర్వ కిన్నరులను ఓడించి లోకపాలురను, అవని పాలురను,తపస్వులను, సిద్ధులను గెలిచి వారి ఇల్లాండ్ర గొనితెచ్చి తన రాజధానియందు లంకలో నుంచి సీతాదేవియెడ మోహవివశుడై బంగారు లేడిరూపు (మారీచు) నితో బయలు దేరి సీతనపహరించెను. అంత కోపించిప రాముడు లక్ష్మణునితో గూడి యుద్ధమునందు రావణునిం జంపుటకై తొలుత వాలిం జంపి సుగ్రీవుని వానర రాజ్యమంద భిషిక్తుని గావించెను. అంగదుని యువరాజుం జేసెను. హనుమదాది కపి వీరులతో కొండలం బలవైచి సముద్రమునకు సేతువుం గట్టి సేనలతో వారధి దాటి రణమొనరించి ప్రహస్త నికుంభ కుంభకర్ణాదుల ఇంద్రజిత్తునుంజంపి రావణు పరిమార్చి అగ్నిశోధనముసేసి జానికింగ్రహించి విభీషణునికి లంకారాజ్య మొసంగి అటనున్న వాసుదేవమూర్తింగొని పుష్పకమెక్కి అవలీలగా లీలామానుషమూర్తి రామచంద్రమూర్తి అయోధ్యకేతెంచి భక్తవత్సలుండా రామచంద్ర ప్రభువు భరితునిందమ్ముని భరతుని పినతమ్ముని శత్రుఘ్నుని సర్వసామ్రాజ్యధినేతలట్లు గౌరవించి సనాతన వాసుదేవమూర్తి నారాధించి పదనొకండు వేలేండ్లు అయోధ్యను బాలించి ఆ విష్ణువిగ్రహమును సముద్రుని కొసంగెను. అట్లొసంగుచునోవాకిథీ! నీవు ధన్యుడవు. ఈ మూర్తి రక్షణము నీపని. నీవు సర్వరత్ననిధివి అనెను.

ద్వాపర యుగమందు జగన్నాధుండు హరి భూదేవి ప్రార్థనచే ఆమెకు గల్గిన భావ వైకల్యమును వారింప వసుదేవు కులము నందు అవతరింపగా సర్వాభిష్ట ప్రదమగు నీ విగ్రహమును సర్వలోక క్షేమము కొఱకు మరి కారణాంతరమునను ”పురుషోత్తమము” అను పుణ్యక్షేత్ర మందు సముద్రుడు నీళ్ళనుండి తానుగా నీమూర్తిని పైకి లేవనెత్తెను.

అప్పటి నుండి ముక్తిదమైన ఆ క్షేత్రమున నీమూర్తి వెలసియున్నది. భక్తితో నీ సర్వేశ్వరుని త్రికరణములను నిగ్రహించి ఆరాధించు భక్తులు పరమ పదమందుదురు. ఈ అనంత వాసుదేవు నొకమారేని దర్శించి నమస్కరించిన అతడు దశాశ్వమోధ రాజసూయ ఫల మందును. ఆమీద కామగ విమానమెక్కి సూర్య సమానవర్చస్సుతో చిరు గంటలు మ్రోయ నానంద భరితుడై విష్ణులోక మేగును. ఇరువది యొక్కతరములవారి నుద్ధరింప గలడు. దేవగంధర్వ గీయామానుడగును. ప్రళయ పర్యంతము నచట అనంత భోగములను అనుభవించి పుణ్యానుభవమయిన తరువాత నీ అవనికేతెంచి చతుర్వేద విదుడై వైష్ణవ యోగమున మోక్షములను బొందును. అనంత వాసుదేవుని మహిమ ఇది నేను కీర్తించితిని. ఓమునివరులారా! వందలేండ్లు వర్ణించిన నిది తుదముట్ట స్తుతింప శక్యముగాదు.

ఇది బ్రహ్మపురాణములో అనంతవాసుదేవ మాహాత్మ్యము అను డెబ్బయ్యవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment