పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మ ఇట్లనియె
ఇట్లేను అనంతమహిమ పురుషోత్తమ క్షేత్ర మహిమయు భుక్తిముక్తులను ఇచ్చునని తెల్పితిని. అచ్చట కృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించినవారు ధన్యులు ముక్తులును సమంత్రకముగా నొనంగిన హవిస్సు అగ్నిం బొందినట్లు కృష్ణుని రాత్రులందు ఉషఃకాలమునందు చేయుధ్యానము వలన భక్తులు దేహము విడిచి కృష్ణుని పొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభధ్రను తలచుకొనువారు హరి సాలోక్య మందుదురు. వర్షఋతువు నాలుగు మాసములు పురుషోత్తమ క్షేత్ర నివాసము చేయువారు భూమింగల సర్వతీర్థములు సేవించిన ఫలముగాంతురు. ఇంద్రియ నిగ్రహముసేసి కోపము జయించి యెల్లపుడు నచట వసించివారు తపఃఫలముము నొందుదురు.
అన్య తీర్థములందు పదివేలేండ్లు చేసిన తపఃఫలము పురుషోత్తమ క్షేత్రమున ఒక్క మాసమాచరించిన లభించును. బ్రహ్మచర్యాదులచే నిస్సంగులై చేయుపుణ్యమిచ్చట సేవించిన గల్గును. ఇది సర్వయజ్ఞ ఫలప్రదము. ఇచట దేహము విడిచిన ముక్తికల్గును. మఱ్ఱివృక్షమునకు సాగరమునకును నడుమ మేనువిడిచిన ముక్తిసిద్ధము. క్రిమికీటకాదులు పశుపక్షులు ఇక్కడ శరీరము బాసిన పరమగతినందును. అన్యతీర్థముల వెంట తిరుగవలెను అనుకొనుట వట్టి భ్రాంతి పురుషోత్తమ దర్శనము ఒనరించినవాడు పురుషోత్తమడగును. ప్రకృతికి అతీతుడాతడు. వేదపురాణము లందుచేతనే హరి పురుషోత్తముడని కీర్తించెను. దారిలో స్మశానములో గృహమున మఱి యొకటనేని శ్రీపురుషోత్తమ క్షేత్రమున ఇష్టమున్నను లేకున్నను దేహములను బాసిన మనుజుడు మోక్షమందితీరును.
అందువలన మోక్షకాంక్షులు పురుషోత్తమ క్షేత్రమున దేహము త్యాగము చేయ యత్నింపవలెను. పురుషోత్తమ మాహాత్మ్యమును మించినది కలుగదు కలుగబోదు. క్షేత్ర గుణసంపదలో కొంతమాత్రమే నేనుచెప్పితిని. సమగ్రముగా తెలుప సాధ్యపడదు. ఓమునులారా! మీరు మోక్షార్థుడేని ఆ పుణ్యక్షేత్రమందు వసింపుడు. అని వ్యాసుడు పలికెను. బ్రహ్మ వచనమాలించి ఆ మునులా క్షేత్రమందు వసించి పరమపదమందిరి. కావున బ్రహ్మాదులారా! మీరునట్లు గావింపుడు.
పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్య వర్ణనమను డెబ్భై ఒకటవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹