శ్రీ కృష్ణ జన్మ కథనము
వ్యాసులిట్లనియె. జగత్కర్త్రియైన ఆ విష్ణుమాయ దేవదేవుడు చెప్పినట్లు దేవకి ఆరుకాన్పులనొనరించి తరువాతి గర్భమును ఆకర్షించెను. ఈ తరువాత దేవకీ గర్భమందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగనిద్ర యశోద ఉదరమందు బ్రహ్మ చెప్పిన విధముగా జనించినది అంతట గ్రహములు శుభస్థానములందు సంచరించినవి. విష్ణ్వంశము భూమియందవతరించు సమయమున ఋతువులు సుశోభనమయ్యెను. దేవకి ముఖకాంతి అతిశయించి ఆమెవంక జూచుటకు నెల్లరకు నశక్యమయ్యెను.
దేదీప్యమానమైయున్న ఆమెను జూచినవారి మనసులు కలతజెందినవి. ఏరికిని తేరిపారచూడ శక్యముగాని దివ్యప్రభతో విష్ణువును తన ఉదరమందు భరించుచున్న ఆమెను దేవతలహర్నిశము నిట్లు స్తుతించిరి.
దేవతలు దేవకీ దేవిని స్తుతించుట
దేవీ నీవు స్వాహా స్వధా విద్యా సుధా స్వరూపిణివి. జ్యోతి స్వరూపురాలవు. సర్వలోక రక్షణమునకై భూలోకమందవతరించితివి. దేవీ ప్రసన్నురాలవగుము. ఎల్లజగత్తునకు మేలొనరింపుము. ఎవ్వనిచే నెల్ల జగము తరింపచేయబడెనో ఆ ఈశ్వరుని నీవు ప్రీతితో ధరింపుము. ఇట్లు స్తుతింపబడి ఆ తల్లి జగద్రక్షిణకారణమైన పుండరీకాక్షుని గర్భమున దాల్చెను. అవ్వలయెల్ల లోకములనెడి పద్మములను వికసింప జేయుటకు అచ్యుతుడను సూర్యుడు పూర్వసంధ్యా సమయమందు దేవకీయందావిర్భావము జేసెను. అఖిల జగదాధారమూర్తియైన జనార్దనుడు నడిరేయి జనించుచుండగ మేఘములు అల్లన గర్జనము చేసినవి. దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. వికసించిన నల్లకలువరంగులో నాల్గు బాహువులతో శ్రీవత్సవక్షుడైయున్న ఆ మూర్తినిచూచి వసుదేవుడు స్తుతించెను. ప్రసాద గుణభరితములైన వాక్కులతో స్తుతించి ఆతడు కంసునివలన జడిసి యిట్లు విన్నవించెను. ఓ దేవదేవ శంఖచక్ర గదాధరా నీకలరూపుజూపితివి. నేనది తెలిసి కొంటిని. దయచేసి ఈ రూపమును మరుగు పరపుము. ఇది తెలిసిన యెడల కంసుడీక్షణమే నన్ననేక యాతనలకు గురిచేయును. ఈ కారాగారమున నీవవతారముజేసితివని వానికి దెలియుట ప్రమాదము. అవ్వల దేవకియు నిట్లనియె. అనంతరూపుడు విశ్వరూపుడునై తనయందెల్ల లోకములను భరించు దేవదేవుడు తన మాయంగొని బాలరూపమున వెలువడిన ఈ స్వామి మా యెడల ప్రసన్నుడగుగాక! ఓసర్వాత్మమూర్తి ఈ చతుర్భుజరూపమును ఉపనంహరింపుము. ఓ దైత్యాంతక నీ ఈ అవతారమును కంసుడెరుగకుండుగాక. అన విని శ్రీ భగవంతుడు పుత్రార్థినివై మున్ను నన్ను స్తుతించితివి కావుననది ఇపుడు సఫలమైనది. నీ ఉదరమునుండి ఇపుడందులకే అవతరించితిని. అని స్వామి మిన్నకుండెను.
వసుదేవుడు ఆ రాత్రియే ఆ శిశువునెత్తుకొని కారాగారము వెడలెను. కారాగార రక్షకులు యోగనిద్రా మోహితులైరి. మధురానగర పాలకులుగూడ నయ్యెడ నిద్రావశులయిరి. నడిరేయిమేఘములు మిక్కిలిగా వర్షించుచుండ శేషుడు తన పడగలు విప్పి పైనిగప్ప సుళ్ళుతిరిగి కెరట మువ్వెత్తుగ పరవళ్ళు ద్రొక్కు లోతైన యమునానదిని మోకాలిబంటి లోతు గొన్నదానిని వసుదేవుడు విష్ణువునెత్తుకొని దాటెను. అదే సమయమున కంసునికి గప్పము జెల్లింపనటకు వచ్చియున్న నందుడు మొదలగు గోపవృద్దుల నాతడు యమున దరిని దర్శించెను. మఱియునతడు బాలుని యశోదప్రక్కలోనుంచి అందున్న పిల్లనెత్తుకొని వచ్చెను.
అవ్వల యశోద మెళుకువగొని పుట్టిన కుమారుని జూచెను. నల్లకలువరేకుల బోలి నిగనిగలాడు నల్లనిమేనివానిని శిశువునుచూచి యెంతేని సంబరబడెను. అట వసుదేవుడును నా బాలికంగొని యింటికివచ్చి దేవకి పక్కలోనునిచి అప్పటియట్ల నుండెను. అవ్వల కారాగార రక్షకులు పిల్లయేడుపువిని తటాలునలేచి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి నివేదించిరి. కంసుడు అపుడు వేగవచ్చి ఆ పిల్లను పట్టుకొనెను. దేవకి మృదుస్వరమున విడువు విడువుమని వారించుచున్నను వాడటనున్న బండపై ఆ బాలికను విసరికొట్టెను. ఆ శిశువాక్షణమ ఆకశమందు నిలచి ఆయుధములతో గూడిన ఎనిమిది బాహువులతో అపురూపమైన రూపుగొని బిగ్గరగానవ్వి రోషముగొని కంసునింగని కంసా ! నన్ను విసరినంతన నేమయ్యెను. నిన్నుజంపువాడొకడు పుట్టియున్నాడు. క్రూరుడవగు నీ పాలిటికి మృత్యువు దేవతల సర్వస్వ మూర్తి అవతరించియున్నాడు ఇదినీమనస్సులో బెట్టుకొని నీకేది హితమో యది చేసికొనుము. ఇట్లాదేవి దివ్యగంధ మాల్యభూషణదారిణియైన కంసుడు చూచుచుండ సిద్ధులు పొగడుచుండ నాకసమువెంట జనియె.
ఇది బ్రహ్మ పురాణమున శ్రీకృష్ణజననకథనమును డెబ్భై ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹