Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

నారదాగమనం

అప్పుడు ముని యిలా చెబుతున్నాడు.

‘ఓరాజా! ఒకానొక రోజున అలా ప్రాయోపవేశం చేయబోతున్న ఆ రుక్మాంగద మహారాజు దూరాన్నుండి వస్తున్న త్రిలోకసంచారియైన నారదమహర్షిని చూశాడు. రుక్మాంగదుడు నారదునికి తన శాపవృత్తాంతమును చెప్పుకొనటం.ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి..

“ఓ మునీంద్రా! ఒక క్షణకాలం విశ్రమించండి!” అంటూ ప్రార్ధించాడు. ఆకాశమార్గంలో పయనిస్తున్న నారదమహర్షి ఆ ప్రార్ధన విని క్రిందకు దిగినాడు. యధావిధిగా నారదుని పూజించి గౌరవభావంతో యిలా ప్రశ్నించాడు. “ఓ మహర్షి! నేను భీమపుత్రుడైన రుక్మాంగదుడను. వేటకై అరణ్యానికి వచ్చి దప్పిగొన్నాను. సమీపంలోనే ఉన్న వాచక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహం తీర్చుకుందుకని మంచి తీర్ధమును అర్ధించాను. ఆ ముని పత్ని కామపీడితురాలై తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. ఇంద్రియనిగ్రహం కలవాడనవటంచేత – దైవానుగ్రహంవల్ల ఆమె కోరికను నిరాకరించాను. ఆమె దుఃఖిస్తూ నిష్టుర మనస్సుతో నన్నిలా శపించింది ‘ఓమూర్ఖుడా! కామించిన నన్ను నిరాకరించావు గనుక నీవు కుష్టురోగంతో పీడితుడవగుదువుగాక!”

ఆ దుష్టవాక్యాన్ని విని నేను ఆ ముని ఆశ్రమము విడిచి నా రాజ్యానికి వెడుతూండగా మార్గమధ్యంలో నా దేహము శ్వేతకుష్టుకు లోనైంది. ఓమహర్షీ! దీని నివృత్తికి తగిన పరిహారము చెప్పి నన్ను కృతార్ధుణ్ణి చేయండి! నా రాకకై ఎదురుచూచే నాతండ్రి ఈపాటికి నా వియోగంవల్ల యెనలేని దుఃఖసముద్రంలో మునిగి వుంటాడు!”

దైన్యంగా ప్రార్ధించిన ఆ రుక్మాంగదుడి జాలిపూరితమైన మాటలకు కరుణార్ద్ర హృదయుడైన నారదమహర్షి హృదయం ద్రవించింది. సర్వజ్ఞు డైనట్టి నారదమహర్షి అతని శ్వేతకుష్టువ్యాధి నివారణకై ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పాడు.

నారదుడు రుక్మాంగదునికి వ్యాధినివారణోపాయం చెప్పుట :-

‘ఓ రుక్మాంగదా! ఎప్పటిలాగే త్రిలోక సంచారంచేస్తూ నేను వస్తూండగా మార్గమధ్యంలో ఒక గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను! విదర్భదేశంలో కదంబ మనే నగరం ఉన్నది. అక్కడగల ఒక ప్రాసాదంలో ఒకగొప్ప వినాయక మూర్తిని చూశాను. భక్తుల సకలాభీష్టాలను నెరవేర్చే ఆ మూర్తికి చింతామణి వినాయకుడని పేరు! ఆ ఆలయానికి ఎదురుగా గణేశకుండమనే కొలనుకూడా ఉన్నది. ఒకానొక శూద్రుడు వృద్ధాప్యం చేత కృశించిన దేహంతో అక్కడికి తీర్ధయాత్రలకని వచ్చి ఆ కుండంలో స్నానం చేయగానే దివ్యదేహాన్ని పొందాడు. ఆ తరువాత ఆతనికై వినాయక లోకాన్నుంచి వినాయకుని దూతలు ఒక విమానము తీసుకు రాగా అందులో ఎక్కి అతడు దుఃఖశోకరహితమైన, పునరావృత్తి రహిత మైన గణేశస్ధానాన్ని చేరుకున్నాడు.

ఓ రుక్మాంగదా! ఇదంతా నేను స్వయంగా నాకళ్ళారా చూశాను. కనుక నీవు కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుని, అక్కడగల ఆ గణేశకుండంలో స్నానమాచరించి, కోరిన కోర్కెలన్నీ తీర్చే భక్తవరప్రదుడైన ఆ చింతామణిగణేశుని భక్తితో అర్చించి ద్విజోత్తములకు విరివిగా దానధర్మములు చేయి! నీవూ తప్పక ఆరోగ్య వంతుడవౌతావు. సర్పం తన కుబుసాన్ని వీడినట్లు నీవుకూడా ఈ రోగంతో కల్మషమైన దేహాన్ని వీడి పరిశుద్ధదేహాన్ని పొందగలవు!” అంటూ చతుర్ముఖుడు వ్యాసమహర్షికి రుక్మాంగదునికి నారదుడు చెప్పిన బాధానివారణోపాయాన్ని వివరించి యిలా కొనసాగించాడు. “ఇలా నారదుని నోటినుండి వచ్చిన అమృత వచనాలను విన్న రుక్మాంగదుని అంతరంగం తొలకరి జల్లులకు పుడమిలా ఆనందం తో పులకరించింది! వెళ్ళిపోబోతున్న ఆ మహర్షికి నమస్కరించి శ్రద్ధాళువై తిరిగి రుక్మాంగదుడు యిలా ప్రశ్నించాడు.

‘ఓ నారదమునీంద్రా! ఆ చింతామణి గణపతి క్షేత్రంలో ఎవరెవరు ఇంతకు పూర్వం గణేశానుగ్రహాన్ని పొందారు?అక్కడి మూర్తిని స్థాపించినదెవరు? పరోపకారులైన మీబోటి వారు మావంటి దీనుల దుఃఖాన్ని నివారించగల సమర్థులు. అందుకనే మీరు మూడులోకాల్లోనూ అవిశ్రాంతంగా సంచరిస్తూంటారు! మేఘాలకు వర్షించటం, శేషుడు భూభారాన్ని వహించటమూ, సూర్యుడు ప్రకాశించటమూ యివన్నీ లోకోపకారానికే గదా! సర్వజ్ఞుడవు దయాంతరంగుడవైన ఓ మునీంద్రా! కనుక నీవు దయతో నా సందేహాన్ని నివృత్తి చెయ్యి!”

ఆ మాటలకు నారదమహర్షి ప్రసన్నంగా యిలా బదులిచ్చాడు.

‘ఓ రుక్మాంగదా! నీ ప్రశ్న ఎంతో సమంజసంగా ఉన్నది. మృదు మధురములైన నీ శ్రద్ధాపూరిత వచనాలకు నాకు ఎంతో తృప్తి కలిగింది. తప్పక నీవడిగిన యావద్వృత్తాంతాన్నీ చెబుతాను. విను!

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘నారదాగమనం’ అనే 29 వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment