హరియంశావతార వర్ణనము వ్యాసుడిట్లనియె.
భూభారము హరింప నీ భారతవర్షమందు హరి అవతరించిన వృత్తాంతము తెలిపెద. ఓ మునివరులార వినుండు. ధర్మహ్రాసము అధర్మాభివృద్ది అయినతఱి జనార్దనుడు తన మూర్తిని రెండువిధములొనర్చికొని సాధురక్షణకు ధర్మస్థాపనకును దుష్టుల దేవద్వేషుల నిగ్రహమునకును యుగయుగమందు ఉదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై మేరువునందున్న దేవసమాజమున కేగి బ్రహ్మాది దేవతలకు మ్రొక్కి తన కష్టము నిట్లు మొఱవెట్టు కొనెను.
అగ్ని బంగారమునకు గురువు. గ్రహములకు సూర్యుడు గురువు. నాకును మఱి యెల్లలోకములకు వంద్యుడైన గురువు నారాయణుడు. ఇపుడు కాలనేమి మొదలుగా గల ఈ దైత్యులు మర్త్యలోకమునకు వచ్చి రేయింబవళ్ళు ప్రజలను బాధించుచున్నారు. ప్రభువైన విష్ణువుచే కాలనేమి గూల్పబడెను. ఉగ్రసేనుని కొడుకు కంసుడను మహాసురుడు పుట్టియున్నాడు. అరిష్టుడు ధేనుకుడు కేశిప్రలంబుడు నరకుడు సుందుడు మహోగ్రుడగుబాణుడు (బలికొడుకు ) మఱి యెందరో రాజుల ఇండ్ల పుట్టినారు. వారిని లెక్కపెట్ట నుత్సహించను. దివ్యమూర్తిధరులగు దేవతలు మదించియున్న దైత్యరాజులుంగలిసి యక్షౌహిణులనేకములు నామీద నున్నవి. ఆ బరువు సైపలేకున్నానని మీకు విన్నవించుకొనుచున్నాను. నేను పాతాళమునకు గ్రుంగిపోకుండ ఈ నా బరువును మీరు దింపవలయును. అని అవని మాట విని సురల ప్రేరణచే బ్రహ్మ భూభానహరణార్థమయి యిట్లు పలికెను.
ఓ వేల్పులారా ! భూదేవి యిపుడన్నదియెల్ల నిజము. నేను భవుడు (శివుడు) మీరు మఱి యంతయు నారాయణ స్వరూపము. ఇవన్నియు హరియొక్క విభూతులే. ఆ విభూతుల హెచ్చుదగ్గుల ననుసరించియే ఒకరినొకరు బాధింపబడువారు,ఒకరు బాధించువారుగ దోచుచుందురు. అందుచే మనమందరము పాలకడలి ఒడ్డునకు వెళ్ళుదము. అచట హరిని ఆరాధించి ఆయనకు విన్నవింతుము. ఆ దేవుడు జగన్మయుడు భూమి ఉపకారమునకై సత్వ గుణాంశమున అవనిపై అవతరించి ధర్మస్థితిని గావించును. అని నలువ సురలతో నేగి మనసు నిలిపి గరుడధ్వజునిట్లు స్తుతించెను.
సహస్రమూర్తీ! సహస్రపాద సహస్రముఖ సృష్టి స్థితిలయకారణ అప్రమేయా నీకు నమస్కారము. సూక్ష్మాతి సూక్ష్మము. బృహత్ప్రమాణము గొప్పవానికెల్ల గొప్పది ప్రధానము బుద్ధి ఇంద్రియములు వాగ్రూపమయిన వేదములకు మూలము పరమునైన ఓ భగవంతుడా! ప్రసన్నుడవగుము. ఈ భూమి భూమిం పుట్టిన మహాసురులచే పీడనొందిన పర్వతబంధములు గలదై జగత్పరాయణమైన నిన్ను భారము దింపగోరి అరుదెంచెను. ఈ మేము ఇంద్రుడు అశ్వినీదేవులు. వరుణుడు ఇరుగో రుద్రులు వసువులు సూర్యులు వాయువు అగ్ని మొదలగు నెల్లర మరుదెంచితిమి. మా యొనరింపవలసినవని యానతిమ్ము. నీవు చెప్పినది విధేయులమై ఒనరింతుము. దోషములు వాసి నీ హద్దున నిలుతుము.
భగవంతుడిట్లు స్తుతింపబడి పరమేశ్వరుడు గావున వారి ననుగ్రహింప తన రెండు శిరోజములను తెలుపు నలుపు వానిని నూడబెరికి వారికి జూపి యీ కేశములు వసుధ యందవతరించి భూభార క్లేశమును హరింపగలవు. సురలెల్లరుం తమతమ అంశములచే నవనీతలమందు అవతరించి మదోన్మత్తులయి పుట్టియున్న మహా రాక్షసులతో యుద్ధము నొనరింతురుగాక! అందుచే నానాయుధ హతులై అశేష దైత్యకూటము నశించును. సందియము లేదు. వసుదేవుని ధర్మపత్ని దేవతా సమానురాలు దేవకి. ఆమె ఎనిమిదవ గర్భము గనీ నాకేశమవతరించును. కంసాదులను సంహరించును అని హరి అంతర్థానమందెను.
అదృశ్యుడయిన ఆ మహాత్మునికి నమస్కరించి ఆ దేవతలును మేరుగిరినెత్తమునకేగి యటనుండి అవనికిం దిగిరి. నారద భగవానుడు కంసుని కడకేగి దేవకి ఎనిమిదవ గర్భము (శిశువు) అవతరించునని తెల్పెను. కంసుడు విని కోపగించి దేవకీ వసుదేవులను కారాగారమున నుంచెను. తాను మున్నిచ్చిన మాట ననుసరించి వసుదేవుడు పుట్టినవానిం బుట్టినట్లు బిడ్డలంగొనిపోయి కంసుని కప్పగించెను.అట్లు జనించిన కొడుకులు ఆరుగురు . తొలి జన్మమున హిరణ్యక శివుని పుత్రులట. విష్ణు ప్రేరణమునొంది నిద్రాదేవి (యోగనిద్ర) గర్భమునందు వారి నావేశించెను. ఆమె వైష్ణవియైన మాయ అవిద్యారూపమైన ఆ మాయ చేతనే జగమెల్ల మోహితమగుచుండును. ఆమెను గని హరి యిట్లనియె.
ఓ నిద్రా ! నాయాజ్ఞచే నీవేగి పాతాళమందున్న వారి నొక్కక్కని గొని దేవకీ జఠరముం జేర్పుము. కంసునిచే వారు చంపబడగా శేషుని యంశమున బుణ్యమూర్తి ఆ దేవకి ఏడవ గర్భమగును. గోకులమునందు వసుదేవుని భార్య రోహిణి గలదు. అమె ప్రసవ సమయమందు ఈ సప్తమ గర్భముంగొని ఏగి ఆమె ఉదరమందు ఉంచుము. భోజరాజగు కంసుని వలన జడుపుచే బంధనముచే దేవకి గర్భము భంగమైనదని జనశ్రుతి పుట్టును. గర్భసంకర్షణముచే ఆ శిశువు ”సంకర్షణుడు” అని పేరొందును. అవ్వల నేనా దేవకి శుభస్థానమైన గర్భమందుందును. నీవప్పుడు యశోద ఉదరమునందు విలంబము లేకుండ నుండదగును. వర్ష ఋతువున శ్రావణ బహుళాష్టమి నాడు అర్థరాత్రి నేను పుట్టెదను. నా శక్తి ప్రేరణమందిన బుద్ధితో వసుదేవుడు దేవకి ప్రక్కలోనున్న నన్ను యశోద ప్రక్కలోనికి చేర్చును. యశోద ప్రక్కలో ఉన్న నన్ను దేవకీ ప్రక్కన చేర్చును. కంసుడు నిన్ను బట్టి ఒకకొండ బండపైకి విసరికొట్టును. నీవు అంతరిక్షమున కెగిరి నిలుతువు. అంతట నిన్ను ఇంద్రుడు నా మీది గౌరవముచే పలుమారులు నమస్కరించి తలవంచి తన చెల్లెలుగా గారవించును. అటుపై నీవు శుంభ నిశుంభాది దైత్యులను వేలకొలది సంహరించి పృథివియందు వేఱువేఱు స్థానములందు వేఱువేఱు రూపములచే ఆలంకరింతువు. నీవే భూతివి సన్నతివి కీర్తివి కాంతివి పృథివివి ధృతివి లజ్జ పుష్ఠి రుపా (రోషము) మఱియేమేమి శక్తులుగలవన్నియు నీవే. ఆర్య దుర్గ వేదగర్భఅంబిక భద్ర భద్రకాశి క్షేమ్య క్షేమంకరి అని ప్రాతఃకాలమునందు అపరాహ్ణమున జనులు వినతులై నిన్ను బెక్కురీతుల స్తుతింతురు. వారి వాంఛితమెల్ల నా ప్రసాదమున సమకూరును. కల్లు మాంసము భక్ష్య భోజ్యములు నివేదించి పూజించిన మానవుల యెల్ల కోరికల నెవ్వరికి నీవు ప్రసన్నవై యనుగ్రహింతువో వారందఱు అన్నివేళల నా యనుగ్రహమున భద్రమూర్తులగుదురు. సందేహములేదు. దేవి ! నే నుడివినట్లు చనుము.
ఇది బ్రహ్మపురాణమునందు హరి అంశావతారవర్ణనమను డెబ్భై ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹