Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఒకటవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

శక్రశాప వర్ణనం

“మహానుభావా! గౌతమముని తన ఆశ్రమానికి అనుష్టానాదికాలు ముగించుకొని తిరిగివచ్చాక ఏమి జరిగింది? ఆ కధా వృత్తాంతాన్ని తెలుసు కోవాలని నాకెంతో కుతుహలంగా వున్నది! దయతో సెలవివ్వండి!” – అంటూ మృదుమధురంగా ప్రశ్నించిన రుక్మాంగదుడి ప్రశ్నకి నారదమహర్షి చిరుమందహాసంచేస్తూ ఇలా బదులిచ్చాడు.

“నాయనా! తన నిత్యకర్మానుష్టానములు ముగించుకున్న గౌతమ మహర్షి తన ఆశ్రమానికి తిరిగివచ్చాడు! భార్యను పిలిచాడు. ఆమె రావటం ఆలస్యంచేయటంతో ఇలా ప్రశ్నించాడు

‘ఓ ప్రియురాలా! పిలువగానే నాముందుకు వచ్చేదానవు ఎందుకని ముఖాన్ని చాటేస్తున్నావు? పిలుస్తున్నా బదులుకూడా పలుకటం లేదేమి? రాగానే కూర్చునేందుకు దర్భాసనం పరచేదానివి! అవన్నీ మరచావా?” ఈ మాటలకు అహల్య గాలికి వణికే లతలా గడగడా వణుకుతూ తల వంచుకొని నెమ్మదిగా కొద్దిసేపయ్యాక భర్తవద్దకు చేరింది. ముని పాదాలపై సాష్టాంగపడి శాపభయంతో విహ్వలయై మెల్లగా యిలా అన్నది

“ఓనాధా! మీరు ప్రొద్దున్నే తమ నిత్యానుష్టానం నెరవేర్చటానికి నదీతీరానికి వెళ్ళిన సమయంలో శచీపతియైన ఇంద్రుడు కామరూపియై మీరూపం దాల్చి వచ్చాడు. మీకంఠస్వరాన్నే అనుకరిస్తూ స్నానార్ధమై వెళ్ళిన తనకు ఒక అపురూప సౌందర్యవతియైన అప్సరస్త్రీ దిగంబరియై స్నానంచేస్తూ కనిపించిందనీ, తమకాన్ని ఆపుకోలేక వచ్చాననీ, రతిసౌఖ్యాన్నిమ్మనీ కోరాడు. మీరేనన్న భావంతో నేనందుకంగీకరించాను.

కానీ ఆ ఇంద్రుని శరీరం విరజిమ్మే దివ్యసుగంధానికి ఆశ్చర్యపోయి, అవమానంతో అనుమానంతో ”ఓ దురాత్మా! నీవు నాభర్త వేషంలో వచ్చి మోసగించిన కపటివి! నీవెవ్వడవో నిజంచెప్పు! లేదా నీపుణ్యం నాశన మౌవటంతోపాటూ భస్మీభూతుడవు అవుతావు!” అని తీవ్రస్వరంతో నిలదీశాను. నా శాపభయానికి వెరచి ఆ త్రిలోకాధిపతి తన నిజరూపాన్ని ధరించాడు.

ఇంతలో మీ కంఠధ్వని నా చెవికి వినిపించింది. సిగ్గుతో చితికిపోయి, జుగుప్సతోనూ, ఏవగింపుతోనూ దహించుకుపోతున్న నేను సహజంగానే మూర్తీభవించిన తపోనిధిలా ఉన్న మీ సముఖంలోకి రావటానికి వెరచాను! నావల్ల జరిగిన ఈ అజ్ఞాన అపరాధాన్ని మన్నిం చండి! చేసిన పాపం చెబితే పోతుందంటారుకదా! ఆ తప్పును కూడా దినమధ్యంలో ప్రకటించినప్పుడే కొంత దోషం తొలగుతుంది!

ఇక నిగూఢంగా దాచవలసినవి మంత్రము, సంగమము, ఆయుర్దాయము, సంపద, రతి, మానము, దానము వీటిని ఎన్నడూ ప్రకటించరాదన్నది పెద్దలు విధించిన నియమంకదా!” అంటూవున్న ఆమె మాటలకు క్రోధపరవశుడై గౌతముడు తక్షణం యిలా శపించాడు.

‘దురాత్మురాలా! కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు పర పురుషునికి వశ్యురాలవైనావు! నా స్వభావమూ, చేష్టలునూ నీవెరుగున్నవే కదా! నీవు చేసిన ఈ ప్రజ్ఞాపరాధానికి నీవు పాషాణమై పడివుందువుగాక! పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు దాశరధియై అరణ్యాలలో తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు అతడి పాదధూళి నీ శిరస్సున దాల్చి నప్పుడు అప్పుడే, తిరిగి నీకు నీ నిజరూపం సంప్రాప్తించునుగాక!”

ఇలా తపోధనుడైన మునివాక్యం పూర్తయేంతలోనే ఆ అహల్య శిలారూపం దాల్చింది. ముని ఆగ్రహావేశుడై యిచ్చిన శాపవచనాలను ప్రక్కనే పొంచివుండి విన్న ఇంద్రుడు భయంతో గడగడ వణికిపోతూ తనలో తాను యిలా పశ్చాత్తాపం చెందసాగాడు.

ఇంద్రుడి పశ్చాత్తాపం

“నేరకపోయి కొరివితో తలగోక్కున్నానే? ఈ ఋషియొక్క ఆగ్రహాన్నుంచి ఇప్పుడు ఎలా తప్పించు కోవటం? ముల్లోకాల్లోనూ ఎక్కడ దాక్కున్నా ఈయన దివ్యదృష్టి కనుగప్పటం అసాధ్యం!” ఇలా భయపడుతూ పిల్లిరూపం దాల్చి యింట్లో తిరుగసాగాడు. ఇంట్లోగాని, ఇంటి వెలుపలగాని ఇంద్రుడు కనబడకపోవటంతో ”ఈ జంభారి (జంభాసురుణ్ణి నిర్జించిన ఇంద్రుడు) ఎక్కడికి వెళ్ళాడా? అనుకుంటూ, తన దివ్యదృష్టిచేత, మోసంతో తన భార్యను చెరచినవానిని తెలుసుకొని,

‘ఓ ఇంద్రా! నీవు త్రైలోక్యాధిపతివి కనుక నిన్ను భస్మంమాత్రం చేయను! కానీ నీ అకృత్యానికి శాపంమాత్రం పెడతాను! నీవు యికనుంచి సహస్రభగుడవు కమ్ము!’ అంటూ శపించాడు. ఇలా రోషావేశంతో పల్కిన మునివాక్కులు అమోఘములై, ఇంద్రుని శరీరమంతా భగ (యోని) చిహ్నములతోనిండిపోయింది!’ సిగ్గుతో చితికిపోయిన ఇంద్రుడు తీవ్ర దుఃఖసముద్రంలో మునిగిపోయాడు.

‘త్రైలోక్యాధిపతినైన నేను సైతం సామాన్యుడిలా యుక్తాయుక్త విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాను కదా! ఎట్టివారికైనా స్వబుద్ధిని అనుసరిస్తేనే సుఖము, గురుబుద్ధివల్ల విశేషమైన శ్రేయస్సునూ ప్రసాదిస్తాయి. ఇక ఇతరుల ఆలోచనలనూ, స్త్రీబుద్ధినీ అనుసరించడంవల్ల వినాశనమే కలుగుతుంది! దేవతలకధిపతి ఉండికూడా నారదముని పెట్టిన ప్రలోభానికి ఎలా లోనయ్యాను? దానివల్ల నే వివేకశూన్యుడనై ప్రవర్తించి ఎంతో జుగుప్సాకరమైన ఈ రూపాన్ని పొందాను.

ఇప్పుడు నా ప్రియపత్ని ఐన శచీదేవికి ఈ నా వికృత ముఖాన్నెలా చూపించను?నేనెంతటి దుష్టుణ్ణి? ఎటువంటి వాడినైనా కాముడు (మన్మధుడు) వివశుణ్ణిచేసి తీరుతాడు! ఐనా ఇప్పు డెవరిననుకుని ఏంలాభం? ఎవరు చేసిన శుభాశుభ కర్మల ఫలితం వారే అనుభవించాలికదా! కనుక నేచేసిన దుష్కృత్యానికి ప్రతిఫలాన్ని నేనే అనుభవించి తీరుతాను! దానివల్ల తప్ప నాకిక నిష్కృతిలేదు!ఇలా అనుకొని ఇంద్రుడు ఒక కీటకరూపం దాల్చి తామరతూడు లో దూరి ఇంద్రగోపకమనే కీటకంలా ఉండాలను నిశ్చయించుకున్నాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”శక్రశాప వర్ణనం” అనే 31-వ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment