Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

ఇంద్రపరాజయం

అప్పుడు పరాశర తనయుడైన వ్యాసమహర్షి బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు.

“ఓ సంభవా! ఈ రకంగా గణేశానుగ్రహాన్నీ, వరసంపదనూ ఆశీస్సుగా పొందిన త్రిపురుడు వరగర్వంతో ఏంచేశాడు? ఆతరువాతి కధా విధానమంతా నాకు వినిపించగోర్తాను!”

“ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా ప్రధముడైన గణాధిపతియొక్క విశేషానుగ్రహాన్ని పొందిన త్రిపురుడు, ముందుగా కాశ్మీరసంభవమైన నల్లటిరాయితో గజాననునిమూర్తిని తయారుచేయించి, మంత్రకోవిదులైన ఆగమపండితులతో యధావిధిగా ఆలయంలో ప్రతిష్ఠించాడు. మణిమాణి క్యాలతో అలంకృతమైన ఒక బంగారు భవనాన్ని నిర్మించి, ఆ గజాననుని అందులోనుంచి షోడశోపచారములతో పూజించాడు.

స్తోత్రములతో గణేశుని సన్నుతించి, యధావిధిగా పూజలను సమర్పించి భూసురులకు భూరిదానాలనిచ్చాడు. గణేశపురంగా ప్రసిద్ధిచెందిన ఆ పట్టణము బెంగాల్ లో ఉన్నది! గణేశానుగ్రహంగా తనకు సిద్ధించిన శక్తులచేత తన బల గర్వంతో ఆ త్రిపురాసురుడు భూమండలాన్నంతటినీ ఆక్రమించాడు! అలా భూమినంతటినీ ఏకచ్ఛత్రాధిపతిగా పరిపాలిస్తూ, నలుదిక్కుల నుంచీ చతురంగబలాలను సమీకరించుకొని, దేవలోకం పై కూడా దండ యాత్రకు సన్నద్ధుడయ్యాడు. అమరావతిపై దండెత్తివెళ్ళిన త్రిపురుని ఎదుర్కోవటానికి దేవేంద్రుడు తన సమస్త సైన్యాలతోనూ ఐరావతాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు!

యుద్ధరంగంలో వ్యూహరచనలో నిపుణుడైన ఆ త్రిపురుడు తన సేననంతటినీ మూడుభాగాలుగా చేశాడు. ఒకభాగానికి ధనుర్విద్యలోనూ, గదాయుద్ధంలోనూ శస్త్రాస్త్రకోవిదుడైన వజ్రదంష్ట్రుని నాయకునిగా నియమించి అతనికి మనుష్య లోకాధిపత్యాన్నిచ్చాడు.

మూడోవంతు సేనతో కాలకూటుడనే వాడిని రసాతలానికి పంపి శేషముఖ్యులైన మహానాగులందరినీ వశులను చేసుకొమ్మని ఆ సేనను ఆదేశించాడు.

ఇక మిగిలిన మూడవభాగాన్ని తాను స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి చతురంగ బలసమేతుడై స్వర్గంలోని నందనవనం పైకి దాడికై వెళ్ళాడు.

అక్కడ తనసేనల్ని విధ్వంసానికి పురికొల్పి, ఆ నందనవనంలోని దివ్యవృక్షాల నెన్నిటినో ఆతడు భగ్నంచేశాడు అలా త్రిపురుడు నందనోద్యానంలో నిలచివుండి అమరాధిపతి ఇంద్రునికి తన దూతద్వారా యిలా సందేశం పంపాడు.

“నీవీ అమరావతీ నగరాన్ని నాకు సమర్పించి, మనుష్యలోకంలోకి వెళ్ళి నాకు వశుడవై ఉండు! లేదా నీకు చేవ ఉంటే, యుద్ధం చేయగల సత్తా ఉంటే సన్నద్ధుడవైరా!”

దూతలు ఇంద్రుని సముఖానికి వెళ్ళి అతనికి త్రిపురుని సందేశం యావత్తూ వినిపించారు. ఆ మాటలు చెవిన పడగానే పిడుగుపాటుకు తల్లడిల్లిన పర్వతంలా ఆగ్రహంతో, అవమానంతో గడగడా వణికి దిగ్భ్రాంతి చెందాడు. తిరిగి అంతలోనే తాను కోలుకుని, అవమానాగ్నితో దహించుకుపోతూ ”ఆ దూతలతో తాను యుద్ధమే చేయగోర్తున్నాని” బదులు పంపించాడు.

దేవసేనలనన్నిటినీ యుద్ధ సమాయత్తంచేసి ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ప్రళయకాల మేఘంలా గర్జించాడు! ఆ శబ్దానికి ముల్లోకాలూ క్షోభించాయి! త్రిపురుని దూతలు ఇంద్రుని సమాధానం త్రిపురునికి తెలియజేసారు! సమస్త దేవతాసైన్యమూ శస్త్రాస్త్రములను ధరించి తన వెంటరాగా దేవరాజైన ఇంద్రుడు పోరుకు సిద్ధమయ్యాడు.

త్రిపురాసుర యుద్ధం

ఇలా ఇంద్రుడు నానా వాద్యఘోషములతోనూ, బ్రాహ్మణ స్వస్తి పుణ్యాహవచనములతో యుద్ధసన్నద్ధుడై బయల్వెడలాడు. అప్పుడు దూతలద్వారా ఇంద్రుడు యుద్ధసమాయత్తుడైనట్లు తెలుసుకున్న త్రిపురుడు తన సేనల్నికూడా ఉత్సాహపరుస్తూ, తానూ ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి, చతురంగ బలాలతోటీ యుద్ధానికి బయల్దేరాడు.

అప్పుడు జరగబోయే భీకర యుద్ధారంభానికి సూచనగా, శంఖా రావాలూ, భేరీనాదాలూ యుద్ధరంగంలో ఇరుపక్షాలలో మింటినంటాయి! త్రిపురుడు సేనల్ని పురికొల్పుతూ హుంకారాన్ని చేయగానే వారంతా భీకరంగా యుద్ధానికి తలపడ్డారు. ఇరుసైన్యాలూ స్వపర భేదంలేకుండా సంకులసమరం చేయసాగారు. అసంఖ్యాకంగా దానవవీరులూ, దానవ శస్త్రాలచేత పీడింపబడ్డ దేవతలూ కూడా కొందరు నేలకూలారు.

ఆ రక్తపు ధారలకు తడిసిన ఇరువర్గాల సైనికులూ పుష్పించిన మోదుగచెట్లలా కనిపించసాగారు. కొందరు దానవులు నేలకూలారు. మరికొందరు క్షతగాత్రులైనారు. అలాగే లొట్టిపిట్టలనూ, ఏనుగులను, గుఱ్ఱాలనూ అధిరోహించిన సైనికులు విశేషంగా ఆ యుద్ధభూమిలో నేలకూలారు. అప్పుడు సింహాన్ని చూచి బెదిరిన లేళ్ళగుంపులా యుద్ధరంగం నుంచి నలుదిక్కులకూ పారిపోయారు!

అప్పుడు త్రిపురుడు ప్రళయాగ్నిలా మండిపోతూ, తన సేనలను యుద్ధానికి పురిగొల్పుతూ ప్రళయకాల మేఘంలా గర్జిస్తూ, తాను స్వయంగా ఇంద్రుడితో పోరుకి తలపడ్డాడు..

వెంటనే ఒక్కసారిగా ఇంద్రుడి మీదకురికి, వజ్రాయుధాన్ని పట్టిన అతడి చేతిని తన వాడి ఖడ్గంతో ఒక్కవేటున నరికాడు. ఆ అదురుకు ఇంద్రుడి చేతనున్న వజ్రాయుధం క్రిందపడింది. ఆ వజ్రాయుధంతో ఐరావతాన్ని తలపై కొట్టాడు. ఆ దెబ్బతిన్న ఐరావతం భయంతో పారి పోయింది! క్షణంలో ఇంద్రుడి ఆ ముష్టిఘాతానికి మూర్ఛిల్లిన త్రిపురుడు కోలుకొని ఇంద్రుణ్ణి తన చేతితో చరిచాడు…

కొంతసేపటికి లేచిన ఇంద్రుడుకూడా తిరిగి ఆ త్రిపురాసురుడిని తనతో మల్లయుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన త్రిపురుడు “ఓ అమరేంద్రా! నీవెందుకు యిలా నీ ప్రాణాలపై నిర్దయుడవైనావు? క్రిమికీటకాదులకు సైతం తమ ప్రాణాలంటే తీపేకదా! నామాట విని నీవు భూలోకానికి పారిపో! నీకు అయితే అక్కడ తలదాచుకునేందుకు నీకో స్థానం కల్పిస్తాను!”

పద్మసంభవుడిలా అన్నాడు ”ఓ మునీంద్రా! ఈవిధంగా త్రిపురుని చేత రెచ్చగొట్టబడ్డ శచీపతి మండిపడుతూ ”ఓ దానవాధమా! నా బొందిలో ప్రాణమున్నంతవరకూ నిన్ను వదలను! నీచేత చిక్కినవాడు నీ ఆజ్ఞానుసారమే భూలోకానికి వెడతాను”

ఇంద్రపరాజయం

ఇలా ఆవేశపూరితుడై ఇంద్రుడు నిప్పులు కక్కుతుండగా, అతడి వక్షస్ధలాన్ని త్రిపురుడు తన పిడికిలితో మోదాడు. ఆదెబ్బకు ఇంద్రుడూ అమిత క్రోధోద్రిక్తుడైనాడు. ఇరువురూ కొదమసింహాల్లాగా, చాణూర కృష్ణుల్లాగా ఒకరితో ఒకరు భీకరంగా పోరాడారు. గుండె-గుండే రాపాడిస్తూ తలను తలతోనూ, వీపును వీపుతోనూ, పాదాలతో మరొకరి పాదాలను తన్నుకుంటూ చాలాసేపు వీరోచితంగా పోరాడారు.

అప్పుడా దైత్యుడు శచీపతి కాలుపట్టుకొని పైకెత్తి గిరగిరా త్రిప్పి విసరివైచాడు. తాను స్వయంగా ఐరావతాన్ని అధిరోహించాడు! దేవ గణాలు తమ ప్రభువు జాడ తెలియక, దిక్కుతోచనివారై ఇంద్రుని అన్వేషిస్తూ హిమవత్పర్వత గుహలవైపుకు పారిపోయారు.

”ఇక మన రాజైన ఇంద్రుని ఎలా కలువగలము?” అనకుంటూ తమలో తాము తర్కించుకుంటూ, వెడుతున్న దేవగణాలకు దూరాన్నుంచి సిగ్గుతో తలవంచుకు వస్తున్న ఇంద్రుడు కనిపించాడు. దేవతలకు కొన ప్రాణం లేచివచ్చినట్లై తమ ప్రభువును అత్యంత ఆదరంతో సేవించుకొని హిమవత్పర్వత గుహలలో ప్రాణాలను కడచేతిలో బెట్టుకొని తలదాచుకున్నారు.

త్రిపురుడు మాత్రం విజయగర్వంతో ఐరావతాన్నెక్కి అమరావతిని చేరుకుని, తన అనుచరులనే అష్టదిక్కులకూ దిక్పాలకులుగా నియ మించి, తాను మాత్రం ఇంద్రుడి స్థానాన్ని అధిరోహించి దివ్యవాయిద్యాల ఘోషలో, గాంధర్వగానం వీనులకింపు చేయగా, అప్సరసల నాట్యసల్లాపా లను వీక్షిస్తూ, వారితో క్రీడిస్తూ, ఉల్లాసంగా కాలం గడపసాగాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”ఇంద్రపరాజయం” అనే ముప్పై తొమ్మిదవ అధ్యాయం.సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment