శ్రీ కృష్ణ చరితే చతుర్వ్యూహ వర్ణనము
వ్యాసుడిట్లనియె:- సురేశ్వరునికి సృష్టికారణునకు విష్ణువునకు పురాణపురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు గుణరూపునకు సర్వాధికునకు యజ్ఞాంగ స్వరూపునకు సర్వాంగునకు నమస్కారము. ఎవనికంటె అణువైన వస్తువు ఎవనికంటె పెద్దదైన వస్తువులేదో, జననములేని ఎవ్వనిచేత విశ్వము వ్యాప్తమైనదో, పుట్టుట గిట్టుట దృశ్యమగుట అదృశ్య మగుటయను లక్షణములచే విలక్షణమైన చరాచర విశ్వవ్యాప్తమైన వానినిగా దెలుపుదురో,ఎవనివలన జగత్తు పుట్టినది నశించునదియని బ్రహ్మణ్యులు పేర్కొందురో, అట్టినిర్వికారము శుద్ధము నిత్యము ఏకైక రూపము విష్ణువు జిష్ణువు (సర్వవ్యావకము జయశీలము) నని వర్ణింపబడు పరమాత్మకు నమస్కారము. హిరణ్యగర్భునకు, (స్వర్ణమయమైన బ్రహ్మాండము గర్భముగా గలవాడు) హరికి, శంకరునకు,వాసుదేవునకు, (సర్వదేవనివాసమైన వానికి) తారునికి (సంసారమును తరింపజేయువాడు) నేక రూపునికి,స్ధూలము సూక్ష్మమునైనవానికి,అవ్యక్తము వ్యక్తమునైన వానికి ముక్తిహేతువగు విష్ణునకు, జగన్మూలము నయినవానికి, నమస్కారము. విశ్వమున కాధారమై అణువులకంటె అణువై సర్వభూతములందుండి చ్యుతిలేనివానికి (అచ్యుతునకు) నమస్కారము. పరమార్థముగ గేవల జ్ఞానరూపమై అర్థస్వరూపముగా భ్రాంతిదర్శనమున దృశ్యాత్మక జగత్తుగా కనిపించువానిగా మునులు పేర్కొనెడి భగవత్తత్వమును గురించి బ్రహ్మమును చెప్పినట్లు నేను చెప్పుచున్నాను.
ఎవడు తన ముఖముల చేత ఋక్సాను మంత్రములను పఠించుచు ఏకార్ణవమునుండి వెలువడివచ్చి ముల్లోకముల పవిత్రము చేయునో అట్టి ఈశానునకు నమస్కరించి దేవతలు యజ్ఞములొనరించు వారి యజ్ఞాచరణమునకు లోపము రానీయరో, ఆయనకు నమస్కరించి అవ్యక్తమునుండి పుట్టిన బ్రహ్మయొక్క సమగ్రమైన అభిప్రాయమును తెలుపుచున్నాను. ఆయన సృష్ఠిని ఉద్దేశించి ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములను వేదరూపమున ప్రకటించియున్నాడు. ఆపః (దీనికి నీరు సామాన్యార్థము. కాని దానికి మూల పదార్థమైన విద్యుత్తు ప్రకాశోదకమను బేర నర్థమని ఋషులు చెప్పినారు) వానికి నారములని నామాంతరము. అవియయనము అనగా గమ్యస్థానము (ఉనికి)గా కలవాడు నారాయణుడు. సృష్ఘిమూలమైన ఆపోరూపమున సర్వవ్యాపకమైయున్న తత్త్వమే నారాయణ తత్త్వమని తాత్పర్యము, ఆ భగవత్తత్వము నాలుగు విధములై యున్నది. ఒకమూర్తి శుక్లవర్ణము. అది జ్వాలా మాలామయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూరమందును దగ్గరనుగూడా ఉండునది. అది గుణములకతీతమైనది. వాసుదేవనామమున ఉండునది. మమకారములేని స్థితిలోనే అది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికిలేవు. కేవలం శుద్ధస్వరూపము. మిక్కిలి నిలకడగల వస్తువు. ఇక రెండవ వ్యూహము. శేషుడను బేర భూమిని ధరించుచున్నది. అది తమోగుణమూర్తి. తిర్యగ్భావమును బొందినది. అనగా పశుత్వమునొందినదని అర్థము. మూడవ వ్యూహము సత్వ ప్రధానమూర్తి ధర్మ సంస్థాపనమొనరించి ప్రజారక్షణ నిమిత్తమైన కర్మను (స్థితిరూపమును జేయునది) నాలుగవ వ్యూహము (మూర్తి) శేషతల్పమున సముద్రమధ్యమందుండును. రజోగుణరూపము సర్గకారణము. (సృష్ఠి కారణము) ఈ చెప్పిన వానిలో మూడవ మూర్తియగు హరి స్వరూపము ధర్మ వ్యవస్థాపనము జేయును. ధర్మనాశముజేయ చెలరేగిన అసురులను సంహారించును. ధర్మపరాయణులైన దేవ గంధర్వాదులను రక్షించును. ఈ మూర్తి ఎప్పుడు ధర్మము వాడిపోవునో అధర్మము ప్రకోపించునో అప్పుడు తనను తాను సృజించుకొనును. మున్ను వరాహమై ముట్టెతో ఉదకమును జిమ్ముకొని వచ్చి తనయొక్క కొమ్ముచేత ఈ వసుంధరను పద్మిని (తామర తీగ) అట్లు పైకెత్తినది. ఈ మూర్తియే నరసింహమూర్తియై హిరణ్యకశిపుని సంహరించినది. దేనిచేతనే విప్రచిత్తి మొదలుగా మరెందరో దానవులు కూల్చబడిరి. వామన రూపమున మాయచే బలిని బంధించి దైత్యులగెలచి ముల్లోకము ఆక్రమింపబడినది. భృగువంశమందు జమదగ్ని కుమారుడై పుట్టి అద్భుత ప్రతాపముచే ఒక రాచపురువు తండ్రిని సంహరించినాడని సర్వక్షత్రియ నాశనమొనరించినది, అట్లే అత్రి కుమారుడై ప్రతాపశీలియై దత్తాత్రేయుడను పేర ఉదయించి మహాత్ముడైన అలర్కునకు అష్టాంగ యోగమును ఉపదేశించినది, దశరథ కుమారుడై రాముడను పేర పుట్టి రావణుని సంహరించినది. సర్వజగత్తు ఒక సముద్రమైనపుడు ఈ సర్వజగత్ప్రభువు అనేక యుగ సహస్రములు నాగ పర్యంక శయనుడై యోగనిద్రనూని తన మహిమయందు దాన నిమిడియుండి ముల్లోకములను గర్భమున దాల్చి జనోలోకమందున్న సిద్ధులు స్తుతింప విలసిల్లుచుండును.
అ అనంతశయనమూర్తి నాభినుండి దిక్కులే రేకులుగా భాసించునొక పద్మము పుట్టినది. అందలి కేసరములు మరుద్గణము. (వాయు) అది పితామహుని చతుర్ముఖుని పుట్టిల్లు. యోగనిద్రనున్న ఆ స్వామి గులిమినుండి మదుకైటభులను దానవులు పుట్టిరి. మహావీర్యులు మహాబలశాలులునై బ్రహ్మను చంపబోయిన ఆ ఇద్దరిని తల్పమునుండి లేచి ఆ ప్రభువు సంహరించెను. ఇట్లనేకలీలలు ఆయనవి అసంఖ్యాకములు. అట్టి యజుడు అవికారుడు మధురానగరములో అవతరించి ఉన్నాడు. ఈ సాత్వికమూర్తి జగత్‌స్థితిహేతువై అవతరించగా ప్రద్యుమ్న నామమున నాల్గవ వ్యూహముగా చెప్పబడినది. ఈ మూర్తి ఒకప్పుడు దేవభావమును ఒకతరి మనుష్య భావమును వెరొకయెడ పశుపక్ష్యాది భావమును గూడా గ్రహించుచుండి తదనురూప స్వభావమునై వాసుదేవాఖ్యమై పూజింపబడి అభీష్టముల ననుగ్రహించుచున్నది. కృతకృత్యుడై (ఏకర్తవ్యములేనివాడై ) సర్వ ప్రభువైన విష్ణువునుగూర్చి నేనింతవరకు తెల్పితిని. ఆయన మనుష్యత్వమును పొంది చేసిన లీలా విశేషములను ఇటుపై నాలింపుడు.
ఇది బ్రహ్మపురాణమున చతుర్వ్యూహవర్ణనమను డెబ్భై నాల్గవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹