Skip to content Skip to footer

శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – డెబ్భై మూడవ భాగము

ఋషి ప్రశ్న నిరూపణము

లోమ హర్షణుడిట్లనియె.

వ్యాస వచనము విని జితేంద్రియులగు మునులు సంప్రీతులై సంతసించి అచ్చెరువంది మఱిమఱి యిట్లనిరి. భారత వర్షప్రభావమెంత చక్కగా నీవు వర్ణించితివి. అట్లే పురుషోత్తమక్షేత్ర మహిమను తాము సెలవిచ్చినది విని ఆనందించితిమి. చిరకాలమునుండి మా యెడ నొక సందియము పాదుకొనియున్నది. దానిని వదలింప తమకంటె మఱియొకడు భూతలమునలేడు. బలరామకృష్ణులు అవని నవతరించుటకు కారణమేమి ? భద్రాదేవి అవతారము ఎందులకువచ్చినది ? వసుదేవుని కుమారులై నందగృహమందు ఆ అన్నదమ్ములెందులకుండిరి ? ఈ లోకము దుఃఖప్రాయము, మృత్యురూపము. నీటిబుడగవలె అస్థిరము. పరమపురుషులు వారు ఈ మల పూరితమైన గొందెలో నీ ఘోరమైన గర్భమున ఎందులకు నివాసమును కోరిరి ? అవనిని అవతరించి వారేమేమి పనులుచేసిరి ? అవెల్ల సమగ్రముగ మాకానతిమ్ము. అతి మానుషమైన వాసుదేవభగవానుని కథ పరమపుణ్యము. పుణ్యాత్ముల చరిత్రలతో ముడిపడియున్నది. దివినుండి అవనికి స్వామి వచ్చుటకు గతమేమి ? చక్రపాణి సర్వసృష్టి చక్రముద్రిప్పు ప్రభువు మనుష్య లోకమునెడల నెట్లు తలుపుగొనెను. సర్వజగద్గోపకుడైన హరి సామాన్య గోపమూర్తియెందులకయ్యెను. మహాభూతములను భరించు సర్వభూతాత్మకుడైన ప్రభువు శ్రీగర్భుడు (అణిమాదైశ్వర్య సంపన్నుడు) అగు శ్రీపతియొక మానవ స్త్రీగర్భమున నెట్లు భరింపబడెను ? దేవతలమేలుకొఱకు ముల్లోకములను మూడడుగులచే ఆక్రమించిన త్రివిక్రమమూర్తి భూర్భువ స్వర్లోకములను మూడు దారులను ధర్మార్థకామములను మూడు పురుషార్థములను నొడుదుడుగు లేకుండ నిలుపు స్థితి కర్త ఆతడు లయకాలమున జలమయ మూర్తిదాల్చి లోకమేకార్ణవమొనరించి దృశ్యాదృశ్య స్వరూపమున జగమెల్ల దిగద్రావి యుండు పురాణపురుషుడు పురాణాత్మరూపుడు పరాహ రూపధారియై తన కొమ్ముతుద నివ్వసుమతినుద్ధరించిన మధుసూదనుడు వసుంధర నెల్లగెలిచి దేవతల కిచ్చిన దేవవతి నరాకృతి సింహాకృతియునై హిరణ్యకశిపు సంహరించిన శ్రీహరి ఔర్వాగ్ని (బాడబాగ్ని) స్వరూపుడై ప్రళయ మూర్తియై పాతాళమునకేగి సముద్రమునెల్ల ఆపోశనము పట్టిన నారాయణుడు ఈ అవనిలో నరాకృతియై ఏల అవతరించెను. సహస్రచరణుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు, సహస్రాంశువు నని ఏ దేవుని (పురుషసూక్తమున) వేదజ్ఞులు స్తుతింతురో యుగయుగమందు ఎవ్వని నాభినుండి పితామహుడు పుట్టినిల్లైన పద్మము ఉద్భవించునో లోకమేకావర్ణవమైనపుడు హిరణ్మయమైన ఆ కమలము ఎవ్వనినుదడి పొడమెనో ఎవ్వనిచే తారకాసుర సంగ్రామమున దైత్యులు హతులైరో ఎవ్వడు సర్వదేవతాత్మకమైన సర్వాయుధధరమైన మేనుగొని మద మెక్కిన కాలనేమిని గూల్చెనో తుట్టతుదను క్షీరసముద్రమందు అమృత నిధియందు యోగమూర్తియై జగత్తు అంధకార బంధురమైనప్పుడు ఎవ్వడు నిద్రించునో ఆ స్వామి అవనిపై అవతరింయుటకు కారణమేమి!

తపోబలమున దేవతలవతరించుటకు నరణియైన ఆదితి (అగ్ని పుట్టుటకు ఆధారభూతమైన జమ్మికర్రయరణియన బడును) గర్భమందు ధరించిన దైత్యగణ బద్ధుడైన దేవేంద్రుని ఎవడు జాగరూకతతో రక్షించెనో మూడడుగులను యోగమయములైన పదములనుగ చేసి దైత్యులను సముద్రము పాలొనరించి దేవతలను దేవేశ్వరులను దేవేంద్రుని కాపాడెనో గార్హపత్య విధానమున అన్వాహార్య కర్మచే అహవనీయాగ్నిని వేదమును దీక్షను సమిధలను ధ్రువపాత్రను బ్రోక్షణ పాత్రను న్రువమును అవబృధ్యమును ఏ మహానుభావుడు ముఖము చేయియు మఱి ఏ అవయవ స్ఫూర్తి లేని నిరాకారుడు దేవతలను గవ్యములను ఆరగించు పితృదేవతలను గల్పించి భోగార్థము యజ్ఞాచరణమందు యజ్ఞవిథిని సమ్మేళనము చేసెనో యజ్ఞపాత్రలు దక్షిణ దీక్ష చెరువు సోమసాధనములైన యూపము సమిధ సోమము స్రువము పవిత్రములు పరిధులు మఱియు యజ్ఞార్హములైన ద్రవ్యములు చమసలు సదస్యులను యజమానులను మేధాదులను క్రతుశ్రేష్ఠములను నెవ్వడు పారమేష్ఠ్యమగు కర్మచేత (బ్రహ్మా చేయ వలసిన పనిగా) విభాగము చేసి యయ్యై యుగముల కనువుగా నొనరించెనో ఆ యజ్ఞపురుషుడు విష్ణువే కృష్ణుడై అవతరించెను.

క్షణములు నిమేషములు కాష్ఠలు కలలు వీని మానము అనుసరించి ఏర్పడు భూత భవిష్యద్వర్తమాన కాలములు ముహూర్తములు తిథులు నెలలు దినము సంవత్సరము ఋతువులు కాలయోగములు త్రైకాలిక కాలప్రమాణము ఆయువు క్షేత్రములు (శరీరము) వాని యువచయము (పెరుగుదల) లక్షణము రూపసౌష్టవము ముల్లోకములు ముమ్మూర్తులు త్రివిధ కార్యము త్రేతాగ్నులు త్రికాలములు కర్మత్రయము త్రివర్ణములు సత్వరజస్తమ గుణములు నెవ్వనిచే అంతులేని కర్మ ప్రభావముచే సృష్ఠింబడునో ఆ సృష్ఠికర్త హరియై అవతరించెను. సర్వభూతాంతర్యామియై సర్వభూత గుణమూర్తియై మానవులయందు నిద్రియముల వెంటనగు యోగముచేత వినోదించునో గడచిన గడువనున్న కర్మముల యొక్క సంబంధముచేత సర్వవిధాయకుడైన ఈశ్వరుడుతానై (కర్మఫలదాన సమర్థుడై) ధర్మపరులకు నెవ్వడు గతియు పాపకర్ములకు నగతియునై దోచునో చాతుర్వర్ణ్య విభాగమునకు మూలమై రక్షకుడై యున్నాడో చాతుర్వర్ణ్యమున (చతుర్వేద విజ్ఞానమునకు) ఎవ్వడెరుంగునొ బ్రహ్మచర్యాది చతురాశ్రమముల కెవ్వడాశ్రయుడో సర్వదిక్కుల నడిమిభాగము ఆకాశము, భూమి,వాయువు,సూర్యుడు, చంద్రసూర్యమయమైన జ్యోతిస్సు చతుర్యుగములకు అధీశ్వరము, ఎవ్వడు పరంజ్యోతియని పరమ తపప్సని వేదములందు వినబడునో,ఎవ్వని పరుని యపరినిగాకూడ (జీవాత్మగా పరమాత్మగాకూడ) పేర్కొందురో ఎవ్వడు పరుడు పరమాత్మయునో,ఆదిత్యుల కధినాదుడును, దైత్యులకంతకుడును, ఏ విభుడో యుగాంతమందంతకు దెవ్వడో,ఎవ్వడు లోకాంతకులకు కూడ అంతకుడో,లోకసేతువుల కెవ్వడు సేతువో, మేధ్యకర్ములకెవ్వడు మేధ్యుడో,(మేథ్యము=పవిత్రము) వేదములెరింగినవారి కెవ్వడెరుంగ తగినవాడో, సృష్టిహేతువు లైనవారికి గూడ నెవ్వడు సృష్టిబీజమో లేక ప్రభుశక్తి కలవానికెవ్వడు ప్రభువో, సౌమ్యద్రవ్యములకెవ్వడు సోముడో, అగ్నివర్చస్సులకెవ్వడు అగ్నియో, సర్వలోకేశులగు శక్రులకు (ఇంద్రులకు) నీశ్వరుడో, తపస్సులకు దపస్స్వరూపుడో, వినయశీలురులలో నెవ్వడు వినయమో,తేజశ్శాలురలలో నెవ్వడు తేజస్సో,

కలహశీలురులలో ఎవ్వడు కలహమో,గతి మంతులలో ఎవడు గతియో, అట్టి హరి పుడమిరవతరించెను. ఆకాశమునుండి వాయువు ప్రాణ వాయువునుండి అగ్ని పుట్టినవి. ఆకాశము అగ్ని ప్రాణము ఈ మూడునువిష్ణురూపములే. రసమునుండి శోణితము శోణితమునుండి మాంసము మాంసమునుండి మేదస్సు మేదస్సునుండి (క్రొవ్వు)(హృదయస్థమైన) ఎముక ఎముకనుండి మజ్జ (ఎముకలలోని క్రొవ్వు) మజ్జ్యనుండి శుక్రము శుక్రమునుండి రసనిర్మాణక్రియచే గర్భము పుట్టును. అందు మొదటి భాగము అప్పులు (ఉదకము) అదే సౌమ్యరాశియని చెప్పబడును. గర్భగతమగు ఊష్మమునుండి రెండవరాశి పుట్టును. శుక్రము సోమాత్మకము ఆర్తవము (స్త్రీ శోణితము) అనలాత్మకము. అగ్ని సోమాత్మకమైన ఈ ద్రవ్యములు రసముననుసరించి ఏర్పడును. శశి పావతులు బీజములు. కఫవర్గమునకు సంబంధించినది శుక్రము (పురషవీర్యము) పిత్తవర్గములోనిది స్త్రీశోణితము. కఫమునకు స్థానము హృదయము. పిత్తమునకుస్థానము నాభి. దేహమద్యమందున్న హృదయము మనస్సుయుండుచోటు. నాభికోష్ఠమునందు అగ్నిదేవుడున్నాడు. మనస్సు ప్రజాపతి. కఫము సోముడు. పిత్తమగ్ని. ఈవిధముగ నీజగత్తు అగ్నీసోమాత్మకము. ఇట్లు ఏర్పడెడి గర్భము వృద్ధిబొందినగొలది పరమాత్మతో బాటు వాయువు శరీరమునందు ప్రవేశించును. ఆ వాయువు శరీరమందు ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము అను అయిదు తెరగులయినది. ప్రాణవాయువు పరమాత్మను బెంపొందించుచు హృదయమందుండును. అపానము నాభి క్రింద భాగమున (గుదస్థానం) యందును. ఉదానము కంఠదేశమునందుండును. వ్యానవాయువు శరీరమెల్లవ్యాపించి ఉండును. సమానవాయువు నాభియందుండును. ఇంద్రియగోచరమై ఈ భూతోత్పత్తి ఈ వాయువులవలననే కలుగును. వాయువు ఆకాశము నీరు భూమితేజస్సు అను ఈ పంచభూతాంశలింద్రియములందు జేరినవై తమతమ భాగములను నిర్వహించును. దేహము పార్థివమని అందురు. వాయువును ప్రాణస్వరూపమందురు. శరీరమందున్న నవ రంధ్రములు (అవకాశములు) ఆకాశమూలములు. జలభూతమువలన శరీరమందు రక్త శుక్రాది స్రావమేర్పడును. కన్నులు జ్యోతి (తేజః) స్వరూపములు. మనస్సు వానికి ఆత్మరూపము. మనశ్శక్తివలననే విషయాదులు ప్రవర్తితములగును.

ఈ విధముగా సనాతనుడైన పురుషుడు పరమాత్మ సర్వలోకములను సృజించెను.

అన మునులిట్లడిగిరి. నశించు స్వభావముగల నీలోకమందు నశింపని పదార్థమగు విష్ణువు నరరూపమునెట్లు పొందెను. అని మా సందియము. విస్మయమును. ఉత్తమగతి కేగువారికి బరమగతి యగునీతడెట్లు మానవశరీరియయ్యెను? దేవతలు దైత్యులుగూడ ఈ విషయము పరమాశ్యర్యముగా బేర్కొందురు. ఆ ఆశ్చర్యకరమైన విష్ణువుయొక్క పుట్టుక వృత్తాంతము తెలుపుము. ఆయన మహాతేజస్సు. బలవీర్యములు ప్రసిద్ధములు. ఆయనచేష్ట ఆశ్చర్యకరము. అట్టి విష్ణువుయొక్క తత్వమిపుడు జెప్పతగును. ఆదేవుడు పురుషోత్తముడు దేవతల కష్టములనెట్లు హరించెను. సర్వ వ్యాపకుడు సర్వలోకేశ్వరుడు సర్వలోక సుఖకరుడు సృష్ఠిస్థితిలయకారుడునగుజగన్నాథుడు శాశ్వతుడు. అంతములేనివాడు. క్షయవృద్ధులులేనివాడు. పాపపుణ్యస్పర్శలేనివాడు. నిర్గుణుడు. సూక్ష్ముడు. వికారరహితుడు. నిరంజనుడు. విభుడు. నిత్యుడు. సత్తామాత్రుడు. అచలుడు నిర్మలుడు సర్వవ్యాపి నిత్యతృప్తుడు నిరాశ్రయుడునైన యాతడు దేవతలయందు వైకుంఠభావమును (నారాయణత్వం) మానవులందు కృష్ణత్వమును నెట్లుపొందెను. కృతయుగమందు విశుద్ధమైన హరిత్వమును సర్వేశ్వరుడగు నా భగవంతుని కర్మగతిని దురవగాహమగు గడచిన జరగనున్న దానిని వినగోరుచున్నాము. భగవంతుడు స్వభావముచేత అవ్యక్తుడయ్యు వ్యక్తరూపమునంది ఉన్నాడు. ఈయన నారాయణుడయ్యు హరియనుపేర అవతరించెను. బ్రహ్మ శక్రుడు(ఇంద్రుడు) రుద్రుడు ధర్ముడు (యముడు) శుక్రుడు గురుడు అయినాడు. తొలుత ప్రధానాత్మయై బ్రహ్మను సృజించెను. పురాణపురుషుడగు నతడు పూర్వకల్పమందు ప్రజాపతులను సృజించెను. అట్టి భగవంతుడు (షడ్గుణౖశ్వర్య సంపన్నుడు) సర్వవ్యాపకుడగు విష్ణువు సర్వలోకేశ్వరుడు మర్త్యలోకమున యదుకులమందు ఎందులకు ప్రవేశించెను. తెలుపుము.

ఇది బ్రహ్మపురాణమున ఋషిప్రశ్ననిరూపణమును

Leave a comment