ధేనుకవధాఖ్యానము
వ్యాసులిట్లనియె:-
బలరామకృష్ణులు కలసి ఆవులను గాచుచు ఆ వనములందు తిరుగుచు చక్కని తాలవనమునకు వెళ్ళిరి. ఆ వనమందు నరగోమాంసములను తినుచు గాడిద రూపమున ధేనుకుడను దానవుడు నివసించుచుండెను. ఆ వనములో తాటిపండ్లు సమృద్ధిగా ఉండుట జూచి గోపకులు కుతూహలములో ఓ రామకృష్ణ! ఈప్రాంతము ధేనుకుని కాపుదలలో ఉన్నందున సువాసన గల ఈ పండ్లు వదలబడియున్నవి. వీనిని మేము కోరుచున్నాము. మీకది సమ్మతమైనచో వీనిని రాలగొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని పడగొట్టిరి.
ఆ చప్పుడు విని రాక్షసుడు గర్దభాకారుడు కోపముగొని వచ్చి వెనుకకాళ్ళతో వాని ఎదురు రొమ్ముపై కొట్టగా ఆ కాళ్ళను పట్టుకొని గిరగిర త్రిప్పి ఆకసమున కెగురవేసెను. వాడు ప్రాణములను బాసెను. అట్లు పడుచున్న వాని తాకిడికి పండ్లు గుట్టలుగ బడినవి. వాని జ్ఞాతులు ఖరాసురులెందరో ఎదిరింప వాయువు మోఘములను జెదరిగిట్టినట్లు వారిని తరుమ బలరామకృష్ణులు అచెట్ల మీదకు విసరిరి. దాన దాటిపండ్లన్నియు నేలపైబడి చూడనింపుగా తోచెను. క్రూరులగు నా గర్దభాకారులు మడసి పడినంత ఆ అడవి నిరాబాధమై గోపకులు గోవులు హాయిగా సంచరింప మిగుల రమణీయమై ఒప్పెను. అందలి పచ్చని లేత పచ్చికలయందు ఆ గొల్లపిల్లలు తాళఫలములను ఆరగించిరి.
ఇది బ్రహ్మ పురాణమున బాలచరితమందు ”ధేనుకవధ” వర్ణనమను ఎనబయ్యవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹