Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఐదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

కదంబపుర గతవర్ణనం

“ఓ చతురాననా! ఆవిధంగా చింతామణి తీర్ధమహిమను వివరించి నారదమహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమిచేశాడు? తదుపరి కధావిధానమెట్టిది? నాకు వివరించండి!” అన్న వ్యాసుని అభ్యర్ధనకు బ్రహ్మ యిలా బదులిచ్చాడు.

“ఓ వ్యాసమునీంద్రా! అలా నారదమహర్షి గణేశషడక్షరీ మహా మంత్రోపదేశం చేసి, ”చింతామణితీర్ధాన్ని” ఆ తీర్ధమహిమను వర్ణించి వెళ్ళిపోయిన తరువాత, తన తలపైనుంచి ఒక పెద్ద భారం తొలగినంత సంతోషించి, రుక్మాంగదుడు తనని వెదుకుతూ వస్తూన్న తన సేనాపరి వారాన్ని చూశాడు. రాజుని ఆతని సైనికులు పోల్చుకోలేకపోయారు. స్వర్ణకాంతితో, మన్మధుడి సౌందర్యాన్నే తలదన్నేంత అందగాడైన తమ ప్రభువైన రుక్మాంగద మహారాజు – అలా కాంతిహీనుడై, వికృతరూపం ధరించి వుండటాన్ని వారు అర్ధంచేసుకోలేక అతడిని ఇలా ప్రశ్నించారు.

“ఓ రాజా! నీ జాడ తెలియక, నిన్ను అన్వేషిస్తూ అరణ్యాలు, నదులూ అన్నీ దాటి, ఆకలిదప్పుల బారినపడి అలసిసొలసి చివరకు నిన్ను ఇప్పటికి దర్శించగలిగాము. నీకీ దురవస్థ ఎలా సంప్రాప్తించిందో? ఆ వివరం మాకు తెలియజేయవలసింది” అంటూ కుశలప్రశ్న వేసిన ఆ పరివారానికి రుక్మాంగదుడు తాను దప్పికగొని వాచక్నవి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మంచినీటిని అర్ధించిన వైనము, ఋషిపత్నియైన ముకుంద తనపై మరులుగొని తన పొందుగోరి బలవంతం చేయటమూ, తాను ఆమెను నిరాకరించినందుకు ప్రతిగా, ఆమె తనకు శాపమివ్వడమూ, అప్పుడు విధివైపరీత్యానికి ఖిన్నుడై దుఃఖిస్తున్న తనకు దేవఋషియైన నారదమహర్షి ప్రత్యక్షమై, చింతామణి క్షేత్ర మహిమనూ అక్కడ స్నానంచేస్తే నాకు గల సమస్తచింతలూ తొలగగలవన్న ఉపాయం ఎరిగించటమూ అంతా పూసగుచ్చినట్లు వివరించి, తాను ఆ చింతామణి క్షేత్రానికి వెళ్ళదలిచానని చెప్పాడు.

ఆ తరువాత పరివార సమేతుడై చింతామణి తీర్ధమునకు వెళ్ళాడు. ఆ తీర్ధాన్ని సందర్శించినంత మాత్రాన్నే ఆ రాజు తన రోగభూయిష్టమైన శరీరాన్ని పాము కుబుసం వీడినట్లు విడిచి, దివ్యదేహాన్ని పొందాడు.

అప్పుడు ఆతడు పూర్వంలా బంగారువన్నె దేహంగలిగి ప్రకాశించాడు. ”ఆహా! నారదమహర్షి వాక్యాలు అక్షరసత్యాలుకదా!” అని మనస్సులో సంతోషాన్ని అనంతమైన ప్రశాంతినీ పొంది, ఆ చింతామణీ తీర్ధంలో విధివిధానపూర్వకంగా పుణ్యస్నాన మాచరించి, అనేక దానాలను సైతం ఆచరించాడు. ఎంతో సంతోషంతో భక్తిగా అక్కడ వెలసిన వినాయకుని అర్చించాడు.

ఇలా అర్చిస్తూ ఉండగా సూర్యకాంతిని తలదన్నేటట్లున్న ప్రకాశం కళ్ళుమిరుమిట్లు గొలుపుతూ ఉన్న ఒక దివ్య విమానం అతని కంటపడింది. అందులో ఉన్న వైనాయక గణములు అప్సరలతో, కిన్నర కింపురుష గణాలతో అలరారుతూ ఉండటాన్ని చూసి, అందులోని వారిని ”ఓ దూతలారా! మీరెవరు? ఎవరి దూతలు? ఎక్కడినుండి విచ్చేశారు? మీ ఆగమనంలోని కారణమేమిటి?” ఆ వివరాలు దయతో తెలుప”మంటూ ప్రార్ధించగా, ఆ వైనాయక దూతలిలా అన్నారు.

“ఓరాజా! నీవు ధన్యుడివి! అనన్యభక్తితో చింతామణీ తీర్ధములో సుస్నాతుడవై, విధివత్తుగా విఘ్ననివారకుడైన గణేశుని అర్చించి సకలము లైన దానాలనూ శ్రద్ధతే చేశావు. కనుక నీవు కోరిన అభీష్టము నెరవేరింది. చింతితార్ధములన్నీ ఇచ్చేవాడు గనుకే ఆ దేవదేవునికి ”చింతామణీ వినాయకుడ”న్న ఖ్యాతి కలిగింది! త్రికరణశుద్ధిగా ఆత్మార్పణబుద్ధితో నీవు చేసిన ఆరాధన ఎంతోఫలప్రదమైనది! అంతేకాదు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన గణపతికిచేసే అర్చన, ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆ దేవుడు నిన్ను అనుగ్రహించి సశరీరునిగా తీసుకురమ్మని మమ్మల్ని ఇక్కడకు ఈ ప్రత్యేక విమానంలో పంపించాడు! కనుక నీవు వెంటనే దీన్ని అధిరోహించి, ఆ వినాయకుని సన్నిధికి రావలసింది!” అంటూ కోరారు.

“ఓ వ్యాసమునీంద్రా! అలా దూతల వాక్యములు విని రుక్మాం గదుడిలా బదులు పలికాడు.”

‘ఓ దూతలారా! సకల జగన్నియామకుడైన ఆ దేవదేవుడెక్కడ? మందబుద్ధినైన నేనెక్కడ? సర్వవ్యాపకుడూ, అవ్యయుడు, త్రిమూర్త్యాత్మ కుడు, కారణాతీతుడైన ఆ విఘ్నేశ్వరునకు నామీద ఇంతటి ఆదరణ ఎలాకల్గింది? ఇది అనంతకోటి పుణ్యప్రదమైన ఈ తీర్ధమహిమా? లేక నా పూర్వజన్మల సుకృతం ఈనాటికి పరిపాకమైనదా? బహుశః అందు వల్లనే కాబోలు! పుణ్యమూర్తులైన మిమ్మల్ని చూడగలిగాను!

మీరు అనంత పుణ్య స్వరూపులవటం వల్లనే అనునిత్యం ఆ స్వామి సన్నిధిలో ఉంటూ, ఆయనను సేవించుకునే మహద్భాగ్యం పొందారు. యిలా పలుకుతూ, వారికి నమస్కరించి వారితో రుక్మాంగదుడు యిలా అన్నాడు.

“ఓ దూతలారా! రాజనగరులో నా తండ్రియైన భీముడు పరమ ధార్మికుడు, సత్యసంధుడు అమేయ పరాక్రమోపేతుడై ఉన్నాడు. నా జననియైన చారుహాసిని కూడా పరమ పతివ్రత. వయోవృద్ధులైన నా జననీ జనకులను విడిచి కేవలం నా స్వార్ధం మాత్రమే చూసుకొన బూనటం అనుచితంకదా?” అందుకాదూతలు “అయితే ఓ రుక్మాంగదా! నీవు వారి పేరిట కూడా సంకల్పం చెప్పి కుశాకంకణం (దర్భలతో పేనిన కంకణం) ధరించివారి సద్గతి నిమిత్తమైకూడా ఈ చింతామణీ తీర్ధంలో స్నానం చెయ్యి!ఆ పుణ్యవిశేషంవల్ల వారుకూడా గణేశలోక ప్రాప్తిని నిస్సందేహంగా పొందగలరు” అన్నారు.

దూతల ఆ సూచనమేరకు రాజు కుశా కంకణాలను తన తలి దండ్రుల పేరిట, తన రాజ్యంలోని ప్రజలపేరా ధరించి, ఆ పుణ్యతీర్ధంలో స్నానాలు విడివిడిగా ఆచరించాడు. అలా స్నానవిధులను సంకల్ప సహితంగా, సమంత్రకంగా నిర్వహించాక, వినాయకదూతలు మరికొన్ని విమానాలతో వచ్చారు.

ఆకాశమండలమంతా మంగళవాయిద్యాలతోనూ, వేదఘోషల తోనూ గంధర్వుల గానంతోనూ దశదిశలా మారుమ్రోగింది. అప్పుడు రుక్మాంగదుడు తల్లిదండ్రులకు, పురజనులకూ తన చింతామణీ తీర్ధపు స్నానఫలాన్ని ధారపోశాడు. ఆ తరువాత మాతాపితరులతోనూ, పురజనుల తోనూ కూడి గణేశస్థానానికి ఆ ప్రత్యేక విమానాన్ని నధిరోహించి వెళ్ళాడు.

ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా ఆ గణేశతీర్ధ పుణ్యప్రభావంచేత బాల గోపాలమూ సద్గతిని పొందారు. ఓ మునీంద్రా! నీవడిన చింతామణీ క్షేత్ర మహత్యాన్నంతటినీ వివరించాను. ఏ మానువులు ఈ మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారుకూడా సద్గతిని పొందుతారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘కదంబపుర గతవర్ణనం’ అనే 35-వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment