బృందావన గమనము
వ్యాసులిట్లనిరి.
వసుదేవుడు కారాగృహముక్తినంది నందుని బండియెక్కి నాకు పుత్రుడు గల్గినాడని ఆనంద భరితుడగు చున్న నందుని జూచెను. మరియు అతనితో నాదరము గొని నీకి వార్థకమందు పిల్లవాడు గల్గినాడు. రాజునకు మీరేటేట జెల్లింపవలసిన పన్ను గట్టుటకు వచ్చియది చెల్లింపబడెగదా వచ్చినపనియైనది. శీఘ్రముగ గోకులమున కేగుడు నాకు అక్కడ రోహిణియందు శిశువు పుట్టినవాడు మీ బిడ్డనట్లు వానిని తమరు రక్షింపవలయును. అనియె.
నందాది గోపకులిట్లు తెలుపబడి బండ్లమీద ధనభాండముల నెక్కించుకొని తెచ్చిన ధనమును పన్ను జెల్లించి వ్రేపల్లె యందుండగా బాలఘాతినియైన పూతన వచ్చి నిదిరించుచున్న కృష్ణునెత్తుకొని ఒకరేయి పాలిచ్చెను. ఆమెయెవనెవ్వనికి చనుగుడిపేనో వానివాని శరీరము నశించుచుండును. కృష్ణుడా రాక్షసి స్తనము ఇరుచేతులనొత్తిపట్టుకొని కోపమున పాలతో బాటు ప్రాణములం ద్రావివైచెను. అది ఆర్చుచు ప్రేవులు తెగి ప్రాణములు వాసి పుడమిం బడి పోయెను. దాని అరుపు విని హడలిపోయి మేల్కని వ్రేపల్లెలోని జనము పూతన ఒడిలో నున్న కృష్ణుని కూలిపడి యున్న ఆ రక్కసినిం గాంచిరి. యశోద తటాలున కృష్ణునెత్తుకొని జడిసిపోయి అవుతోక తలచుట్టు తిప్పుట నుదుట గోమయము బొట్టువెట్టుట మున్నగు అంగరక్షలు చేసి చంటిపిల్లలకగు దోషమును వారించెను. మఱియు ఆ తల్లి ఇట్లు రక్షాకవచము పఠించెను.
ఎవని బొడ్డునందు బొడమిన తామర పువ్వునుండి జగత్తు పొడమినదో ఆ సర్వభూతకర్తయగు హరి నిన్ను రక్షించుగాక! ఎవ్వని కోరుతుట్ట తుద ధరింపబడిన ధారుణి సర్వజగత్తును ధరించుచున్నదో ఆ వరాహ రూపముల దాల్చిన వేల్పు కేశవుడు నిన్ను రక్షించుగాక! నీ గుహ్యమును జఠరమును విష్ణువు నీ పిక్కలను బాదములను జనార్దనుడు రక్షించుగాక! ఎవ్వడు వామనమూర్తియై క్షణములో మూడడుగులిడి ముల్లోకముల నాక్రమించె నా వామన మూర్తి ఆయుధములగొని నిన్ను బ్రోచుగాక, గోవిందుడు నీశిరస్సును గాపాడుగాక! కేశవుడు నీకంఠమును రక్షించుగాక ! నీముఖము నీ బాహువులు నీ ముంజేతులను మనస్సును సర్వేంద్రియములను అవ్యాహతైశ్వర్యుడు అవ్యయుడునగు నారాయణుడు రక్షించుగాక! నలుదిక్కుల నిన్ను వైకుంఠుడేలుగాక! విదిక్కులందు మదుసూదనుడు బ్రోచుగాక! అంబర వీథిని హృషీకేశుడు మహీధరుడు భూమియందును నిన్ను రక్షించుగాక ! అని ఇట్లు యశోదమ్మ చేత మంగళా శాసనములు చేయబడి బాలకుడు బండి క్రింద పొత్తళ్ల బరుండ బెట్టబడియె. గోపకులట కూలిన పూతన కళేబరమును జూచి చచ్చిన దానిం జూచియు హడలిపోయి అబ్బురమందిరి.
ఒకతరి నా బండి క్రింద పరుండిన మధుసూదనుడు రెండు పాదములు మీదికెత్తి పాలకై ఏడ్చుచుండెను. ఆ స్వామి పాదముల తోపునకు ఆ బండి తలక్రిందులాయె. అందున్న పాలకడవలెల్ల బోర్లపడియె. అంత నా గోప గోపీ జనము హాహాకారమొనరించిరి. అందఱు వచ్చి వెల్లగిల పరున్న శిశువుంగని ఈ బండి ఎవ్వని వలన దిరుగువడినదని అడిగిరి. అటనున్న పిల్లలీ పిల్లవాని వలననే ఇది పడినది. ఏడ్చుచు ఈతడు పాదములాడింప అవి తగిలి ఈ బండి తలక్రిందులైనది. ఈ పని మఱి యెవ్వనిది గాదనిరి. అదివిని గోపకులింకను వింతవడిరి.
నందగోపుడా బిడ్డ నెత్తికొని వెఱగువడియె. యశోద అబ్బురపడి పగిలిన కుండ పెంకులు గల బండిని పెరుగు పూలుపండ్లు నక్షతలచే అర్చించెను. గర్గాచార్యులు గోకులమందు వసుదేవు ప్రేరణముచే (కంస భీతిచే) ఎవ్వనికి తెలియ రాకుండనే ఆ బలరామ కృష్ణులకు జాతకర్మాది సంస్కారము లొనరించె. ఆ ముని పెద్దవానిని రాముడని యవ్వలి వానిని కృష్ణుడని పేర్కొనియె. అత్యల్ప కాలముననే ఆ బాలురు మహాబల సంపన్నులయిరి. కాలుచేతులు ఆడించుచు క్రమముగా బ్రాకుచు వెలిబూడిద మెడల బూసుకొని యిట్టుటు నడయాడుచుండ ఆ అన్నదమ్ములను ఆ తల్లి యశోద పట్టలేని దయ్యెను. గోవాటమునందు లేగల దొడ్డియందు నాబాలు రానాడే పుట్టిన లేగదూడల తోకలు గొని లాగుచు నిద్దరోక్కచోట నడయాడుచు నాటలాడుచుండ యశోదవారిబట్ట లేనిదయ్యె. ఒక్కతఱి నాతల్లి కినుకుగని కృష్ణుని ద్రాడుగొని రోలికిం గట్టి ఓరోరి అల్లరిపిల్ల వాడ ! నీ చేత నైన నేది వెళ్లు మెటువోదవో చూచెదనని యింటి పనులు సక్కవెట్టు తొందరలో నుండ రోలిడ్చుకొంచు పోయిపోయి కమల నయనుడు హరి రెండు మద్ది చెట్లనడుమం జొచ్చి యిరుకుత్రోవం జనుచుండ రోలు తిఱగుడువడి తాక నాచెట్లు పెనుగొమ్మల గూలి పడిపోయెను. అంత నచ్చట పొడమిన కటకటా శబ్దము విని బెదరి వ్రేపల్లెనము గ్రమ్ముకొని ఆ పెనుమ్రాకుల మొదళ్ళు పెల్లగిలి కొమ్మలు విఱిగి పుడమిని పడ జూచిరి. దానితో బాటు వచ్చియు రాని పలువరుస మందహాస నింపుగులుక నామ్రాకులజంట నట్టనడుమ బొజ్జదిఱుగ పెనురజ్జువున గట్టబడినా పలుదిట్టనా చిట్టి కుఱ్ఱంగనిరి.
దామముచే నుదరమునం గట్టబడినవాడు గావున దాన నాతడు దామోదరుడయ్యె. అవ్వల గోపవృద్దులు నందాదులు చెదరిపోయి యెడనెడ నిట్లుగల్గు మహోత్పాతములకు జడిసిపోయి యిచ్చోటు వలనబని లేదెటకేని కారడవికి బోవుదమనికొనిరి. పెక్కురకముల వ్రేపల్లెందోచు నుత్పాతములివి. పూతనగూలుట బండి తలక్రిందులగుట పెనుగాలి మఱియే దోషములేక చెట్లుగూలిపడుట ఇవన్నియు మనకు నాశనహూతువులు అందుచే నిటనుండి లేచి ఇపుడు బృందావనమున కేగుదుముగాక ! భౌమమయిన ఉత్పాతదోష మేర్పడకుండ నీ పల్లెను విడచి పోవలయునని నిశ్చయించిరి. మఱియు తమతమ వారిని బందుగులను విలంబము వలదులెండని హెచ్చరించి అందఱు బండ్లెక్కి గోధనములతో (మందలతో) నాలమేపరులను వ్రజవాసులను పిలిచికొనుచు మందలుగా తరలి చనిరి. క్షణములో నా వ్రజవాటము సర్వావయవ భంగము పొంది కాకికూతల వెఱవై పోయెను.
భగవంతుడు కృష్ణుడు గోవుల క్షేమాభివృద్దులను గోరి శుభమయిన మనస్సుతో బృందావనమును ధ్యానించెను. అందుచే మిక్కిలి పరుషమైన గ్రీష్మకాలమున గూడ వర్షఋతు ధర్మములు దోచి వానకారునంబోలె ఎటు చూసినా లేత పచ్చికలు అచ్చెరవు గొలిపె. సర్వ గోకులమట్లు బృందావన నివాసమ్యె. వారెక్కివెళ్లిన బండ్లు నిలిపిన యవ్వనవాటము అర్ధచంద్రాకారమున శృంగార మొలకించె. రామదామోదరులక్కడ యాలకాపరులైరి. ఆ గోవుల మందలందు గోశాలలందు (గోష్ఠములందు) సవిలాసముగా ఆ బలరామకృష్ణులాడుకొన జోచ్చిరి. కొండెసిగలం నెమలి పింఛములను జెఱవికొని యయ్యడవి పూలంజుట్టు లందురిమి పిల్లన గ్రోవులూది లయన గుణముగ వాద్యములు వాయించుచు నిరువంక జునుపములు వ్రెల నగ్ని కుమారులలోయన్నట్లు(కుమారస్వామి పోలికలతోనన్నమాట) నవ్వుచు గేరుచు గేరింతలుకొట్టుచు ఆ వనమందు సంచరింపదొదంగిరి. ఒండొరులంగని పరియాచకములు ఆడుకొనుచు నంగడికాండ్రగూడి దూడల మరలించుకొనుట నిట్లు సరసన వారేడేండ్ల ప్రాయము వారైరి.
ఎల్లలోకముల గాచువారచ్చటనట్లు దూడలంగాచువారైన తఱి నింగినెల్ల మబ్బులగ్రమ్మ వారిధారల దశదిశ లోక్కటి గావించి వానకాలమేతెంచె. ఎటుచూచిన చెట్లుచేమలు తీవలు మొగ్గదొడిగి కొన్ననలుపూసె. ఇంద్రగోపములు మెఱసి మరకత మణింబద్మరాగములు పొదవినట్లందముగుల్కి నదీ జలపూరములు కట్టలుద్రెంచుకొని నడిమంత్రపు సిరినొంది దుందుడుకువడు చెడగరుల మనస్సులట్లు ఉన్మార్గములు(దారితప్పి నడచునవి) అయ్యె. సమయముగాని సమయమునేని స్వేచ్చగ నా మందకువచ్చి ఆ వీరులు బలరామకృష్ణులు ఈడుజోడు వారింగలిసి అమరులట్లా బ్రందావన మందాటలాడిరి.
ఇది బ్రహ్మపురాణమున బృందవనాగమనము అను డెబ్భై ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹