ఉపాసనా ఖండము మొదటి భాగము
గృతృమదోపాఖ్యానం
ఆ తరువాత వ్యాసమునీంద్రుడిలా ప్రశ్నించాడు..
“ఓ చతురాననా! చింతామణి గణేశతీర్ధ మహిమనంతటినీ చెప్పావు. కౌండిన్యపురవాసుల యొక్క రుక్మాంగదునియొక్క చరిత్రలను వివరించావు. కాని విరహాంతరింతయైన ఆ చక్నవి మహర్షిపత్నియైన ముకుంద వృత్తాంతమేమిటో తెలియజేయ గోరతాను! అలా రుక్మాంగదుని శపించిన తరువాత ఆమె ఏమైంది? ఆ వివరం దయతో నాకు తెలియజేయవలసింది!”
ఈ మాటలకు చతుర్ముఖుడైన సృష్టికర్త యిలా బదులిచ్చాడు. “ఆ ప్రకారంగా శాపోపహతుడైన రుక్మాంగదుడు తనతో పొందును తిరస్కరించి వెళ్ళిపోయాక, అరణ్యంలో చెలరేగిన కార్చిచ్చుచేత అడవి మొత్తం దగ్ధమైపోయినట్లు, ఆ ఋషిపత్నియైన ముకుందుకు తను మదనాగ్నిలో తప్తురాలవటంచేత అన్నపానాదులు ఎంతమాత్రం రుచించలేదు. శైత్యోపచారములుగాని, నృత్యగీతాలుగాని ఆమెకు ఇసుమంతైనా స్వాంతనను యివ్వలేకపోయాయి! ఆకలిదప్పికల బాధతో ఆమె సోషతో మూర్ఛిల్లింది! ఆ బడలికకూ, శ్రమకూ అలసి సొలసిపోయి, నిద్రించింది.
అలా నిర్జనారణ్యంలో అత్యంత సౌందర్యవతి, లావణ్యవతియైన ఋషిపత్ని ఒంటరిగా నిద్రించటమూ, రుక్మాంగదుని పొందుకై కామా తురురాలై, వివశురాలై వుండటమూ చూసిన ఇంద్రుడు వెంటనే తాను రుక్మాంగదుని రూపం దాల్చివచ్చి కాముకురాలైన ఆమెతో కూడి సుఖించి రతిలో రమించాడు. ఆమెను చుంబనల (ముద్దుల) తోనూ, కౌగిలింతల తోనూ తృప్తిపరచి, సంతోషించాడు.
ఆ ఋషిపత్నికూడా ఆ సురాధిపతిని రుక్మాంగదుడిగానే భావించి శృంగారరసంలో ఓలలాడి పరవశించింది! ఆ సంగమం తరువాత తృప్తురాలైన ఆమె చాలా సిగ్గుపడి తన ఇల్లు చేరుకున్నది. ఇంద్రుడు కూడా తన నిజరూపం దాల్చి అంతర్ధానం చెందాడు.
ఆ ముకుంద రుక్మాంగదుడు తనతో రమించినాడని భావించి గర్భం ధరించింది! నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో శుభ ప్రదుడైన కుమారుణ్ణి కన్నది. లోకోత్తరమైన సౌందర్యవంతుడైన ఆ పిల్లవాడు భూపతనమవ్వగానే బ్రహ్మాండగోళాలు దశదిశలు దద్దరిల్లేటంతటి పెద్ద ధ్వని కలిగింది. ఆ ధ్వనిని విన్న పక్షులన్నీ భయపడి ఆకసంలోకి పైకెగిరినాయి. ఆ ధ్వనికి వాచక్నవి మహర్షికూడా తన నిత్యానుష్ఠానము వీడి ఆశ్రమం చేరుకున్నాడు. ఐతే తనభార్య చేసిన దుష్టచేష్టను ఏమాత్రం కనుక్కొనలేకపోయాడు.
పుట్టినవాడు తన కుమారుడేనన్న భావంతో ఆ బాలుడికి జాతకర్మవంటి సంస్కారాలను యధావిధి గా జరిపించాడు. తన శక్త్యానుసారం బ్రాహ్మణులకు అనేక దానధర్మాలను చేశాడు. పదకొండవరోజున ఆ బాలుడికి ‘గృత్సమదుడు’ అని నామకరణం చేశాడు.
అతడికి ఐదవ ఏడు రాగానే ఉపనయన సంస్కారం జరిపాడు! ఆ వటువుచేత వేదవ్రతాలను యధావిధిగా చేయించాడు. అప్పుడు గురుకులవాసానికి వెళ్ళిన గృత్సమదుడు ఏకసంధాగ్రహి గానూ కేవల శ్రవణ మాత్రం చేతనే సకల విద్యలనూ నేర్చుకొని, వాటిలో ప్రౌఢి మను సంపాదించాడు. వేదశాస్త్రాలలో నిధియై, స్వకర్మానుష్టానంలో కుశలుడైనాడు.
ఇలాఉండగా వాచక్నవి మహర్షి ఒకానొక శుభముహూర్తంలో తన కుమారుడైన గృత్సమదుడిని చేరబిలిచి “గణానాంత్వా” అనే ఋగ్మంత్రాన్ని ఉపదేశించి ”నాయనా! ఇది వైదిక మంత్రాలన్నింటిలోకీ సర్వశ్రేష్ఠ మైనది. అన్ని సిద్ధులనూ అలవోకగా ప్రసాదిస్తుంది!
కనుక ఓ కుమారా! దేవదేవుడైన గజాననుని ఈ మంత్రంతో ఏకమనస్సుతో నిశ్చలంగా ధ్యానించు! అలా చేస్తే సర్వోత్కృష్టమైన సిద్ధిని పొంది, ఈ లోకంలో తరగని కీర్తిని పొందగలవు!” అంటూ ఆశీర్వదించాడు.
అలా తండ్రినుండి పొందిన మంత్రాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జపధ్యానములతో గృత్సమదుడు అనుష్టించాడు. ఇలా చాలాకాలం గడి చింది. నిరంతరం గణేశధ్యాన తత్పరుడైన గృత్సమదుడు అచంచల భక్తి శ్రద్ధలతో గణేశుని ఆరాధించాడు. ఇలాఉండగా, ఒకానొక సమయంలో మగధరాజ్యాన్ని పరిపాలించే మగధుడనే రాజుయింట పితృశ్రాద్ధము సంప్రాప్తమైంది. ఆ రాజు ఎంతో ధార్మికుడు, అత్యంత సౌందర్యవంతుడై, మాన్యుడని తలవబడేవాడు. ఆ రాజుచేత ఆహ్వానించబడి వశిష్టుడు, అత్రి మొదలైన ప్రముఖ మహర్షులంతా కూడా అక్కడికి వచ్చారు.
గృత్సమదుడు కూడా రాజాహ్వానాన్ని అందుకుని ఆ రాజమందిరాన్ని చేరుకున్నాడు. అక్కడ అన్యోన్యమైన శాస్త్రచర్చలలో తన పాండిత్యీ ప్రకర్షచేత అందరినీ వాదములో ఓడించాడు. అప్పుడు అత్రిమహర్షి అతడిని చులకన చేసి మాట్లాడాడు.
‘ఓయీ! నీవు తపస్వివని మాన్యత కల్పించామేకాని, నీవు మునులలో గణింపతగినవాడివి కావు! ఎందుకంటే నీవు క్షత్రీయుడైన రుక్మాంగదుడి వలన జన్మించావు! నీవు మా పంక్తిని కూర్చోతగవు! అవునో కాదో విచారణ జరుపుకొని నిర్ధారించుకో! నీవిక పైపై ఆర్భాటాలను చాలించి నీ ఆశ్రమానికి వెళ్ళటం మంచిది!”
ఈ మాటలకు తోకత్రొక్కిన పాములా లేచిన గృత్సమదుడు క్రోధోద్దీపితుడై ‘ఓ మునీశ్వరులారా! మీరారోపించినట్లు నేను రుక్మాంగదుని కుమారుడను కానిపక్షంలో మిమ్మల్నందర్ని నా శాపాగ్నిలో భస్మం చేస్తాను!” అంటూ విసవిసా తన ఆశ్రమాన్ని చేరుకుని తన తల్లినిలా నిలదీశాడు.
“ఓ పాపాత్మురాలా! నా జన్మకు కారకుడెవరో నిజంచెప్పు! నీ యొక్క బుద్ధిచాపల్యంవల్ల, శీలరాహిత్యంవల్ల కళంకితవైనావు! ఇప్పటికైనా నీవు నిజం చెప్పనిపక్షంలో నిన్ను నా తపోగ్నితో భస్మంచేస్తాను!” అంటూ ఆగ్రహోదగ్రుడై నిప్పుల్నే చెరిగాడు!
ఆ మాటలకు శాపభయంతో గడగడలాడుతూ ఆ ముకుంద వివశురాలై ”మృగయాసక్తుడైన, అతి సౌందర్యోపేతుడైన రుక్మాంగదుని చూచి తాను మోహించాననీ, స్నానార్ధం వాచక్నవి నదీతీరానికి వెళ్ళి నప్పుడు తానతని పొందుకోరానని, అందుచే అతడే నీ తండ్రియని” గడగడలాడుతూ చెప్పింది. ఆ మాటలకు గృత్సమదుడు సిగ్గుతో చితికి పోయాడు కోపంతో వణికిపోతూ తల్లిని ఇలా శపించాడు.
“నీవు నీ సౌందర్యాన్ని ఎరగాచేసి ఉచితానుచితాలు మరచి పశువులాప్రవర్తించావు. కనుక నీవు అడవిలో కంటకవృక్షము (ముళ్ళ చెట్టు) గా మారి అందరిచేత వదలివేయబడుదువు గాక!” అప్పుడు ఆ ముకుందకూడా యిలా ప్రతిశాప మిచ్చింది.
“ఓ కుమారా! జన్మనిచ్చిన తల్లినని కూడా చూడకుండా నన్ను అనాదరించి శపించావు! కనుక నీకు త్రిలోకాలకూ కంటకుడైనవాడూ అతి దారుణమైనవాడూ, మహా బలపరాక్రమోపేతుడైన రాక్షసుడు కొడుకుగా జనించుగాక!”
ఇలా ఆ తల్లీకొడుకులిద్దరూ ఆగ్రహంతో ఒకరినొకరు శపించుకొన – ఆ ముకుంద బదరికాశ్రమంలో ప్రాణులేవీ సంచరించని ప్రాంతంలో కంటకవృక్షమై (ముళ్ళచెట్టె) జన్మించింది. ఆ సమయంలో అశరీరవాణి ఆకాశంలోంచి ”ఇంద్రుని వలననే గృత్సమదుడు జన్మించాడు” అంటూ పలికింది. ఈ ప్రకారంగా అక్కడి అలజడిఅంతా సమసిపోయాక గృత్సమదుడు తన మంత్రానుష్టానానికి అరణ్యానికి వెళ్ళి పోయాడు.
ఎవరైతే ఈ గృత్సమదోపాఖ్యానాన్ని శ్రద్ధతో వింటారో, పఠిస్తారో, అట్టివారు అన్ని సంకటములనుంచీ విడివడి, తమతమ మనోభీష్టాలను తప్పక పొందగలరు!” అంటూ చతుర్ముఖుడు వ్యాసమహర్షికి చెప్పాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘గృత్సమదోపాఖ్యానం’ అనే ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹