ఉపాసనా ఖండము మొదటి భాగము రుక్మాంగద
అభిషేక వర్ణనం
అనంతరం పరమ తపోనిధియైన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో అన్నాడు. ”చతురాననా! బుద్ధిశాలియైన విశ్వామిత్రునిచేత భీమునికి ఏమి ఉపదేశమివ్వబడిందో, దేన్ని అనుష్టించడంవల్ల అతని సకలాభీష్టములు నెరవేరినాయో, ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మోహపులంపటాన్నుంచి విముక్తుడిని చెయ్యి!”
అప్పుడు చతుర్ముఖుడు ఇలా బదులిచ్చాడు.
”ఓ వ్యాసమునీంద్రా! విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము, ఉపకారము ఎనలేనిది! అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి, విశ్వామిత్రుడు అతనితో యిలా అన్నాడు.
”ఓరాజా! ఈ మంత్రంచేత భక్తాభీష్టప్రదుడూ, భక్తవత్సలుడూ ఐన గజవదనుడిని ఆరాధించు! నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్టించు! మీ పూర్వీకులందరిచేతా పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకూ కోరినట్టి సకలాభీష్టాలనూ అనుగ్రహిస్తాడు! చతుర్విధ పురుషార్ధాలనూ ఇవ్వగల దిట్టయే శంకర తనయుడూ, పార్వతీ ప్రియనందనుడైన గణపతి! కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి, గణేశానుగ్రహాన్ని పొంది కృతార్థుడివికా!”
మహర్షి మాటలకు కృతజ్ఞతాభావంతోనూ, ఆనందంతోనూ గొంతు గద్గదమవగా, మహర్షియొక్క కరుణావాత్సల్యాలకు ఆనందాశ్రువులు కళ్ళలో చిప్పిల్లగా, భీమరాజు సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి, ఆ మునివద్ద సెలవు తీసుకొని, తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగివెళ్ళాడు.
ఇక రాజుయొక్క నగర ఆగమన వార్తను తెలుసుకున్న మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ, సమస్త రాజలాంఛనాలతోనూ, పరి వారంతోనూ, ఎదురువచ్చి నగరంలోకి తీసుకెళ్ళారు. నగరాన్నంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి, సమస్త మంగళ వాయిద్యాలు ఊరేగింపుకు ముందు నడువగా భీమరాజునూ, ఆయన పత్ని యైన చారుహాసినినీ రాజమందిరానికి వెంటబెట్టుకొని వెళ్ళారు.
“లోకమున పతినిచేరి పతివ్రతయైన స్త్రీ శోభించినట్లుగా, నేటికి మన భీమప్రభువు తిరిగి రావటంతో మన నగరానికే ఒక క్రొత్త జీవకళ వచ్చింది!” అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హర్షాతిరేకంతో ఆ నగరం అంతాకూడా నిండిన సంతోషంతోనూ, ఏ కొరతలేనట్టి సర్వసమృద్ధితోనూ కళకళలాడింది. రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజ దంపతులు సమస్త ప్రజానీకానికీ నూతన వస్త్రాలంకారాలనూ, తాంబులాదికములనూ, వెలగల అనేక ముత్యాల ఆభరణాలనూ బహూకరించి వారిని తృప్తులను చేశారు.
ఆ తరువాత ఒకానొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షిచేత ఉపదేశించబడిన మంత్రాన్ని అనుష్టానం చేయడానికి కౌండిన్యపురం లోని దక్షునిచే నిర్మించబడిన గణేశమందిర ప్రాసాదాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వ కాల సర్వావస్థలలోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తూ, సమస్తమైన చరాచర సృష్టియంతటిలోనూ, పంచభూతాలలోనూ సర్వాన్నీ ఆ గజాననుని స్వరూపంగానే చూడసాగాడు. అతడికి దేన్ని చూసినా భగవత్స్వరూపంగానే తోచి దానియందు అపారమైన ప్రేమ కలిగేది. దాన్ని ఆలింగనం చేసుకొని ప్రేమించేవాడు. ఇలా అంతటా భగవద్దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరాతనికి మతి భ్రమించిందనుకున్నారు. మరికొందరైతే అదేదో భూతావేశమనుకున్నారు. ఇలాఉండగా ఒకనాడు అతని అనన్యభక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్క రించాడు. అతని చేయిపట్టుకొని మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ దయతో యిలా అన్నాడు.
‘ఓ రాజా! నీవు ముక్తుడవైనావు. నీ సమస్త అభీష్టాలన్నీ నెరవేరుస్తాను! నీకు కావలసిన వరం ఏదైనాసరే సంశయించక కోరుకో!అన్నాడు. అప్పుడు వినమ్రుడైన ఆ భీమప్రభువు యిలా బదులు పలికాడు.
‘ఓ ప్రభూ! నీ దివ్యచరణాలపైన ఎనలేని, ఎడబాటులేనట్టి భక్తినే కోరేది! దాన్ని దయతో నాకు అనుగ్రహించు!’ అన్నాడు.. అప్పుడు గజాననుడిలా అన్నాడు.
‘ఓరాజా! నా అనుగ్రహంవల్ల నీకు గుణవంతుడు, రూపవంతుడూ బంగారువన్నె దేహకాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యుడైన కుమారుడు వరపుత్రుడిగా కలుగుతాడు! నీవింక రాజమందిరానికి వెళ్ళి దేవబ్రాహ్మణ పూజారతుడవై ఉండు!’ అంటూ అదృశ్యుడైనాడు.
అప్పుడు ఆ భీమరాజు భగవంతుడైన గణేశుని ఆజ్ఞమేరకు దేవతలనూ, రాజకొలువులో సమస్త బ్రాహ్మణులనూ తృప్తిపరస్తూ, ”అందరి లోనూ అంతర్యామిగాఉన్న ఆ గణేశుడు తృప్తినొందుగాక!” అనుకుంటూ దేవ, బ్రాహ్మణులను పూజించసాగాడు. ఇలావుండగా కొంతకాలానికి ఆరాజుకు శుభప్రదుడైన మగపిల్లవాడు జన్మించాడు! పుత్రోత్సవ సమ యంలో అనేక దానధర్మాలను చేసి, ఆ బాలునికి ”రుక్మాంగదు”డన్న నామకరణం చేశాడు.
దైవదత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధ మానుడై పెరగసాగాడు. ఆ పిల్లవాణ్ణి విద్యాభ్యాసానికై గురుకుల వాసానికి పంపారు. కుశాగ్రబుద్ధియై, ఏకసంథాగ్రాహిగా చెప్పినవి చెప్పగానే నేర్చుకోసాగాడు. ఇలా ఆ బాలుడు కపిలమునివద్ద రెండో గజాననుడు అనిపించేలాగా సకల విద్యలలోనూ నిధియైనాడు.
ఆ తరువాత భీమరాజు తన తనయుడికి ఒక శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు.ఆ రుక్మాంగదుడు కూడా తండ్రివద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది, తదేకదీక్షతో ఆరాధించసాగాడు.
ఇలావుండగా ఒకానొకరోజు రుక్మాంగదుడు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు. అనేక జంతువులను వేటాడి అలసి, ఒకానొక ముని ఆశ్రమాన్ని చూశాడు. రమణీయమైన ప్రకృతితో, ఆహ్లాదకరమైన పరిసరాలతో, ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమంలో నానా జంతువులూ భయాన్నీ స్వభావ వైరములనూ విడిచి స్నేహంతో మెలుగుతూ ఉన్నాయి. అటువంటి పరమపవిత్రమైన, ప్రశాంతమైన ఆశ్రమాన్ని రుక్మాంగదుడు చేరుకున్నాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని రుక్మంగద అభిషేకం అనే 27 వ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹