ఉపాసనా ఖండము మొదటి భాగము
అహల్యాధర్షణం
అలా రుక్మాంగద మహారాజు శ్రద్ధాళువై వేసిన ప్రశ్నకు ప్రత్యుత్త రంగా నారదమహర్షి యిలా అన్నాడు.
రుక్మాంగదా! నేనోసారి త్రిలోకాధిపతియైన ఇంద్రుణ్ణి చూడటానికి అమరావతీ నగరానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నన్ను మూడు లోకాలలోనూ సంతోషం కలిగించే ఆనందకరమైన విషయం,ఆ వివరం త్రిలోక సంచారిని గనుక నన్ను చెప్పమని, ఉచిత సత్కారాలనందించి, ప్రశ్నించాడు.
”భూలోకంలో అత్యంత రమణీయకమైన ప్రకృతి పరిసరాలతో – అనేక వృక్షాలతోనూ, లతలతోనూ, పక్షుల కుహూరవాలతో నయనా నందకరంగా విలసిల్లుతూ గౌతమముని ఆశ్రమం! ఆ ప్రశాంత ఆశ్రమంలో అపూర్వ సౌందర్యరాశియైన అహల్యతో కూడిన గౌతమమునిని దర్శించాననీ, ఆమె సౌందర్యం లోకోత్తరమైనదనీ వర్ణనాతీతమైనదనీ ఇంద్రుడెరిగున్న అప్సరసలకన్నా, లక్ష్మీ, పార్వతి వంటి దేవతామూర్తుల కన్నా అరుంధతి అనసూయలవంటి మహాపతివ్రతల సౌందర్యంకన్నా మిన్నయై, సూర్యుని పత్నులైన ఛాయ, సౌంజ్ఞలకన్నా, చివరికి కశ్యప ప్రజాపతి భార్యయైన అదితికన్నా కూడా సౌందర్యవంతురాలనీ, అందచందాలలో ఆమెకు సాటిరారనీ”దేవరాజైన ఇంద్రుడికి చెప్పాను..
”అటువంటి దివ్యసౌందర్యవంతురాలిని చూడగానే అఖండ బ్రహ్మ చారినైన నాకు సైతం మనస్సు చలించిందనీ, ఇక గానము, భోజనపానాదులేవీ నాకు రుచించలేదనీ, నిద్రకూడా పట్టలేదనీ చివరికి బ్రహ్మచర్యవ్రతం భంగమౌతుందేమోనన్న భయంకలిగి వెంటనే అక్కడినుండి ఎకాయకి స్వర్గానికి వచ్చాననీ, అందుచేత ఆమెలేని స్వర్గం అలంకారం లేని అతివలా వుంటుందని” చెప్పి అంతర్హితుడనైనాను!
ఓ రుక్మాంగదా! అలా నేను ప్రేరేపించి అంతర్హితుడనైనాక ఇంద్రుడు అహల్యను ఆమె రూపలావణ్యాలనూ పదేపదే తన మనస్సు లో, తలపోస్తూ మదనబాధ భరించలేనంత ఎక్కువగా తట్టుకోలేక మూర్ఛిల్లాడు. కొంతతడవు ఆగాక లేచి”మహర్షి వివరించిన ఆ అందాలరాశియైన గౌతముని పత్నిని ఎప్పుడు చూడగలనోకదా? ఆమె పొందును శీఘ్రంగా ఏ ఉపాయంచేత పొందగలను? నాకు కలిగే ఈ భరించరాని మదనతాపాన్ని ఎలా ఉపశ మింప చేసుకోగలను? ఆమె అధరాలు చిలికించే సుధారసాన్ని ఎప్పుడు గ్రోలగలను? ఆమెను బిగియార తనివితీర ఎలా కౌగలించుకోగలను? ఆమె లేని ఈ జీవితం నిరర్ధకమైనదే!” అని భావిస్తూ ఆమెనే హృదయాన స్మరిస్తూ కామరూపుడవటంచేత గౌతమముని రూపాన్ని ధరించి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు!
మహర్షి స్నానఅనుష్టానాదులకనీ స్నానపానాదులకై వెళ్ళేదాకా అనువైన సమయం కోసం వేచివుండి ఆయన వెళ్ళిన తరువాత కొంతసేపటికి కపటబుద్ధితో గౌతమముని రూపుదాల్చిన శచీపతి గౌతమముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను సమీపించి తనకు “మృదుశయ్యను ఏర్పరచ” మంటూ ఋషిపత్నియైన కోరాడు.
అప్పుడా మునిపత్ని ఆశ్చర్యపోతూ “ఓనాధా! తమరు సంధ్యా అనుష్టానాలకని ఇప్పుడేగదా నదీతీరానికి వెళ్ళారు. తిరిగి ఇంతలోనే వచ్చేశారేమి? ఎన్నడూలేనిదీ, తపస్వులకత్యంత గర్హనీయమైన ఈ అకాల కామవాంఛ మీలో ఎలా పొడసూపింది? నిషిద్ధమైన దివారతిని కోరుతున్నారెందుకు?” అంటూ ప్రశ్నించింది. అందుకా కపట గౌతమ వేషధారి యైన శచీపతి అహల్యతో యిలా నమ్మబలికాడు.
“ఓ ప్రియురాలా! స్నానార్ధమై వెళ్ళిన నేను ఒక అప్సరసను చూశాను. దిగంబరిగా సరస్సులో స్నానంచేస్తూన్న ఆమెను చూడగానే నాకూ కోరిక, సంగమేచ్ఛ కలిగింది. ఇక ఉండబట్టలేక వచ్చేశాను! కోరికతో ప్రజ్వరిల్లుతున్న నన్ను నీదరికి చేర్చుకుని నాకు రతిసౌఖ్యాన్నివ్వు! అలా కాకపోతే కామాగ్నికి దగ్ధుడనై నేను మరణించగలను! లేదా. నిన్ను శపిస్తాను” అంటూ ఆమెను సమీపించబోయాడు.
భర్తయొక్క ఊహించని ఈ హఠాత్ప్రవర్తనకు విస్తుపోయిన అహల్య “ఓ మునివర్యా! స్వాధ్యాయనంలోను, జపతపానుష్టానములతోనూ, దేవతాపూజలతోనూ గడపవల్సిన ఈ ప్రాతః సమయంలో ఈవిధంగా జంతువుల్లాగా రమింపబూనడం మీకు ఉచితంకాదు. అయినా మీ పట్టిన పట్టు వీడకపోతే – మీ ఆజ్ఞను పాలిస్తాను! భర్తృ ఆజ్ఞాపాలనను – మించిన ధర్మం సతులకెక్కడున్నది?”
”ఓ రుక్మాంగద మహారాజా! ఈవిధంగా రూపంలోనూ, కంఠధ్వనిలోనూ, స్వభావ, సంభాషణలలో ముమ్మూర్తులా గౌతమమునిలా ఉన్న అతనిని తన భర్తగానే భావించి, అతని కోరిక తీర్చటానికై శయ్యను చేరింది! అప్పుడు ఇంద్రుడు ఆమెతో యధేచ్చగా చుంబన, ఆలింగనాది కములతో రమించాడు.
అతని దేహంనుంచి వస్తున్న దివ్య సుగంధానికి చకితురాలైన అహల్య తనలో తానిలా అనుకుంది! ”ఇతడు నాభర్త యేనా? లేక ఎవరైనా కపటరూపందాల్చి నన్ను వంచించారా? అలాగైతే తీరని కళంకంగా మాయనిమచ్చ నా జీవితంపై పడుతుంది! ఈ దుష్టుని సాంగత్యంవల్ల అటు పుట్టినింటికీ యిటు మెట్టినింటికీ అపకీర్తి తెచ్చిన దాననౌతాను!” అని మధనపడుతూ… కోపంతో ఇలా అంది
“ఓయీ! నీవెవరో కపటరూపంలో నాభర్త రూపుదాల్చి నన్ను వంచించావు! నీవెవరైనదీ నిజంచెప్పు! లేదా నిన్ను శపించగలను!” ఆమె శాపానికి భయంచెందిన ఇంద్రుడు తన నిజరూపుదాల్చి ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు.
‘ఓ అహల్యా! నన్ను శచీపతియైన ఇంద్రుడిగా తెలుసుకో! నీ రూపలావణ్యము, సౌందర్యములను చూచి నిగ్రహించుకొనలేక ఇలా చేశాను!త్రైలోక్యాధిపతియైన నన్నే యికపైన సేవించుకో!” అన్న ఇంద్రుని మాటలకు క్రోధంతో బుసలుకొట్టే మిన్నాగులా తీక్షవీక్షణాలతో “ఓ మూఢా! తపస్వియైన నాభర్త యిప్పుడు ఇంటికివస్తే నీగతేమౌతుందో చెప్పలేను. మహాపాపివైన నీవు నా పాతివ్రత్యాన్ని చెరచినావు! ఇక ఆ మహర్షి శాపంతో నేనెలాంటి అవస్థ పొందుతానోకదా!”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”అహల్యాధర్షణం” అనే 30-వ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹