Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

ప్రాయోపవేశనం


ముకుంద రుక్మాంగదుని మోహించుట…

అనంతరం చతుర్ముఖుడిలా చెప్పసాగాడు.

‘ఓ వ్యాసమునీంద్రా! అలా వేటకై వచ్చి దప్పిగొని ముని ఆశ్రమానికి చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుడినీ, మృదుమధురంగా మాట్లాడే ఆతని భార్య ముకుందనూ చూసి, భక్తితో ఆ పుణ్యదంపతులకు నమస్కరించాడు. ఆ తరువాత ముని స్నానార్ధం నదీతీరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దప్పిగొన్న రుక్మాంగదుడు ఆ మునిపత్నిని ‘తల్లీ’! నా నాలుక దప్పికతో పిడచకట్టుక పోతున్నది. కనుక నాకు త్రాగేందుకు కాసిని చల్లని మంచి నీటిని యిచ్చి పుణ్యం కట్టుకో!’ అన్నాడు..

ఆ మాటలకు ఆ మునిపత్నియైన ముకుంద ఒక క్షణకాలం ఆ రాజుయొక్క అందచందాలకూ ఠీవికీ మోహితురాలై అతడితో యిలా అన్నది.

“ఓరాజా! అందంలో మన్మధుణ్ణి ధిక్కరించేలా వున్నావు. నీవంటి సొగసుకాడిని యిప్పటివరకూ ఎన్నడూ నేను చూసికూడా ఉండలేదు! జయంతుడు, వసంతుడు, నలకూబరుడు కూడా అందంలో, ఠీవిలో నీకాలి గోటికే సరిరారు! అపరమన్మధుడిలా ఉన్న నీయందు నామనస్సు చిక్కుకున్నది. కనుక కామాతురనైన నా కోరిక తీర్చి, నా అధరసుధా పానముచేయి! నామనస్సు రంజిల్లచేయి!”

ఇంద్రియాలను నిగ్రహించిన వాడూ, శమదమాలతో సాధనసంపత్తిని అలవర్చుకున్నవాడైన ఆ రుక్మాంగదుడు ఆమెమాటలకు పిడుగు పాటుకు లోనైనట్లు విలవిలలాడాడు! ఆమెకు తగు బుద్దిగరపుతూ యిలా అన్నాడు.

‘ఓ ముకుందా! నీవీ చపలతను వీడు! హేయమైన పరదారా పరిగ్రహానికి ఆ గజాననుని దివ్యానుగ్రహ లబ్ధుడనైన నేను ఎలా – పాల్పడగలను? అధర్మురాలవూ, దుష్టురాలవైన నీవిచ్చిన నీటిని కూడా త్రాగటం పాపం! ఋషి ఆశ్రమము అత్యంత పావనమైనదని ఇక్కడికి వచ్చాను! ఇక ఇక్కడనుండి వెడతాను’ అంటూ లేచి వెళ్ళిపోబోయాడు!

వెంటనే ఆరాజు చేయి పట్టుకుని ముకుంద ఇలా అంది “ఓరాజా! బలాత్కారముగా ఇతరుల భార్యను చేపట్టినట్టివాడే నరకాన్ని పొందుతాడు. అంతేకాని, తనంత తానుగా వలచివచ్చిన స్త్రీని చేపడితే ఎట్టి ప్రమాదమూ లేదు! అంతేకాదు; సృష్టికర్తయైన ఆ బ్రహ్మదేవుడు కూడా కృత త్రేతా ద్వాపర యుగాలలో మా స్త్రీలకు స్వాతంత్ర్యమిచ్చి వున్నాడు. కనుక నీవు నా కోరికను తీర్చు! లేదా నిన్ను రాజ్యభ్రష్టునిగా వనచారివిగా చేస్తాను!’ అన్నది.

ఓరాజా! ముకుంద కామోద్దీపితురాలై పరుగెత్తి వచ్చి రుక్మాంగదుడిని బలాత్కారంగా కౌగలించుకొని ముద్దుపెట్టుకున్నది. అప్పుడు రుక్మాంగదుడామెను బలంతో దూరంగా తోసివైచాడు! అప్పుడామె గాలివాటుకు పడిపోయిన అరటిచెట్టులా నేలనుపడి మూర్ఛిల్లింది! స్పృహలోకి వచ్చిన ఆమెతో రుక్మాంగద మహారాజు యిలా అన్నాడు.

‘ఓ అవిరాలా! నీవు పరమపవిత్రుడూ, అగ్నిహోత్రం వంటి వాడైన వాచక్నవి మునిభార్యవు! ఇలా పరపుషుడిపై మనసుపడటం నీకు ధర్మభ్రష్టుత్వాన్నీ, నరకప్రాప్తినీ కలిగిస్తుంది! అటు సూర్యుడిటు పొడిచినా – సముద్రాలే ఇంకినా, నామనస్సు నీ పాపపు కోరికను అంగీకరించదు!” అంటూ నిరాకరించాడు’ కధాగమనాన్ని ఇలా కొనసాగించసాగాడు.

ముకుంద రుక్మాంగదుని శపించుట:-

ఆమాటలకు తోకతొక్కిన త్రాచులా లేచిన ముకుంద రుక్మాంగదుణ్ణి యిలా శపించింది!

‘ఓరాజా! నీ తిరస్కారంవల్ల నేనెలాటి కష్టాన్నీ, వ్యధనూ పొందానో, నీవూ అలాగే కుష్టువ్యాధితో బాధితుడవవుదువుగాక! వజ్రకఠినమైన నీ హృదయం కరుగకపోవటంవల్ల నీకీ శాపమిస్తున్నాను’!

ఆ మాటలకు రుక్మాంగదుడు ఎంతో నొచ్చుకుని అట్టి శంఖిణి తనకు ఎదురవటం కేవలం తన పూర్వజన్మకృత పాపఫలమే అనుకొని మనస్సులో భేదపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు! అలా వెడుతుండగా మార్గమధ్యంలో అతని శరీరమంతా కొంగశరీరంవలే తెల్లటి శ్వేతకుష్ఠుతో వ్యాపించబడింది! ఎంతో ‘వ్యాకులపడ్డ రుక్మాంగదుడు దుఃఖసాగరంలో మగ్నుడై గజానుడిని యిలా అన్నాడు.

‘ఓగజాననా! నావల్ల నీకేం అపరాధము జరిగింది? ఏ అదృశ్యశక్తి నన్నీ ముని ఆశ్రమానికి తీసుకువచ్చింది? దుష్టురాలైన ఈ మునిపత్ని అసలు నాకెందుకు తటస్థపడింది? ఓ సిద్ధిపతీ! పరమ దయాకరుడవే ఐనా, నీ దయయొక్క ప్రయోజనాన్ని దుష్టులే ఎక్కువగా పొందుతారనుకుంటాను.

భక్తులను రక్షించేందుకూ దుష్టులను శిక్షించేందుకే నీ అనుగ్రహ అవతారాలన్న మాటను నిజం చేయవాప్రభూ? స్వైరిణి దుష్ప్రవర్తనగల ఈ మునిపత్ని దురాగతాన్ని సహించి ఎందుకు ఊరుకున్నావు? ఈమె దుష్ప్రవర్తన యిలా అప్రతిహతంగా కొనసాగవలసిందేనా? మేలిమి బంగారు శరీరపు వన్నెకలిగి కాంతివంతంగా ప్రకాశించే నా శరీరం ఈనాడు ఇటువంటి దుస్థితిని పొందటానికి కారణమేమిటి? ఏ పూర్వ కర్మ దుష్కర్మఫలం నాకీ అగత్యమేర్పడింది?

ఓ పార్వతీనందనా! దీనజనావనా! నిన్నుతప్ప అన్యులను ఏమాత్రమూ శరణువేడని వాడనే! నీవే నాకు దిక్కు! ఎప్పటిలాగా నేను నీయందే అచంచలమైన భక్తి విశ్వాసాలతో నీ పాదపద్మాలనే అనవరతము సేవిస్తాను! కాని, ఈ రోగభూయిష్టమైన శరీరాన్నీ నా అమంగళకరమైన రూపాన్నీ నా ప్రజలకు యిక చూపించబోను! ఈ శరీరాన్ని యింక యిక్కడే ప్రాయోప వేశంతో శుష్కింప చేస్తాను!’ అని నిశ్చయించుకొని ఆ రుక్మాంగదుడు ఒక మట్టిచెట్టుక్రింద కూర్చున్నాడు.

అతని వెంటవచ్చిన భటులు తమ ప్రభువుకై వెదకి, ఎక్కడా జాడ కనుగొనలేక, సాయంసంధ్య అవుతుండగా తమతమ యిళ్ళకు వెనుదిరిగారు. ఈవిధంగా భటులు చంద్రుడికై చక్రవాక పక్షుల్లా తమ ప్రభువుకు దూరమై తీవ్ర వియోగబాధకు లోనైనారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనా ఖండం లోని ‘ప్రాయోపవేశనం’ అనే 28-వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment