Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై మూడవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి భాగము

ఇంద్రాది మోక్షణం

దేవతలు ఇంద్రునికి హితోపదేశం చేయటం :-

“ఓ రుక్మాంగదా! ఈవిధంగా గౌతమమునివద్ద అనుజ్ఞను పొందిన దేవతాగణములు ఇంద్రుడు క్రిమియై దాగివున్న సరోవర తీరానికి వెళ్ళి యిలాఅన్నాడు

‘ఓ ఇంద్రా! నీవు బయటికి రమ్ము! దేవర్షియైన నారదునితో కలసి గౌతమముని ఆశ్రమానికి వెళ్ళి అతడిని ప్రసన్నుణ్ణి చేసుకొని అనుగ్రహాన్ని పొంది నీ సన్నిధికి వచ్చాము. నీ శాపనివృత్తికి, దోష పరిహారానికీ తగిన ఉపాయాన్నికూడా తెలుసుకుని వచ్చాం. అనుగ్రహ మూర్తియైన ఆ ముని వరంగా నీకో ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. ఏదైనా దోషం సంభవించినప్పుడు సత్పురుషులు దాన్ని జనసమూహం ఎదుట ప్రకటిస్తారు. అలా పశ్చాత్తాపం చెందని పక్షంలో ప్రతిక్రియ చేసినా ప్రయోజనం ఉండదు!

చేసిన తప్పునుకప్పి పెట్టడమనే దోషం దాన్ని బహిరంగంగా ప్రకటించడంవల్ల పోతుంది! కనుక ఓ ఇంద్రా! నీవు వెంటనే బైటకువచ్చి దేవగురువు ఎదుట నీతప్పు ఒప్పుకో! ఆ తరువాత ఆ దోషనివారణకై గౌతమముని ప్రసాదించిన మార్గాన్ని అనుసరించు! వినాయకుని షడక్షరీమంత్రాన్ని ఆయనవద్ద గ్రహించి వీతకల్మ షుడివి కా! పూర్వం శివకళ్యాణ సమయంలో కూడా బ్రహ్మ ఇలాగే కామమోహితుడై రేతస్ఖలనముకాగా సిగ్గుచెంది తలదించుకుని ఉండగా శివుడా వృత్తాంతం ఎరిగి ఉపాయంతో అతణ్ణి నిర్దోషుడిగా చేశాడు.’

ఇలా దేవతలచేత అనునయించబడినాక ఇంద్రుడు తానున్న తామర తూడునుండి బైటకువచ్చి నిలిచాడు. శరీరమంతా రసిఓడుతూ, మలినమైన శరీరంతో దుర్వాసన కొడుతూ భరించలేనంత దుర్భరుడై ఉండగా ఆ దేవతలు తమ ముక్కులను మూసుకున్నారు.

అప్పుడు స్నానంచేసి పరిశుద్ధుడైనాక ఇంద్రుడు ఆచమించి శుచిర్భూతుడవగా, బృహస్పతి అతనికి గణేశ షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశము చెవినిబడినంతనే ఇంద్రుడు దివ్యసుందరమైన దేహాన్ని పొందాడు.ఋషిశాపమువలన సంక్రమించిన వేయి భగములు (యోని చిహ్నములు) కన్నులుగా మారాయి! ఎప్పుడైతే ఇంద్రుడిలా దివ్యదేహాన్ని దాల్చాడో దేవతలు తమ హర్షోద్వేగాన్ని ప్రకటిస్తూ జయ జయ ధ్వానాలు చేశారు.

గంధర్వులూ తమ సుమధుర గళాలతో గాత్రాన్ని ఆలపించారు. దేవతలందరూ సంతోషంతో పుష్పవృష్టిని కురి పించారు. నారదుడు మొదలైన మునులంతా దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి ఆశీర్వదించారు. కొందరు దేవతలు అతడిని ఆలింగనం చేసుకున్నారు, మరికొందరు దేవతలాతడిని స్తుతించారు.

‘ఓ ఇంద్రా! నిన్ను తిరిగి పొందటంతో మేము కృతార్ధులమైనాము. చంద్రుడులేని రేయి, తలితండ్రులులేని శిశువులాగే నీవులేని అమరావతీ నగరంకూడా శోభించటంలేదు!’ అన్న దేవతల వచనాలను విని ఇంద్రు డెంతో సంతసించి, ప్రసన్న హృదయంతో ఆ దేవతలను గూర్చి ఇలా అన్నాడు

‘ఓ దేవతలారా! నారదముని వాక్యాలచేత ప్రేరితుడనై కామ మోహితుడనై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి చేయరాని అతి హేయమైన దుష్టమైనకర్మ చేశాను! అందుకుతగ్గ ఫలితాన్ని కూడా వెంటనే అనుభవించేశాను! నన్నీ పాపకూపంలోంచి బైటికిలాగి ఉద్ధరించారు. ఓ మహాప్రభావం గల దేవతలారా మీకిదే కృతజ్ఞుడినై నమస్క రిస్తున్నాను.’

మహా ప్రభావోపేతులైన ఋషీశ్వరులకు నమస్కారము. పాపపంకిలంలో నుంచి నన్ను ఉద్ధరించటానికీ, దీనతతో శరణాగతుడనైన నన్ను రక్షించటానికీ మీకన్నా అన్యులెక్కడ ఉన్నారు? అందుకు మీరే తగినవారు! ఓ దేవతలారా! ఆ గౌతమ ఋషివద్ద ఈ ప్రశస్తమైన అనుగ్రహోపాయాన్ని ఎలా పొందారు? ఆ విశేషాలను వివరించండి!” అంటూ కోరగా ఆ వృత్తాంతాన్ని అంతటినీ దేవేంద్రునికి దేవతాప్రముఖులు వివరించారు.

“ఓ ఇంద్రా! ఆ మహామంత్ర ప్రభావం చేతనే నీవు నీ పూర్వవైభవాన్ని పొందగలిగావు! కనుక నీవు తిరిగి వచ్చి యధాప్రకారం అమరావతిలో నీవు ముల్లోకాలనూ, మమ్మల్నీ పరిపాలించు!” అంటూ వేడుకోగా ఇంద్రుడిలా బదులిచ్చాడు.

“ఓ దేవర్షులారా! నేను నా దోషాన్ని పూర్తిగా గణేశానుగ్రహం పొంది నివారించుకున్న మీదటే అమరావతికి రాగలను! మీరు మీమీ స్థానాలకు వెళ్ళండి. మీ దయతో సంప్రాప్తమైన ఉపాయం సాయంతో నేను విగతదోషుడిని కావలసివుంది! మీ అనుగ్రహవిశేషం వల్లనే నేను సహస్రాక్షుడనైనాను! క్రోధంతో ప్రజ్వరిల్లే గౌతమమునిని శాంతింపజేసి అనుగ్రహింప చేసింది కూడా మీ కృషి యొక్క విశిష్టతయే!” అంటూ దేవతా గణాలను వీడ్కొలిపి ఇంద్రుడు మంత్రానుష్టానానికి ఉపక్ర మించాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘ఇంద్రశాప మోక్షణము’ అనే 33-వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment