Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఐదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి భాగము

నూతన రాజనిర్ణయం

అనంతరం విశ్వామిత్రమహర్షి యిలా అన్నాడు.

”ఓరాజా! ఈవిధంగా దక్షుడు తన స్వప్నవృత్తాంతాన్ని తన తల్లికి తెలిపి, ఆమె ఆశీస్సులు పొందిన తరువాత దైవవశాన ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య నగరాన్ని పాలిస్తున్న చంద్రసేనుడనే రాజు స్వర్గస్థుడైనాడు. ఆ రాజుయొక్క వియోగాన్ని సైపలేని ప్రజలంతా ఎంతో విలపించారు.

ప్రజారంజకుడైన పాలకు డవటంచేత చంద్రసేనుడు అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు.ప్రజల్ని కన్నబిడ్డలకన్నా మిన్నగా పాలించటంవల్ల ప్రజలకు రాజు స్వర్గస్థుడవటం తీరనిలోటైంది.

తండ్రిని కోల్పోయిన పిల్లల్లా దిక్కులేని వారయ్యారు. తలలు బాదుకొనుచూ, గుండెలవిసేలా రోదిస్తూ ప్రజలందరూ రాజభవనానికి వచ్చి రాజుయొక్క పార్ధివదేహానికి గౌరవపురస్సరంగా తలలు వంచి నమస్కరించారు. ఇక రాణియైన సులభయొక్క మనః స్ధితి వర్ణనాతీతం! గుండెలు, నెత్తి మొత్తుకొంటూ అతిదీనంగా రోదించ సాగింది. తన ఆభరణాలనూ, అలంకరణాలనూ అటూ యిటూ విసరి వేసి దుఃఖభారము అతశయమవగామూర్ఛిల్లింది!కొందరు పరిచారికలు లేవనెత్తి పట్టుకొనగా ‘ఓనాధా! ఓనాధా!’ అంటూ ఏడవసాగింది..

అంత క్రూరంగా నొసటివ్రాత వ్రాసినందుకు బ్రహ్మదేవుని నిందిస్తూ, ఒంటరిగా వీడిపోయినందుకు తన పతిదేవుని తప్పుబట్టి దుఃఖాతిశయం తో వివశురాలైంది. అప్పుడు చంద్రసేనుడి మంత్రులైన సుమంత్రుడు, మనోరంజనుడు అక్కడికివచ్చి ”రాజులేని రాజ్యంగతి ఏమవుతుందా?” అని ఆందోళన చెందసాగారు. ఇలా అందరూ నిశ్చేష్టులయి బాధా సర్పదష్టులై ఉండగా దైవవశాన అక్కడికి ఓ యతీశ్వరుడు వచ్చాడు. సకలశాస్త్రపారంగతుడూ, బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నవాడైన ఆ బ్రాహ్మ ణుడు యిలా కర్తవ్యబోధ చేశాడు.

‘ఓ ప్రజలారా! మీ స్వార్థచింతనను కాస్సేపు వదలి ప్రభువుకు శ్రేయస్సును కల్గించేమార్గం ఆలోచించండి. మీ బాగోగులన్నీ తనవిగా భావించి మీ అందరి శ్రేయస్సుకై అహరహము కృషిచేసిన మీరాజుకు మీరు కృతజ్ఞతచూపే ఆఖరిఅవకాశం యిది. ఎందుకంటే మృతుడైన తరువాత ప్రేత తనచుట్టూ చేరి రోదిస్తున్న స్నేహితులు, బంధు జనుల కన్నీళ్ళనే ఆహారంగా స్వీకరిస్తాడు. అప్పుడు అతను విడిచిన పాంచభౌతికదేహం భూమికి బరువవుతుంది!

ఈ భూప్రపంచంలో ఎక్కడైనా శరీరంలో ప్రాణాలున్నంతవరకే జీవుడికి అనుబంధాలు ఉంటాయి. ఆ తరువాత ఆ జీవునివెంట ఎవరూ అనుసరించలేరు. అతని సుకృత దుష్కృతాలు మాత్రమే అతని వెంట వెడతాయి. ఈ రాణి కూడా తాను అనాధయైనందుకు దుఃఖిస్తున్నదే తప్ప, రాజును అనుసరించగోరికాదు! మీరంతా మీమీ స్వంతపనులు నెరవేర్చుకొనటంలోనే సమర్థులు. ఇదివరలో ఈ భూమండలాన్ని అనేకమంది ప్రభువులు రాజ్యాలేలారు! సూర్య చంద్రవంశపు రాజులెందరో తమ కాలం చెల్లిపోగానే దివంగ తులు అయ్యారుకదా!

కనుక ఇకనైనా మీ రోదనలను ఆపి, పుత్రహీనుడైన ఈ రాజుకు శ్రేయస్సుకై, ఆత్మశాంతికై అంతిమ సంస్కారాలకు ఏర్పాటుచేయండి! మృతునికి అంతిమసంస్కారం చక్కగా నెరవేర్చినవాడే నిజమైన ఆప్తుడు. ఇటువంటి అపరకర్మలు నిర్వర్తించటానికే శాస్త్రాలు పుత్రుని అవశ్యకతను నిర్దేశించాయి! పుత్రహీనుడైన ఈ రాజుయొక్క అంత్యక్రియలు జర డానికి ఔరసపుత్రునిగాని, పుత్ర సమానుడైన యితరునిగాని తీసుకొని వచ్చి, తరువాత జరగవల్సిన కార్యక్రమాలను జరిపించండి! మీరందరూ తిలాంజలులు యిచ్చి అతనికి తుది వీడ్కోలివ్వండి!” అంటూ ఆ ఆ యతీశ్వరుడు వారందరినీ కర్తవ్యోన్ముఖుల్ని చేశాడు.

“ఓ భీమరాజా! అలా ప్రేరేపించబడిన పురజనులు సుమంతుడనే మంత్రిపుంగవుణ్ణి సంస్కారక్రియలకై నియోగించారు. అతడు అంత్యక్రియలన్నిటినీ యధావిధిగా నిర్వహించాడు.

ప్రజలంతా తిలాంజలి సమర్పించి, పట్టణానికి మరలారు. శివుని దర్శనం చేసుకుని ఎవరి ఇళ్ళకు వారు చేరుకున్నారు.

పదమూడవ రోజున రాణికి నూతన వస్త్రముల నిచ్చి, ప్రీతితో సుఖభోజనాలు చేశారు. ఇలా కొంతకాలం గడిచాక రాణి, మంత్రులు, పురజనులు రాజ్యపరిపాలనను ఎవరికి అప్పగించాలా? అన్న సందిగ్ధంలో పడి, ఆలోచించసాగారు. అంతలో అక్కడికి యాదృచ్ఛికంగా ముద్గల మహాముని విచ్చేశాడు. వారి సమస్యకి ఒక పరిష్కారాన్ని సూచించాడు.

”ఓ జనులారా! గహనమనే పేరుగల రాజుగారి పట్టపుటేనుగు కమలాల మాలను తొండంతో ఎవరిమెడలో వేస్తుందో అతడినే ప్రభువుగా ఎన్నుకుంటే బాగుంటుంది” అనగానే ప్రజలంతా సంతోషంతో ”బాగు, బాగు” అంటూ హర్షధ్వానాలు చేశారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘నూతనరాజు నిర్ణయం’ అనే ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment