గోవర్ధనోద్ధరణము
వ్యాసుడిట్లనియె:-
ఇంద్రోత్సవము సేయబనిలేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి ఇంద్రుడు సంవర్తకమును మేఘ గణముం గూర్చి ఇట్లనియె. ఓ మేఘములారా! నేను పలుకు వచనము నాలింపుడు. నా ఆజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలను కూడగట్టుకొని కృష్ణుని ఆశ్రయ బలముచే ఉబ్బి ఉత్సవభంగము చేసివాడు. ఆ గొల్లలకు జీవనాధారము, గోపాలురు అనిపించుకొనుటకు కారణమును గోవులే. కావున వానిని రాళ్ళవాన గురిపించి బాధింపుడు. నేనును కొండశిఖరమట్లున్న ఐరావతమెక్కి వచ్చి వాయువులతోడ మీకు తోడయ్యెదను. ఇట్లు ఇంద్రునిచే ఆజ్ఞాపింపబడి మేఘములు గోవులుచెడ జడుపు గొలుపు జడివాన గురిసినవి. క్షణములో నీ ధరణి దిక్కులు ఆకాశము ఒక్కటిగ ఏకధారగ గురిసిన కుంభవృష్టిచే ఆవులు దెబ్బతిని మెడలు తలలు తిఱుగబడి పడిపోయినవి. కొన్ని గోవులు దూడలను ఱొమ్ముల అదుముకొన్నవి. కొన్ని గోవులు దూడలకెడమైనవి. కొన్ని ఆవులు గాలికి నొడలువడక బిక్క మొగముపెట్టి కావుకావుమన్నట్లు అంబారవములు చేసి అల్లన కృష్ణునిం గూర్చి మొర పెట్టుకొన్నవి. గోవులు గోపికలు గోపకులతో ఆ గోకులమెల్ల బెగడువడి వ్యాకులమౌటగని హరివారిని రక్షింప ఆలోచించెను. ఉత్సవభంగమునకు పగగొని ఇంద్రుడిది చేసెను. నేనీ గోవ్రజమును కాపాడవలయును. ఈ కొండం పెళ్లగించి ఈ గోష్ఠమునకెల్ల గొడుగుగా నెత్తి పట్టెదనుగాక అని నిశ్చయించి ఆ గోవర్ధనగిరి ఒంటిరెక్క అవలీలగ నెత్తి పట్టెను. మఱియును జగన్నాథుడు వాన అడ్డుచేసితిని. ఈ కొండ గొడుగు క్రిందకు అందఱు రండు రండు. గాలి తాకిడి లేనియెడ అనువగుచోటుల మీరు సర్దుకొనుడు. ఈ కొండవిరిగి మీదపడునేమోయని ఈ క్రింద నిలుచుటకు జడియవలదన హరిపలుకువిని గోధనములతో బండ్లకెక్కించికొన్నకుండలుమండలతో గోపకులు గోపికలు వానదెబ్బదిని ఆ కొండక్రిందికిం జొచ్చిరి. కృష్ణుడు ఆ శైలముం గేలల్లాడకుండ నెత్తిపట్టెను. వ్రజవాసులు ఆనందపడి అచ్చెరువుగొని విచ్చిన వెదకన్నులప్పగించి కృష్ణప్పంగని బాలకృష్ణలీలలను గొనియాడిరి. స్వామియు అదియొక ఆటగా ఏడురాత్రులేక ధారగానింద్రాజ్ఞగొని మేఘములు గురియ నేకధాటి నా గోవర్ధనము నెత్తికొనెను. హరియట్లు ఆ పెనుగొండ నెత్తికొన గోకులము రక్షణగొన బలారి తనప్రతిన అబద్ధమయి ఆకసమున మబ్బు విరిసినట్ల తన ఆలోచనలు వమ్మయిపోగా గోకులము వెడలి సంబరపడి స్వస్థానమునకు దిరిగి వచ్చెను.
కృష్ణుడును గోవర్ధనగిరిని యధాస్ధానము నదుంచెను. వ్రజవాసులెనలేని ఉల్లాసమున ఆ వింతంగనిరి. ఈ విధముగా గిరినెత్త గోకులము రక్షణముగొన ఇంద్రుడు కృష్ణదర్శనము చేసికొననెంచి ఐరావతమెక్కి క్రిందికి దిగివచ్చి ఆయ్యాలకాపరిని జగమ్మునకెల్ల కాపరింగా గరుడుండు తన రెక్కలువిప్పి కల్పించిన నీడక్రింద గరుడ వాహనారూఢుడై ఉన్న సాక్షాత్ విష్ణువుని మధుసూదనునింగని గజరాజమునుండిదిగి యేకాంతమునందు అల్లననగుచు ప్రీతిచే కన్నులు విప్పార నిట్లనియె.
గోవర్ధన పట్టాభిషేకము
కృష్ణా కృష్ణా! వినుమేనిటకు నీసన్నిధికెందులకు వచ్చితినో ఇది మరొకలాగున భావింపవలదు. భూభారము దింప ఈ ఇలపై నీవు అవతరించిన నిఖిలాధారుడవు. పరమేశ్వరుడవునీవే. నన్ను గూర్చిన మహోత్సవమునకు భంగమయ్యెనన్న విరోధమున గోకులముంజెఱువ నేను బంపిన కార్మబ్బులచే ఇంత రగడు జరిగినది. నీ వా గిరినెత్తి యాదవులంగాంచితిని. అవ్వింతంగని నేనును సంతుష్టుడనైతిని దేవతల కార్యమిద్దాన నెరవేరినది. నా ప్రయోజనము చక్కగా సిద్ధించినదని నేను దలచెదను. నీరక్షణమందిన గోవులు నీ అవతార కారణమునకు కారణమైనవి. ప్రేరణసేయ నీదరికేతెంచితిని. గోవిందుడవీవే యిపుడు ఉపేంద్రుడవు కాగలవు. అని ఐరావతము మెడనుండి గంటను జేకొని పవిత్ర జలపూర్ణమైన అద్దానిచే హరికి అభిషేకముగావించెను. గోప్రేరణచే ఆ జరిపిన ఆ గోవర్ధన పట్టాభిషేక వైభవమందు గోవులు నిండ చేసిన క్షీరధారలచే నాక్షణమే అభిషేకించి ఈ వసుంధర గూడ నిండ తడిపినవి. శచీపతి ప్రీతిగోని వినయముతో కృష్ణుంగని మఱియు నిట్లనియె.
ఈ వైభవమంతయు గోవుల మాటంబట్టి చేసితిని. ఒకవిన్నపము గావించెద నాలింపుము. నా అంశమున ఈ అవనిపై మహాపురుషుడై అర్జునుండవతరించి ఉన్నాడు. అతడు తమరక్షణ కర్హుడు. భూభారమునందు నీతో చెలిమి చేయగలడు. వానిని నీవు నిన్నువలె కాపాడవలయును. అన భగవంతుడిట్లనియె.
భారతవంశమున నీ అంశమున పార్ధుడు పుట్టుట నేనెఱుంగుదును. వానిని నేను అవని ఉన్నంతదనుక పాలింతును. ఆ అర్జునుని ఎవ్వడును యుద్ధమున గెలువజాలడు. కంసుడు అరిష్టుడు కేశి కువలయాపీడుడు నరకుడు మఱియెందరో కూలిన తరువాత మహాయుద్దము జరుగగలదు. దాన భూభారము హరించును. అందుచే నీవేగుము. నీపుత్రునకై నీవు పరితాపపడకుము. అర్జునునికి శత్రువను వాడొక్కడు నాముందుండబోడు. అర్జునుకొఱకే నేను యుదిష్టిరాదులను భారతయుద్ధము జరిగిన తరువాత క్షేమముననున్నవారిని కుంతికి సమర్పింతును. అని హరి పలుక దేవాధిపతి జనార్ధనుని కౌగిలించుకొని ఐరావతమెక్కి దివంబున కరిగెను. కృష్ణుడును గోవులతో గోపాలురతో గొల్లపల్లెను గోపికల చూపులచే పవిత్రమైనత్రోవ నేతెంచెను.
ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరిత్రమందు గోవిందపట్టాభిషేకమను ఎనభై రెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹