Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

వరప్రదానం

అనంతరం వ్యాసమునీంద్రుడిలా ప్రశ్నించాడు…

“ఓ పద్మసంభవా! ఆ తరువాత జరిగిన గృత్సమదుని వృత్తాంతమును తెలుసుకొన గోరుతున్నాను. నాకు చెప్పవలసింది!” అంటు వేడిన వ్యాసమహర్షితో బ్రహ్మ ఇలా అన్నాడు.

“ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు సకల మునిగణాలు గృత్సమదుని గౌరవించి నమస్కరించారు. అప్పటినుంచీ సకల కార్యారంభములలోనూ చేసే గణపతి పూజలో ముందుగా ఆ మునికే నమస్కరించసాగారు. ఈరీతిగా ఎంతో ప్రఖ్యాతిని గాంచిన గృత్సమదుడు సునిశ్చిత భక్తితో ఏకాగ్రచిత్తంతో గణేశునే ధ్యానిస్తూ ఉత్కృష్ట భక్తిని పొందాడు! ఇలా ఉండగా ఒకానొక సమయంలో పెద్దధ్వని అయేలా ఆ ముని తుమ్మినాడు. ఆ తుమ్ము ధ్వనికి పర్వత గుహలు అదిరిపడ్డాయి.

క్షణంలో తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు. ఎఱ్ఱని దేహకాంతిని కలిగి పెద్ద ధ్వనినిచేస్తూ తేజోరాశితో కళ్ళు మిరుమిట్లు గొల్పుతూన్న ఆ బాలకుని చూసి భయంతో గృత్సమదముని గడగడా వణికాడు.

”ఆహా! ఇది విపత్తు? ఈ పుత్రుడు గజాననునిచే ఇవ్వ బడినాడా ఏమి?’ అనుకుంటూ తిరిగి తేరిపార ఆపిల్లవానివంక చూడగా సౌందర్యోపేతమైన ముఖారవిందం, పద్మరేకులవంటి విశాల నేత్రాలను కలిగి, బంగారు భుజకీర్తులతో, బాహుపురులు, దివ్యమైన కిరీటము, పాదాలంకారాలనూ కలిగి, కటిప్రదేశంలో బంగారు మొలత్రాటిని ధరించి, నవమన్మధుడిలా ఉన్న ఆ బాలకుణ్ణి చూసిన ముని యిలా ప్రశ్నించాడు.


“ఓ బాలకా! నీవెవరవు?

ఎవ్వరివాడవు?ఏంచేయడానికి వచ్చావు? నీ తలిదండ్రు లెక్కడుంటారు?ఆ మాటలకు ఆ బాలకుడిలా బదులిచ్చాడు.

త్రికాలజ్ఞాని ఓ గృత్సమదమునీంద్రా! అన్నీ ఎఱిగివుండి నన్నెందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు? అయినా నీ ఆజ్ఞను అనుసరించి చెబుతాను విను!

నేను నీ కుతము (తుమ్ము) నుండి జనించాను. కనుక నాకు తల్లి, తండ్రి యిక నీవే! నన్ను దయతో కొన్నాళ్ళు సంరక్షించు! ఇంద్రునితోసహా ముల్లోకాలనూ ఆక్రమించగల బలపరాక్రమం కల వాడిని! కొద్దికాలంలోనే నా అప్రమేయ పౌరుషాన్ని నీవు చూడగలవు”

ఈ మాటలకు ముగ్ధుడైన ఆ ముని తనలో ”ఆహా”ఈ బాలకుడెవరో పుట్టీ పుట్టగానే తాను ముల్లోకాలనూ గెలువగల సమర్ధుణ్ణంటూ ప్రకటించుకున్నాడే? వీడెవరోగాని అసాధ్యుడిలా ఉన్నాడు! కనుక వీడి శక్తియుక్తులు మరింతగా ఇనుమడింపచేయగలందులకు నా మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను! ఆ మంత్ర ప్రభావంతో వరదుడైన గణేశుడతనికి సకల వాంఛితములను ప్రసాదించగలడు! వీడివల్ల నాకూ ఘనకీర్తి లభించగలదు” అని సంకల్పించి ఆ బాలునికి తన ”గణానాంత్వా” అన్న ఋగ్మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించి తరువాత ఇలా అనుగ్రహ వచనాలతో అతడినిలా ఆశీర్వదించాడు.

”ఓ చిరంజీవి ”గణానాంత్వా” అన్న ఈ మంత్రాన్ని నీవు నిశ్చల మైన మనస్సుతో జపించు! ఆ గజాననుని అనుగ్రహాన్ని పొందిననాడు నీ సకలాభీష్టములూ నెరవేరతాయి!”

ఇలా గృత్సమదుడినుంచి మంత్రోప దేశాన్నీ, అనుగ్రహాశీస్సులనూ, బడసిన ఆ బాలకుడు వెంటనే ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళి, అక్కడ ఇంద్రియాలను నియమించి, తదేక దీక్షతో, కాలి బొటనవేలుపై నిలచి, ఐదువేల సంవత్సరాల కాలం నిరాఘాటంగా తండ్రి ఉపదేశించిన ఆ మంత్రాన్ని జపించాడు!

అప్పుడాతడి ముఖంలోనుంచి వెంటనే తపోగ్నిజ్వాలలు వెలువడి దిక్కులంతా ప్రజ్వరిల్లచేస్తూ దేవగణాలకూ, పాతాళంలోని రాక్షసులకు సైతం భయోత్పాతాన్ని కలిగించాయి! అప్పుడు ఆ బాలుని తపస్సుకు సంతుష్టుడైన గజాననుడు ఆతడి ఎదుట సాక్షాత్కరించాడు.

దిక్కులనెల్లా ప్రజ్వరిల్లచేస్తూ, సూర్యకాంతిని ధిక్కరించే తేజః ప్రకాశంతో తొండమును అలవోకగా అటూ ఇటూ ఆడిస్తూన్న ఆ గజాననుని ఘీంకారం విన్న ఆ బాలకుడు భయంతో వివశుడై నేత్రాలను విప్పి ఎదురుగా నిలచిన ఆ దేవదేవుని చూచాడు.

నాలుగు బాహువులతోనూ, పెద్ద ఉదరంతోనూ, నానాలంకారములతో అలంకరించబడి, పరశువు, పద్మము, జపమాల, మోదకములను నాల్గు చేతులలోనూ దాల్చివున్న ఆ దివ్యతేజోమూర్తియొక్క ప్రకాశానికి ముందు నిర్ఘాంతపోయి, ఆ తరువాత క్రొద్దిగా తడబడి, తిరిగి ధైర్యాన్ని పుంజుకుని ఆ ప్రభువునిలా ప్రార్ధించసాగాడు.

“ఓ దేవా! నీకు అనన్య భక్తుడను, శరణాగతుడనూ ఐన నన్ను ఇలాభయపెట్టడం నీకు భావ్యమా? సౌమ్యరూపాన్ని దాల్చినా వాంఛితార్ధములను ప్రసాదించి, నన్ను అనుగ్రహించవే!”

ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు ఆ భక్తవరదుడైన గణాధిపుడు అతడి ప్రార్ధనతో తన భయంకర రూపాన్ని ఉపసంహరించి, ఎంతో ప్రీతితో సౌమ్యరూపందాల్చి ఆ బాలకుణ్ణి పిలిచి “నాయనా! నీవు స్వస్థచిత్తుడివికా! అహోరాత్రాలు ఎవరినుద్దేశించి ధ్యానం చేశావో, ఆ నీ ధ్యానమూర్తిని నేనే! నీయందు పూర్తి ప్రసన్నతను కలిగి, నీకు వరాలను అనుగ్రహించదలచి వచ్చాను!

ఈ నా రూపం స్వప్రకాశమైనదీ, జగన్మయమైన నా పరరూపమును బ్రహ్మరుద్రాదులు కూడా తెలుసుకోలేరు! దేవతలు, మునులు, గంధర్వులు, అసురులు వీరెవ్వరికీ కూడా ఇది గ్రహింపనలవికానట్టిది! అటువంటి నేను, నీ శ్రద్ధతోకూడిన తపస్సుకు బద్ధుడనై నిన్ను అనుగ్రహించదలచాను. కోరిన వరమివ్వటానికై వచ్చాను! కనుక నావల్ల నీకేమేమి వరములు కావాలో అవన్నీ కోరుకో!” అన్నాడు.

ఆ మాటలకు ఆ బాలకుడిలా అన్నాడు ఓ దేవా! నీ దివ్యమంగళ తేజోమయ రూపాన్ని దర్శించటంతో నా జన్మ నేటికి చరితార్ధ మైంది! నాతపస్సు, నా జననీజనకులూ ధన్యులైనారు. బాలుడనైన కారణంచేత నీ మహిమా విశేషాన్ని వర్ణించలేకపోయాను. సకల జగత్తుకూ నీవే ఆధారభూతుడవు! సూర్యాది గ్రహగోళాలు నీ భావనవల్లనే ప్రకాశిస్తున్నాయి.

నీ మహిమా విశేషం చేతనే జగత్తంతా చలిస్తున్నది. అట్టి నీ మహిమావిశేషాన్ని త్రిమూర్తులైనా పూర్తిగా గ్రహింపలేరు! ఐనా నీవు దయతో వరాననుగ్రహించగోరితే ఈనాటినుంచీ ‘మూడు లోకాలలోనూ ఎక్కడా నాకు తిరుగుండరాదు! దేవఅసుర గణాలందరూ నాకు వశ్యులై ఉండాలి! దేన్ని సంకల్పించినా తక్షణమే అది సిద్ధించేలా సంకల్పసిద్ధినీ ప్రసాదించు! ఇహలోకంలో సకలభోగాలను అనుభవించాక అంత్యమున మోక్షాన్నిపొందేలా అనుగ్రహించు!

“ఓ భక్తవరదా! నేను తపస్సు ఆచరించిన ఈ ప్రదేశము ఇకనుంచీ ‘గణేశపురము’ అన్న పేరిట లోకవిఖ్యాతిని గాంచుగాక!” అంటూ వేడిన ఆ బాలుడితో గజాననుడిలా ప్రసన్నుడై, అనుగ్రహ వచనాలు పలికాడు.

“ఓ బాలకా! నీవు కోరినట్లే నీకు త్రైలోక్యాకర్షణశక్తి కలుగగలదు! నీకెవరివల్లా ఎటువంటి భయమూ కలుగదు! మూడు పురములు బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించియిస్తాను! కోరుకున్న స్థలానికి వెళ్ళే కామగమనశక్తిని అవి కలిగివుంటాయి. ఒక్క లయకారకుడైన శంకరుడి చేతతప్ప అవి భేదింపబడనివి! ఈలోకంలో నీవు త్రిపురాసురుడన్న ఖ్యాతిగాంచెదవు!

ఏనాడైతే శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడింటినీ భేదిస్తాడో ఆనాడే నీవు ముక్తి పొందగలవు! ఇది ముమ్మాటికీ సత్యము! ఇంకా నీవడిగిన ఇతర వాంఛితములన్నీ తప్పక ఈడేర గలవు!”

వ్యాసమునీంద్రా! ఈ విధంగా అతడికి వరాలనూ అనుగ్రహించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దైవవియోగానికి ఆ బాలకుడు ఖినుడైకూడా ఆ వరముల లబ్ధికి సంతోషయుక్తుడైనాడు. అనంతరం తన వరబలగర్వముతో ముల్లోకాలను ఆక్రమింప ప్రయత్నించాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”వరప్రదానం” అనే 38-వ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment